సాక్షి, తిరుపతి, సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి ఉప ఎన్నికలో ఓటమి ఖాయమనే నిర్థారణకు వచ్చిన ప్రతిపక్ష పార్టీ నేతలంతా ఏకమై ‘దొంగ ఓట్లు’ రాగం అందుకున్నారు. దొంగ ఓట్లు వేసేందుకు ఆస్కారం లేకున్నా ఏదో జరిగిపోయిందని చిత్రీకరించేందుకు నానాపాట్లు పడ్డారు. పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు జరుగుతున్నట్లు ప్రచారం జరిగితే ఓటర్లు దూరంగా ఉంటారనే వ్యూహంతో బరి తెగించిన బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ నేతలు వారిని భయాందోళనలకు గురిచేసేలా వ్యవహరించారు. విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నట్లుగా దొంగ ఓట్లు వేసేందుకు అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఓటర్ ఐడీ కార్డు ఫోటోతో కూడుకుని ఉంటుంది. ఒకవేళ ఓటర్లకు అది లేకపోతే ఆధార్ చూపాలి. ఓటర్ స్లిప్పు, పోలింగ్ బూత్‌లో ఉండే ఓటర్ లిస్టులో కూడా ఫొటో ఉంటుంది. పోలింగ్ ఏజెంట్లుగా అన్ని పార్టీల వారుంటారు. ఫొటోలను, సదరు ఓటరును ఒకటికి రెండుసార్లు పరిశీలించి నిర్ధారించుకున్నాకే ఓటు వేసేందుకు అనుమతిస్తారు.
అనుమానం వస్తే అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఇన్ని దశల్లో తనిఖీలు చేసి నిర్థారించుకునే ప్రక్రియ ఉన్నప్పుడు ఎలాంటి ఆధారాలు లేకుండా దొంగ ఓట్లు వేశారంటూ అసంబద్ధమైన ఆరోపణలు చేయడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. ‘పొరుగు ఊర్ల నుంచి వచ్చేవారు ఎలా దొంగ ఓట్లు వేస్తారు? అదెలా సాధ్యం? పోలింగ్ బూత్, చిరునామా, ఓటరు స్లిప్పు, ఆధార్ కార్డు, ఓటరు కార్డు ఇవన్నీ లేకుండా దొంగ ఓట్లు వేయడం ఎలా సాధ్యం? నిత్యం తిరుపతికి 50 వేల నుంచి లక్ష మంది దాకా భక్తులు వస్తుంటారు. అలాంటప్పుడు వీరంతా దొంగ ఓట్లు వేశారనేందుకు వచ్చారని ఆరోపణలు చేయడంలో ఏమైనా అర్థం ఉందా?’ అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడులైనప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీల నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే లక్ష్యంగా అసత్య ప్రచారాలకు దిగారు. పుణ్యక్షేత్రమైన తిరుపతిలో కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని ఎత్తులు వేశారు. అందులో భాగంగా బీజేపీ, టీడీపీ ముఖ్య నేతలంతా అక్కడే తిష్టవేసి పోలింగ్ రోజైన శనివారం కుట్రలను కార్యరూపంలోకి తెచ్చారు.
ప్లాన్ ప్రకారం వీడియో చిత్రీకరణ..
తిరుపతిలో పోలింగ్ రోజు హైడ్రామా నెలకొంది. కొందరు విపక్ష నాయకులు పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లి వీడియో ఆన్ చేయగానే క్యూలో నిలుచున్న ఓ వ్యక్తి పారిపోయేలా ముందుగానే ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. సదరు వ్యక్తి పరారయ్యే సమయంలో వీడియో చిత్రీకరించి దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని తాము పట్టుకుంటున్నట్లు ప్రచారం కల్పించారు. మరి అదే నిజమైతే పారిపోతున్న వ్యక్తిని తాము పట్టుకోవడం గానీ లేదంటే కనీసం అతడిని పట్టుకోవాలని ఇతరులను ఎందుకు అప్రమత్తం చేయలేదన్నది ప్రశ్న!
టార్గెట్ పెద్దిరెడ్డి!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: దశాబ్దాలుగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం కోటకు బీటలు వారాయన్న నిర్వేదంతో తిరుపతి ఎన్నికల నోటిఫికేషన్ నుంచి పోలింగ్ వరకు ప్రతి సందర్భంలోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు అసంబద్ధ ఆరోపణలకు దిగారు. 1983 నుంచి కుప్పంలో టీడీపీ అభ్యర్థులు 9 పర్యాయాలు గెలుపొందగా చంద్రబాబు 7 దఫాలుగా నెగ్గుతున్నారు. అయితే టీడీపీకి గట్టి పట్టున్న కుప్పం నియోజకవర్గంలో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. 89 పంచాయితీలకుగానూ 74 సర్పంచ్‌లను వైఎస్సార్‌సీపీ కైవశం చేసుకుంది. మూడున్నర దశాబ్దాలుగా ఏకచత్రాధిపత్యం వహించిన టీడీపీ కేవలం 14 సర్పంచ్‌లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. (స్వతంత్ర అభ్యర్థి ఒకచోట గెలుపొందారు) ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేక మంత్రి పెద్దిరెడ్డిపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేస్తున్నట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు.
దొంగే.. దొంగా దొంగా!
దొంగే.. దొంగ దొంగ అన్నట్టుగా టీడీపీ వ్యవహరించింది. వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చే బస్సులు, వాహనాలు నిలిపివేసి దొంగ ఓట్లు వేయడానికి వస్తున్నారా?’ అంటూ నిలదీస్తూ ఆ పార్టీ నేతలు భయభ్రాంతులకు గురిచేశారు. పథకంలో భాగంగా చంద్రబాబు అనుకూల మీడియాతో ఫోటోలు, వీడియోలు తీసి హంగామా సృష్టించారు. కొందరు మహిళలు వీరి వికృత చేష్టలకు భయపడి చేతులతో ముఖాన్ని కప్పుకోవడంతో వాటికి విస్తృత ప్రచారం కల్పించారు. ఫలితంగా ఓటర్లు పోలింగ్ బూత్‌కు వచ్చేందుకు తటపటాయించారు. తమ ఓటు హక్కును వినియోగించుకోలేక పోయామంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ అధికారులు, పోలీసులకు కూడా బీజేపీ, టీడీపీ నేతలు హెచ్చరికలు జారీ చేశారు. దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. ఎన్నికలు అయ్యాక మీపై చర్యలు ఉంటాయంటూ బెదిరిస్తూ పేర్లు రాసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment