ఆదిలాబాద్, మహారాష్ట్ర సరిహద్దులో విచిత్రం
14 గ్రామాల వారికి రెండేసి ఓట్లు
ఏప్రిల్ 19న మహారాష్ట్రలో ఓటేశారు
రేపు తెలంగాణలోనూ వేయనున్నారు
ఒకే ఓటరుకు రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఓటు వేసే అవకాశం వస్తే? అవి కూడా రెండు రాష్ట్రాల పరిధిలోని స్థానాలైతే! అదెలా అనుకుంటున్నారా? చట్టబద్ధంగా అయితే అవకాశం లేదు. కానీ ఒకటో రెండో కాదు... ఏకంగా 14 గ్రామాల ప్రజలకు ఇలా రెండు రాష్ట్రాల పరిధిలో ఓటు హక్కుంది. ఒక్కొక్కరికి రెండు ఓటరు గుర్తింపు కార్డులున్నాయి. అంతే కాదు, రెండు రాష్ట్రాల తరఫునా సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా పొందుతున్నారు. ఈ గమ్మత్తేమిటో తెలుసుకోవాలంటే ఆదిలాబాద్ జిల్లా కెరమెరి, మహారాష్ట్రలోని జీవతి తాలూకాలకు వెళ్లాల్సిందే...
1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సందర్భంగా మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో 14 గ్రామాలు ఎవరికి చెందాలన్నది ఎటూ తేలలేదు. ఇవి పరందోలి, అంతాపూర్ గ్రామ పంచాయితీల పరిధిలో 30 కిలోమీటర్లలో విస్తరించి ఉన్నాయి. వాటిలో 6,000 మంది నివసిస్తున్నారు. వారికి రెండు రాష్ట్రాల తరఫున ఓటరు ఐడీ కార్డులు, ఆధార్‌లు, కులం సర్టిఫికెట్లు ఉన్నాయి. ఈ ఊళ్లలో స్కూళ్లు కూడా తెలుగు, మరాఠీ మాధ్యమాల్లో రెండేసి ఉంటాయి! ఈ గ్రామాలు అటు మహారాష్ట్రలోని చంద్రపూర్ లోక్‌సభ స్థానంతో పాటు ఇటు తెలంగాణలోని ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలోకి కూడా వస్తాయి!
సర్పంచ్‌లూ ఇద్దరు
పరందోలి, అంతాపూర్ గ్రామ పంచాయితీలకు ఇద్దరేసి సర్పంచ్‌లు ఉండటం మరో విశేషం. వీరు తెలంగాణ, మహారాష్ట్రలో వేర్వేరు పారీ్టలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ 14 గ్రామాల వారికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అభివృద్ధి నిధులు కూడా వస్తుంటాయి. సంక్షేమ పథకాల ప్రయోజనాలూ అందుతున్నాయి.
రెండువైపులా ఓటు
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తాము రెండు రాష్ట్రాల్లోనూ ఓటు వేస్తూ వస్తున్నట్టు పరందోలి సర్పంచ్ లీనాబాయ్ బిరాడే మీడియాతో చెప్పడం విశేషం. ఆయనది మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. ‘‘రెండు రాష్ట్రాల్లోనూ ఒకే తేదీన పోలింగ్ ఉంటే మాకు వీలైన స్థానంలో ఓటేస్తాం. వేర్వేరు తేదీల్లో ఉంటే మాత్రం రెండు రాష్ట్రాల్లోనూ ఓటేస్తాం. రెండు రాష్ట్రాల నుంచి మాకు సౌకర్యాలు అందుతున్నాయి’’ అని లీనాబాయ్ వివరించారు. చంద్రాపూర్ లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 19న తొలి విడతలో పోలింగ్ ముగిసింది. అందులో ఈ 14 గ్రామాల ఓటర్లు పాల్గొన్నారు. ఇప్పుడు సోమవారం నాలుగో విడతలో ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి కూడా ఓటేయనున్నారు!
ఒకచోట తొలగించండి...!
ఇలా రెండు లోక్‌సభ స్థానాల పరిధిలో రెండుసార్లు ఓటేయడం సరికాదని ఎన్నికల అధికారులు అంటున్నారు. దీనిపై చంద్రాపూర్, ఆదిలాబాద్ జిల్లా అధికారులు ఇటేవలే వారితో సమావేశం కూడా నిర్వహించినట్టు చంద్రాపూర్ కలెక్టర్ వినయ్ గౌడ వెల్లడించారు. రెండుసార్లు ఓటేయడం చట్ట విరుద్ధమని ఆయా గ్రామాల ప్రజలకు చెప్పామన్నారు. స్థానిక నేతలు మాత్రం రెండు చోట్ల ఓటు వేయవద్దని తమకు చెప్పేముందు తమ గ్రామాలు ఏ రాష్ట్రం పరిధిలోకి వస్తాయో తేల్చాలని కోరుతున్నారు. ‘‘మేము రెండుసార్లు ఓటు వేస్తున్నాం. ఇది చట్టవిరుద్ధమైతే సమస్యను పరిష్కరించాల్సిందిగా రెండు రాష్ట్రాలను ఎన్నికల సంఘం కోరాలి. ఒక నియోజకవర్గ పరిధి నుంచి మా ఓట్లను తొలగించమనండి. మాకు సమస్యేమీ లేదు. కాకపోతే మేము మహారాష్ట్రకు చెందుతామా, లేక తెలంగాణకా అన్నది తేల్చాలి’’ అని పరందోలి సర్పంచ్, బీఆర్‌ఎస్ నాయకుడు నింబదాస్ పతంగె అన్నారు.
‘‘ఈ 14 గ్రామాల వారు మహారాష్ట్ర, తెలంగాణల్లో ఏదో ఒక్క చోటే ఓటేయాలి. ఇప్పటికే చంద్రపూర్ లోక్‌సభ స్థానం పరిధిలో ఓటేసిన వారిని మళ్లీ ఓటేయడానికి అనుమతించొద్దు. తెలంగాణ ప్రభుత్వానికి ఈ మేరకు సూచించాలని ఈసీని కోరాం’’
– ఎస్.చొక్కలింగం, మహారాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment