voter identity card
-
Lok Sabha Election 2024: రెండు రాష్ట్రాల్లోనూ ఓటు!
ఒకే ఓటరుకు రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఓటు వేసే అవకాశం వస్తే? అవి కూడా రెండు రాష్ట్రాల పరిధిలోని స్థానాలైతే! అదెలా అనుకుంటున్నారా? చట్టబద్ధంగా అయితే అవకాశం లేదు. కానీ ఒకటో రెండో కాదు... ఏకంగా 14 గ్రామాల ప్రజలకు ఇలా రెండు రాష్ట్రాల పరిధిలో ఓటు హక్కుంది. ఒక్కొక్కరికి రెండు ఓటరు గుర్తింపు కార్డులున్నాయి. అంతే కాదు, రెండు రాష్ట్రాల తరఫునా సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా పొందుతున్నారు. ఈ గమ్మత్తేమిటో తెలుసుకోవాలంటే ఆదిలాబాద్ జిల్లా కెరమెరి, మహారాష్ట్రలోని జీవతి తాలూకాలకు వెళ్లాల్సిందే... 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సందర్భంగా మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో 14 గ్రామాలు ఎవరికి చెందాలన్నది ఎటూ తేలలేదు. ఇవి పరందోలి, అంతాపూర్ గ్రామ పంచాయితీల పరిధిలో 30 కిలోమీటర్లలో విస్తరించి ఉన్నాయి. వాటిలో 6,000 మంది నివసిస్తున్నారు. వారికి రెండు రాష్ట్రాల తరఫున ఓటరు ఐడీ కార్డులు, ఆధార్లు, కులం సర్టిఫికెట్లు ఉన్నాయి. ఈ ఊళ్లలో స్కూళ్లు కూడా తెలుగు, మరాఠీ మాధ్యమాల్లో రెండేసి ఉంటాయి! ఈ గ్రామాలు అటు మహారాష్ట్రలోని చంద్రపూర్ లోక్‌సభ స్థానంతో పాటు ఇటు తెలంగాణలోని ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలోకి కూడా వస్తాయి! సర్పంచ్‌లూ ఇద్దరు పరందోలి, అంతాపూర్ గ్రామ పంచాయితీలకు ఇద్దరేసి సర్పంచ్‌లు ఉండటం మరో విశేషం. వీరు తెలంగాణ, మహారాష్ట్రలో వేర్వేరు పారీ్టలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ 14 గ్రామాల వారికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అభివృద్ధి నిధులు కూడా వస్తుంటాయి. సంక్షేమ పథకాల ప్రయోజనాలూ అందుతున్నాయి. రెండువైపులా ఓటు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తాము రెండు రాష్ట్రాల్లోనూ ఓటు వేస్తూ వస్తున్నట్టు పరందోలి సర్పంచ్ లీనాబాయ్ బిరాడే మీడియాతో చెప్పడం విశేషం. ఆయనది మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. ‘‘రెండు రాష్ట్రాల్లోనూ ఒకే తేదీన పోలింగ్ ఉంటే మాకు వీలైన స్థానంలో ఓటేస్తాం. వేర్వేరు తేదీల్లో ఉంటే మాత్రం రెండు రాష్ట్రాల్లోనూ ఓటేస్తాం. రెండు రాష్ట్రాల నుంచి మాకు సౌకర్యాలు అందుతున్నాయి’’ అని లీనాబాయ్ వివరించారు. చంద్రాపూర్ లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 19న తొలి విడతలో పోలింగ్ ముగిసింది. అందులో ఈ 14 గ్రామాల ఓటర్లు పాల్గొన్నారు. ఇప్పుడు సోమవారం నాలుగో విడతలో ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి కూడా ఓటేయనున్నారు! ఒకచోట తొలగించండి...! ఇలా రెండు లోక్‌సభ స్థానాల పరిధిలో రెండుసార్లు ఓటేయడం సరికాదని ఎన్నికల అధికారులు అంటున్నారు. దీనిపై చంద్రాపూర్, ఆదిలాబాద్ జిల్లా అధికారులు ఇటేవలే వారితో సమావేశం కూడా నిర్వహించినట్టు చంద్రాపూర్ కలెక్టర్ వినయ్ గౌడ వెల్లడించారు. రెండుసార్లు ఓటేయడం చట్ట విరుద్ధమని ఆయా గ్రామాల ప్రజలకు చెప్పామన్నారు. స్థానిక నేతలు మాత్రం రెండు చోట్ల ఓటు వేయవద్దని తమకు చెప్పేముందు తమ గ్రామాలు ఏ రాష్ట్రం పరిధిలోకి వస్తాయో తేల్చాలని కోరుతున్నారు. ‘‘మేము రెండుసార్లు ఓటు వేస్తున్నాం. ఇది చట్టవిరుద్ధమైతే సమస్యను పరిష్కరించాల్సిందిగా రెండు రాష్ట్రాలను ఎన్నికల సంఘం కోరాలి. ఒక నియోజకవర్గ పరిధి నుంచి మా ఓట్లను తొలగించమనండి. మాకు సమస్యేమీ లేదు. కాకపోతే మేము మహారాష్ట్రకు చెందుతామా, లేక తెలంగాణకా అన్నది తేల్చాలి’’ అని పరందోలి సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు నింబదాస్ పతంగె అన్నారు. ‘‘ఈ 14 గ్రామాల వారు మహారాష్ట్ర, తెలంగాణల్లో ఏదో ఒక్క చోటే ఓటేయాలి. ఇప్పటికే చంద్రపూర్ లోక్‌సభ స్థానం పరిధిలో ఓటేసిన వారిని మళ్లీ ఓటేయడానికి అనుమతించొద్దు. తెలంగాణ ప్రభుత్వానికి ఈ మేరకు సూచించాలని ఈసీని కోరాం’’ – ఎస్.చొక్కలింగం, మహారాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి – సాక్షి, నేషనల్ డెస్క్ -
Telangana: ఓటేద్దాం.. రండి
సాక్షి, హైదరాబాద్: ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్) లోని వివరాల్లో స్వల్ప తేడాలున్నా, ఓటరు గుర్తింపు నిర్థారణైతే చాలని, ఓటు హక్కు కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వేరే నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్టరోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ఈఆర్వో) జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డును గుర్తింపునకు ఆధారంగా చూపి, మరో నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటు హక్కును వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే, ఆ పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితాలో పేరు ఉంటేనే ఈ సదుపాయం కల్పిస్తామని పేర్కొంది. ఓటరు గుర్తింపు నిర్థారణకు ఇటీవల కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.ఎపిక్‌లో లోపాలుంటే వేరే గుర్తింపు తప్పనిసరి..ఓటరు గుర్తింపు కార్డులో ఫొటోలు తారుమారు కావడం, ఇతర లోపాలతో ఓటరు గుర్తింపు ధ్రువీకరణ సాధ్యం కానప్పుడు, కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన జాబితాలోని ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు పత్రాల్లో(కింద జాబితాలో చూడవచ్చు) ఏదైనా ఒకదానిని ఆధారంగా చూపాల్సి ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది.ప్రవాస భారత ఓటర్లు తమ పాస్‌పోర్టును తప్పనిసరిగా చూపాల్సి ఉంటుందని తెలిపింది. అయితే పోలింగ్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు.. ఓటరు గుర్తింపుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఓటరు గుర్తింపు కార్డు లేనిపక్షంలో.. ఉన్నా గుర్తింపు ధ్రువీకరణ సాధ్యం కానిపక్షంలో పోలింగ్ రోజు ఈ కింది జాబితాలోని ప్రత్యామ్నాయ ఫొటో ధ్రువీకరణ పత్రాలను తీసుకువస్తే ఓటు హక్కు కల్పించాలని ఆదేశించింది.» ఆధార్ కార్డు» ఉపాధి హామీ జాబ్‌కార్డు, బ్యాంకు/తపాల కార్యాలయం జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్‌బుక్,» కేంద్ర కార్మికశాఖ పథకం కింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు» రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్, ఇండియా(ఆర్జీఐ), నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రర్ (ఎన్పీఆర్) కింద జారీ చేసిన స్మార్ట్ కార్డు » భారతీయ పాస్‌పోర్టు» ఫొటో గల పెన్షన్ పత్రాలు » కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/పీఎస్‌యూలు/ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు»ఎంపీలు/ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు» కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ డిజెబిలిటీ గుర్తింపు కార్డు(యూడీఐడీ)చాలెంజ్ ఓటు అంటే?ఓటేసేందుకు వచ్చిన వ్యక్తి గుర్తింపును అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లు రూ.2 చెల్లించి సవాలు చేయవచ్చు. ఓటరు గుర్తింపును నిర్థారించడానికి ప్రిసైడింగ్ అధికారి విచారణ జరుపుతారు. ఓటరు గుర్తింపు నిర్థారణ జరిగితే ఓటేసేందుకు అవకాశం కల్పిస్తారు. దొంగ ఓటరు అని నిర్థారణ అయితే సదురు వ్యక్తిని ప్రిసైడింగ్ అధికారి పోలీసులకు అప్పగించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.ఓటర్ హెల్ప్ లైన్ యాప్‌తో ఎన్నో సదుపాయాలు..ఓటర్స్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ఓటర్లకు ఎన్నో సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఓటర్ల నమోదుకు దరఖాస్తు చేసుకోవడం, ఓటర్ల జాబితాలో పేరు వెతకడం, పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకోవడం, బీఎల్ఓ/ఈఆర్వోతో అనుసంధానం కావడం, ఈ– ఎపిక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడం వంటి సేవలను పొందవచ్చు.పోలింగ్ సమయం ముగిసినా లైన్లో ఉంటే ఓటేయవచ్చురాష్ట్రంలోని 13 వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మిగిలిన 106 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా పోలింగ్ కేంద్రం ముందు లైనులో నిలబడిన వారికి ఓటేసేందుకు అవకాశం కల్పించనున్నారు. పోలింగ్ సమయం ముగిసిన వెంటనే లైనులో ఉన్న వారికి పోలింగ్ అధికారులు టోకెన్లు ఇస్తారు. పోలింగ్ కేంద్రంలో సెల్ఫోన్లపై నిషేధం!పోలింగ్ కేంద్రంలో మొబైల్ ఫోన్లు, కార్డ్ లెస్ ఫోన్లు, వైర్ లెస్ సెట్లతో ప్రవేశంపై నిషేధం ఉంది. పోలింగ్ కేంద్రానికి చుట్టూ 100 మీటర్ల పరిసరాల పరిధిలోకి ఇలాంటి పరికరాలు తీసుకెళ్లకూడదు. పోలింగ్ బూత్‌లో ఓటు వేస్తూ సెల్ఫీలు తీసుకోవడానికి సైతం వీలు లేదు. కేవలం ఎన్నికల పరిశీలకులు, సూక్ష్మ పరిశీలకులు, ప్రిసైడింగ్ అధికారులు, భద్రత అధికారులు మాత్రమే ఎన్నికల కేంద్రంలో మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లవచ్చు. అయితే వాటిని సైలెంట్ మోడ్‌లో ఉంచాల్సిందే.మీ ఓటును వేరే వాళ్లు వేసేశారా? అయితే.. టెండర్ ఓటేయవచ్చు! ఎన్నికల్లో ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లే సరికి మీ ఓటు వేరేవాళ్లు వేసేశారా? అయితే దిగులుపడాల్సిన అవసరం లేదు. మీకు టెండర్ ఓటు వేసే హక్కును ఎన్నికల సంఘం కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెíషీన్(ఈవీఎం) ద్వారా కాకుండా పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటేసే అవకాశం కల్పిస్తారు. టెండర్ బ్యాలెట్ ఓటర్ల వివరాలను ప్రిసైడింగ్ అధికారులు ఫారం–17బీలో రికార్డు చేస్తారు. ఈ ఫారంలోని 5వ కాలమ్‌లో ఓటరు సంతకం/వేలి ముద్ర తీసుకున్న తర్వాత వారికి బ్యాలెట్ పత్రాన్ని అందజేస్తారు. ప్రత్యేక ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి ఓటరు బ్యాలెట్ పత్రాన్ని తీసుకెళ్లి తాము ఓటేయదల్చిన అభ్యర్థికి చెందిన ఎన్నికల గుర్తుపై స్వస్తిక్ ముద్రను వేయాల్సి ఉంటుంది. ఓటెవరికి వేశారో బయటికి కనబడని విధంగా బ్యాలెట్ పత్రాన్ని మడిచి కంపార్ట్మెంట్ బయటకి వచ్చి ప్రిసైడింగ్ అధికారికి అందజేయాలి. ఆ బ్యాలెట్ పత్రాన్ని టెండర్ ఓటుగా ప్రిసైడింగ్ అధికారి మార్క్ చేసి ప్రత్యేక ఎన్వలప్లో వేరుగా ఉంచుతారు.జాబితాలో పేరు ఉందా? లేదా? ఎలా తెలుసుకోవాలి?» ఎన్నికల సంఘం వెబ్సైట్https://electoralsearch.eci. gov. in కి లాగిన్ కావాలి. » మీ వివరాలు/ ఓటరు గుర్తింపు కార్డు(ఎపిక్)/ మొబైల్ నంబర్ ఆధారంగా జాబితాలో పేరును సెర్చ్ చేయడానికి ఈ పోర్టల్ అవకాశం కల్పిస్తోంది. మొబైల్ ఫోన్ నంబర్, ఎపిక్ కార్డు నంబర్ ఆధారంగా జాబితాలో పేరు సెర్చ్ చేయడం చాలా సులు వు. గతంలో ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రర్ చేసుకున్న వారు మాత్రమే మొబైల్ ఫోన్ నంబర్ ఆధారంగా పేరును సెర్చ్ చేసేందుకు వీలుంటుంది. ఓటరు పేరు, తండ్రి పేరు/ వయస్సు ఇతర వివరాలను కీ వర్డ్స్‌గా వినియోగించి సెర్చ్ చేసినప్పుడు అక్షరాల్లో స్వల్ప తేడాలున్నా జాబితాలో పేరు కనిపించదు.» ఓటర్ హెల్ప్ లైన్ 1950కి కాల్ చేసి తెలుసుకోవచ్చు.(మీ ఏరియా ఎస్టీడీ కోడ్ ముందు యాడ్ చేయాలి). » 1950 నంబర్‌కి మీ ఎపిక్ నంబర్‌ను ఎస్ఎంఎస్ చేసి తెలుసు కోవచ్చు. (ఎస్ఎంఎస్ ఫార్మాట్: ‘ఉఇఐ ఎపిక్ నంబర్’. ఈసీఐ, ఎపిక్ నంబర్ మధ్య స్పేస్ ఉండాలి).పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో..ఎలా తెలుసుకోవాలి?రాష్ట్రంలోని ఓటర్లందరికీ ఎన్నికల సంఘం ఫొటో ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను జారీ చేసింది. ఈ ఓటర్ స్లిప్పుల వెనకభాగంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం రూటు మ్యాప్‌ను పొందుపరిచింది. ఈ రూట్ మ్యాప్‌తో సులువుగా పోలింగ్ కేంద్రానికి చేరుకోవచ్చు.అనుచితంగా ప్రవర్తిస్తే పోలింగ్ బూత్ నుంచి గెంటివేతేపోలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రంలో అనుచితంగా ప్రవర్తించిన లేదా చట్టపర ఆజ్ఞలను పాటించడంలో విఫలమైన వ్యక్తులను ప్రిసైడింగ్ అధికారి బయటకు పంపించవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 132 కింద ఈ మేరకు అధికారాలు ప్రిసైడింగ్ అధికారికి ఉన్నాయని పేర్కొంది. మద్యం సేవించి పోలింగ్ కేంద్రానికి వచ్చే వ్యక్తుల ఓటు హక్కును నిరాకరించడం సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. మద్యం లేదా మాదక ద్రవ్యాల మత్తులో విచక్షణ కోల్పోయి పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించే వ్యక్తులను మాత్రం పోలీసుల సాయంతో బయటకు పంపించేందుకు నిబంధనలు అనుమతిస్తాయని అధికారవర్గాలు పేర్కొన్నాయి.ఓటరు జాబితాలో పేరు తొలగించినా ఓటేయవచ్చు..అన్ని పోలింగ్ కేంద్రాల వారీగా ప్రత్యేకంగా అబ్సెంటీ, షిఫ్టెడ్, డెడ్(ఏఎస్డీ) ఓటర్ల జాబితాను రూపొందించి సంబంధిత పోలింగ్ కేంద్రం ప్రిసైడింగ్ అధికారికి అందజేస్తారు. ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే వ్యక్తి పేరు ఓటరు జాబితాలో లేకుంటే, ఆ వ్యక్తి పేరును ఏఎస్డీ ఓటర్ల జాబితాలో వెతకాల్సి ఉంటుంది. ఏఎస్డీ ఓటర్ల జాబితాలో ఆ వ్యక్తి పేరుంటే ఓటరు గుర్తింపు కార్డు/ లేదా ఇతర గుర్తింపు కార్డుల ఆధారంగా ఆ వ్యక్తి గుర్తింపును ప్రిసైడింగ్ అధికారి ముందుగా నిర్థారించుకుంటారు. అనంతరం ఈ వ్యక్తి పేరును ఫారం 17ఏలో నమోదు చేసి సంతకంతో పాటు వేలిముద్ర సైతం తీసుకుంటారు. ఈ క్రమంలో తొలి పోలింగ్ అధికారి సదరు ఏఎస్డీ ఓటరు పేరును పోలింగ్ ఏజెంట్లకు గట్టిగా వినిపిస్తారు. సదరు ఓటరు నుంచి నిర్దిష్ట ఫార్మాట్లో డిక్లరేషన్ సైతం తీసుకోవడంతో పాటు ఫొటో, వీడియో సైతం తీసుకుంటారు. అనంతరం ఆ వ్యక్తికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. 13న వేతనంతో కూడిన సెలవుసెలవు ఇవ్వకుంటే కఠిన చర్యలకు ఈసీ ఆదేశంరాష్ట్రంలోని 17లోక్‌సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 13న పోలింగ్ జరగనుండడంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 కింద ఈ మేరకు సెలవు ప్రకటిస్తూ మార్చి 19న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఫ్యాక్టరీస్ అండ్ ఎస్లాబ్లిష్మెంట్ యాక్ట్–1974 కింద ఫ్యాక్టరీలు, షాపులు, ఇండస్ట్రియల్ అండర్ టేకింగ్స్, ఎస్లాబ్లిష్మెంట్స్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తూ మార్చి 22న రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణికుముదిని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు సెలవు ఇవ్వని పక్షంలో కార్మిక, ఎన్నికల చట్టాల కింద కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్ శనివారం మీడియాకు వెల్లడించారు. -
ఓటర్ల నమోదుకు రేపే చివరి అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా రెండో ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ప్రకటించిన తుది జాబితాలో మీ పేరు లేదా? జాబితాలో పేరు ఉన్నా మరో ప్రాంతానికి నివాసం మార్చారా? మీ పేరు, ఇతర వివరాలు తప్పుగా అచ్చు అయ్యాయా?.. ఇలాంటి కారణాలతో నవంబర్ 30న జరగనున్న రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల్లో ఓటేయలేమని బాధపడుతున్నారా? అయితే మీలాంటి వారి కోసం కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశాన్ని కల్పిస్తోంది. కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం–6, ఇతర ప్రాంతానికి ఓటు బదిలీ, పేరు, ఫొటో, ఇతర వివరాల దిద్దుబాటు కోసం ఫారం–8 దరఖాస్తులను అక్టోబర్ 31లోగా సమర్పిస్తే వచ్చే శాసనసభ సాధారణ ఎన్నికల్లో మీకు ఓటు హక్కు లభించనుంది. నివాసం ప్రస్తుతం ఉండే నియోజకవర్గంలోనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారినా, లేదా ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మారినా ఫారం–8 దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ఓటరు జాబితా/ ఓటరు గుర్తింపు కార్డులో ఫొటో సరిగ్గా లేకపోయినా, పేరు, ఇతర వివరాలు తప్పుగా వచ్చినా ఫారం–8 దరఖాస్తు ద్వారానే సరిదిద్దుకోవచ్చు. దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారితో ప్రత్యేకంగా అనుబంధ ఓటర్ల జాబితాను ఎన్నికల యంత్రాంగం ప్రచురించనుంది. తుది ఓటర్ల జాబితాతో పాటు అనుబంధ ఓటర్ల జాబితాలోని ఓటర్లకు వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నామినేషన్ల ప్రక్రియ ముగింపునకు 10 రోజుల ముందు నాటికి వచ్చిన ఓటరు నమోదు దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి ఎన్నికల్లో ఓటేసేందుకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. నవంబర్ 3న రాష్ట్ర శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ రానుండగా, 10తో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. దానికి 10 రోజుల ముందు అనగా, అక్టోబర్ 31 నాటికి దరఖాస్తు చేసుకున్న వారికి శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించనున్నారు. దరఖాస్తు ఎలా చేసుకోవాలి..? ఓటర్ల నమోదు, ఓటు బదిలీ, వివరాల దిద్దుబాటు.. తదితర సేవల కోసం కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ https://voters.eci.gov.in లో అన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటర్ హెల్ప్‌లైన్ యాప్(వీహెచ్ఏ)ను మొబైల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని కూడా ఈ సేవలను పొందవచ్చు. లేకుంటే స్థానిక బూత్ స్థాయి అధికారి(బీఎల్ఓ), ఓటరు నమోదు అధికారి (ఈఆర్వో)ను కలసి సంబంధిత దరఖాస్తు ఫారాన్ని నింపి అందజేయాల్సి ఉంటుంది. ఓటరు నమోదు కోసం కొత్తగా దిగిన ఫొటోతో పాటు చిరునామా, వయసు ధ్రువీకరణ కోసం పదో తరగతి మార్కుల పత్రం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, విద్యుత్ బిల్లు డిమాండ్ నోటీసు, గ్యాస్/బ్యాంక్ పాసుపుస్తకాలు వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. జాబితాలో పేరు ఉందా? లేదా? ఎలా తెలుసుకోవాలి? ఓటరు జాబితాలో పేరు ఉందా? లేదా ? అనేది తెలుసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా https://electoralsearch.eci. gov.in అనే వెబ్‌సైట్‌ను నిర్వహిస్తోంది. ఓటరు వివరాలు, ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్), మొబైల్ నంబర్ ఆధారంగా జాబితాలో పేరును సెర్చ్ చేయడానికి ఈ పోర్టల్ అవకాశం కల్పిస్తోంది. మొబైల్ ఫోన్ నంబర్, ఎపిక్ కార్డు నంబర్ ఆధారంగా జాబితాలో పేరు సెర్చ్ చేయడం చాలా సులువు. గతంలో ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న వారు మాత్రమే మొబైల్ ఫోన్ నంబర్ ఆధారంగా పేరును సెర్చ్ చేయడానికి వీలుండేది. ఓటరు పేరు, తండ్రి పేరు/ వయసు ఇతర వివరాలను కీ వర్డ్స్‌గా వినియోగించి సెర్చ్ చేసినప్పుడు అక్షరాల్లో స్వల్ప తేడాలున్నా జాబితాలో పేరు కనిపించదు. అయితే ఓటర్స్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ఓటర్ల జాబితాలో పేరును సులువుగా సెర్చ్ చేయవచ్చు. కొత్త ఎపిక్ కార్డు నంబర్ ఎలా తెలుసుకోవాలి? గతంలో కేంద్ర ఎన్నికల సంఘం 13/14 అంకెల సంఖ్యతో ఓటరు గుర్తింపు కార్డులను జారీ చేయగా, గత కొంత కాలంగా 10 అంకెల సంఖ్యతో కొత్త ఓటరు గుర్తింపు కార్డులను జారీ చేస్తోంది. పాత ఓటరు గుర్తింపు కార్డు నంబర్ ఆధారంగా మీ కొత్త ఓటరు గుర్తింపు కార్డు నంబర్‌ను తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) కార్యాలయం రూపొందించిన ప్రత్యేక వెబ్సైట్ https://ceotserms2.telangana.gov.in/ ts search/ Non Standard Epic.aspx ను సందర్శించి మీ పాత కార్డు నంబర్ ఆధారంగా కొత్త ఎపిక్ కార్డు నంబర్‌ను తెలుసుకోవచ్చు. -
ఓటర్ కార్డు లేకున్నా ఓటేయొచ్చు..!
సాక్షి, హైదరాబాద్: ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్)లోని వివరాల్లో స్వల్ప తేడాలున్నా, ఓటరు గుర్తింపు నిర్ధారణ అయిన పక్షంలో ఓటు హక్కు కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వేరే నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో) జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డును ఆధారంగా చూపి, మరో నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటును వినియోగించుకోవడానికి వచ్చే వారికి (ఆ పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితాలో పేరున్న వారికి) సైతం ఓటు హక్కు కల్పించాలని సూచించింది. ఓటరు గుర్తింపు కార్డు లేనిపక్షంలో, ఒకవేళ ఉన్నా గుర్తింపు ధ్రువీకరణ సాధ్యం కానిపక్షంలో పోలింగ్ రోజు ప్రత్యామ్నాయ ఫొటో ధ్రువీకరణ పత్రాలను తీసుకువస్తే ఓటు హక్కు కల్పించాలని ఆదేశించింది. తెలంగాణ సహా మరో 4 రాష్ట్రాల్లో శాసనసభ సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటరు గుర్తింపు నిర్థారణ విషయంలో కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తూ సీఈసీ ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు (సీఈఓలకు) లేఖ రాసింది. ఇలాంటి పరిస్థితుల్లో గుర్తింపు తప్పనిసరి.. ఓటరు గుర్తింపు కార్డులో ఫొటోలు తారుమారు కావడం, ఇతర లోపాలతో ఓటరు గుర్తింపు ధ్రువీకరణ సాధ్యం కానప్పుడు, కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన జాబితాలోని ప్రత్యామ్నాయ ఫోటో గుర్తింపు పత్రాల్లో (కింద జాబితాలో చూడవచ్చు) ఏదో ఒకదానిని ఆధారంగా చూపాల్సి ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది. ప్రవాస భారత ఓటర్లు తమ పాస్‌పోర్టును తప్పనిసరిగా చూపాల్సి ఉంటుందని తెలిపింది. పోలింగ్‌కు కనీసం 5 రోజుల ముందు పోలింగ్ కేంద్రం పేరు, తేదీ, సమయం, ఇతర వివరాలతో ఓటర్లకు పోలింగ్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను జారీ చేయాలని ఆదేశించింది. అయితే వీటిని ఓటరు గుర్తింపుగా పరిగణించరాదని స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ ఫోటో ధ్రువీకరణ పత్రాలివే.. – ఆధార్‌కార్డు – ఉపాధి హామీ జాబ్ కార్డు – బ్యాంకు/తపాల కార్యాలయం జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్‌బుక్ – కేంద్ర కార్మికశాఖ పథకం కింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు – డ్రైవింగ్ లైసెన్స్ – పాన్‌కార్డు – రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్, ఇండియా (ఆర్జీఐ).. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎనీ్పఆర్) కింద జారీ చేసిన స్మార్ట్ కార్డు – భారతీయ పాస్‌పోర్టు – ఫోటో గల పెన్షన్ పత్రాలు – కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/పీఎస్‌యూలు/ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు – ఎంపీలు/ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు – కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ డిజెబిలిటీ గుర్తింపు కార్డు (యూడీఐడీ) -
ఆధార్‌తో శర (అను) సంధానం
పార్లమెంటులో ఎన్నికల చట్టం (సవరణ) బిల్లు వేగంగా ఆమోదం పొందింది. మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించుకోవడంపై విమర్శలు తలెత్తు తున్నాయి. బిల్లులో ప్రతిపాదించిన ‘ఓటరు జాబితాను ఆధార్‌తో అనుసంధానించడం’పై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.మంచి ప్రతిపాదనలతో వచ్చిన సవరణ బిల్లును, అందరి అంగీకారంతో ఆమోదింపజేసేందుకు పాలకపక్షం చొరవ తీసుకొని ఉండాల్సింది. మరోవైపు ఆయా పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం, నిధుల వివరాలు, బాండ్ల ప్రక్రియ... ఇలా అన్ని సంస్కరణలూ ఫలితమివ్వకుండా ఒట్టిపోతున్నాయి. తాజా అనుసంధానంతో పాటు ఎన్నికల సంస్కరణలన్నీ ఆచరణలో మరింత పదునుదేలి, ఫలితాలిస్తేనే ప్రజాస్వామ్యానికి బలం. ప్రజలకు ప్రయోజనం. దేశంలో ఎన్నికల సంస్కరణల మందకొడి తనానికి విరుద్ధంగా పార్లమెంటులో ఎన్నికల చట్టం (సవరణ) బిల్లు వేగంగా ఆమోదం పొందింది. ప్రవేశపెట్టాక నిమిషాల్లోనే లోక్‌సభలో ప్రక్రియ పూర్తయితే, ఉభయసభల్లో కలిపి 48 గంటల్లోనే బిల్లుకు ఆమోదం దొరికింది. చట్టసభల స్ఫూర్తి, సంప్ర దాయం, మర్యాదల్ని గాలికొదిలి సాధించిన ఈ వేగం మంచిదా? అన్న చర్చ తెరపైకొస్తోంది. ముసాయిదా అంశాల్ని సభల్లో చర్చించ కుండా, స్థాయీ సంఘానికి పంపాలన్న విపక్ష డిమాండ్ పట్టించు కోకుండా, విభజన వినతిని వినకుండా మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించుకోవడంపై విమర్శలు తలెత్తుతున్నాయి. ఇక, బిల్లులో ప్రతిపాదించిన ‘ఓటరు జాబితాను ఆధార్‌తో అనుసంధానించడం’పై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ‘ఇది నిర్బంధమేమీ కాదు, ఓటర్ల ఐచ్ఛికం మాత్రమే!’ అని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, బిల్లు లోని అంశాల్ని బట్టి ఇది పూర్తిగా ఐచ్ఛికం కాదని తెలుస్తోంది. తప్పని సరి కాదంటున్నా, తగిన కారణాలుంటే తప్ప ఆధార్ అనుసంధాన పరచకుండా ఒక పౌరుడు కొత్తగా ఓటు నమోదు చేయలేడు, పాత ఓటరు పునరుద్ధరణా చేసుకోలేడన్నది బిల్లు మతలబు! ఆ ‘తగిన కారణాల్ని’ తర్వాత కేంద్రమే నిర్ణయిస్తుంది. దీనిపైనే విపక్షాలకు అభ్యంతరాలున్నాయి. ఒక పౌరుడు, ఆధార్ వివరాలివ్వదలచుకోనందునో, ఇవ్వలేక పోతున్నందుకో కొత్త ఓటరు నమోదును గానీ, పాత ఓటు పునరుద్ధరణను కానీ ఎన్నికల సంఘం నిరాకరించజాలదని కేంద్రం చెబుతోంది. ఈ విషయంలో కొంత అస్పష్టత, సందిగ్ధత ఉన్నాయి. ఓటర్ల జాబితా ప్రక్షాళన, బోగస్ ఓట్లు ఏరివేయటం వంటి లక్ష్యాల సాధనకు ఉద్దేశించిన బిల్లు వివాదాస్పదమవడమే దురదృష్ట కరం! ఓటరు జాబితా–ఆధార్ అనుసంధానంతో పాటు, ఏటా 4 సార్లు విభిన్న గడువు తేదీలతో కొత్త ఓటర్ల నమోదు, సర్వీస్ ఓటర్ల విషయంలో ఇప్పుడున్న లింగ వివక్షను తొలగించడం వంటి మంచి ప్రతిపాదనలతో వచ్చిన సవరణ బిల్లును, అందరి అంగీకారంతో ఆమోదింపజేసేందుకు పాలకపక్షం చొరవ తీసుకొని ఉండాల్సింది. విస్తృత సంప్రదింపులు జరిపి, పార్లమెంటులో లోతైన చర్చకు ఆస్కారం కల్పించి ఉంటే ప్రజస్వామ్య స్ఫూర్తి నిలిచేది. బహుళ నమోదులకు చెక్! ‘నీవు ఎక్కదలచుకున్న రైలు జీవితం కాలం లేటు’ అని ఆరుద్ర అన్నట్టు మన దేశంలో ఎన్నికల సంస్కరణలు ఎప్పుడూ ఆలస్యమే! ఎంతోకాలం బాకీ పడ్డ తర్వాత కానీ అవి రావు. ఆలస్యంగా వచ్చి కూడా వెంటనే అమలుకు నోచుకోవు! ఒకే వ్యక్తి వేర్వేరు నియోజక వర్గాల పరిధిలో ఓటరుగా ఉంటున్న ఉదంతాలు దేశంలో కొల్లలు! విడతలుగా జరిగే ఎన్నికల్లో వీరు రెండేసి చోట్ల ఓటు హక్కును వినియోగించుకొని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి గండికొడుతున్నారు. తెలుగు నాట ఇది తరచూ కళ్లకు కట్టేదే! పకడ్బందీగా దీన్ని పరిహరించి, ఒక వ్యక్తికి ఒకే ఓటును శాస్త్రీయంగా పరిమితం చేసే ఓటరు జాబితాల ప్రక్షాళనకి ఎన్నికల సంఘం–కేంద్రం పూనుకున్నాయి. ఓటరు జాబి తాని ఆధార్‌తో అనుసంధానించడమే ఇందుకు మేలైన పరిష్కారమని తాజా బిల్లు తెచ్చాయి. పౌరసత్వం లేని వారూ ఓటర్లుగా ఉండటం పట్ల పాలకపక్షం బీజేపీకి అభ్యంతరాలున్నాయి. బంగ్లాదేశ్, నేపాల్, వంటి పొరుగుదేశాల నుంచి అక్రమంగా వచ్చిన, దేశపౌరులు కాని వారిని ఓటు బ్యాంకులుగా అనుభవించేందుకే విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ ఈ బిల్లును వ్యతిరేకిస్తోందని పాలకపక్షం ఎదురుదాడి చేస్తోంది. విపక్షాలు మాత్రం, ఎన్నికల సంస్కరణల్లో కీలకమయ్యే బిల్లును కేంద్రం ఎందుకింత హడావుడిగా తెచ్చింది? అంటున్నాయి. తొందర వెనుక దురుద్దేశాల్ని శంకిస్తున్నాయి. అనుసంధానం తప్పని సరి కాదు, ఐచ్ఛికం అంటున్నప్పటికీ... వద్దనుకునే పౌరులు ఏ పరిస్థితుల్లో నిరాకరించవచ్చో బిల్లులో లేకపోవడం లోపం! పైగా, అందుకు ‘తగిన కారణాలు’ ఉండాలనటం, వాటిని కేంద్ర నిర్ణయానికి వదలటంపైనే సందేహాలున్నాయి. అలా నిర్ణయించే కారణాలు, పౌరుల అప్రతిహతమైన ఓటుహక్కును భంగపరచవచ్చన్నది భయం! ఈ అనుసంధానం వ్యక్తుల గోప్యత హక్కుకు విఘ్నమని, ఫలితంగా ఆధార్‌లో పొందు పరచిన పౌరుల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగ మయ్యే ఆస్కారముందని వారు సందేహిస్తున్నారు. ఆధార్ ప్రామాణికతపైనే.. దేశంలో కోట్ల రూపాయలు వెచ్చించి, ప్రత్యేక గుర్తింపు కార్డు వ్యవస్థ ఏర్పరిచారు. 95 శాతానికి పైబడి జనాభాకు ఆధార్ ఇప్పించినప్పటికీ, నిర్దిష్టంగా దేనికీ తప్పనిసరి చేయలేని పరిస్థితి! అలా చేయడానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం అనుమతించడం లేదు. సంక్షేమ కార్యక్రమాల్లో దుబారాను, దుర్వినియోగాన్ని నిలువరించేందుకు ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియకు పలుమార్లు ఎదురుదెబ్బలే తగిలాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, వేరయ్యాక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఓటరు జాబితాను ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియ చేపట్టినా, అర్ధంతరంగా ఆపాల్సి వచ్చింది. లక్షల్లో ఓట్లు గల్లంతవడం పట్ల పౌర సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆర్టీఐ దరఖాస్తులతో సమాచారం సేకరించినపుడు, ఈ ఓట్ల తొలగింపు–చేర్పు ప్రక్రియ ఇల్లిల్లూ తిరిగి జరిపింది కాదని తేలింది. రాజకీయ పక్షాల ప్రమే యంతో, ఎక్కడో కూర్చొని మూకుమ్మడిగా జరిపినట్టు ఆధారాలతో తప్పుల్ని నిరూపించడంతో, లోపాల్ని ఎన్నికల సంఘమే అంగీకరించాల్సి వచ్చింది. ‘ఇప్పటికిప్పుడు మేమైనా ఏమీ చేయలేమ’ని ఎన్నికల సంఘమే చేతులెత్తడం విమర్శలకు తావిచ్చింది. ఈ దశలోనే, సుప్రీంకోర్టు కల్పించుకొని, సదరు ప్రక్రియ నిలుపుదలకు ఆదేశిం చింది. పైగా ఆధార్ సమాచార ప్రామాణికతపైనే ఎన్నో సందేహాలు న్నాయి. పౌరులు ఆధార్ నమోదు సమయంలో ఇస్తున్న సమాచారం సరైందా? కాదా? తనిఖీ చేసి, ధ్రువీకరించుకునే వ్యవస్థ ‘భారత ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ’(యుఐడిఎఐ) వద్ద లేదు! ఈ లోపాన్ని అలహాబాద్, కలకత్తా హైకోర్టులతో పాటు వేర్వేరు సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా గుర్తించి, తప్పుబట్టాయి. అనుసంధానం వల్ల ఆధార్‌లోని పౌరుల వ్యక్తిగత సమాచారం వెల్లడై, రాజకీయ పక్షాలు ‘ప్రొఫైలింగ్’ చేసే ఆస్కారం ఉంటుంది. ఇది పౌరుల గోప్యతా హక్కుకు భంగం. తమ పరిధి ఓటర్లైన, ఏయే సామాజిక వర్గాల వారు, ఎలాంటి సంక్షేమ పథకాల కింద, ఎంతేసి లబ్ది పొందుతున్నారో అభ్యర్థులు, పార్టీలు తెలుసుకోవచ్చు! తద్వారా వారిని లక్ష్యం చేసి ప్రచారం జరుపడం, ప్రభావితం చేయడం, వశపరచుకోవడం వంటి అకృత్యాలకు ఆస్కారముంటుంది. ఇది పాలకపక్షాలకు సానుకూలాం శమై, పోటీదారుల మధ్య వివక్షకు తావిస్తుంది. లోగడ పుదుచ్చేరిలో ఇలా జరిగినపుడు చైన్నై హైకోర్టు తప్పుబట్టింది. సంస్కరణలింకా నిగ్గుతేలాలి! ‘నోటా’ పోరాట యోధులు ఇప్పుడెక్కడున్నారో? ‘పోటీలోని అభ్యర్థు లెవరికీ తాను ఓటేయజాల’ అని చెప్పడమే నోటా! పెద్ద పోరాటం తర్వాత, సుప్రీంకోర్టు అనుమతితో 2013 నుంచి సంక్రమించిన ఈ ప్రక్రియ, ఇంకా నికర లాభాలివ్వలేదు. ఎన్నికల వ్యయాన్ని నియం త్రించే వ్యవస్థలన్నీ ఇప్పుడు నామమాత్రమయ్యాయి. ఎన్నికల సంఘం విధించే పరిమితికి మించి వ్యయం చేసే వారెందరో ఉన్నా, దొరకటం లేదు. ఆ కారణంగా ఎవరూ అనర్హులు కావటం లేదు. రాజకీయాల్లోకి నేరస్తులు రాకుండా అడ్డుకునేందుకు చేసిన సంస్క రణలు ‘నిర్దిష్టత’ కొరవడి నీరసిస్తున్నాయి. కేంద్ర సమాచార కమిషన్, సుప్రీంకోర్టు చెప్పినా... తాము ‘పబ్లిక్ అథారిటీ’ కాదని రాజకీయ పక్షాలు చేస్తున్న పిడివాదంతో పారదర్శకత లోపించి పార్టీలపరమైన సంస్కరణలు కుంటుపడుతున్నాయి. ఆయా పార్టీల్లో అంతర్గత ప్రజా స్వామ్యం, నిధుల వివరాలు, బాండ్ల ప్రక్రియ... ఇలా అన్ని సంస్కర ణలూ ఫలితమివ్వకుండా ఒట్టిపోతున్నాయి. సగటు ఓటరుకు ఎన్ని కలపైనే విశ్వాసం సడలుతోంది. తాజా అనుసంధానంతో పాటు ఎన్ని కల సంస్కరణలన్నీ ఆచరణలో మరింత పదునుదేలి, ఫలితాలిస్తేనే ప్రజాస్వామ్యానికి బలం. ప్రజలకు ప్రయోజనం. - దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
సెక్స్ వర్కర్లకు ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: వృత్తి, ఉద్యోగాలతో సంబంధం లేకుండా అందరికీ ప్రథమిక హక్కులు కల్పించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సెక్స్ వర్కర్లకు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డులు అందించాలని ఆదేశించింది. గుర్తింపు కార్డులు లేనివారికి కూడా రేషన్ బియ్యం ఇవ్వాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో సెక్స్ వర్కర్లు సమస్యలపై వేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేట్టింది. సెక్స్ వర్కర్లకు రేషన్‌కార్డులు అందించాలని 2011లో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ అమలుకు నోచుకోలేదని న్యాయమూర్తులు ఎల్.నాగేశ్వరరావు, బీఆర్ గవాయి, బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. సెక్సు వర్కర్లుకు రేషన్ కార్డులు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుమారు దశాబ్దం కిందనే ఆదేశించినా ఎందుకు అమలు చేయడంలేదని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. పౌరులు చేసే వృత్తి, ఉద్యోగానికి సంబంధం లేకుండా ప్రతిఒక్కరికీ ప్రాథమిక హక్కులు ఉన్నాయని తెలిపింది. దేశంలోని ప్రజలకు ప్రభుత్వాలు విధిగా అన్ని సౌకర్యాలని కల్పించాలని గుర్తుచేసింది. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెక్స్ వర్కర్లకు రేషన్, ఓటర్ కార్డులను అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆదేశించింది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంఘాల సహాయం తీసుకోవాలని తెలిపింది. కమ్యూనిటీ ఆధారిత సంస్థలు అందించిన సమాచారంతో సెక్స్ వర్కర్ల జాబితాను సిద్ధం చేసుకోవాలని పేర్కొంది. సెక్స్ వర్కర్లకు అందించే ఐడీ కార్డులను తయారు చేసే క్రమంలో వారి పేర్లు, గుర్తింపును గోప్యంగా ఉంచాలని సుప్రీం కోర్టు సూచించింది. -
నవంబర్ 1 నుంచి ఓటర్ల నమోదు
సాక్షి, హైదరాబాద్: నవంబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం– 2022 షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2022 జనవరి 1 నాటికి 18 ఏళ్లు, ఆపై వయసు కలిగిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ప్రారంభానికి ముందు ఈ నెల 9 నుంచి అక్టోబర్ 31 వరకు సన్నాహక కార్యక్రమాలను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. డూప్లికేట్ ఓటర్లు, పునరావృతమైన ఓట్లు, ఇతర తప్పులను తొలగించడం, బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ తిరిగి ఓటర్ల పరిశీలన నిర్వహించడం, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ వంటి కార్యక్రమాలను ఇందులో భాగంగా చేపట్టనున్నారు. అనంతరం నవంబర్ 1 నుంచి కింద పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులతో పాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, ఇతర మార్పుచేర్పుల కోసం ఠీఠీఠీ.nఠిటp. జీn పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) శశాంక్ గోయల్ గురువారం ఓ ప్రకటనలో కోరారు. -
ఇక డిజిటల్ ఓటరు కార్డు!
న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియాలో భాగంగా ఓటరు గుర్తింపు కార్డును డిజిటల్ చెయ్యా లని కేంద్ర ఎన్నికల సంఘం యోచిస్తోంది. పలు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకి ముందే డిజిటల్ ఫార్మేట్లోకి మార్చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీని వల్ల ఓటరు తమ గుర్తింపు కార్డుని పోలింగ్ బూతులకి వెంట తీసుకువెళ్లాల్సిన పని ఉండదు. అంతేగాక క్యూఆర్ కోడ్ల ద్వారా సమాచారాన్ని కార్డులో ఉంచనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారి ఒకరు శనివారం వెల్లడించారు. దీంతో విదేశాల్లో ఉన్న వారు కూడా తమ కార్డుని ఒక్క క్లిక్ సాయంతో క్షణాల్లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. -
అదే మీ చేతిలోని బ్రహ్మాస్త్రం: కమల్
చెన్నై: మరో ఆరు నెలల్లో తమిళనాడులో ఎన్నికల నగారా మోగనుంది. పార్టీలన్ని దూకుడు పెంచాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దిగనున్న నటుడు, మక్కల్ నీధి మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్ హాసన్ ఓటర్లును ఉద్దేశిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఓటరు ఐడీ మన చేతిలోని బ్రహ్మాస్త్రం అన్నారు. అర్హులైన వారంతా ఓటరు ఐడీలకోసం సైన్ అప్ చేసుకోవాలని కోరారు. రెండున్నర నిమిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో కమల్ ప్రజలను ఉద్దేశిస్తూ.. ‘ఓటరుగా ఉండటం అనేది 18 ఏళ్లు నిండిన వారికి దక్కిన అరుదైన గౌరవం. ఓటరు ఐడి అనేది పెద్ద ఆయుధం. తన బాధ్యతలను సరిగా నిర్వర్తించని సమాజం.. హక్కులను ఆటోమెటిక్‌గా కోల్పోతుంది. మార్పు రావాలని ఉపన్యాసాలు దంచేవారు.. సిస్టం సరిగ్గా పని చేయడం లేదని విమర్శించే వారు.. ప్రజా ప్రతినిధులంతా దొంగలు అని తిట్టే వారికి ఓటరు ఐడీ ఉండదు. 2021 ఎన్నికల్లో దీన్ని మీ ఆయుధంగా వాడుకోండి. నేను మారతాను.. నేను ఓటేస్తాను అని ప్రతిజ్ఞ చేయండి’ అని కోరారు కమల్. (చదవండి: ఇలాగైతే పార్టీ ఎత్తేస్తా.. కమల్‌హాసన్ హెచ్చరిక..!) ஒன்று கூடுவோம் வென்று காட்டுவோம்#iWillCHANGE_iWillVOTE#என்ஓட்டு_என்பெருமை pic.twitter.com/xvggdOfl6V — Kamal Haasan (@ikamalhaasan) November 20, 2020 వచ్చే ఏడాది మేలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇద్దరు లెజండరీ నాయకులైన జయలలిత, కరుణానిధిలను కోల్పోయిన తర్వాత తమిళనాడులో జరగనున్న ఈ అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కమల్ హాసన్ 2021లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. 2018, ఫిబ్రవరిలో కమల్ మక్కల్ నీధి మయ్యం పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఇక గతేడాది లోక్‌సభ ఎన్నికల్లోల బరిలో నిలిచిన కమల్ పార్టీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు. కేవలం 4 శాతం ఓట్లు మాత్రమే సంపాదించింది. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ పార్టీ ‘జీవనాధారం, ఉద్యోగాలు, తాగునీరు’ అజెండాతో ప్రజల మధ్యకు వెళ్లనుంది. వచ్చే నెల నుంచి కమల్ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే దానికి గురించి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. అనారోగ్యం కారణంగా రజనీకాంత్ ఎన్నికల్లో పోటీ గురించి పునరాలోచిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. -
యంత్రంలో ఓటు మంత్రం
సాక్షి, నరసరావుపేట : ఎన్నికల సమరంలో పోలింగ్ ప్రక్రియ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అందులోనూ గతంలో మాదిరి బ్యాలెట్ ఓటింగ్ కాకుండా.. ఈవీఎం, వీవీప్యాట్ల ద్వారా ఓటు వేసే విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనిలో ఓటు ఏలా వేయాలో తెలుసుకుందాం. పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశం మీరు పోలింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్లేసరికి ప్రిసైడింగ్ అధికారి మీ బ్యాలెట్‌ను సిద్ధంగా ఉంచుతారు. ఓటు వేయడం ఇలా బ్యాలెట్ యూనిట్(ఈవీఎం)పైన మీకు నచ్చిన అభ్యర్థి పేరు, ఫొటో, గుర్తుకు ఎదురుగా ఉన్న నీలిరంగు(బ్లూ) బటన్‌ను గట్టిగా నొక్కాలి. సిగ్నల్ : ఓటు వేసినప్పుడు మీరు ఎంచుకున్న అభ్యర్థి పేరు, గుర్తుకు ఎదురుగా ఎర్రలైట్ వెలుగుతుంది. ప్రింట్‌ను చూడండి ప్రింటర్– మీరు ఎన్నుకున్న అభ్యర్థి సీరియల్ నంబర్, పేరు, ఫొటో, గుర్తుతో ఓ బ్యాలెట్ స్లిప్ ప్రింట్‌ను వీవీప్యాట్‌లో చూడవచ్చు. గమనించాల్సిన విషయం ఒక వేళ మీకు బ్యాలెట్ స్లిప్ కనిపించకపోయినా, బీప్ శద్ధం గట్టిగా వినిపించకపోయినా ప్రిసైడింగ్ అధికారిని సంప్రదించవచ్చు. ఓటు గుర్తింపు కార్డు లేకపోయినా ఓటేయొచ్చు! ఓటర్ జాబితా సవరణతో కొత్తగా ఓటర్‌గా నమోదైన వారికి సైతం ఇటీవల గుర్తింపు కార్డులు వచ్చాయి. అయితే ప్రస్తుత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు ఉండీ గుర్తింపు కార్డు లేదని బాధపడుతున్నారా! ఇప్పుడు ఆ చింత అవసరం లేదు. ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఇవి ఉంటే సరి.. డ్రైవింగ్ లైసెన్సు, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, ఆధార్‌కార్డు, ఫొటోతో ఉన్న బ్యాంక్ పాస్‌పుస్తకం, పోస్టాఫీసులు జారీ చేసిన ఫొటోతో ఉన్న పాస్‌బుక్, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు, పింఛన్‌కార్డు, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు .. ఇలా వీటిల్లో ఏదో ఒక దానిని చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. చాలెంజ్ ఓటు.. ఏప్రిల్ 11 2019ఓటరు గుర్తింపు విషయంలో అధికారులకు సందేహం కలిగినా, ఏజెంట్లు అభ్యంతరం చెప్పినా సదరు ఓటర్ తన గుర్తింపును చాలెంజ్ చేసి రుజువు చేసుకోవాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి ఓటు వేయడానికి వచ్చినప్పుడు అతని పేరు తప్పు చెబుతున్నాడని ఏజెంట్ అభ్యంతరం చెబితే ఓటర్ను.. ఏజెంట్‌ను ప్రిసైడింగ్ అధికారి వద్దకు పంపుతారు. అభ్యంతరం చెప్పిన ఏజెంట్ నుంచి రూ. 2 చాలెంజ్ ఫీజుగా తీసుకుంటారు. అప్పుడు ఓటర్ వద్ద ఉన్న ఇతర గుర్తింపు వివరాలు అధికారులు పరిశీలిస్తారు. అప్పటికీ సంతృప్తి చెందకపోతే బీఎల్ఓను పిలిచి అతడు స్థానిక ఓటరా కాదా అనే విషయం.. పేరు, తండ్రి పేరు లాంటి వివరాలు తెలుసుకుంటారు. అతడు స్థానిక ఓటరై, జాబితాలో ఉన్న పేరు వాస్తవం అయితే వయన్సు, తండ్రి పేరు, చిరునామా లాంటి విషయాల్లో తేడా ఉన్నా పెద్దగా పట్టించుకోరు. అప్పుడు ఏజెంట్, ఓటరు ఇద్దరిలో ఎవరి వాదన సరైందని తేలితే వారిని వదిలి మిగతా వారికి ప్రిసైడింగ్ అధికారి మొదటిసారి హెచ్చరిక జారీ చేస్తారు. లేదా ఏజెంట్‌ను, ఓటరును పోలీసులకు అప్పగించవచ్చు. -
ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ షురూ
సాక్షి, హైదరాబాద్: ఏప్రిల్ 11న జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసేందుకు అవకాశం పొందిన కొత్త ఓటర్లకు ఉచితంగా ఫొటో గుర్తింపు (ఎపిక్) కార్డులతో పాటు ఫొటో ఓటరు స్లిప్పులు, ఓటరు గైడుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) ఇంటింటికి తిరిగి వీటిని ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు. గురువారం నాటికి రాష్ట్రంలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఫొటో ఓటరు గుర్తింపు కార్డులు, ఓటరు స్లిప్పుల పంపిణీ ఉధృతం కానుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్ తెలిపారు. ఇంతకు ముందే ఓటరుగా నమోదు చేసుకుని ఎపిక్ కార్డులు తీసుకోనివారు సమీపంలోని మీ–సేవ కేంద్రం వద్ద తగిన రుసుం చెల్లించి పొందవచ్చని తెలిపారు. ఓటు వేయడానికి ముందు పోలింగ్ కేంద్రంలో ఓటరు గుర్తింపు నిర్ధారణకు కేవలం ఓటరు స్లిప్పులు చూపితే సరిపోదని, ఓటరు గుర్తింపు కార్డు లేదా ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదానిని చూపాలని తెలిపారు. ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు కార్డులు 1.పాస్‌పోర్టు 2. డ్రైవింగ్ లైసెన్స్ 3. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు/ప్రభుత్వ రంగ సంస్థలు/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగుల గుర్తింపు కార్డులు 4. బ్యాంకులు, పోస్టాఫీస్‌లు ఫొటోతో జారీ చేసిన పాస్ పుస్తకాలు 5. పాన్‌కార్డు 6. ఎన్పీఆర్ కింద రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం జారీ చేసిన స్మార్ట్‌కార్డు 7.ఉపాధి హామీ జాబ్ కార్డు 8. ఆరోగ్య బీమా కింద కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన స్మార్ట్‌కార్డు 9. ఫొటో జత చేసి ఉన్న పింఛన్ పత్రాలు 10. ఎంపీ/ఎమ్మెల్యే/ఎంఎల్సీలకు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం 11. ఆధార్ కార్డు -
ఆయన్ని కట్టడి చేయడానికి రాజ్యాంగ సవరణ
ఎన్నికల సంఘం అంటే గుర్తుకు వచ్చేది టీఎన్ శేషనే. ఎన్నికల సంఘంపై చెరిగిపోని ముద్ర వేసి ఎన్నికల్లో సంచలనం సృష్టించారు. కాగితాలకే పరిమితమైన ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిని ఆచరణలోకి తీసుకొచ్చారు. ఎన్నికల సంఘానికి రాజ్యాంగం కల్పించిన అధికారాలను విస్తృత స్థాయిలో ఉపయోగించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. తన సంస్కరణల ద్వారా ఆయన రాజకీయ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఈ క్రమంలో ఆయన వివాదాస్పదుడిగా పేరు కూడా గడించారు. 1990లో ఆయన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల్లో భారీగా అక్రమాలు, ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుపై పరిమితి లేకపోవడం, పోలింగ్ బూత్‌ల కబ్జా, అధికార దుర్వినియోగం ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రధాన కమిషనర్‌గా నియమితులయ్యారు. వీటన్నింటినీ కట్టడి చేసేందుకు ఆయన పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రక్రియలో ఆయన ప్రభుత్వాన్ని సైతం సవాలు చేశారు. రాజ్యాంగం ఇచ్చిన తన అధికారాల్లో ఏ ఒక్కరూ జోక్యం చేసుకోరాదని తేల్చిచెప్పారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రతను, సమగ్రతను కాపాడటం, ఓటర్లకు సాధికారిత కల్పించడం, ఎన్నికల విధివిధానాలను మార్చడం, ఎన్నికల చట్టాలను సవరించడం వంటివి ఆయన ప్రధాన లక్ష్యాలు. అందుకు ముందు ప్రజల్లో ఎన్నికల కమిషన్ పట్ల ఉన్న అభిప్రాయాన్ని మార్చాలని నిర్ణయించుకున్నారు. దీనికి గాను ఆయన ముందుగా తన కార్యాలయాన్ని సంస్కరించడం మొదలుపెట్టారు. కార్యాలయాల్లోని గోడలపై ఉన్న దేవుళ్లు, దేవతల ఫొటోలను తీసేయించారు. ఎన్నికల కమిషన్ లౌకిక నిర్వచన పరిధిలోకి వస్తుందని ఉద్యోగులకు ఉద్భోధించారు. మధ్యాహ్న భోజన విరామ సమయాన్ని తగ్గించారు. అధికారులను ఎక్కువ సమయం గ్రంథాలయంలో గడిపేలా చేశారు. ఆ తర్వాత ఆయన ఎన్నికల కేసులపై దృష్టి సారించారు. అభిశంసన తీర్మానానికి దారితీసిన నిర్ణయాలు వివిధ ఆరోపణలపై పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులపై ఆయన అనర్హత వేటు వేశారు. దీంతో ఆయన రాజకీయ నాయకులకు లక్ష్యంగా మారారు. దీని తర్వాత ఆయనపై అభిశంసన తీర్మానాన్ని పెట్టగా అప్పటి స్పీకర్ తిరస్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందిని ఎన్నికల సమయంలో డిప్యుటేషన్ మీద తన పరిధిలోకి తీసుకునే విషయంలో కూడా ప్రభుత్వాలకు, శేషన్‌కు మధ్య యుద్ధమే నడిచింది. దీనిపై సుప్రీంకోర్టు శేషన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. శేషన్ కట్టడికి రాజ్యాంగ సవరణ 1993లో తమిళనాడు ఎన్నికల సందర్భంగా కేంద్ర బలగాలను పంపాలని కేంద్రాన్ని కోరారు. దీనికి కేంద్ర హోంశాఖ నిరాకరించింది. దీంతో శేషన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం ఎన్నికల సంఘం అధికారాన్ని గుర్తించే వరకు ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. దీంతో శేషన్‌ను కట్టడి చేసేందుకు ఎన్నికల కమిషన్‌లో మరో ఇద్దరు కమిషనర్లను నియమిస్తూ రాజ్యాంగ సవరణ చేశారు. అభ్యర్థుల ప్రచార వ్యయానికి పరిమితులు అసెంబ్లీ అభ్యర్థి ప్రచార వ్యయాన్ని గరిష్టంగా రూ.40 వేలుగా, పార్లమెంట్ అభ్యర్థి ప్రచార వ్యయాన్ని రూ.1.70 లక్షలుగా నిర్ణయించారు. ఈ పరిమితి అమల్లోకి వచ్చిన తర్వాత పీవీ నరసింహారావు ప్రభుత్వం ఈ పరిమితిని పెంచేందుకు ప్రయత్నించింది. అయితే ఈ పరిమితిని ఉల్లంఘిస్తే సహించేది లేదని శేషన్ తేల్చి చెప్పారు. 1993 ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ఖర్చుపై ఆయన ఎక్కువ దృష్టి సారించారు. ఎన్నికల లెక్కలు సమర్పించనందుకు 1,488 మందిపై మూడేళ్ల పాటు అనర్హత వేటు వేశారు. ఓటరు గుర్తింపు కార్డు ఉండాల్సిందే.. ఎన్నికలు సజావుగా జరగటానికి ఓటర్లకు అవగాహన కల్పించడం ముఖ్యమని శేషన్ గ్రహించారు. అందుకోసం జాతీయస్థాయిలో ఓటరు అవగాహన కార్యక్రమాలు ప్రారంభించారు. ఓటరు హక్కులు, బాధ్యతల గురించి విస్తృత ప్రచారం నిర్వహించారు. 1992లో ఆయన తీసుకొచ్చిన సంస్కరణ మొత్తం ఎన్నికల ప్రక్రియను మార్చేసింది. అర్హులైన ఓటర్లందరికీ ఫొటో గుర్తింపు కార్డు ఇవ్వాలని నిర్ణయించారు. రాజకీయ నేతలు ఈ ప్రతిపాదనను తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. ఓటరు గుర్తింపు కార్డు విషయంలో ప్రభుత్వం 18 నెలలు గడిచినా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. గుర్తింపు కార్డులు ఇచ్చేంత వరకు ఎన్నికలు నిర్వహించేది లేదని శేషన్ తేల్చిచెప్పారు. సుప్రీంకోర్టు జోక్యం తర్వాత ఎన్నికలు జరిగాయి. ‘లౌడ్ స్పీకర్’ నిషేధం శేషన్ తీసుకొచ్చిన మరో సంస్కరణ గోడలపై రాతలు, లౌడ్ స్పీకర్ల వినియోగం. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపై పోస్టర్లు అతికించడం వంటి వాటిపై నిషేధం విధించారు. దీనివల్ల ఎన్నికల సందర్భంగా శబ్దకాలుష్యం తగ్గింది. ప్రచార ఖర్చుపై పరిమితి ఉండటంతో అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడగాల్సిన పరిస్థితి వచ్చింది. కులం, మతం, భావోద్వేగాల ఆధారంగా ఓట్లు అడగరాదంటూ కూడా శేషన్ ఓ ఉత్తర్వులు ఇచ్చారు. వీటి అమలు కోసం ప్రత్యేక పరిశీలకులను నియమించారు. రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోలను పరిశీలించే అధికారం పరిశీలకులకు ఇచ్చారు. అభ్యర్థుల ప్రసంగాలపై కూడా నిఘా ఉంచారు. సంస్కరణల్లో అత్యంత ముఖ్యమైంది.. ప్రవర్తనా నియమావళి. ఎన్నికల సందర్భంగా ఎలా నడుచుకోవాలి? ఎలా నడుచుకోరాదో ఈ నియమావళి నిర్ణయిస్తుంది. ఇది మొత్తం ఎన్నికల తీరుతెన్నులనే మార్చేసింది. ఈ నియమావళికి ప్రతి అభ్యర్థితోపాటు రాష్ట్రపతి నుంచి ముఖ్యమంత్రి వరకు అందరూ కట్టుబడి ఉండాల్సి వచ్చింది. ఎన్నికల సందర్భంగా వీడియో బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ నియమావళితో అనేక అక్రమాలకు, అవకతవకలకు తెరపడింది. దేశవ్యాప్తంగా ప్రజల నుంచి ఈ సంస్కరణలకు మద్దతు లభించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం ‘నోటా’ను తీసుకొచ్చింది. లెక్కలు చూపాల్సిందే.. అధికారులు, నేతలు కుమ్మక్కై ఎన్నికల ప్రక్రియను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఎన్నికల పరిశీలకులను నియమించాలని శేషన్ నిర్ణయించారు. ప్రధానంగా ఎన్నికల వ్యయాన్ని పరిశీలించేందుకు వీరిని ఉపయోగించుకున్నారు. ఇది సత్ఫలితాన్ని ఇచ్చింది. అంతేకాకుండా ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 77ను కూడా ఆయన ఉపయోగించారు. ఎన్నికల లెక్కలను ప్రమాణపూర్వక అఫిడవిట్ రూపంలో సమర్పించేలా చర్యలు తీసుకున్నారు. – యర్రంరెడ్డి బాబ్జీ సాక్షి, అమరావతి ప్రతి పైసాకూ -
వైఎస్ఆర్ జిల్లా.. మీ ఓటు చెక్ చేసుకోండి
సాక్షి, వైఎస్ఆర్ జిల్లా నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ www.nvsp.in ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. www.ceoandhra.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. కాల్ సెంటర్ఇన్చార్జి: రామునాయక్, స్టెప్ సీఈఓ 98499 09064 మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. ఈ నెల 15వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. -
మీ ఓటు ఉందా.. ఒకసారి సరి చూసుకోండి
-
కృష్ణా జిల్లా.. మీ ఓటు చెక్ చేసుకోండి
సాక్షి, కృష్ణా జిల్లా: నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ www.nvsp.in ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. www.ceoandhra.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. కలెక్టరేట్ కాల్ సెంటర్ ఇన్చార్జి : స్వామినాయుడు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్: 9849903988 జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. ఈ నెల 15 వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. -
గ్రామాల్లో ‘స్థానిక’ సందడి షురూ
సాక్షి, కథలాపూర్: ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గత ఐదు నెలలుగా గ్రామాల్లో రాజకీయాలు వెడేక్కి.. ప్రశాంతంగా ముగియడంతో నాయకులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారు చేయడంతో గ్రామాల్లో రాజకీయాలు మరోమారు వెడేక్కాయి. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చాయని కొందరు నాయకులు తమకు రిజర్వేషన్లు కలిసిరాలేదని మరికొందరు తమ అనుచరవర్గాలతో రాజకీయ భవితవ్యంపై చర్చల్లో మునిగితేలుతున్నారు. మరోవైపు ఏ నాయకుడిని గెలిపిస్తే మంచిపాలన అందిస్తారనే విషయంలో ప్రజలు సైతం కూడళ్ల వద్ద చర్చించుకోవడం విశేషం. బీసీలకే కథలాపూర్ ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు.... ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్ల ప్రక్రియ జిల్లాస్థాయిలో జరగడంతో కథలాపూర్ మండల ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానం బీసీలకే రిజర్వ్ అయ్యాయి. కథలాపూర్ మండలంలో 19 గ్రామాలుండగా.. 13 ఎంపీటీసీ స్థానాలుగా నిర్ణయించారు. ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లను మండలస్థాయి యూనిట్‌గా ఖరారు చేయనుండటంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఆయా గ్రామాల్లో ఇటివలే జరిగిన సర్పంచ్ ఎన్నికలకు వర్తించే రిజర్వేషన్లు ఎంపీటీసీ స్థానాలకు దగ్గరగా ఉంటాయని ఆయా గ్రామాల్లో ఆశావహులు ఇప్పటికే అనుచరవర్గంతో ప్రచారాలు ప్రారంభించడం గమనార్హం. సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిపాలైన పలువురి నాయకులకు ప్రజాతీర్పు కోరుకునేందుకు ఎంపీటీసీ ఎన్నికల రూపంలో మరోచాన్స్ వచ్చినట్లయిందని.. గెలుపుకోసం ఏమి చేయాలనే వ్యుహాలు రచించుకుంటున్నారు. మండలంలో 32,712 మంది ఓటర్లు.. కథలాపూర్ మండలంలో 19 గ్రామాలకు గాను 13 ఎంపీటీసీ స్థానాలుండగా.. 32,712 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళ ఓటర్లు 17,354 మంది, పురుషులు 15,358 మంది ఓటర్లు ఉన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో యువత ఉపాధి నిమిత్తం గల్ఫ్‌బాట పట్టినవారే ఉండటంతో మహిళ ఓటర్లు ఎక్కువగా వినియోగించుకునే అవకావం ఉంది. ఆయా గ్రామాల్లో గెలుపు ఓటములకు మహిళ ఓటర్లు కీలకం కానున్నారని పార్టీల నాయకులు భావిస్తున్నారు. కథలాపూర్‌కు మరోసారి జెడ్పీ చైర్మన్ పోస్టు దక్కేనా..? 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కథలాపూర్ జెడ్పీటీసీగా గెలుపొందిన తుల ఉమ జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. జిల్లాల పునర్విభజన జరగడంతో ప్రస్తుతం కథలాపూర్ మండలం జగిత్యాల జిల్లా పరిధిలోకి వచ్చింది. జిల్లాలో 18 జెడ్పీటీసీ స్థానాలుండటంతో ఏ పార్టీ అధిక స్థానాలు గెలుచుకుంటే ఆ పార్టీ జెడ్పీ చైర్మన్ సీటు కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి జెడ్పీటీసీగా బరిలో ఉండే నాయకులు సైతం జిల్లాస్థాయిలో ప్రభావం చూపాలని అప్పుడే ఉన్నతస్థాయిలో పార్టీ నేతలో చర్చలు జరుపుతుండటం విశేషం. మరోసారి కథలాపూర్ జెడ్పీటీసీగా గెలుపొందినవారు జెడ్పీ చైర్మన్ సీటు దక్కించుకుంటారా లేదా అనేది రాజకీయ నాయకుల్లో ఆసక్తి రేపుతోంది. ఏదేమైనా గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. ఏప్పుడేమి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని రాజకీయనాయకులతోపాటు ప్రజల్లో రోజురోజుకు ఉత్కంఠ నెలకొంది. -
ఓటరు స్లిప్పు లేకుంటే.. గుర్తింపు కార్డు తప్పని సరి
సాక్షి,మిర్యాలగూడ రూరల్ : శాసనసభ ముందస్తు ఎన్నికలు ఈ నెల 7న శుక్రవారం ఉదయం 7గంటలకు ప్రారంభమై సాయంత్రం 5గంటలకు నిర్వహించనున్నారు. ఓటు వేయడానికి ఓటర్లందరికీ ఓటరు స్లిప్పులను బీఎల్ఓల ద్వారా ఇంటింటికీ తిరిగి అందజేశారు. ఈ స్లిప్పులు లేకున్నా ఓటరు జాబితాలో తమ కార్డు నంబరు, పోలింగ్ బూతు నంబరు, ఓటరు క్రమ సంఖ్య తెలిసి ఉంటే తెల్లకాగితంపై రాసుకుని వెళ్లి ఎన్నికల సంఘం ఆమోదించిన ఆధార్‌కార్డుతో పాటు డ్రైవింగ్, పాన్‌కార్డు, ఉపాధిహామీ జాబ్‌కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం, పాస్‌పోర్టు లాంటి తదితర గుర్తుంపు కార్డులు ఏ ఒక్కటి ఉన్నా చూపించి కూడా ఓటు వేయవచ్చు. పోలింగ్ బూతులో ఏజెంట్ అభ్యంతంరం తెలిపినపుడు వారిని సంతృప్తి పరిచే విధంగా రుజువు చేసుకోవలసి ఉంటుంది. స్థానిక బూతులెవల్ అధికారి,గ్రామ రెవెన్యూ అధికారి నిర్ధారణ చేస్తారు. పోలింగ్ రోజు సాయంత్రం వరకు ఓటు వేయడానికి ఎంత పెద్ద వరుస ఉన్నా వారందరూ ఓటువేయడానికి అవకాశం కల్పిస్తారు.ఒక వేళ అవకాశం ఇవ్వక పోతే అక్కడి పరిశీలకులు లేదా టోల్ ఫ్రీ నంబర్ 1950 ఫిర్యాదు చేయవచ్చు. మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక వరుసలు ఏర్పాటు చేస్తారు. అంధులు, శరీర దౌర్భల్యం గల వారిరు ఓటు వేయడానికి సహాయకులను తీసుకుపోవచ్చు. అయితే సహాయకున్ని ఒక ఓటుకు మాత్రమే అంగీకరిస్తారు. మళ్లీ రాకుండా సహాయకుని కుడిచేతిచూపుడు వేలుకు సిరా గుర్తు వేస్తారు. పోలింగ్ బూతులోనికి కెమరాలు, సెల్ ఫోన్లు అనుమతించరు. ఓటు వేయడానికి బహిరంగంగా డబ్బు ,బహుమతి, మద్యం తీసుకొన్న వారితో పాటు ,ఇచ్చిన వారిని అరెస్టు చేస్తారు. అభ్యర్థికి చెందిన వాహనంలో ఓటు వేయడానికి వచ్చిన అరెస్టు చేయవచ్చు. -
జిల్లాకు కొత్త ఓటరు కార్డులొచ్చాయోచ్..!
సాక్షి, మహబూబ్‌నగర్ న్యూటౌన్ : రానున్న ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్‌లకు వెళ్లే ఓటర్ల కోసం కమిషన్ ఫొటో గుర్తింపు కార్డు(ఎపిక్)లు జారీ చేసింది. వంద శాతం పోలింగ్ లక్ష్యంగా ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఓటరుగా నమోదైన ప్రతీ ఒక్కరికి గుర్తింపు కార్డు జారీ చేస్తోంది. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు ఎదురవకుండా.. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చేలా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న జిల్లా యంత్రాంగం ఓటరు గుర్తింపు కార్డులను సైతం ఓటర్లకు అందజేసేందుకుచర్యలు చేపట్టారు. రిటర్నింగ్ కార్యాలయాలకు.. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల గుర్తింపు కార్డులు ఎన్నికల కమిషన్ నుంచి జిల్లాకు చేరాయి. ఈ సందర్భంగా వీటిని నియోజకవర్గాల వారీగా వేరు చేసి రిటర్నింగ్ కార్యాలయాలకు పంపించారు. అక్కడ గ్రామాల వారీగా, పోలింగ్ బూత్‌ల వారీగా కార్డులను వేరు చేయడంలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లిన సమయంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ఫొటో గుర్తింపు కార్డుల్లో ఒకటైన ఎలక్టోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డు(ఎపిక్)ను తీసుకెళ్తే సరిపోతుంది. ఓటరు ఫోటో గుర్తింపు కార్డులు 10,22,244 జిల్లాలో మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లకు సంబంధించి ఎపిక్ కార్డులు వచ్చాయి. జిల్లాలో మొత్తం 10,22,244 మంది ఓటర్లు ఉండగా.. వీరికి సంబంధించిన కార్డులను బూత్‌ల వారీగా విభజన ఆయా రిటర్నింగ్ కార్యాలయాల్లో జరుగుతోంది. విభజన పూర్తయ్యాక గ్రామాలకు చేరవేసి వీఆర్వోల పర్యవేక్షణలో వాటిని ఓటర్లకు పంపిణీ చేయనున్నారు. ప్రతీ ఓటరుకు అందేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. -
‘నల్లగొండ’ మొదటి ఓటరు సుగుణాబాయి
సాక్షి, నల్లగొండ : ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో విలు వుంది. అది ఎంతో ప్రాముఖ్యమైనది కూడా. సామాన్యుడికి అదో వజ్రాయుధం లాంటిది. ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఓటు వేయాల్సిందే.అయితే ఓటరు జాబితాలో మొదటి ఓటరు మాత్రం ఓటు వేసిన మధుర స్మృతి ఎప్పటికీ మిగిలిపోనుంది. 2018 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో మొదటి ఓటరు అవకాశం దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి మండలం గొడకొండ్ల గ్రామంలోని మొదటి పోలింగ్ బూత్‌లోని మొదటి ఓటరుగా సుగుణాబాయికి అవకాశం దక్కింది. జిల్లాలోనే మొదటి ఓటరుగా ఆమెకు అవకాశం లభించడం, మొదటి ఓటు వేయడం ఎంతో ఆసక్తిని కలింగించనుంది. చింతపల్లి మండలం గొడకొండ్ల గ్రామంలో జిల్లాలోని మొదటి పోలింగ్ బూత్ అది. ఆ బూత్‌లోనే మొదటి ఓటరు మొదట ఓటు వేసే అవకాశం లభించింది. సుగుణాబాయి ఓటరు ఐడీ కార్డు నంబర్ టీఐసీ1199504. అయితే ఈమె జిల్లాలోనే మొదటి ఓటు వేయడంతోపాటు దేవరకొండ నియోజకవర్గంలో కూడా మొదటి ఓటు ఆమెనే వరించినట్లయింది. జిల్లాలో మొత్తం 12లక్షల 87వేల 370 మంది ఓటర్లు ఉన్నారు. దేవరకొండ నియోజకవర్గంలో 2లక్షల 13వేల 256 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో 86వ నియోజకవర్గం దేవరకొండది. అయితే ఓటరు జాబితాలో సుగుణాబాయి మొదటి ఓటరైంది. ఓటరు జాబితాలో మొదటి ఓటరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంటుంది. అదొక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోనుంది. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో మొదటి పోలింగ్ బూత్‌లలో మొదటి ఓటరుగా ఒక్కొక్కరికీ అవకాశం లభించింది. జిల్లా- దేవరకొండ నియోజకవర్గ మొదటి ఓటరు.. దేవరకొండ నియోజకవర్గం–86 లోని చింతపల్లి మండలం గొడకొండ్ల గ్రామంలోని పోలింగ్ బూత్ నెంబర్ 1లో ఓటర్ల జాబితాలో మొదటి ఓటరు సుగుణాబాయి ఓటర్ ఐడీ నంబర్ టీఐసీ1199504 నాగార్జున సాగర్–87... నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నడికుడ గ్రామంలో మొదటి పోలింగ్‌బూత్‌లోని ఓటరు జాబితాలో మొదటి ఓటరు ఓటును బదిలీ చేసుకుంది. దాంతో 2వ ఓటరు కట్టెబోయిన రేణుక మొదటి ఓటరైంది. ఆమె ఓటర్ ఐడీ నంబర్ కేకే1057364. మిర్యాలగూడ– 88... మిర్యాలగూడ నియోజకవర్గంలో పాములపహాడ్ గ్రామంలోని మొదటి పోలింగ్ బూత్‌లో మొదటి ఓటరు మైబీ మహ్మద్. ఆమె ఓటర్ ఐడీ నంబర్ యుజేక్యూ1347989. మునుగోడు–93... మునుగోడు నియోజకవర్గం పరిధిలోని జైకేసారం గ్రామంలోని మొదటి పోలింగ్ బూత్‌లోని ఓటర్ల జాబితాలో మొదటి ఓటరు సాయమ్మ రుద్రగోని మొదటి ఓటును వేయనుంది. ఓటర్ ఐడీ నంబర్ ఏపీ 41292055207. నల్లగొండ– 92... నల్లగొండనియోజకవర్గ పరిధిలోని చందనపల్లి గ్రామంలోని మొదటి పోలింగ్‌స్టేషన్ పరిధిలోని ఓటరు జాబితాలోని మొదటి ఓటరు ఓటు బదిలీ చేసుకోవడంతో రెండవ ఓటరు అయిన పాలడుగు రాములమ్మ మొదటి ఓటు వేయనుంది. ఆమె ఓటర్ ఐడీ నంబర్ హెచ్డీవీ3663036. నకిరేకల్–95... నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని తుమ్మలగూడెం గ్రామంలోని మొదటి పోలింగ్ బూత్‌లోని మొదటి ఓటరు పురం యశోధ మొదటి ఓటు వేయనుంది. ఓటర్ ఐడీ నంబర్ ఏపీ422900318118. ఈ ఆరు నియోజకవర్గాల పరిధిలోని మొదటి ఓటర్లుగా వీరు మొదటి ఓటు వేసేందుకు అవకాశం లభించింది. వీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే వారికి ఇది తీపి గుర్తుగా మిగిలిపోనుంది. -
ఓటులోనూ రకాలు..!
సాక్షి,భువనగిరి : పోలింగ్ రోజు సాధారణ ఓటర్లతో పాటు ఇతర ఓటర్లు కూడా తమ హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ప్రత్యేక పరిస్థితుల్లో నిబంధనల ప్రకారం మాత్రమే ఈ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇందులో టెండరు ఓటు, చాలెంజ్ ఓటు, పోస్టల్ బ్యాలెట్ ఓటు లాంటివి ఉంటాయి. టెండర్ ఓటు: కొన్ని సమయాల్లో ఓటరు ఓటు వేయడానికి వచ్చేసరికి అతని ఓటును ఇంకా ఎవరో వేసి వెళ్లడం చూస్తాం. అలాంటి సందర్భంలో సదరు ఓటరు వివరాలను ప్రీసైడింగ్ అధికారి పరిశీలిస్తారు.అతడు వాస్తవంగా ఓటు వేయలేదని నిర్ధారణకు వస్తే అతడికి ఈవీఎం ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.దీనిని టెండర్ ఓటు అంటారు. ఇందుకోసం ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో 20చొప్పున బ్యాలెట్ పేపర్లు అందుబాటులో ఉంటాయి. ఈబ్యాలెట్ను తీసుకుని ఓటర్ కంపార్ట్మెంట్లోకి వెళ్లి ఓటు వేసి ఆపత్రాలను కవర్లో పెట్టి ప్రీసైడింగ్ అధికారికి అందజేయాల్సి ఉంటుంది. పత్రం వెనుక ఇంకుతో టెండర్ బ్యాలెట్ అని అధికారులు రాస్తారు. చాలెంజ్ ఓటు: ఓటర్ గుర్తింపు విషయంలో అధికారులకు సందేహాలు కలిగిన ఏజెంట్లు అభ్యంతరం చెప్పిన సదరు ఓటర్ గుర్తింపును చాలెంజ్ చేసి రుజువు చేసుకోవాలి.ఉదాహరణకు ఒక వ్యక్తి ఓటు వేయడానికి వచ్చినప్పుడు అతని పేరు తప్పు చెబుతున్నారని ఏజెంట్ అభ్యంతరం తెలిపితే ఓటర్ను ఏజెంట్‌ను ప్రీసైడింగ్ అధికారి వద్దకు పంపుతారు. అభ్యంతరం చెప్పిన ఏజెంట్ నుంచే రెండు రూపాయలు చాలెంజ్ ఫీజుగా తీసుకుంటారు.అప్పుడు ఓటర్ వద్ద ఉన్న ఇతర గుర్తింపు వివరాలు అధికారులు పరిశీలిస్తారు.అప్పటికీ సంతృప్తి చెందకపోతే బీఎల్ఓను పిలిచి అతని స్థానిక ఓటర్ అవునా కాదా అనే విషయం, పేరు, తండ్రి పేరు లాంటి వివరాలు తెలుసుకుంటారు. అతడు స్థానిక ఓటరై జాబితాలో ఉన్న పేరు వాస్తవం అయితే ఆయనను ఆయన తండ్రి పేరు, చిరునామా లాంటి విషయాల్లో తేడా ఉన్న పెద్దగా పట్టించుకోరు. అప్పుడు ఏజెంట్, ఓటర్ ఇద్దరిలో ఎవరి వాదన సరైంది అని తేలితే వారిని వదిలి మిగతా వారికి ప్రీసైడింగ్ అధికారి మొదటి సారి హెచ్చరిక జారీ చేస్తారు. లేదా ఏజెంట్‌ను ఓటర్ను పోలీసులకు అప్పగించవచ్చు. ఫ్రాక్సీ ఓటు: కొందరు సర్వీసు ఓటర్లనే ఫ్రాక్సీ ఓటర్లుగా పరిగణిస్తారు. భద్రతా బలగాలు, రక్షణ రంగాల్లో పని చేసేవారు, ఫ్రాక్సీ విధా నం ద్వారా ఓటు హక్కును విని యోగించుకోవచ్చు. ఓటర్ స్థానికంగా లేనందున వారి తరపున ఓ ప్రతి నిధిని ఓటు వేసేందుకు అధికారులు అనుమతిస్తారు. వీరిని క్లాసిఫైడ్ ఓటర్‌గా పరిగణిస్తారు. నియోజకవర్గం, పోలింగ్‌బూత్ పరిధిలోని ఫ్రాక్సీ ఓటర్ వివరాలపై ముందే ఆర్వో ద్వారా ప్రీసైడింగ్ అధికారికి సమాచారం ఉంటుంది. సర్వీసు ఓటర్ తరఫున వచ్చే ఫ్రాక్సీ ఓటర్ ఆపోలింగ్ బూత్ పరిధిలోని మిగతా ఓటర్ల మాదిరిగానే ఓటు వేస్తారు. వీరు కూడా అందరి లాగే ఈవీఎంలో ఓటు వేయాల్సి ఉంటుంది. అయితే సాధారణ ఓటర్లకు కుడిచేతి చూపుడు వేలుకు సిరా చుక్క పెడితే ఫ్రాక్సీ ఓటర్‌కు మధ్య వేలుకు చుక్కపెడుతారు. ఇక తన ఓటు వినియోగించుకున్నప్పుడు అందరి లాగే చూపుడు వేలుకు చుక్క పెడుతారు. అయితే ఫ్రాక్సీ ఓటర్ తన ఓటు కాక ఒక్కరికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ ఓటు: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల చివరి జాబితా సిద్ధం కాగానే జిల్లా ఎన్నికల అధికారి రహస్యంగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. ఈబ్యాలెట్ పేపర్లు సిద్ధం కాగానే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సర్వీసు సెక్టార్లలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ జిల్లా ఎన్నికల కార్యాలయం నుంచి పోస్టల్ బ్యాలెట్ పేపర్ పంపిణీ చేస్తారు. ఈప్రక్రియ నిర్వహణ, రిటర్నింగ్ అధికారి, ఒక ఏఆర్‌తోపాటు, కొందరి సహాయకులను నియమిస్తారు.వీరు పోస్టల్ బ్యాలెట్‌కు, ఉద్యోగులకు పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తారు. అదే విధంగా పోస్టల్ బ్యాలెట్ స్వీకరించడానికి ఎన్నికల కార్యాలయంలో ఒక డ్రాప్ బాక్సును రెడీగా ఉంచుతారు.లేదంటే నేరుగా రిటర్నింగ్ అధికారికి అందజేయవచ్చు.పోస్టల్ బ్యాలెట్ పేపర్లు పోలింగ్ తేదీ కన్నా ఒకరోజు ముందు వరకు గాని, ఎన్నికల అధికారుల సూచించిన గడువు లోగా మాత్రమే అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. -
ఓటు హక్కు కావాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శానసనసభ రద్దు అయిన నేపథ్యంలో ముందస్తు ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ప్రకటించిన ప్రత్యేక ఓటర్ల జాబితా రెండో సవరణ కార్యక్రమం కింద కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణకు గడువు మంగళవారం ముగిసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10 నుంచి 25 వరకు 10 లక్షలకు పైగా దరఖాస్తులు, అభ్యంతరాలొచ్చాయని అధికారవర్గాలు పేర్కొన్నాయి. గత జూలై 20 నుంచి ఈ నెల 10 వరకు నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల జాబితా తొలి సవరణ కార్యక్రమం కింద మరో 15.12 లక్షల దరఖాస్తులు, అభ్యంతరాలు నమోదయ్యాయి. వీటిలో 12 లక్షల వరకు దరఖాస్తులు, అభ్యంతరాల పరిశీలన పూర్తి కాగా, మిగిలినవాటిని వచ్చే నెల 4లోగా పరిష్కరించాల్సి ఉంది. అనంతరం వచ్చే నెల 7లోగా నవీకరించిన ఓటర్ల జాబితాల సప్లిమెంట్లను ప్రచురించి, 8న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. ఆన్లైన్లో జోరుగా ఓటరు నమోదు కొత్త ఓటర్ల నమోదు కోసం ఆన్లైన్లోనే అత్యధిక ‘ఫామ్ 6’దరఖాస్తులొచ్చాయి. ఓటర్ల జాబితా రెండో సవరణ కార్యక్రమం కింద సోమవారం నాటికి 8.75 లక్షల దరఖాస్తులు రాగా.. అందులో ఆన్లైన్ ద్వారా 2,97,655, బూత్ లెవల్ అధికారులకు 2,72,218 ‘ఫామ్–6’దరఖాస్తులు వచ్చాయి. ముసాయిదా ఓటర్ల జాబితాలోని పేర్లపై అభ్యంతరాలు తెలపడానికి ఆన్లైన్ ద్వారా 4,825, బీఎల్ఓలకు మరో 1,75,981 ఫామ్–7 దరఖాస్తులు వచ్చాయి. ఓటరు గుర్తింపు కార్డులో వివరాలను సరిదిద్దుకోవడానికి ఆన్లైన్ ద్వారా 33,705, బీఎల్ఓలకు 18,593 మంది ఫామ్–8 దరఖాస్తులు చేసుకున్నారు. కాగా, కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి వెబ్సైట్ (http://ceotelangana.nic.in)తో పాటు జాతీయ ఓటర్ల నమోదు పోర్టల్ (https://www.nvsp.in) మొరాయించడంతో చివరి రోజు ఆన్లైన్లో ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నామినేషన్లు స్వీకరించే తుది గడువుకు 10 రోజుల ముందు వరకు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించి అర్హులకు ఓటు హక్కు కల్పిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ పేర్కొన్నారు. -
మాజీ సీఎం ఓటుపై మల్లగుల్లాలు
పశ్చిమగోదావరి, పెనుమంట్ర: మార్టేరు గ్రామంలోని ఓటర్ల జాబితాలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డికి ఓటు హక్కు ఉండటంపై రెవెన్యూ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆయనతోపాటు పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు కూడా ఇదే జాబితాలో చోటు దక్కడంపైనా ఆరా తీస్తున్నారు. ‘సాక్షి’ దినపత్రికలో సోమవారం ‘సొంతూరు పీలేరు.. ఓటున్నది మార్టేరు’ అనే శీర్షికన ప్రచురితమైన కథనం స్థానికంగా సంచలనమైంది. దీంతో ఏలూరు నుంచి జేసీ కోటేశ్వరరావు ఫోన్లో మండల రెవెన్యూ అధికారులను ఆరా తీశారని సమాచారం. ఈకథనంపై పెనుమంట్ర తహసీల్దార్ వెంకట్రావు స్పందించి ప్రాథమిక విచారణ చేపట్టారు. మార్టేరులోని 104వ బూత్ అధికారిని ఆరా తీశారు. ఆ ఓట్లను ఫారం–7 ద్వారా వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తహసీల్దార్ చెప్పారు. అలాగే సాయంత్రం ఎమ్మార్వో కార్యాలయంలో ఆచంట నియోజకవర్గ స్థాయి ఎన్నికల అధికారి నరసింహరావు పోలింగ్‌బూత్ స్థాయి సిబ్బంది, పర్యవేక్షణాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. జాబితాల్లో పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
ఓటర్లూ ఇవి గమనించండి...
మొబైల్ (సెల్‌ఫోన్) యాప్ ద్వారా లక్షకు పైగా ఓటర్లు తమ ఓటరు స్లిప్‌ను సెల్ఫోన్లో సేవ్ చేసుకున్నారు. ఇక వేరే స్లిప్ అవసరం లేదు.. ఫోన్లోని వివరాలే పోలింగ్ కేంద్రంలో చూపిస్తే సరిపోతుందని భావిస్తున్నారు. కానీ..అది కుదరదు. పోలింగ్ కేంద్రంలోకి సెల్ఫోన్లను అనుమతించరు. పోలింగ్‌స్టేషన్ వివరాలు తెలుసు కనుక ఎలాగూ పోలింగ్ కేంద్రం వరకు వెళతారు. అక్కడ త్వరితంగా మీ వివరాల్ని పోలింగ్ అధికారులు గుర్తించాలంటే పోలింగ్స్టేషన్లో ఓటరుజాబితాలో మీ వరుస నెంబరు ఎంతో రాసుకొని వెళ్లి చెప్పినా ఫరవాలేదు. గుర్తుంచుకొని చెప్పినా ఫరవాలేదు. అంతే కానీ.. సెల్ఫోన్లోనే చూపిస్తామనుకుంటే మాత్రం కుదరదని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్(ఎన్నికలు) సురేంద్రమోహన్ తెలిపారు. - సాక్షి, సిటీబ్యూరో ఓటరు స్లిప్ ఉంది కదా అని దానిని మాత్రమే తీసుకువెళ్లినా ఓటు వేసేందుకు అనుమతించరు. ఓటరు గుర్తింపుకార్డు(ఎపిక్ కార్డు) తీసుకువెళ్లాలి. అది లేని పక్షంలో దిగువ పేర్కొన్న పత్రాల్లో దేన్నయినా వెంట తీసుకువెళ్లాలి. 1. ఆధార్ కార్డు, 2. పాస్‌పోర్టు, 3.డ్రైవింగ్ లెసైన్స్, 4.పాన్ కార్డు, 5. ఉద్యోగుల గుర్తింపుకార్డు(రాష్ట్ర/కేంద్ర/ప్రభుత్వరంగ/స్థానికసంస్థ/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ), 6. బ్యాంక్/పోస్టాఫీసు/కిసాన్ పాస్‌బుక్‌లు. 7.పట్టా , రిజిస్టర్డ్ డీడ్స్, 8. రేషన్‌కార్డు, 9. ఎస్సీ/ ఎస్టీ /బీసీ సర్టిఫికెట్లు 10.పెన్షన్పత్రాలు(ఎక్స్‌సర్వీస్‌మెన్ పెన్షన్ బుక్ /పెన్షన్ పేమెంట్ ఆర్డర్ / ఎక్స్ సర్వీస్మన్ల వితంతు / ఆధారపడ్డ వారి సర్టిఫికెట్స్/ వృద్ధాప్య , వితంతు పెన్షన్ ఉత్తర్వులు, 11.స్వాతంత్య్ర సమరయోధుల గుర్తింపుకార్డు 12.ఆయుధ లెసైన్సు, 13. వికలాంగుల సర్టిఫికెట్, 14. ఏటీఎం కార్డులు 15. బార్ కౌన్సిల్ గుర్తింపు కార్డు, 16. పార్లమెంటు సభ్యుల గుర్తింపు కార్డు. 17.శాసనసభ, శాసనమండలి సభ్యుల గుర్తింపుకార్డు. 18.ఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డు, 19.కార్మిక మంత్రిత్వ శాఖ స్కీమ్ ద్వారా జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కార్డు, 20. నేషనల్ పాపులేషన్ స్కీమ్ ద్వారా ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్‌కార్డు, 21. పట్టాదారు పాసు పుస్తకాలు. ( పైన పేర్కొన్నవాటిపై ఓటరు ఫొటో కలిగి ఉండాలి. ఎన్నికల నోటిఫికేషన్కన్నా ముందు తెరచిన ఖాతాలు / జారీ అయిన కార్డులు అయి ఉండాలి) -
మే లోపు ఆధార్ ప్రక్రియ పూర్తి
సాక్షి, హైదరాబాద్: రా్రష్ట్ర ప్రజలందరికీ విశిష్ట ప్రాధికార గుర్తింపు సంఖ్య ‘ఆధార్’ జారీ ప్రక్రియను వచ్చే మే నెలలోగా పూర్తి చేస్తామని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండి యా(యూఐడీఏఐ) అసిస్టెంట్ డెరైక్టర్ జనరల్ దేవరతన్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఆధార్ ప్రక్రియ కొనసాగుతున్న తీరుపై యూఐడీఏఐ డెరైక్టర్ జనరల్ వి.ఎస్.మదన్ సోమవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యద ర్శి రాజీవ్‌శర్మతో చర్చించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పలు పథకాలతోపాటు ఓటరు గుర్తింపుకార్డుకు కూడా ఆధార్‌ను అనుసంధానించే విషయమై చర్చ జరిగిందని చెప్పారు. త మవద్ద ఉన్న లెక్కల ప్రకారం తెలంగాణలో వందశాతం ఆధార్ ప్రక్రియ పూర్తి అయిందన్నారు. -
నిర్మాణరంగ కార్మికులకు సర్కారు చేయూత
వీరు అర్హులు నిర్మాణ రంగంలో మట్టిపని, గుంతలు తీయటం, చదును చేయటం, ఫిట్టర్లు, తాపీ మేస్త్రీలు, తాపీ కూలీలు, కార్పెంటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, మార్బుల్, గ్రానైట్, టైల్స్ మొదలగు ఫ్లోరింగ్ పనిచేయువారు పాలిషింగ్, సెంట్రింగ్, సీలింగ్ వర్క్, పెయింటింగ్, రోడ్డు నిర్మాణ కార్మికులు, సూపర్ వైజర్లు, అకౌంటెంట్స్, ఇటుకల తయారీకార్మికులు, చెరువులు, బావులు పూడిక తీయుట, తవ్వుట మొద లైన పనులు చేసే వారు నమోదు ఇలా.. 90 రోజుల పాటు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసి ఉండాలి. దరఖాస్తు ఫారంతో పాటు రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు జిరాక్సులను జతపరిచి, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని లేబర్ కార్యాల యంలో సంబంధిత సర్కిల్ లేబర్ అసిస్టెంట్ అధికారికి అందించాలి. బ్యాంకులో రూ.62తో కార్మిక శాఖ పేరు మీద చలాన్ చెల్లించాలి. ఈ మొత్తం ఒక సంవత్సరానికి మాత్రమే. రెండో సంవత్సరం రెన్యువల్ కోసం రూ.12 బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లించాలి. సదుపాయాలు ఇవీ.. భవన నిర్మాణ కార్మికుడిగా నమోదు చేయించుకున్న కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందినా, శాశ్వత అంగవైకల్యానికి గురైనా ప్రభుత్వం వారికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుంది. {పమాదం వలన 50 శాతం అంగవైకల్యం కలిగితే రూ. లక్ష వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. కార్మికురాలి ప్రసూతి సహాయార్థం రూ.5000, కార్మికుడు/కార్మికురాలు సాధారణంగా మరణిస్తే రూ.30 వేలు ప్రభుత్వం ద్వారా పొందవచ్చు. నిర్మాణ రంగంలోని వారికి జాతీయ నిర్మాణ శిక్షణ ద్వారా శిక్షణ కార్యక్రమాలను అందిస్తుంది.