సాక్షి, అమరావతి బ్యూరో: ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. అందుకు బాధ్యులైన అధికారులపై కొరడా ఝుళిపించింది. రాష్ట్రంలో డబుల్, ట్రిపుల్ అనుమానాస్పద, దొంగ ఓట్లపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ఢిల్లీలో ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరాకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో అనుమానాస్పద ఓట్లపై విచారణ ప్రారంభమైంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో భారీ అవకతవకలకు పాల్పడినట్లు అధికారుల విచారణలో తేలింది. దీంతో అందుకు బాధ్యులైన ఐదుగురు బీఎల్వోలపై సస్పెన్షన్ వేటు వేశారు.
సస్పెండ్ అయినవారిలో మండల కేంద్రమైన నాదెండ్లలోని 35వ నంబర్ పోలింగ్ కేంద్రం బీఎల్‌వో నాదెండ్ల శివయ్య (పంచాయతీ కార్యదర్శి), నాదెండ్ల మండలం తూబాడులోని 43వ నంబర్ పోలింగ్ కేంద్రం బీఎల్వో జంగు జరీనా (పంచాయతీ కార్యదర్శి), యడ్లపాడు మండలం ఉన్నవలోని 85వ నంబర్ పోలింగ్ కేంద్రానికి చెందిన బీఎల్వో వై.ప్రమీల, (అంగన్‌వాడీ వర్కర్), చిలకలూరిపేట మండలం కోమటినేనివారిపాలెంలోని 212వ నంబర్ పోలింగ్ కేంద్రానికి చెందిన బీఎల్వో గుంటి రవి (వీఆర్వో), చిలకలూరిపేట మండలం కోమటినేనివారిపాలెంలోని 214వ నంబర్ పోలింగ్ కేంద్రం బీఎల్‌వో అంగళ మరియమ్మ (అంగన్‌వాడీ వర్కర్) ఉన్నారు. వారితో పాటు చిలకలూరిపేట తహసీల్దార్ వీసీహెచ్ వెంకయ్య, నాదెండ్ల తహసీల్దార్ మేరిగ శిరీష, యడ్లపాడు తహసీల్దార్ ఆర్.రామాంజనేయులుకు షోకాజ్ నోటీసులిచ్చారు.
పల్నాడు అధికారుల్లో భయం భయం..
అనుమానాస్పద ఓట్లపై విచారణ ప్రారంభించడం, చిలకలూరిపేట నియోజకవర్గంలో పలువురు అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవడంతో జిల్లాలోని పల్నాడు ప్రాంత అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో ఓటర్ల జాబితాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు చోటుచేసుకోవడమే దీనికి కారణం. విచారణలో తమ గుట్టురట్టవుతుందని బీఎల్‌వోలు, తహసీల్దార్లు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం.
అనుమానాస్పద ఓట్లపైనే ఆందోళన
రాష్ట్ర వ్యాప్తంగా 54 లక్షలకు పైగా అనుమానాస్పద ఓట్లు ఉన్నట్టు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధారాలతో ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లాలో అనుమానాస్పద ఓట్లు 2,07,209 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో అధికంగా మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గంలో 16,659, స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రాతినిథ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గంలో 15,498, నరసరావుపేటలో 14,746, గురజాలలో 15,498, పెదకూరపాడులో 15,314, మంగళగిరిలో 12,495, ప్రత్తిపాడులో 12,480, తాడికొండలో 11,971 ఉన్నాయి. వీటిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిష్పక్షపాతంగా ఓట్ల మార్పులు, చేర్పులు చేస్తారా అనే విషయంపై రాజకీయ పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
ఇప్పటికే సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ కేంద్రాల మార్పు, ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులపై వైఎస్సార్‌సీపీ నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సత్తెనపల్లి నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. గురజాల నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు ఎన్నికల సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి దొంగ ఓట్లను చేర్పించుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. మొత్తం మీద పల్నాడు ప్రాంతంలోనే అధికంగా దొంగ ఓట్లు, అనుమానాస్పద ఓట్లుండటం గమనార్హం. అధికార పార్టీ నేతలు బూత్ లెవల్ అధికారులపై ఒత్తిడి తెచ్చి.. తమకు అనుకూలంగా ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేసినట్లు ఆరోపణలొస్తున్నాయి. ఓటర్ల జాబితాను పరిశీలించుకుని.. పేరు లేకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని వైఎస్సార్‌సీపీ నేతలు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment