Challa Ramachandra Reddy Strategy On Punganur Incident, Details Inside | Sakshi
Sakshi News home page

Punganur Incident: ఆ మారణహోమం చల్లా వ్యూహం

Published Tue, Apr 30 2024 11:04 AM | Last Updated on Tue, Apr 30 2024 1:45 PM

 Challa Ramachandra Reddy Strategy On Punganur Incident

పుంగనూరును  వల్లకాడు చేసేందుకు కుట్ర

బాబు పర్యటనను అడ్డుపెట్టుకునిఅల్లర్లకు యత్నం

పోలీసులను చంపి..కాల్పులకు పురిగొల్పేలా ప్లాన్‌

ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా దాడులు

ప్రాణాలకు తెగించి.. రక్తం చిందించిన ఖాకీలు

అప్పటి ఎస్పీ విచక్షణతో బెడిసికొట్టిన టీడీపీ నేతల పన్నాగం  

ప్రజల ధన..మాన..ప్రాణాలంటే పచ్చమూకలకు లెక్కలేదు. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేసే పోలీసులంటే గౌరవం లేదు. ప్రశాంత పుంగనూరును వల్లకాడుగా మార్చేయాలి. ప్రభుత్వంపై బురదజల్లాలి. ఇదే లక్ష్యంతో గత ఏడాది ఆగస్టు 2వ తేదీన అప్పటి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి.. ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి కుట్రకు తెగబడ్డారు. చంద్రబాబు పర్యటనలో అల్లర్లు సృష్టించేందుకు పథకం రచించారు. పోలీసుల ఉసురు తీయడమే లక్ష్యంగా దాడులకు ప్లాన్‌ వేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై నింద మోపేందుకు దారుణ మారణహోమానికి తెరతీశారు. అప్పటి ఘటనపై విచారణ చేపట్టిన పోలీసు అధికారులే లోగుట్టు తెలుసుకుని దిగ్భ్రాంతి చెందారు.

పుంగనూరు: జిల్లాలోని పుంగనూరులో గత ఏడాది ఆగస్టు 4వ తేదీన టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడు పర్యటనలో మారణహోమం సృష్టించేందుకు ఆ పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందించారు. కనీసం ఇద్దరు పోలీసులనైనా చంపాలని దుర్మార్గపు ఆలోచన చేశారు. బాబు పర్యటనకు రెండు రోజుల ముందే ఈ ప్లాన్‌ రూపొందించారు. పోలీసులపై దాడులకు తెగబడి అల్లర్లు సృష్టించిన ఘటనలో అప్పటి టీడీపీ పుంగనూరు  ఇన్‌చార్జి చల్లా బాబు అలియాస్‌ చల్లా రామచంద్రారెడ్డి గత ఏడాది ఆగస్టు 2వ తేదీన రొంపిచెర్లలో పార్టీ ప్రధాన వ్యక్తులతో రూపొందించిన పథకాన్ని ఆయన వ్యక్తిగత కార్యదర్శి గోవర్దన్‌రెడ్డి  పూసగుచ్చినట్లు పోలీసులకు చెప్పాడు. ఇది విన్న పోలీసులు కేవలం ఉనికిని కాపాడుకునేందుకు ఇలాంటి క్షుద్ర రాజకీయాలకు పాల్పడతారా అని షాక్‌కు గురయ్యారు.

ప్లాన్‌– బీ.. 
ప్టాన్‌– ఏ అమలుకాని పక్షంలో ప్లాన్‌–బీకి సైతం పచ్చ పార్టీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. పోలీసులు చనిపోకపోయినా, ఫైర్‌ ఓపెన్‌ చేయకపోయినా ఆందోళన చేస్తున్న టీడీపీ శ్రేణులు మొత్తం ఒక్కసారిగా పుంగనూరు పట్టణంలోకి చొరబడాలి. ఎక్కడికక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫెక్సీలు చింపడం, పెట్రోలు పోసి నిప్పంటించడం చేయాలి. దీనిపై వెంటనే వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రతిస్పందిస్తాయి. ఈ క్రమంలో చెలరేగే అల్లర్లలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఒకరిద్దరిని మట్టుబెడితే.. వాళ్ల చేసే దాడుల్లో టీడీపీ కార్యకర్తలు సైతం చనిపోతారు. 

ఇది జరిగినా కూడా నెపం ప్రభుత్వంపై నెట్టేసి, శవ రాజకీయంతో సర్కారును పడగొట్టవచ్చని రెండో ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నారు. రాష్ట్రం మొత్తం ఈ ఘటనలతో హోరెత్తిపోతుందని, అదే కారణంగా శాంతి భద్రతల వైఫల్యాన్ని ఎండగట్టాలని అనుకున్నారు. అయితే ఈ రెండు ప్లాన్ల గురించి టీడీపీలోని ప్రధాన వ్యక్తులకు తప్ప, పార్టీ కార్యకర్తల్లో ఒక్కరికి కూడా తెలియడానికి వీల్లేదంటూ కట్టడి చేశారు. ఎక్కడా కూడా ఈ ప్లాన్ల గురించి ఎవరూ మాట్లాడకుండా అత్యంత గోప్యత పాటించారు. ఈ అల్లర్లకు పుంగనూరు నుంచి కాకుండా మదనపల్లె, ములకలచెరువు, సదుం, సోమల మండలాల నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలను రంగంలోకి దించాలని ఆదేశించారు.  

 

ప్లాన్‌– ఏ.. 
పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జనాదరణ పెరిగిపోతుండడంతో చల్లా బాబు రగిలిపోయారు. ఇదే పుంగనూరులో పెద్దిరెడ్డిని జీరో చేయాలని, అదే సమయంలో రాష్ట్రం మొత్తం పుంగనూరువైపు చూసేలా మారణహోమం సృష్టించాలని సంకల్పించుకున్నారు. చంద్రబాబు నాయుడు పర్యటన ర్యూట్‌ మ్యాప్‌లో పుంగనూరును చేర్చేందుకు పార్టీ శ్రేణులు పట్టుపట్టాలని నిర్ణయించారు.  పోలీసులు దీనికి కచ్చితంగా అంగీకరించరని, ఇదే అదనుగా దాడులకు పాల్పడాలని నేతలు, కార్యకర్తలకు చల్లా బాబు దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగా అప్పటికే కృష్ణదేవరాయ కూడలి వద్ద సిద్ధం చేసుకున్న రాళ్లు, మద్యం బాటిళ్లు, బీరు సీసాలు, బాంబులను పోలీసులను లక్ష్యంగా చేసుకుని విసరాలి. 

మొత్తం 30 నిముషాల పాటు ఈ రాళ్ల దాడి చేయడానికి వస్తువులను ఉంచారు. తొలి మూడు నిముషాల్లో చెప్పులు, వాటర్‌ బాటిళ్లు విసిరితే పోలీసులు తేలిగ్గా తీసుకుంటారు. అనంతరం పోలీసుల ఊహకు అందకుండా రాళ్లు, బాంబులు, మద్యం బాటిళ్లతో పది నిముషాలు దాడులు చేయాలని, ఇందులో ఒకరిద్దరు పోలీసులు చనిపోయినా పర్లేదని ఆదేశించారు.  ఇదే కనుక జరిగితే వెంటనే పోలీసులు కాల్పులు ఓపెన్‌ చేస్తారు. ఈ కాల్పుల్లో ఎటులేదన్నా 30 మంది వరకు టీడీపీ కార్యకర్తలు మరణిస్తారు. దీంతో దేశం మొత్తం పుంగనూరు వైపు చూస్తుందని, దీంతో ప్రభుత్వాన్ని కూల్చేసి, సానుభూతి పేరిట చంద్రబాబు నాయుడును సీఎం కుర్చీ ఎక్కించవచ్చనే భారీ పన్నాగం పన్నారు.

ఇలాంటి వ్యక్తికి టికెట్టా? 
స్వార్థ రాజకీయాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాటే చల్లా రామచంద్రారెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వడంపై పుంగనూరు వాసులు మండిపడుతున్నారు. ఇలాంటి ఆలోచనా విధానమున్న వ్యక్తిని రాజకీయాల్లో ప్రోత్సహించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

పోలీస్‌ ప్లాన్‌ ఇలా.. 
టీడీపీ నేతలు రూపొందించిన మారణహోమం ఉచ్చులో పోలీసులు చిక్కుకునే ఘటన దాదాపు అమలైపోతుందని ఆ పార్టీ నేతలు భావించారు.  దీనికి తోడు అల్లర్ల సమయంలో అక్కడ బందోబస్తులో ఉన్న ఓ పోలీసు అధికారి వెంటనే అప్పటి ఎస్పీ రిషాంత్‌రెడ్డికి ఫోన్‌ చేశారు. పోలీసులు రక్తమోడుతుండడం చూసిన ఆ అధికారి చలించిపోయి. గద్గద స్వరంలో ఎస్పీతో మాట్లాడుతూ.. ‘సర్, పరిస్థితి చేయి దాటిపోతోంది. డీఎస్పీల తలలు పగిలిపోతున్నాయి. సీఐలు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు ఇక్కడ ఆర్తనాదాలు చేస్తున్నారు. మనం ఫైర్‌ ఓపెన్‌ చేయాలి. వెంటనే మీరు కలెక్టర్‌తో మాట్లాడి ఫైరింగ్‌కు ఆర్డర్‌ ఇవ్వండి ప్లీజ్‌. లేకుంటే మనవాళ్లు చనిపోతారు..’ అంటూ బతిమిలాడారు. 

అక్కడ ఏం జరుగుతోందని ఎస్పీ ఆరా తీశారు. సంయమనంతో ఆలోచించి పోలీసులు 300 మీటర్లు వెనక్కు వచ్చేయాలని ఆదేశించారు. దీంతో టీడీపీ శ్రేణులు రాళ్లు, మద్యం బాటిళ్లు నిల్వ ఉన్న ప్రాంతం నుంచి దూరమవుతారని చెప్పారు. ఇదే జరిగితే పోలీసులకు దగ్గరగా వచ్చిన టీడీపీ శ్రేణులను చెదరగొట్టడానికి స్వల్ప లాఠీచార్జ్, బాష్ప వాయు ప్రయోగించాలని సూచించారు. తాను కూడా వెంటనే పుంగనూరు వచ్చేస్తానని, అప్పటి వరకు ఒక్క బుల్లెట్‌ కూడా తుపాకీ నుంచి బయటకు రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఎస్పీ ఆదేశాలను అమలు చేసిన పోలీసులు, అనుకున్నట్టుగానే రక్తం కారుతున్నా, అల్లరి మూకల్ని దగ్గరకు రప్పించి లాఠీలతో చెదరగొట్టారు. దీంతో టీడీపీ నేతల కుతంత్రాలు, కుట్రలు పటా పంచలైపోయాయి.  

‘చల్లా’ చరిత్ర నేరమయమే! 
టీడీపీ పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి అలియాస్‌ చల్లా బాబు చరిత్రంతా నేరమయమే. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఇతనిపై  దాడులు, హత్యయత్నాలు చీటింగ్‌ తదితర నేరాలపై పోలీసులు 19 కేసులు నమోదు చేశారు. ఇందులో గత ఏడాది ఆగస్టు 4న పుంగనూరులో జరిగిన అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడుగా 7 కేసులు నమోదయ్యాయి. అలాగే సోమల, కల్లూరు, రొంపిచెర్ల, చౌడేపల్లె, ములకలచెరువు, ముదివేడు పోలీస్‌స్టేషన్లతో పాటు తెలంగాణలోని కూకటిపల్లె పోలీస్‌స్టేషన్‌లో కేసులు ఉన్నట్లు చల్లారామచంద్రారెడ్డి స్వయంగా తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
– చల్లా రామచంద్రారెడ్డి, టీడీడీ ఎమ్మెల్యే అభ్యరి్థ, పుంగనూరు 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement