kerameri
-
Lok Sabha Election 2024: రెండు రాష్ట్రాల్లోనూ ఓటు!
ఒకే ఓటరుకు రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఓటు వేసే అవకాశం వస్తే? అవి కూడా రెండు రాష్ట్రాల పరిధిలోని స్థానాలైతే! అదెలా అనుకుంటున్నారా? చట్టబద్ధంగా అయితే అవకాశం లేదు. కానీ ఒకటో రెండో కాదు... ఏకంగా 14 గ్రామాల ప్రజలకు ఇలా రెండు రాష్ట్రాల పరిధిలో ఓటు హక్కుంది. ఒక్కొక్కరికి రెండు ఓటరు గుర్తింపు కార్డులున్నాయి. అంతే కాదు, రెండు రాష్ట్రాల తరఫునా సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా పొందుతున్నారు. ఈ గమ్మత్తేమిటో తెలుసుకోవాలంటే ఆదిలాబాద్ జిల్లా కెరమెరి, మహారాష్ట్రలోని జీవతి తాలూకాలకు వెళ్లాల్సిందే... 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సందర్భంగా మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో 14 గ్రామాలు ఎవరికి చెందాలన్నది ఎటూ తేలలేదు. ఇవి పరందోలి, అంతాపూర్ గ్రామ పంచాయితీల పరిధిలో 30 కిలోమీటర్లలో విస్తరించి ఉన్నాయి. వాటిలో 6,000 మంది నివసిస్తున్నారు. వారికి రెండు రాష్ట్రాల తరఫున ఓటరు ఐడీ కార్డులు, ఆధార్లు, కులం సర్టిఫికెట్లు ఉన్నాయి. ఈ ఊళ్లలో స్కూళ్లు కూడా తెలుగు, మరాఠీ మాధ్యమాల్లో రెండేసి ఉంటాయి! ఈ గ్రామాలు అటు మహారాష్ట్రలోని చంద్రపూర్ లోక్‌సభ స్థానంతో పాటు ఇటు తెలంగాణలోని ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలోకి కూడా వస్తాయి! సర్పంచ్‌లూ ఇద్దరు పరందోలి, అంతాపూర్ గ్రామ పంచాయితీలకు ఇద్దరేసి సర్పంచ్‌లు ఉండటం మరో విశేషం. వీరు తెలంగాణ, మహారాష్ట్రలో వేర్వేరు పారీ్టలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ 14 గ్రామాల వారికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అభివృద్ధి నిధులు కూడా వస్తుంటాయి. సంక్షేమ పథకాల ప్రయోజనాలూ అందుతున్నాయి. రెండువైపులా ఓటు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తాము రెండు రాష్ట్రాల్లోనూ ఓటు వేస్తూ వస్తున్నట్టు పరందోలి సర్పంచ్ లీనాబాయ్ బిరాడే మీడియాతో చెప్పడం విశేషం. ఆయనది మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. ‘‘రెండు రాష్ట్రాల్లోనూ ఒకే తేదీన పోలింగ్ ఉంటే మాకు వీలైన స్థానంలో ఓటేస్తాం. వేర్వేరు తేదీల్లో ఉంటే మాత్రం రెండు రాష్ట్రాల్లోనూ ఓటేస్తాం. రెండు రాష్ట్రాల నుంచి మాకు సౌకర్యాలు అందుతున్నాయి’’ అని లీనాబాయ్ వివరించారు. చంద్రాపూర్ లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 19న తొలి విడతలో పోలింగ్ ముగిసింది. అందులో ఈ 14 గ్రామాల ఓటర్లు పాల్గొన్నారు. ఇప్పుడు సోమవారం నాలుగో విడతలో ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి కూడా ఓటేయనున్నారు! ఒకచోట తొలగించండి...! ఇలా రెండు లోక్‌సభ స్థానాల పరిధిలో రెండుసార్లు ఓటేయడం సరికాదని ఎన్నికల అధికారులు అంటున్నారు. దీనిపై చంద్రాపూర్, ఆదిలాబాద్ జిల్లా అధికారులు ఇటేవలే వారితో సమావేశం కూడా నిర్వహించినట్టు చంద్రాపూర్ కలెక్టర్ వినయ్ గౌడ వెల్లడించారు. రెండుసార్లు ఓటేయడం చట్ట విరుద్ధమని ఆయా గ్రామాల ప్రజలకు చెప్పామన్నారు. స్థానిక నేతలు మాత్రం రెండు చోట్ల ఓటు వేయవద్దని తమకు చెప్పేముందు తమ గ్రామాలు ఏ రాష్ట్రం పరిధిలోకి వస్తాయో తేల్చాలని కోరుతున్నారు. ‘‘మేము రెండుసార్లు ఓటు వేస్తున్నాం. ఇది చట్టవిరుద్ధమైతే సమస్యను పరిష్కరించాల్సిందిగా రెండు రాష్ట్రాలను ఎన్నికల సంఘం కోరాలి. ఒక నియోజకవర్గ పరిధి నుంచి మా ఓట్లను తొలగించమనండి. మాకు సమస్యేమీ లేదు. కాకపోతే మేము మహారాష్ట్రకు చెందుతామా, లేక తెలంగాణకా అన్నది తేల్చాలి’’ అని పరందోలి సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు నింబదాస్ పతంగె అన్నారు. ‘‘ఈ 14 గ్రామాల వారు మహారాష్ట్ర, తెలంగాణల్లో ఏదో ఒక్క చోటే ఓటేయాలి. ఇప్పటికే చంద్రపూర్ లోక్‌సభ స్థానం పరిధిలో ఓటేసిన వారిని మళ్లీ ఓటేయడానికి అనుమతించొద్దు. తెలంగాణ ప్రభుత్వానికి ఈ మేరకు సూచించాలని ఈసీని కోరాం’’ – ఎస్.చొక్కలింగం, మహారాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి – సాక్షి, నేషనల్ డెస్క్ -
'రిమ్స్ అక్రమ ప్రావీణ్యుడి' బాగోతం తెరపైకి..!
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో అక్రమార్కుల దందా జోరుగా సాగుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొంతమంది ఘరానా మోసగాళ్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. రిమ్స్‌లో తవ్వినకొద్దీ బండారం బయటపడుతోంది. కాంట్రాక్ట్ స్టాఫ్‌నర్స్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, సెక్యూరిటీగార్డు, పేషెంట్‌కేర్, రికార్డు అసిస్టెంట్ తదితర పోస్టులు ఇప్పిస్తామంటూ వారి నుంచి రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పించడం పక్కనబెడితే వారు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలు ఇటీవల అనేకం వెలుగులోకి వస్తున్నాయి. అక్రమాలకు పాల్పడిన ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగిని ఇటీవల టర్మినెట్ చేయగా, తాజాగా మరో అక్రమ ‘ప్రావీణ్యు’డి బాగోతం తెరపైకి వచ్చింది. చాలామంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు ఇప్పించకపోగా, తిరిగి ఇచ్చేందుకు ముప్పుతిప్పలు పెడుతున్నాడు. విషయం రిమ్స్‌లో బహిరంగ రహస్యమే అయినప్పటికీ రాజకీయ నాయకులు, యూనియన్ అండదండలతో అతడు తప్పించుకొని తిరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్రమార్కుల్లో ఓ ‘ప్రావీణ్యు’డు.. ► కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరికి చెందిన ఓ నిరుద్యోగి ఐటీఐ పూర్తి చేశాడు. కూలీనాలి చేస్తేనే ఆ కుటుంబ సభ్యుల జీవనం సాగేది. తనకు తెలిసిన మిత్రుడు ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో రికార్డు అసిస్టెంట్ ఉద్యోగం ఉందని చెప్పడంతో తండ్రి అప్పు చేసి రూ.లక్ష ఇచ్చాడు. దీంతో ఆ యువకుడు రిమ్స్‌లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి బ్యాంక్ ఖాతాలో ఆ మొత్తం ట్రాన్స్ఫర్ చేశాడు. అయితే డబ్బులు తీసుకున్న సదరు వ్యక్తి ఉద్యోగం ఇప్పించకపోగా, ఏడాదిన్నరగా రేపూమాపు అంటూ తిప్పుకుంటున్నట్లు బాధితుడు వాపోయాడు. ► కుమురంభీం జిల్లా కెరమెరికి చెందిన మరో నిరుద్యోగి ల్యాబ్ టెక్నీషియన్ పూర్తి చేశాడు. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగం ఇప్పిస్తానని ఈ అక్రమార్కుడే నిరుద్యోగి నుంచి రూ.లక్ష తీసుకున్నాడు. ఐదారు నెలలుగా తిప్పుకున్నాడు. దీంతో బాధితుడు ఓ రాజకీయ పార్టీ నాయకుడి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాడు. రిమ్స్ డైరెక్టర్‌తో పాటు కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడంతో ఆ బాధితుడికి డబ్బులు తిరిగి ఇచ్చేశాడు. ఇలా ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిర్మల్, ఖానాపూర్, తదితర ప్రాంతాలకు చెందిన అనేక మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి అందినకాడికి దండుకుంటున్నాడు. ఇతనొక్కడే కాదు.. అంగట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అనేలా పలువురు ఈ దందా నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో చాలామంది పెద్దల హస్తమున్నట్లు సమాచారం. ఇటీవల పలు ఘటనలు వెలుగు చూసినా ఉన్నతాధికారులు కఠిన చర్యలకు వెనుకాడడం అనుమానాలకు తావిస్తోంది. అక్రమాలకు పాల్పడుతున్న తీరిలా.. జిల్లాలో పలువురు అక్రమార్కులు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ముఖ్యంగా రిమ్స్ ఆస్పత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అందులో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులే ఎక్కువ శాతం ఈ దందాకు తెరలేపుతున్నారు. కొన్ని అవుట్సోర్సింగ్ ఏజెన్సీల నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఆ ఏజెన్సీల వారు తమకు తెలుసని, అదేవిధంగా రాజకీయ నాయకులతో పరిచయం ఉందని మాయమాటలు చెబుతున్నారు. రిమ్స్ ఆస్పత్రితో పాటు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పడటం అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉన్నాయని మోసాలకు తెర లేపుతున్నారు. విద్యార్హతలు, ఇంటర్వ్యూలు లేకుండానే కొలువు ఇప్పిస్తామని చెప్పడంతో అమాయక నిరుద్యోగులు వీరి వలలో చిక్కుకుంటున్నారు. డబ్బులు ఇచ్చిన తర్వాత మోసపోయామని లబోదిబోమంటున్నారు. కొంత మంది ఈ విషయాన్ని బహిర్గతం చేస్తుండగా, మరికొంత మంది ఎవరికై నా చెబితే తమ డబ్బులు రావనే భయంతో మానసికంగా కుంగిపోతున్నారు. ఇలాంటి బాధితులు వందలాదిగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన సదరు అక్రమార్కుడు దాదాపు 50 మందికి పైగా నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. ఏకంగా గెజిటెడ్ సంతకాలు పెట్టి ఉత్తర్వులు జారీ చేయడం సంచలనం కలిగిస్తోంది. తనతో పాటు దందాలో కుటుంబీకులను కూడా కలుపుకొని ఇంటి వద్ద నుంచే ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. విధులు నిర్వహించకుండా ఇదే పనులపై దృష్టి పెడుతున్నారని రిమ్స్‌లో పనిచేసే ఉద్యోగులు సైతం పేర్కొనడం ఆయన పాల్పడిన అక్రమాలకు అద్దం పడుతోంది. నా దృష్టికి రాలేదు.. రిమ్స్‌లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు నా దృష్టికి రాలేదు. బాధితులెవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. రిమ్స్‌లో ప్రస్తుతం ఎలాంటి ఉ ద్యోగాలు లేవు. నిరుద్యోగులు మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోవద్దు. ఎవరికి డబ్బులు ఇవ్వొద్దు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే మా దృష్టికి తీసుకురావాలి. – జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్, ఆదిలాబాద్ -
'అక్కడ' ముందస్తు దసరా ఉత్సవాలు!
