ఈ ఫొటోలోని చండ్ర సరళ ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి పదవిలో ఉన్నారు.
2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో తెనాలి మున్సిపాలిటీ 31వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓడిపోయారు.
ఈమె నెల్లూరు జిల్లా పామూరుపల్లి కోడలు.
అయితే పుట్టినిల్లైన తెనాలిలోనూ ఆమెకు ఓటుంది.
ఇంటి పేరు మార్పుతో రెండు చోట్లా ఓటరుగా కొనసాగుతున్నారు.
జాస్తి సరళ పేరుతో తెనాలిలో ఓటరుగా నమోదు చేసుకోగా చండ్ర సరళ పేరుతో పామూరుపల్లిలో ఓటు హక్కు పొందారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఓటూ ఎంతో కీలకం! ఒకే ఒక్క ఓటు సైతం అభ్యర్థుల తలరాతలను తారుమారు చేస్తుంది! గెలుపోటములను నిర్దేశిస్తుంది! ఒకపక్క ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయంటూ గగ్గోలు పెడుతున్న విపక్ష టీడీపీ మరోపక్క చాపకింద నీరులా దొంగ ఓట్ల నమోదుకు బరి తెగించింది. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ మద్దతుదారుల దొంగ ఓట్ల బాగోతం బహిర్గతమైంది. పలువురు వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాల్లోనూ ఓటర్లుగా నమోదైనట్లు గుర్తించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఓటర్ల జాబితా పరిశీలన, నమోదు, తొలగింపు, సవరణ లాంటి కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాల్లో టీడీపీకి చెందిన పలువురు రెండు చోట్ల ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు బయటపడింది.
అక్కడా ఉంటారు.. ఇక్కడా ఉంటారు!
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలోని పామూరుపల్లి 300 ఓటర్లు ఉండే చిన్న గ్రామం. అక్కడ టీడీపీ మద్దతుదారులకు సంబంధించి 30 ఓట్ల డబుల్ ఎంట్రీ వ్యవహారం తాజాగా బయటపడింది. గ్రామంలో ఓటు హక్కు ఉన్న చింతగుంపల ప్రసాద్, చింతగుంపల అరుణ, చింతగుంపల ముఖేష్‌కు కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండలం రాచెరువురాజుపాలెం గ్రామంలోనూ ఓటర్లుగా నమోదయ్యారు. చండ్ర చలపతిరావు, చండ్ర సరళకు పామూరుపల్లిలో పాటు తెనాలిలోనూ ఓట్లు ఉన్నాయి. చండ్ర ఈశ్వరమ్మకు వరికుంటపాడులోనే రెండు చోట్ల ఓట్లు ఉండటం గమనార్హం. వివాహమై అత్తారింటికి వెళ్లిన కొందరు మహిళలకు అటు మెట్టినింట్లోను, ఇటు పుట్టింటిలోనూ 2 చోట్ల ఓట్లున్నాయి.
సోమిరెడ్డి – నారాయణ కుట్రలు
► సర్వేపల్లి నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాలలో 11,291 మంది వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు మాజీ మంత్రి సోమిరెడ్డి తన అనుచరులతో ఫారం–7 ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయించారు. వెరిఫికేషన్ సమయంలో అనుమానం రావడంతో పరిశీలించగా టీడీపీ నేతలు కుట్ర పన్నినట్లు వెలుగులోకి వచ్చింది.
► ఇదే తరహాలో నెల్లూరు నగరంలో దాదాపు 12 వేల ఓట్లను తొలగించేందుకు మాజీ మంత్రి పొంగూరు నారాయణ టీమ్ ప్రయత్నించింది. వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఓట్లను ఆన్లైన్లో ఫారం–7 ద్వారా తొలగించేందుకు దరఖాస్తు చేయించారు. అయితే నెల్లూరు కార్పొరేషన్ నుంచి సంబంధిత ఓటర్లకు సమాచారం వెళ్లడంతో ఈ కుట్రలు విఫలమయ్యాయి. నెల్లూరు నగర నియోజకవర్గం జనార్దన్‌రెడ్డి కాలనీ పోలింగ్ బూత్ నెంబర్ 10లో గౌస్‌బాషా వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు కావడంతో అతడి ఓటును తొలగించేందుకు ఎల్లో గ్యాంగ్ ఆన్లైన్లో ఫారం–7 ద్వారా దరఖాస్తు చేసింది. బూత్ నెంబర్ 9లో ఎస్ మస్తాన్, పెల్గగరి దేవయానం మృతి చెందినట్లు పేర్కొంటూ ఓటర్లుగా తొలగించేందుకు ఫారం–7 ద్వారా దరఖాస్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment