Telangana News: 'రిమ్స్‌ అక్రమ ప్రావీణ్యుడి' బాగోతం తెరపైకి..!
Sakshi News home page

'రిమ్స్‌ అక్రమ ప్రావీణ్యుడి' బాగోతం తెరపైకి..!

Published Mon, Sep 18 2023 9:02 AM | Last Updated on Tue, Sep 19 2023 9:28 AM

- - Sakshi

విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం - జైసింగ్‌ రాథోడ్‌, రిమ్స్‌ డైరెక్టర్‌, ఆదిలాబాద్‌

ఆదిలాబాద్‌: జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆస్పత్రిలో అక్రమార్కుల దందా జోరుగా సాగుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొంతమంది ఘరానా మోసగాళ్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. రిమ్స్‌లో తవ్వినకొద్దీ బండారం బయటపడుతోంది. కాంట్రాక్ట్‌ స్టాఫ్‌నర్స్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, సెక్యూరిటీగార్డు, పేషెంట్‌కేర్‌, రికార్డు అసిస్టెంట్‌ తదితర పోస్టులు ఇప్పిస్తామంటూ వారి నుంచి రూ.లక్షలు వసూలు చేస్తున్నారు.

ఉద్యోగాలు ఇప్పించడం పక్కనబెడితే వారు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలు ఇటీవల అనేకం వెలుగులోకి వస్తున్నాయి. అక్రమాలకు పాల్పడిన ఓ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగిని ఇటీవల టర్మినెట్‌ చేయగా, తాజాగా మరో అక్రమ ‘ప్రావీణ్యు’డి బాగోతం తెరపైకి వచ్చింది. చాలామంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు ఇప్పించకపోగా, తిరిగి ఇచ్చేందుకు ముప్పుతిప్పలు పెడుతున్నాడు. విషయం రిమ్స్‌లో బహిరంగ రహస్యమే అయినప్పటికీ రాజకీయ నాయకులు, యూనియన్‌ అండదండలతో అతడు తప్పించుకొని తిరుగుతున్నట్లు తెలుస్తోంది.

అక్రమార్కుల్లో ఓ ‘ప్రావీణ్యు’డు..
► కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరికి చెందిన ఓ నిరుద్యోగి ఐటీఐ పూర్తి చేశాడు. కూలీనాలి చేస్తేనే ఆ కుటుంబ సభ్యుల జీవనం సాగేది. తనకు తెలిసిన మిత్రుడు ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ ఆస్పత్రిలో రికార్డు అసిస్టెంట్‌ ఉద్యోగం ఉందని చెప్పడంతో తండ్రి అప్పు చేసి రూ.లక్ష ఇచ్చాడు.

దీంతో ఆ యువకుడు రిమ్స్‌లో పనిచేసే అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి బ్యాంక్‌ ఖాతాలో ఆ మొత్తం ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. అయితే డబ్బులు తీసుకున్న సదరు వ్యక్తి ఉద్యోగం ఇప్పించకపోగా, ఏడాదిన్నరగా రేపూమాపు అంటూ తిప్పుకుంటున్నట్లు బాధితుడు వాపోయాడు.

► కుమురంభీం జిల్లా కెరమెరికి చెందిన మరో నిరుద్యోగి ల్యాబ్‌ టెక్నీషియన్‌ పూర్తి చేశాడు. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఉద్యోగం ఇప్పిస్తానని ఈ అక్రమార్కుడే నిరుద్యోగి నుంచి రూ.లక్ష తీసుకున్నాడు. ఐదారు నెలలుగా తిప్పుకున్నాడు. దీంతో బాధితుడు ఓ రాజకీయ పార్టీ నాయకుడి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాడు. రిమ్స్‌ డైరెక్టర్‌తో పాటు కలెక్టర్‌, ఎస్పీలకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడంతో ఆ బాధితుడికి డబ్బులు తిరిగి ఇచ్చేశాడు.

ఇలా ఆదిలాబాద్‌ జిల్లాతో పాటు నిర్మల్‌, ఖానాపూర్‌, తదితర ప్రాంతాలకు చెందిన అనేక మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి అందినకాడికి దండుకుంటున్నాడు. ఇతనొక్కడే కాదు.. అంగట్లో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు అనేలా పలువురు ఈ దందా నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో చాలామంది పెద్దల హస్తమున్నట్లు సమాచారం. ఇటీవల పలు ఘటనలు వెలుగు చూసినా ఉన్నతాధికారులు కఠిన చర్యలకు వెనుకాడడం అనుమానాలకు తావిస్తోంది.

అక్రమాలకు పాల్పడుతున్న తీరిలా..
జిల్లాలో పలువురు అక్రమార్కులు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ముఖ్యంగా రిమ్స్‌ ఆస్పత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అందులో పనిచేసే అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులే ఎక్కువ శాతం ఈ దందాకు తెరలేపుతున్నారు. కొన్ని అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఆ ఏజెన్సీల వారు తమకు తెలుసని, అదేవిధంగా రాజకీయ నాయకులతో పరిచయం ఉందని మాయమాటలు చెబుతున్నారు.

రిమ్స్‌ ఆస్పత్రితో పాటు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పడటం అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు ఉన్నాయని మోసాలకు తెర లేపుతున్నారు. విద్యార్హతలు, ఇంటర్వ్యూలు లేకుండానే కొలువు ఇప్పిస్తామని చెప్పడంతో అమాయక నిరుద్యోగులు వీరి వలలో చిక్కుకుంటున్నారు. డబ్బులు ఇచ్చిన తర్వాత మోసపోయామని లబోదిబోమంటున్నారు.

కొంత మంది ఈ విషయాన్ని బహిర్గతం చేస్తుండగా, మరికొంత మంది ఎవరికై నా చెబితే తమ డబ్బులు రావనే భయంతో మానసికంగా కుంగిపోతున్నారు. ఇలాంటి బాధితులు వందలాదిగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన సదరు అక్రమార్కుడు దాదాపు 50 మందికి పైగా నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం.

ఏకంగా గెజిటెడ్‌ సంతకాలు పెట్టి ఉత్తర్వులు జారీ చేయడం సంచలనం కలిగిస్తోంది. తనతో పాటు దందాలో కుటుంబీకులను కూడా కలుపుకొని ఇంటి వద్ద నుంచే ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. విధులు నిర్వహించకుండా ఇదే పనులపై దృష్టి పెడుతున్నారని రిమ్స్‌లో పనిచేసే ఉద్యోగులు సైతం పేర్కొనడం ఆయన పాల్పడిన అక్రమాలకు అద్దం పడుతోంది.

నా దృష్టికి రాలేదు..
రిమ్స్‌లో పనిచేసే అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు నా దృష్టికి రాలేదు. బాధితులెవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. రిమ్స్‌లో ప్రస్తుతం ఎలాంటి ఉ ద్యోగాలు లేవు. నిరుద్యోగులు మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోవద్దు. ఎవరికి డబ్బులు ఇవ్వొద్దు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే మా దృష్టికి తీసుకురావాలి. – జైసింగ్‌ రాథోడ్‌, రిమ్స్‌ డైరెక్టర్‌, ఆదిలాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement