RIMS Director
-
'రిమ్స్ అక్రమ ప్రావీణ్యుడి' బాగోతం తెరపైకి..!
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో అక్రమార్కుల దందా జోరుగా సాగుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొంతమంది ఘరానా మోసగాళ్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. రిమ్స్‌లో తవ్వినకొద్దీ బండారం బయటపడుతోంది. కాంట్రాక్ట్ స్టాఫ్‌నర్స్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, సెక్యూరిటీగార్డు, పేషెంట్‌కేర్, రికార్డు అసిస్టెంట్ తదితర పోస్టులు ఇప్పిస్తామంటూ వారి నుంచి రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పించడం పక్కనబెడితే వారు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలు ఇటీవల అనేకం వెలుగులోకి వస్తున్నాయి. అక్రమాలకు పాల్పడిన ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగిని ఇటీవల టర్మినెట్ చేయగా, తాజాగా మరో అక్రమ ‘ప్రావీణ్యు’డి బాగోతం తెరపైకి వచ్చింది. చాలామంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు ఇప్పించకపోగా, తిరిగి ఇచ్చేందుకు ముప్పుతిప్పలు పెడుతున్నాడు. విషయం రిమ్స్‌లో బహిరంగ రహస్యమే అయినప్పటికీ రాజకీయ నాయకులు, యూనియన్ అండదండలతో అతడు తప్పించుకొని తిరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్రమార్కుల్లో ఓ ‘ప్రావీణ్యు’డు.. ► కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరికి చెందిన ఓ నిరుద్యోగి ఐటీఐ పూర్తి చేశాడు. కూలీనాలి చేస్తేనే ఆ కుటుంబ సభ్యుల జీవనం సాగేది. తనకు తెలిసిన మిత్రుడు ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో రికార్డు అసిస్టెంట్ ఉద్యోగం ఉందని చెప్పడంతో తండ్రి అప్పు చేసి రూ.లక్ష ఇచ్చాడు. దీంతో ఆ యువకుడు రిమ్స్‌లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి బ్యాంక్ ఖాతాలో ఆ మొత్తం ట్రాన్స్ఫర్ చేశాడు. అయితే డబ్బులు తీసుకున్న సదరు వ్యక్తి ఉద్యోగం ఇప్పించకపోగా, ఏడాదిన్నరగా రేపూమాపు అంటూ తిప్పుకుంటున్నట్లు బాధితుడు వాపోయాడు. ► కుమురంభీం జిల్లా కెరమెరికి చెందిన మరో నిరుద్యోగి ల్యాబ్ టెక్నీషియన్ పూర్తి చేశాడు. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగం ఇప్పిస్తానని ఈ అక్రమార్కుడే నిరుద్యోగి నుంచి రూ.లక్ష తీసుకున్నాడు. ఐదారు నెలలుగా తిప్పుకున్నాడు. దీంతో బాధితుడు ఓ రాజకీయ పార్టీ నాయకుడి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాడు. రిమ్స్ డైరెక్టర్‌తో పాటు కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడంతో ఆ బాధితుడికి డబ్బులు తిరిగి ఇచ్చేశాడు. ఇలా ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిర్మల్, ఖానాపూర్, తదితర ప్రాంతాలకు చెందిన అనేక మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి అందినకాడికి దండుకుంటున్నాడు. ఇతనొక్కడే కాదు.. అంగట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అనేలా పలువురు ఈ దందా నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో చాలామంది పెద్దల హస్తమున్నట్లు సమాచారం. ఇటీవల పలు ఘటనలు వెలుగు చూసినా ఉన్నతాధికారులు కఠిన చర్యలకు వెనుకాడడం అనుమానాలకు తావిస్తోంది. అక్రమాలకు పాల్పడుతున్న తీరిలా.. జిల్లాలో పలువురు అక్రమార్కులు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ముఖ్యంగా రిమ్స్ ఆస్పత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అందులో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులే ఎక్కువ శాతం ఈ దందాకు తెరలేపుతున్నారు. కొన్ని అవుట్సోర్సింగ్ ఏజెన్సీల నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఆ ఏజెన్సీల వారు తమకు తెలుసని, అదేవిధంగా రాజకీయ నాయకులతో పరిచయం ఉందని మాయమాటలు చెబుతున్నారు. రిమ్స్ ఆస్పత్రితో పాటు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పడటం అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉన్నాయని మోసాలకు తెర లేపుతున్నారు. విద్యార్హతలు, ఇంటర్వ్యూలు లేకుండానే కొలువు ఇప్పిస్తామని చెప్పడంతో అమాయక నిరుద్యోగులు వీరి వలలో చిక్కుకుంటున్నారు. డబ్బులు ఇచ్చిన తర్వాత మోసపోయామని లబోదిబోమంటున్నారు. కొంత మంది ఈ విషయాన్ని బహిర్గతం చేస్తుండగా, మరికొంత మంది ఎవరికై నా చెబితే తమ డబ్బులు రావనే భయంతో మానసికంగా కుంగిపోతున్నారు. ఇలాంటి బాధితులు వందలాదిగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన సదరు అక్రమార్కుడు దాదాపు 50 మందికి పైగా నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. ఏకంగా గెజిటెడ్ సంతకాలు పెట్టి ఉత్తర్వులు జారీ చేయడం సంచలనం కలిగిస్తోంది. తనతో పాటు దందాలో కుటుంబీకులను కూడా కలుపుకొని ఇంటి వద్ద నుంచే ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. విధులు నిర్వహించకుండా ఇదే పనులపై దృష్టి పెడుతున్నారని రిమ్స్‌లో పనిచేసే ఉద్యోగులు సైతం పేర్కొనడం ఆయన పాల్పడిన అక్రమాలకు అద్దం పడుతోంది. నా దృష్టికి రాలేదు.. రిమ్స్‌లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు నా దృష్టికి రాలేదు. బాధితులెవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. రిమ్స్‌లో ప్రస్తుతం ఎలాంటి ఉ ద్యోగాలు లేవు. నిరుద్యోగులు మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోవద్దు. ఎవరికి డబ్బులు ఇవ్వొద్దు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే మా దృష్టికి తీసుకురావాలి. – జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్, ఆదిలాబాద్ -
‘మీడియా’ కథనంతో.. రిమ్స్‌ను తనిఖీ చేసిన కలెక్టర్..!
ఆదిలాబాద్: ‘పడకేసిన వసతులు’ శీర్షికన ఈనెల 6న ‘సాక్షి’ మెయిన్ పేజీలో ప్రచురితమైన కథనా నికి కలెక్టర్ రాహుల్ రాజ్ స్పందించారు. రిమ్స్‌లో పడకలు సరిపోక రోగులు తిప్పలు పడుతున్నారు. ఒకే పడకపై ఇద్దరు, ముగ్గురేసి ఉన్నారనే విషయాన్ని ప్రస్తావించగా.. స్పందించిన కలెక్టర్ శుక్రవారం ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఎమర్జెన్సీ, ఫీవర్ వార్డులతో పాటు ఇతర వార్డుల్లో కలియ తిరిగారు. అందుతున్న వైద్యసేవల వివరాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డైరెక్టర్‌ను ఆదేశించారు. జిల్లాలో ఈనెలలో ఇప్పటివరకు 12 డెంగీ, రెండు మలేరియా కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించినట్లు వివరించారు. వారానికి రెండుసార్లు డ్రైడే పాటించాలన్నారు. నీరు నిల్వ ఉండకుండా చూడాలని తెలిపారు. వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. కలెక్టర్ వెంట రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్‌వో నరేదంర్ రాథోడ్, జిల్లా మలేరియా నివారణ అధికారి శ్రీధర్, రిమ్స్ సూపరింటెండెంట్ అశోక్, వైద్యులు సుమలత, శ్యాంప్రసాద్ తదితరులు ఉన్నారు. -
ఎమ్యెల్యే VS రిమ్స్ డైరెక్టర్
-
రిమ్స్ వైద్యుడిపై పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, ఆదిలాబాద్ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యహరించిన రిమ్స్ వైద్యుడిపై ఆస్పత్రి డైరెక్టర్ బలరాం నాయక్ ఫిర్యాదు చేశారు. మర్కజ్ సన్నహక సమావేశానికి వెళ్లొచ్చి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఓ వైద్యుడు విధులకు హాజరయ్యాడు. సమాచారం గోప్యంగా ఉంచి.. నిబంధనలకు వ్యతిరేకంగా విధులు నిర్వహించిన డాక్టర్‌పై సెక్షన్ 176, 188, 270, 271 ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం వైద్యుడు క్వారంటైన్లో చికిత్స పొందుతున్నాడు. (ఫేక్ న్యూస్ పోస్ట్ చేసిన కిరణ్ బేడీ.. నెటిజన్ల మండిపాటు) -
బాలింతతో ఒంగోలు రిమ్స్ డైరెక్టర్ వేటకరం
-
వీఐపీ రిపోర్టర్ : రిమ్స్ డైరెక్టర్ టి. జయరాజ్
-
పేరులోనే రాజసం .. సేవల్లో నీరసం
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా రిమ్స్‌లో పలు సమస్యలున్నట్లు గుర్తించాను. వాటి పరిష్కారానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తా. ముఖ్యంగా మెటర్నిటీ వార్డులో ఒకే పడకపై ఇద్దరు బాలింతలు ఉండటం ఇబ్బందికరమే. ఈ సమస్యను పరిష్కారిస్తా. నిర్మాణంలో ఉన్న మూడు బ్లాకుల పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూస్తాం. మిగిలిన నాలుగు బ్లాకుల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదిక పంపుతాను. ఆస్పత్రిలో శానిటేషన్ లోపం కనిపించింది. దీనిపై కూడా దృష్టి పెడతాను. సదరం ధ్రువపత్రాల్లో కొన్ని నకిలీవి వస్తున్నాయి. వాటిని గుర్తించి సంబంధిత అధికారులతో విచారణ జరిగేలా చూస్తాం. ఈ మేరకు డీఆర్డీఏ వాళ్లకు నివేదిక పంపుతాం. ఆస్పత్రికి ప్రహరీ గోడ లేకపోవటంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీని నిర్మాణానికి నిధులు మంజురయ్యాయి. పనులు త్వరగా జరిగేలా చూస్తాను. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(రిమ్స్).. పేరులో రాజసం ఉట్టిపడే ఈ సంస్థ సేవల్లో మాత్రం నీరసంగానే ఉంటోంది. ఏళ్లు గడుస్తున్నా ఇంకా పూర్తికాని భవనాల నిర్మాణాలు, పూర్తిస్థాయిలో అందుబాటులో లేని స్పెషాలిటీ విభాగాలు, వైద్య నిపుణులు, సిబ్బంది కొరత, అధునాతన సౌకర్యాల లేమి.. ఎక్కడికక్కడ పారిశుద్ధ్యలోపం.. ఇలా ఎన్నో సమస్యలతో రిమ్స్ నీరసించిపోతోంది. జిల్లాలో పెద్దాస్పత్రి అయిన ఇక్కడికి రోజూ వందల సంఖ్యలో వచ్చే పేద రోగులు నాణ్యమైన, పూర్తిస్థాయి వైద్యసేవలు అందక ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీయాల్సి వస్తోంది. వీటికి తోడు గత ఏడు నెలలుగా స్టైపెండ్ అందక జూనియర్ డాక్టర్లు మనస్ఫూర్తిగా పని చేయలేకపోతున్నారు. ఈ లోపాలు, సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు రిమ్స్ డెరైక్టర్ టి.జయరాజ్ రిపోర్టర్‌గా మారారు. ‘సాక్షి’ తరపున వీఐపీ రిపోర్టరుగా ఆస్పత్రి అంతటా కలియదిరిగారు. రోగులు, ఉద్యోగుల సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు. ఆ వివరాలు.. మెటర్నిటీ వార్డులో.. డెరైక్టర్: డాక్టరు గారు.. మీ వార్డులో ఎంత మంది వైద్యులున్నారు. నెలకెన్ని కేసులు చేస్తుంటారు? డాక్టరు శశికళ: మా వార్డులో మొత్తం పది మంది వైద్యులం ఉన్నాం సార్. నెలకు సుమారు 420 కేసుల వరకు వస్తుంటాయి. వాటన్నింటిని సిబ్బంది సహకారంతో విజయవంతంగా చేస్తున్నాం. డెరైక్టర్: ఏమైనా సమస్యలున్నాయా? డాక్టరు శశికళ: పడకలు సరిపోవటం లేదు సార్. ఒక్కో పడకపై ఇద్దరేసి గర్భిణులు, బాలింతలను ఉంచాల్సి వస్తోంది. అలాగే స్టాఫ్‌ను కూడాపెంచితే బాగుంటుంది. డెరైక్టర్: ఏమ్మా...ఏ ఊరు మీది? కుమారి(గర్భిణి): మాది శ్రీకాకుళం పట్టణమే బాబు. డెరైక్టర్: ఆస్పత్రిలో ఎప్పుడు చేరావు. బాగానే చూసుకుంటున్నారా? కుమారి: ఈ నెల రెండో తేదీన చేరాను. రక్తం తక్కువగా ఉందని ఉంచారు. బాగానే చూసుకుంటున్నారు. ఇబ్బంది లేదు సార్. డెరైక్టర్: ఏమ్మా.. ఒకే పడకపై ఇద్దరు బాలింతలను ఉంచారేంటి? హెడ్ నర్స్(విజయ): భవనాలు చాలకపోవటంతో పడకలు తక్కువగా ఉన్నాయి సార్. అందువల్ల ఒకే పడకపై ఇద్దరేసి బాలింతలను ఉంచుతున్నాం. డెరైక్టర్: ఏ ఊరమ్మా మీది.. ఆస్పుత్రిలో సేవలేవిధంగా అందుతున్నాయమ్మ? ఎం.రోజమ్మ(బాలింత): మాది గార మండలం కొర్ని గ్రామం సార్. ఇక్కడ వైద్య సేవలు బాగానే ఉన్నాయి. కాని ఉండటమే కష్టంగా ఉంది. ఒకే పడకపై ఇద్దరిని ఉంచుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆర్థోపెడిక్ వార్డులో.. డెరైక్టర్: డాక్టరు గారు.. మీ వార్డులో ఏమైనా సమస్యలున్నాయా. అసలు ఇక్కడ రోగులకు అందే సేవలేంటి? డాక్టర్ రజనీ: మా వార్డులో పెద్దగా సమస్యలేమీ లేవు సార్. ఆర్థోపెడిక్‌కు సంబంధించి ఆరోగ్యశ్రీ కేసులకు ముందు ఇక్కడే చికిత్స అందిస్తున్నాం. ఆరోగ్యశ్రీ అప్రూవల్ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ వార్డుకు తరలిస్తాం. అంత వరకు శస్త్రచికిత్సకు ముందు చికిత్సంతా ఇక్కడే అందిస్తాం. డెరైక్టర్: రిఫరల్ కేసులకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? రజనీ: చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. రోగి తరపు వారు వచ్చి ఎందుకు రిఫర్ చేశారో తెలియజేయమంటుంటారు. అయితే కొం త మందికి వైద్యపరంగా మేము చెప్పే విషయాలు అర్థం కావు. అటువంటప్పుడు ఇబ్బంది తప్పటం లేదు. వాళ్లకు తెలియక మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. డెరైక్టర్: అసలు కేసులు ఎందుకు రిఫరల్ వెళ్తున్నాయి, సుమారు ఎన్ని ఉండవచ్చు? రజనీ: రిమ్స్‌కు వచ్చే కేసుల్లో పది శాతం ఇతర ప్రాంతాలకు రిఫరల్‌గా వెళ్తున్నాయి. ఆయా కేసులకు సంబంధించిన సౌకర్యాలు ఇక్కడ లేకపోవటం వల్లే రిఫర్ చేస్తున్నాం. మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తే రిఫరల్ సమస్య ఉండదు సార్. డెరైక్టర్: ఏమయ్యా.. నీ పేరేంటి? నీకేమంది? రోగి: నా పేరు లక్ష్మీనాయుడు బాబు. మాది బూర్జ గ్రామమండి. పొలంలో చేను పెరుక్కుని రోడ్డెక్కుతుంటే బండి(స్కూటర్) గుద్దీసింది. ఆస్పత్రిలో సేరి పది రోజులు గడిసిపోనాది బాబు. ఇంత వరకు అపరేషన్ సేయ్యనేదు బాబు. డెరైక్టర్: డాక్టరు గారు.. ఇదేంటి వచ్చిన రెండు మూడు రోజుల్లో శస్త్రచకిత్స చేస్తామంటున్నారు కదా. మరి ఇతను వచ్చి పది రోజులైనా ఎందుకు చేయ్యలేదు? రజనీ: ఆయన కాళ్లకు ఇన్ఫెక్షన్ వచ్చింది సార్. అది నయమైతేగానీ శస్త్రచికిత్స చేయలేం. అందువల్లే ఆలస్యమవుతోంది. గైనిక్ వార్డులో.. డెరైక్టర్: ఏం బాబు.. రోగులకు ఏం ఆహారం ఇస్తున్నావు?(డైట్ సరఫరా చేసే సిబ్బంది నారాయణతో) నారాయణ: రోగికివ్వాల్సిన పౌష్టికాహారాన్ని బట్టి ఆ రోజు మెనూ ఉంటుంది సార్. గైనిక్ వార్డుకు సంబంధించి అరటి పండు, రెండు గుడ్లు, రెండు శనగుండలు, భోజనం ఇస్తున్నాం సార్. డెరైక్టర్: ఏమ్మా...నీ పేరేంటి? బాలింత: నా పేరు స్వాతి సార్.. మా ఊరు చిలకపాలెం సార్. డెరైక్టర్: ఎన్నో కాన్పమ్మ?.. ఆస్పత్రిలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి? స్వాతి: నాది రెండో కాన్పు సార్. ఆస్పత్రిలో దోమలు విపరీతంగా ఉన్నాయి సార్. అసలు ఉండలేకపోతున్నాం. పిల్లలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. చివరకు బయట డబ్బులిచ్చి దోమ తెరలు కొనుక్కుని పిల్లలకు పెడుతున్నాం సార్. పేదోళ్లమైన మేము ఖర్చు చేయలేకపోతున్నాం. దోమల నివారణకు చర్యలు చేపడితే బాగుంటంది సార్. డెరైక్టర్: ఏమ్మా.. మీరు జూనియర్ డాక్టరే కదా.. మీకేమైనా సమస్యలున్నాయా? లావణ్య: అవును సార్.. మేము జూనియర్ డాక్టర్లమే. మాకు ఒక్క స్టైపెండ్ సమస్య తప్పితే ఇంకే సమస్యలు లేవు సార్. జూనియర్ డాక్టర్లుగా చేరినప్పటి నుంచి ఇంత వరకు ఒక్క నెల మాత్రమే స్టైపెండ్ ఇచ్చారు. ఇంకా ఏడు నెలల స్టైపెండ్ అందాలి సార్. డెరైక్టర్: స్టైపెండ్ కోసం ఇతర జిల్లాల్లో సమ్మె చేస్తున్నారు కదా. మీరు కూడానా...? లావణ్య: లేదు సార్. సమ్మె చేసే ఆలోచన ప్రస్తుతం లేదు. కాని స్టైపెండ్ అందకపోవటంతో జూనియర్ డాక్టర్లందరం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ప్రభుత్వం మా సమస్యను గుర్తించి, వెంటనే విడుదల చేస్తే బాగుంటుంది. ఆశా వర్కర్లతో.. డెరైక్టర్: ఏ ఊరు మీది. రిమ్స్‌కు ఎందుకు వచ్చారమ్మా? ఆశా వర్కర్లు: సార్.. మాది ఆమదాలవలస. మా పేర్లు శ్రీదేవి, పద్మావతి. మేము ఆశా వర్కర్లుగా పనిచేస్తున్నాం. గర్భిణులను పట్టుకుని ఇక్కడకు వచ్చాం సార్. డెరైక్టర్: అలాగా.. ఆస్పత్రిలో ఏమైనా సమస్యలున్నాయా..? ఆశా వర్కర్లు: రక్త పరీక్షల రిపోర్టు ఇవ్వటం చాలా ఆలస్యం అవుతోంది సార్. దాని కోసం మళ్లీ రెండో రోజు రావల్సిన పరిస్థితి కొన్ని సందర్భాల్లో ఏర్పడుతోంది. అలా కాకుండా రక్తపరీక్షలు నిర్వహించిన వెంటనే రిపోర్టులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటే బాగుంటుంది సార్. నిర్మాణ విభాగం డీఈతో.. డెరైక్టర్: (నడుచుకుంటూ నిర్మాణంలో ఉన్న కొత్త బ్లాకుల్లోకి వెళ్తూ అక్కడున్న డీఈ శ్రీనివాస్‌తో) సార్...ఏంటీ ఎంత వరకు వచ్చాయి నిర్మాణ పనులు? డీఈ: అవుతున్నాయి సార్. త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం సార్. డెరైక్టర్: పనుల్లో 45 శాతమే పూర్తి అయ్యాయని, ఇంకా 55 శాతం నిర్మాణాలు జరగాల్సి ఉందని అందరూ అంటున్నారు. ఏమిటి సార్ దీని పరిస్థితి? డీఈ: మొత్తం 13 బ్లాకుల్లో ఆరు బ్లాకులు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం వాడుకులో ఉన్నాయి సార్. నిర్మాణ దశలో ఏడు బ్లాకులు ఉన్నాయి. వీటిలో అత్యవసరంగా 7, 11, 12 బ్లాకుల నిర్మాణాలు చేపడుతున్నాం. ఈ పనులను సత్యసాయి కన్సస్ట్రక్షన్ వారు చేపడుతున్నారు. ఇందుకోసం రూ.20.89 కోట్లు మంజురయ్యాయి సార్. డెరైక్టరు: ఇంతకీ ఎప్పటికి ఈ నిర్మాణాలు పూర్తి అవుతాయి? డీఈ: ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 7,11, 12 బ్లాకులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి అవుతాయి సార్. మిగిలిన నాలుగు బ్లాకులకు సంబంధించి ఇటీవలే డీఎంఈ వచ్చి పరిశీలించి వెళ్లారు. వారిచ్చే ఆదేశాల ప్రకారం కొత్త కాంట్రాక్టు పిలవాలో లేక ప్రస్తుతమున్న వారికే పనులు అప్పగించాలో.. నిర్ణయం తీసుకుంటాం. డెరైక్టర్: ఓకే థ్యాంక్యూ వెరీ మచ్.. డీఈ గారు. -
రిమ్స్‌లో మృత్యు ఘోష
రిమ్స్ క్యాంపస్: కొండంత ఆశతో జిల్లా నలుమూలల నుంచి రిమ్స్‌కు వస్తున్న పేద రోగులు అక్కడి దారుణ పరిస్థితులు చూసి భయపడి పారిపోతున్నారు. తెగించి ఆస్పత్రిలో చేరిన వారు మృత్యువాత పడుతున్నారు. ప్రసవాలు చేస్తే ఇన్ఫెక్షన్ వస్తుందన్న ఉద్దేశంతో చివరకు వైద్యులు కూడా డెలివరీ కేసులు చేపట్టేందుకు ముందుకు రావటం లేదు. ఐదు రోజుల వ్యవధిలోనే మెడికల్ వార్డులో 15 మంది మృతి చెందడం వీరందరి ఆందోళనలో అర్థముందని ధ్రువీకరిస్తోంది. ఇంత దారుణ దుస్థితికి కారణమేంటి?.. ఇదీ నేపథ్యం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులకు పాత, కొత్త కాంట్రాక్టర్లిద్దరూ కలిపి ఐదు నెలల వేతనాలు బకాయి ఉన్నారు. వీటి కోసం పలుమార్లు ధర్నాలు చేసినా స్పందన లేకపోవటంతో ఈ నెల 9వ తేదీన కార్మికులు సమ్మెకు దిగారు. అప్పట్లో రిమ్స్ డెరైక్టర్, కొత్త కాంట్రాక్టర్ కలసి ఈ నెల 15వ తేదీన బకాయి పడ్డ వేతనాలు చెల్లిస్తామని హామీ ఇవ్వటంతో.. 10వ తేదీ మధ్యాహ్నం సమ్మె విరమించారు. అయితే ఆ తేదీన వేతనాలు చెల్లించకపోవటంతో కార్మికులు మళ్లీ సమ్మె చేపట్టారు. దీంతో పారిశుధ్ద్య నిర్వహణ పూర్తిగా స్తంభించింది. ఓపీ నుంచి ఆపరేషన్ థియేటర్ వరకు ప్రతి చోటా చెత్త పోగులు, వ్యర్థాలు పేరుకుపోయాయి. ఫలితంగా ఆస్పత్రి అంతా దుర్వాసనతో నిండిపోయి కనీసం ఐదు నిమిషాలైనా ఉండలేని పరిస్థితి నెలకొంది. అసలే రోగులకు నిలయం. పైగా దుర్వాసన, పారిశుద్ధ్యలోపంతో పరిస్థితి క్షీణించింది. పరిశుభ్ర వాతావరణం ఉంటేనే రోగాలు త్వరగా నయమవుతాయని తెలిసినా.. అపరిశుభ్ర వాతావరణంలోనే రోగులకు చికిత్సలు చేయాల్సిన దుస్థితి దాపురించింది. వరుస మరణాలు పారిశుద్ధ్యం క్షీణించడంతో ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయి. అసలే వ్యాధులతో బాధపడుతున్న వారిని వాంతులు వంటి కొత్త రుగ్మతలు సోకి ప్రాణాలను కబళిస్తున్నాయి. మెడికల్ విభాగానికి చెందిన స్త్రీ, పురుషుల వార్డుల్లో ఈ నెల 18 నుంచి 22 వరకు ఐదు రోజుల్లో 15 మంది మృత్యువాత పడ్డారు. పరిస్థితి అత్యంత దారుణంగా ఉందనడానికి ఇదే నిదర్శనం. సాధారణంగా మెడికల్ విభాగానికి వచ్చే కేసుల్లో మరీ సీరియస్‌గా ఉన్న ఒకరో ఇద్దరో మరణించడం సాధారణం. ఇంత ఎక్కువ సంఖ్యలో ఇంతకుముందెప్పుడూ మరణాలు సంభవించలేదని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు రిమ్స్‌లో నెలకొన్న దయనీయ పరిస్థితి చూసి రోగులు జడుసుకుంటున్నారు. ప్రసూతి వార్డు పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. దాంతో సోమవారం రాత్రి ఏకంగా నలుగురు గర్భిణులు రిమ్స్ నుంచి బయటపడి ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల్లో ప్రసవాలు చేయలేమని వైద్యులు కూడా చేతులెత్తేశారు. ప్రసవాలు చేస్తే తల్లీబిడ్డలకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదముందని రిమ్స్ డెరైక్టర్‌కు తెల్చి చెప్పేశారు. పరిస్ధితి ఇంత దారుణంగా ఉన్న జిల్లా అధికార యంత్రంగం రిమ్స్ సమస్యపై కనీసం కన్నేతైన చూడకపోవటం దారుణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కార్మికుల సమస్యలను పరిష్కరించి వారి సమ్మెను విరమించకపోతే రిమ్స్‌లో రోజు రోజుకి మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