సాక్షి, కెరమెరి(ఆసిఫాబాద్): మండలంలోని తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన మహరాజ్‌గూడ అడవుల్లో బస చేసిన జంగుబాయి సన్నిధిలో నేడు విజయదశమి దసరా ఉత్సవాలు జరుపుకోనున్నారు. ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాలకు ఇరు రాష్ట్రాలకు చెందిన ఆదివాసీలు హాజరుకానున్నారు. ఈ ఏడాది పండిన ఆహారధాన్యాలను సాంప్రదాయబద్ధంగా పోచమ్మతల్లికి చూపిస్తారు. అక్కడున్న రావుడ్ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం మైసమ్మ, జంగుబాయి కొలువైన గృహల్లోకి వెళ్లి ప్రార్ధనలు చేస్తారు. ఎనిమిది వంశీయుల కటోడాలు పెద్దగా వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మరో రెండు మాసాలు తర్వాత ప్రారంభం కానున్న జంగుబాయి ఉత్సవాల నేపథ్యంలో ఏర్పాట్లు, సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. అనాది నుంచి వస్తున్న ఆచారం పోచమ్మ ప్రతిమలు ఏళ్లుగా వస్తున్న ఆచారాన్ని నేటికీ ఆదివాసీలు నిర్వహిస్తున్నారు. ప్రతీ సంవత్సరం విజయదశమికి ఐదు రోజులు ముందు అమ్మవారి సన్నిధిలో ముందస్తుగా దసరా పండుగ నిర్వహించడం ఆనవాయితిగా వస్తుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ, మహారాష్ట్రలోని వివిధ గ్రామాలకు చెందిన ఆదివాసీ భక్తుల రానున్నారు. ఇది ఆధ్యాంతం భక్తి భావంతో కొనసాగుతాయి. ఈ గురువారం రాత్రి పోచమ్మతల్లికి, ఇతరత్రా దేవతలకు పూజలు నిర్వహించి మొక్కులు కోరుకుంటారు. టొప్లకసలోని గంగాజలం తీసుకవచ్చి దేవతా విగ్రహాలను శుద్ధి చేస్తారు. నేటి ఉదయం నుంచి భక్తుల రాక ప్రారంభమవుతుంది. ఇప్పటికే అన్ని ప్రాంతాల వారికి దసరా ఉత్సవం జరుపుకుంటున్న విషయాన్ని తెలియజేశారు. ఇటీవల ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిని దసరా పండుగతోపాటు డిసెంబర్ చివరి వారంలో ప్రారంభం కానున్న జంగుబాయి ఉత్సవాల గురించి చర్చించారు. -
వాగు దాటి.. వైద్యం అందించి..!
సాక్షి, కెరమెరి(ఆసిఫాబాద్) : ఇటీవల కురుస్తున్న వానలకు పొంగిపొర్లుతున్న వాగులను సైతం లెక్కచేయకుండా వైద్య సిబ్బంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలకు చెందిన సుమారు 30కు పైగా గ్రామాలు వాగు అవతల ఉండడంతో ఈ కష్టాలు నిత్యం తప్పడం లేదని సిబ్బంది వాపోతున్నారు. కెరమెరి ప్రాథమిక కేంద్రం ఆధ్వర్యంలో ఏఎన్ఎం సుమలత, హెల్త్ అసిస్టెంట్లు వసంత్, శత్రుఘన్ గురువారం మండలంలోని కరంజివాడ వాగును దాటి వైద్య సేవలిందించారు. నడుము వరకు నీళ్లు ఉన్నప్పటికీ లెక్క చేయకుండా ఆంద్‌గూడ, గోండ్ కరంజివాడ, పెద్ద కరంజివాడ గ్రామాలకు వెళ్లి 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరుగురి రోగుల నుంచి రక్త పూతలు సేకరించారు. నలుగురి గర్భవతులకు పరీక్షలు నిర్వహించి మాత్రలు అందించారు. -
రివాల్వర్ మిస్ ఫైర్ : ఎస్ఐ మృతి
ఆదిలాబాద్ : రివాల్వర్ మిస్ ఫైర్ అయి ఎస్ఐ మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కెరమెరి పోలీస్ స్టేషన్లో సబ్ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న శ్రీధర్ మంగళవారం ఉదయం రివాల్వర్ మిస్ ఫైర్ అయింది. పోలీస్ క్వార్టర్స్‌లో నివసిస్తున్న ఆయన తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్‌ను శుభ్రం చేస్తున్న క్రమంలో గన్ మిస్ ఫైర్ రెండు బుల్లెట్లు తలలో దూసుకెళ్లాయి. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆసిఫాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎస్ఐ మృతిచెందారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం అవునూరు గ్రామానికి చెందిన శ్రీధర్ శిక్షణ పూర్తి చేసుకుని రెండు రోజుల కిందటే సబ్ఇన్స్పెక్టర్గా కెరమెరిలో పోస్టింగ్ పొందారు. సమాచారం అందుకున్న పోలీస్ ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
రివాల్వర్ మిస్ ఫైర్ : ఎస్ఐ మృతి
-
దిగుబడి రాక రైతు ఆత్మహత్య
కెరమెరి : ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం కిలికె గ్రామానికి చెందిన ఓ రైతు పంట దిగుబడి లేక, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. రామ్‌కిషన్‌కు ఐదెకరాల పొలం ఉండగా మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. వర్షాభావ పరిస్థితులతో కేవలం రెండు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. సాగు కోసం రూ.3 లక్షల వరకు అప్పులు చేయడంతో అవి తీర్చే దారి లేక మంగళవారం మధ్యాహ్నం ఇంటి దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. -
అనాథలకు ‘అమ్మ’ ఆసరా
కెరమెరి : అమ్మ మృతి చెందడం.. నాన్న తాగుడుకు బానిస కావడంతో అనాథలుగా మారిన చిన్నారుల వైనం ఈ నెల 13న ‘సాక్షి’లో ‘అమ్మ లేదు.. నాన్న రాడు’ కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన బెల్లంపల్లిలోని ‘అమ్మ’ సాంస్కృతిక, సాంఘిక స్వచ్చంధ సేవా సంస్థ అనాథ శరణాలయం నిర్వాహకులు చిన్నారుల ఆలనా, పాలనా చూసుకునేందుకు ముందుకొచ్చారు. గురువారం మండలంలోని బాబేఝరి (కొలాంగూడ)లో ఉంటున్న చిన్నారుల నానమ్మ, చిన్నాయన గంగారాంను కలిశారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఇంగ్లిష్ మీడియం చదువులు చదివిస్తామని, మా అనాథ శరణాలయంలో చిన్నారులను చేర్పించాలని ఆ సంస్థ ప్రధాన కార్యాదర్శి జాడి భాగ్యలక్ష్మి, కార్యదర్శి బింజి సుధాకర్ కోరారు. తమ పిల్లలు చాలా చిన్నారులని, మరి కొద్ది మాసాల తర్వాత పంపిస్తామని గంగారాం, పిల్లల నానమ్మ వారితో పేర్కొన్నారు. ప్రస్తుతం చిన్నారుల తాత ఇతర గ్రామంలో పాలేరుగా పని చేస్తునాన్నడని, ఆయన రావడానికి మరో మూడు మాసాలు పడుతుందన్నారు. వచ్చాక ఆయనతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉందని సమాజంలో పేరు ప్రఖ్యాతులుగాంచేలా తీర్చి దిద్దుతామని అమ్మ నిర్వాహకులు చెప్పారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ రాజశ్రీ కూడా వారికి ఎంతో నచ్చజెప్పినా ప్రస్తుతం ససేమిరా అన్నారు. కార్యక్రమంలో జనతాదల్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రేంకుమార్, ప్రధాన కార్యాదర్శి కుర్ర శంకర్ , అంగన్వాడీ కార్యకర్త అనసూయ ఉన్నారు. -
అమ్మ లేదు.. నాన్న రాడు
కెరమెరి : మండలంలోని కెరమెరి గ్రామ పంచాయతీలోని బాబేఝరి(కొలాంగూడ) గ్రామానికి చెందిన టేకం లేతుబాయి-భీంరావు దంపతులకు ఇద్దరు కూతుళ్లు లలిత(రెండున్నరేళ్లు), లక్ష్మి(ఏడాదిన్నర), ఐదు నెలల బాబు భీంరావు ఉన్నారు. ఆగస్టులో తల్లి లేతుబాయి జ్వరంతో మృతిచెందింది. కానీ ఆ పిల్లల ఆలనా, పాలనా చూసుకోవాల్సిన తండ్రి త్రాగుడుకు బానిసయ్యాడు. ఆయన ఉన్నా లేనిదాని కిందే లెక్కని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భార్య మృతిచెందినప్పటి నుంచి నేటి కీ ఆయనకు మత్తు దిగడం లేదు. దీంతో ఆ చిన్నారులు అనాథలయ్యారు. అన్న పట్టించుకోవడం లేదని తెలుసుకున్న తమ్ముడు టేకం గంగారాం ఆ చిన్నారుల బరువు బాధ్యతలు, తన భుజస్కంధాలపై వేసుకున్నాడు. అమ్మతో కలిసి తల్లిదండ్రులు చేసే సపర్యాలు ఆయన చేస్తున్నారు. స్నానం చేయించడం, బట్టలు వేయించడం, అన్నం తినిపించడం, రాత్రి పడుకోబెట్టడం.. జోల పాడడం, ఇతరత్రా సపర్యలు చేస్తున్నారు. పాపం పసివాడు.. భీంరావు భీంరావు ఐదు నెలల చిన్నారి. పుట్టిన 30 రోజులకే తల్లి మృతి చెందడంతో చిన్నారిని చూసిన వారందరు బతక డం కష్టమన్నారు. కానీ ఇప్పటికైతే క్షేమంగానే ఉన్నాడు. తల్లి పాల కోసం పెడుతున్న కేకలు చూపరుల ను కంటతడి పెట్టిస్తున్నాయి. ఆవు పాలు తాగిస్తున్నారు. చలించిన అధికారులు మంగళవారం బాబేఝరి(కొలాంగూడ) గ్రామాన్ని సందర్శించినప్పుడు ఆ చిన్నారుల పరిస్థితిని చూసి కెరమెరి మండల ప్రత్యేకాధికారి ఎ.ఇనేశ్, తహశీల్దార్ సిడాం దత్తు చలించిపోయారు. తల్లిదండ్రుల్లా సపర్యాలు చేస్తున్న గంగారాంను అభినందించారు. పిల్లల కోసం కావల్సిన సహాయం అందిస్తామన్నారు. కాగా, టేకం లలితకు జ్వరం రాగా మంగళవారం గ్రామంలోనే వైద్య సిబ్బంది వైద్యం అందించారు. -
సేంద్రియ విజయం
కెరమెరి : సేంద్రియ ఎరువులతో సుస్థిర సాగుపై రైతులు దృష్టి సారించారు. ఒక్కరితో మొదలైన సేంద్రియ వ్యవసాయ వి ధానాన్ని నేడు 2,467 మంది రైతులు అనుసరిస్తున్నారు. వీరి కి చేతన ఆర్గానిక్ ఫార్మర్ అసోసియేషన్ చేయూతనందిస్తోం ది. మొదటిసారిగా మండలంలోని చౌపన్‌గూడ గ్రామానికి చెందిన ఆత్రం కుసుంభరావు 2004లో పత్తి సాగు చేశాడు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి రావడంతో ఇతర మండలాలకు రైతులకు అవగాహన కల్పించారు. చేతన ఆర్గానిక్ ఫార్మర్ అసోసియేషన్ అనే స్వచ్ఛంద సంస్థ గతంలో ఐటీడీఏ, ఐకేపీలతో కలిసి పనిచేసింది. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా స్వతంత్రంగా పనిచేస్తోంది. అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్, కెరమెరి, సిర్పూర్(యు), జైనూర్, నార్నూర్, ఉట్నూర్ మండలాల్లోని 148 గ్రామాల్లో సేంద్రియ ఎరువులతో పం టలు సాగవుతున్నాయి. ఆయా మండలాల్లోని 13,775 ఎకరాల్లో 2,467 మంది రైతులు పత్తి, ఇతర పం టలు సాగు చేస్తున్నారు. వీరంతా 154 గ్రూపులుగా ఏర్పడ్డారు. నాన్‌బీటీ విత్తనాలతోనే పత్తి పంటలు పండిస్తున్నారు. ఎకరాకు ఐదు నుంచి ఆరు క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. పత్తి ధర అధికంగా, ఖర్చులు తక్కువ కావడం, వర్షాపాతం తక్కువగా ఉన్నా పంటలు పండే అవకాశం ఉంది. -
గాలివాన బీభత్సం
కెరమెరి, న్యూస్‌లైన్ : కెరమెరి మండలం అంతా కూడా గాలివానతో అతలాకుతలం అయింది. హట్టి, సాకడ, గోయేగాంలోని ప్రధాన రహదారులతో పాటు పోలీస్‌స్టేషన్ ఎదుట చెట్లు విరిగిపడ్డాయి. ఆయా దారుల్లో వాహనాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. హట్టి, మోడి గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో రూపాం తరం కింద నిర్మించిన భవనాల పైకప్పులు గాలికి లేచిపోయి పంట పొలాల్లో పడ్డాయి. ఈ సమయంలో విద్యార్థులు కానీ, ఇతర పాఠశాల సిబ్బంది కానీ ఆ గదుల్లో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఝరిలో మూడు ఇళ్లు కూలిపోయాయి. మరికొద్ది రోజుల్లో చేతికి వస్తుందనుకున్న జొన్న పంట నేలవాలింది. విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. పిడుగుపాటుకు 30 ఇన్సులేటర్లు పాడైపోయాయి. ప్రజలు ఇబ్బందులు పడ్డారు. -
ఔను.. వారు రెండు రాష్ట్రాల్లో ఓటేశారు
కెరమెరి, న్యూస్‌లైన్ : ఆంధ్రా, మహారాష్ట్ర వివాదాస్పద సరి హద్దులోని రెండు గ్రామాల పంచాయతీలైన పరందోళి, అంతాపూర్ ప్రజలు రెండ్రోజుల్లో రెండు రాష్ట్రాల్లో రెండు సార్లు ఓటు హక్కు విని యోగించుకున్నారు. గురువారం మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాకు చెందిన పార్లమెం టు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. శుక్రవారం జిల్లాలో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఓటు వేశారు. అంతాపూర్ గ్రామ పంచాయతీకి చెందిన ఓటర్లకు బోలాపటార్‌లో, బోలాపటార్‌కు చెందిన ఓట ర్లఅంతాపూర్‌లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీంతో రవాణా సౌకర్యం కోసం ఓట ర్లు ఇబ్బంది పడ్డారు. ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా.. బోలాపటార్‌లో 8.30 గంటల వరకు ఒక్కరూ ఓటు వేయలేదు. అనంతరం ఒక్కొక్కరుగా వచ్చారు. పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉండడంతో ఆల స్యం జరిగింది. మరోవైపు అనేకమంది కాలినడకన రావడంతో ఇబ్బంది పడ్డారు. చంద్రాపూర్ ఎంపీ ఎన్నికల్లో ఎడమచేయి చూపుడు వేలుకి సిరా చుక్కవేయగా, శుక్రవారం జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎడమచేయి మధ్యవేలికి సిరా చుక్కవేశారు. రెండు గ్రామ పంచాయతీల్లో మొత్తం 2,585 ఓటర్లు ఉన్నారు. ఇందులో పరందోళి గ్రామపంచాయతీలో 1,317మంది ఓటర్లకు గాను 1071 మంది ఓటు వేశారు. 81.32 శాతం పోలింగ్ నమోదైంది. అంతాపూర్ గ్రామ పంచాయతీలో 1,268 ఓటర్లకు గాను 922మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 72.71శాతం పోలింగ్ నమోదైంది. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
సమస్యల పరిష్కారానికే రచ్చబండ
కెరమెరి, న్యూస్‌లైన్ : ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమమే రచ్చబండ అని జిల్లా ఇన్చార్జి మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. శనివారం కెరమెరి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నిర్వహించిన రచ్చబండకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల వరకే పార్టీలు కానీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకాలు శాశ్వతంగా ఉంటాయని అన్నారు. ప్రజలు ఆ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. వివిధ రకాల కార్యక్రమాల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.923 కోట్లు ఖర్చు చేసిందన్నారు. రాష్ట్రంలో 25లక్షల మంది విద్యార్థులకు ఉచిత విద్య, స్కాలర్షిప్లు అందించామని తెలిపారు. పలు మండలాల తాగునీటి కోసం రూ.78లక్షలతో చేపట్టిన పథకాలను త్వరలో ప్రారంభిస్తామని అన్నారు. కలెక్టర్ అహ్మద్ బాబు చురుగ్గా పనిచేస్తున్నారంటూ ప్రశంసల జల్లు కురిపించారు. అనార్పల్లి రోడ్డు మరమ్మతుకు రూ.50లక్షలు మంజూరయ్యాయని చెప్పారు. రచ్చబండలో వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించి సత్వర న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించబోతోందని అన్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల విద్యుత్ బకాయిలను ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. సబ్‌ప్లాన్‌లో భాగంగా మండలంలోని గ్రామ పంచాయతీలకు రూ.5లక్షల చొప్పున రోడ్డు పనులకు మంజూరైనట్లు తెలిపారు. పరందోళి, అంతాపూర్ గ్రామ పంచాయతీల్లో ఇందిరమ్మ ఇళ్ల వ్యవహారంలో అవినీతిపరులు జైలుపాలైనప్పటికీ అర్హులకు గృహాలు అందలేదన్నారు. ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని అన్నారు. కెరమెరి నుంచి నార్నూర్ వరకు రోడ్డు పనులు చేపట్టాలని కరంజివాడ సర్పంచు రాథోడ్ శంకర్ కోరారు. ధ్వంసమైన రోడ్డు ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను సభలో చూపించారు. అర్హులకు బంగారుతల్లి, పింఛన్, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, డ్వామా పీడీ వినయ్‌కృష్ణారెడ్డి, ఆర్డీవో రామచంద్రయ్య, ఏపీడీ జాదవ్ గణేశ్, తహశీల్దార్ రవిచంద్రారెడ్డి, ఎంపీడీవో శశికల, ఎంఈవో మల్లయ్య, నాయకులు మునీర్‌అహ్మద్ బాపురావు, సర్పంచులు రాథోడ్ శంకర్, జలపతిరావు, లింబారవు, సుంగుబాయి, పరమేశ్వర్, భీంరావు పాల్గొన్నారు.