ఎందుకు తొలగించకూడదు
సాక్షి ప్రతినిధి, కడప: రిమ్స్ డెరైక్టర్ సిద్దప్ప గౌరవ్‌ను ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాల్సిందిగా మెడికల్ అండ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రమణ్యం డిపార్టుమెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)ను ఆదేశించారు. ఆ మేరకు ఈనెల 13న మెమో 8800/ఏ.2/2014ను జారీ చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు డెరైక్టర్‌గా డాక్టర్ సిద్దప్పగౌరవ్ అనర్హుడని ఏపీ మెడికల్ అండ్ హెల్త్ నాన్‌గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీకి ఫిర్యాదు చేశారు. అనస్థీషియా ప్రొఫెసర్‌గా సిద్దప్పకు అర్హత లేదని, కోర్టు ఉత్తర్వుల కారణంగా అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయి మాత్రమేనని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అసోసియేట్ ప్రొఫెసర్‌కు డెరైక్టర్‌గా ఉండే అర్హత ఎంతమాత్రం లేదని ఎన్జీఓ అసోసియేషన్ వివరించింది. దీంతో రిమ్స్ డెరైక్టర్‌గా సిద్దప్పగౌరవ్‌ను ఎందుకు తొలగించకూడదో స్పష్టమైన కారణాలు వివరించాలని డీఎంఈని ఆదేశించింది. మరో ఏడాది అవకాశం ఇవ్వండి.. రిమ్స్ డెరైక్టర్‌గా మరో ఏడాది అవకాశం ఇవ్వాలని డాక్టర్ సిద్దప్ప గౌరవ్ డీఎంఈని కోరినట్లు విశ్వసనీయ సమాచారం. తర్వలో రిమ్స్ డెరైక్టర్‌గా పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఆయన మరో అవకాశం కోసం అభ్యర్థించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని ఏపీ మెడికల్ అండ్ హెల్త్ ఎన్జీఓ హైదరాబాద్ విభాగం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఆధారంగా మెడికల్ అండ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రెటరీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఎన్జీఓల ఫిర్యాదుపై స్పందించిన ఆయన చర్యల నిమిత్తం డీఎంఈ వివరణ కోరారు. డెరైక్టర్‌ను తొలగించాలి.. రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ సిద్దప్పగౌరవ్‌ను తొలగించాలని ఏపీ మెడికల్ అండ్ హెల్త్ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విజడంచౌదరి, ప్రధాన కార్యదర్శి అహరోన్‌లు కోరారు. తమ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రమణ్యం ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల్ని పరిగణలోకి తీసుకొని తక్షణమే డీఎంఈ డెరైక్టర్ తొలగింపునకు ప్రతిపాదనలు పంపాలని కోరారు. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటనను ఆదివారం విడుదల చేశారు. -
రిమ్స్‌లో ప్రచ్ఛన్న యుద్ధం!
రిమ్స్‌క్యాంపస్: ఎవరైనాతప్పు చేస్తే వారిని మందలించటం సహజం. మరీ అవసరమైతే చర్యలు తీసుకోవటం ఏ శాఖలోనైనా పరిపాటే. తప్పు చేసిన వారు కూడా ఒక్కోసారి తలవంచుకుపోతారు. అదే తప్పు చేయకుండానే ఉన్నతాధికారులు చర్యలకు సిద్ధమైతే? కిందిస్థాయి సిబ్బందిలో ఆగ్రహావేశాలు ముంచుకొస్తాయి. కొద్దిసేపు సహనం వహిస్తారు. అప్పటికీ అధికారుల తీరు మారకపోతే ఆందోళనకు సిద్ధమవుతారు. ఇదే పరిస్థితి జిల్లాకు తలమానికంగా ఉన్న రిమ్స్ ఆస్పత్రిలో ప్రస్తుతం నెలకొంది. కొద్దిరోజులుగా ఏదో ఒక విషయంలో రిమ్స్‌లో నెలకొంటున్న విభేదాలు మరోసారి తారస్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిమ్స్ ఆస్పత్రిలో సుమారు 250 మంది స్టాఫ్ నర్సులు విధులు నిర్వహిస్తున్నారు. వీరి విధులను నర్సిం గ్ సూపరింటెండెంట్లు పర్యవేక్షిస్తారు. ఎవరైన విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే నర్సింగ్ సూపరింటెండెంట్ చర్యలు తీసుకుంటారు. అయితే ఇక్కడ పరిస్థితి తారుమారైంది. నర్సింగ్ స్టాఫ్ పై రిమ్స్ డెరైక్టర్ అజమాయిషీ చెలాయించేందుకు చూస్తున్నారనే ఆరోపణ లు వినిపిస్తున్నాయి. రిమ్స్ మొత్తానికి ఉన్నతాధికారిగా ఆయనకు అధికారం ఉన్నప్పటికీ లేనిపోని తప్పులను చూపించడాన్ని మాత్రం నర్సింగ్ స్టాఫ్ తట్టుకోలేకపోతున్నారు. ఇటీవల వార్డు ల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వార్డులో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రోగులకు ఏ విధమైన సేవ లు అందుతున్నాయి, దొంగతనాలు జరుగకుండా ఇలా వీటి ద్వారా అధికారులు పరిశీలించి తెలుసుకుంటున్నారు. అయితే స్టాఫ్ నర్సులు రోగులకు సేవలందించిన తరువాత సంబంధిత రికా ర్డు వర్క్, డైట్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం స్టాఫ్ నర్సులు వార్డులో వారికి కేటాయించిన చోట కూర్చొని విధులు నిర్వహిస్తుంటారు. అయితే ఇటీవల ఓ వార్డులో స్టాఫ్ నర్సులు ఒకే దగ్గర కూర్చొని ఉండటాన్ని సీసీ కెమెరాలో చూసిన రిమ్స్ డెరైక్టరు వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మెమోలివ్వాలంటూ ఆదేశాలు స్టాఫ్ నర్సులంతా ఒకచోట కూర్చొని ఉండటాన్ని తప్పుబట్టిన డెరైక్టర్ ఆ సమయంలో ఎవరెవరు డ్యూటీలో ఉన్నారో వారికి మెమోలివ్వాలంటూ నర్సింగ్ సూపరింటెండెంట్లకు ఆదేశాలను జారీ చేశారు. అయితే రికార్డు వర్క్ చేసుకుంటున్న వారికి ఏ విధంగా మెమోలిస్తామంటూ సూపరింటెండెం ట్లు డెరైక్టరుకు వివరించారు. డెరెక్టర్ మాత్రం వీరి మాటలను పట్టించుకోలేదు. వారికి మెమోలివ్వకుంటే నేను మీకు మెమోలిస్తానంటూ హెచ్చరించి నట్టు సమాచారం. తప్పు చేయని స్టాఫ్ నర్సులకు మెమోలివ్వలేక, డెరైక్టరు మాటకు ఎదురు చెప్పలేక ఓ నర్సింగ్ సూపరింటెండెంట్ కన్నీళ్లు పెట్టుకున్నట్టు తెలిసింది. ఆందోళన ఆలోచనలో నర్సింగ్ స్టాఫ్ ! డెరైక్టర్ తీరు మార్చుకోకపోతే ఆందోళనకు సిద్ధం కావాలననే ఆలోచనలో స్టాఫ్ నర్సులు ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు కొంతమంది గురువారం సమావేశమై చర్చించినట్టు ఆస్పత్రి వ ర్గాలు చెబుతున్నాయి. నిజంగా తప్పు చేసి ఉంటే ఆధారాలతో సహా రుజువు చేసి చర్య తీసుకోవాలంటున్నారు. మెమోలివ్వమన్న మాట వాస్తవమే విధులు సక్రమంగా నిర్వహించటం లేదంటూ కొంత మంది స్టాఫ్ నర్సుల కు మెమోలను ఇవ్వమని డెరైక్టర్ చెప్పటం వాస్తవమేనని గ్రేడ్-2 నర్సిం గ్ సూపరింటెండెంట్ దుర్గాంబ ‘సాక్షి’కి చెప్పారు. తొలుత మెమోలు ఇవ్వమని చెప్పినా.. ఆ తరువాత వాటిని రద్దు చేయమని చెప్పడంతో ప్రస్తుతం ఎవ్వరికి మెమోలు ఇవ్వలేదన్నారు. ఇదే విషయాన్ని రిమ్స్ సూపరింటెండెంట్ ఎల్.వేణుగోపాల్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా నర్సింగ్ స్టాఫ్ చాలా సమయం ఒకే చోటకూర్చొని ఉంటున్నారని రోగుల నుంచి ఫిర్యాదులు వస్తుండడంతో స్టాఫ్ నర్సులను డెరైక్టరు మందలించినట్టు చెప్పారు. మెమోల విషయం తనకు తెలియదన్నారు. -
ఆ కుటుంబ సంకల్పమే.. ఓ ప్ర‘యోగం’!
- మరణానంతరం దేహదానానికి సమష్టి నిర్ణయం - డైట్ అధ్యాపకుడు తిరుమల చైతన్య కుటుంబం ఆదర్శం - రిమ్స్ డెరైక్టర్‌కు అంగీకార పత్రాల అందజేత - వైద్య విద్యార్థుల ప్రాక్టికల్స్‌కు ఉపయోగపడాలన్నదే లక్ష్యం - ఇతరుల నుంచి అంగీకారపత్రాల సేకరణకూ సిద్ధం రిమ్స్ క్యాంపస్: పుట్టినవాడు గిట్టక తప్పదు.. మరణించినవాడికి మరుజన్మ తప్పదన్నది గీతా సారం. అయితే మరణించిన వారి దేహం మట్టిలో కలిస్తేగానీ మరో జన్మ ఉండదన్న నమ్మకం మన సమాజంలో పాతుకుపోయింది. మట్టిలో లిస్తే మరుజన్మ ఉంటుందో లేదో గానీ.. పార్థివ దేహాన్ని భావి వైద్యుల ప్రయోగశాలగా మార్చడం ద్వారా ఎన్నో ప్రాణాలను నిలబెట్టే అపూర్వ అవకాశం లభిస్తుంది. అదే దిశలో ఆలోచించిందా ఆ కుటుంబం. తమ తదనంతరం తమ శరీరాలను వృథా పోనివ్వకుండా వైద్య విద్యార్థుల ప్రయోగాల కోసం దానం చేయాలని సంకల్పించింది. అనుకున్నదే తడవుగా కుటుంబం మొత్తం అంగీకార పత్రాలపై సంతకాలు చేసింది. రిమ్స్ వైద్య కళాశాల డెరైక్టర్‌కు అందజేసింది. శరీర దానం పై ప్రచారం చేయడంతోపాటు ప్రజల నుంచి అంగీ కార పత్రాలు పొందేందుకు కృషి చేసేందుకు నడుం కట్టిన ఆ కుటుంబం గురించి తెలుసుకుందాం.. మన మూ స్ఫూర్తి పొందుదాం.. శ్రీకాకుళం ప్రశాంతినగర్ కాలనీకి చెందిన సదాశివుని తిరుమల చైతన్య రెండున్నర దశాబ్దాలుగా వమరవల్లిలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డైట్)లో సీని యర్ అధ్యాపకునిగా విధు లు నిర్వహిస్తున్నారు. ఈయనకు భార్య పుష్పాంజలి, ఇంజనీరింగ్ పూర్తి చేసిన కుమార్తె ప్రత్యూష, ఇంజనీరింగ్ చదువుతున్న కుమారుడు సాకేత్ సిద్ధార్థలు ఉన్నారు. ఉన్నత విద్యావంతులైన ఈ కుటుంబ సభ్యులు సమష్టిగా ఓ ఉదాత్తమైన నిర్ణయం తీసుకున్నారు. తాము చనిపోయిన తరువాత మృతదేహాలను వైద్య విద్యార్థుల ప్రాక్టికల్స్ కోసం దానం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు అంగీకార పత్రాలను రిమ్స్ డెరైక్టర్ టి.జయరాజ్‌కు శుక్రవారం అందజేశారు. అన్ని దానాల్లో కన్నా విద్యాదానం గొప్పదని అంటారు. కానీ వైద్య కళాశాలల్లో విద్యాదానం చేసేందుకు అవసరమైన మానవ దేహాలు లభించక విద్యార్థులు ఉపన్యాసాలు, వీడియోలను చూసి పరిజ్ఞానం పెంచుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో నాణ్యమైన వైద్యు లు తయారవ్వటం లేదని విమర్శలు చేసే బదులు భావి వైద్యుల ప్రాక్టికల్స్‌కు ఉపయోగపడేలా మృతదేహాలను దానమివ్వటం ఎంతో అవసరమని భావించిందీ కుటుంబం. మానవ సమాజం ఏర్పడిన తొలినాళ్లలో మరణించినవారి దేహాలను జంతువులు పీక్కుతినకుండా పూడ్చటం, దహనం చేయటం వంటి కార్యక్రమాలు చేసేవారు. క్రమంగా అదో నమ్మకం, సంప్రదాయంగా మారడంతో వైద్య విద్యార్థుల ప్రయోగ పాఠాలకు మృతదేహాలు దొరకటం దుర్లభంగా మారింది. దాంతో గతంలో దొంగచాటుగా సమాధులను తవ్వి మానవదేహాలను సేకరించి వైద్య పరిశోధనలు చేసి ఎన్నో కొత్త విషయాలను కనుగొన్నర ని చరిత్ర చెబుతోంది. ఇప్పటికీ దాదాపు ఆ పరిస్థితే ఉందని.. ఇది మారాలి.. తమ నిర్ణయం నలుగురికీ ఆదర్శంగా నిలవాలన్నది తిరుమల చైతన్య కుటుంబం ఆశయం. పదివేల దేహదాన ధ్రువపత్రాల సేకరణే లక్ష్యం వైద్య విద్యార్థుల ప్రాక్టికల్స్ కోసం జిల్లాలో పది వేల మృతదేహాల దానపత్రాలు సేకరించాలని తిరుమల చైతన్య దృఢ సంకల్పంతో ఉన్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా పుష్పాంజలి అవేకనింగ్ చారిటబుల్ ట్రస్ట్(పి.ఎస్.సి.టి)ను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా దేహదానంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టి పదివేల మంది నుంచి అంగీకార పత్రాలు సేకరిస్తామని ఆయన చెప్పారు. ఈ మహా క్రతువును తమ కుటుంబంతోనే మొదలుపెట్టి ముందడుగు వేశారు. దేహదానానికి ముందుకు వచ్చే వారికి ప్రశంసాపత్రాలు ఇప్పించే విషయమై మాట్లాడేందుకు త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్, ఆరోగ్యశాఖ మంత్రి, జిల్లా కలెక్టర్లను కలవనున్నట్లు చెప్పారు. దేహదానానికి ముందుకు వచ్చేవారు. ఒక పాస్‌పోర్టు సైజ్ ఫొటో, ఏదైనా గుర్తింపు కార్డు, ఇద్దరు కుటుంబ సభ్యుల సాక్షి సంతకంతో తన నెంబరు 9490904090, 7702123770 నెంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు. -
రిమ్స్ ఆస్పత్రిలో అవినీతి రాజ్యం
అబ్బాయి పుడితే రూ.800.. అమ్మాయి పుడితే రూ.500..గ్రూపులుగా మారి వసూళ్ల దందా బాధితులను పీక్కుతింటున్న సిబ్బంది కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : రిమ్స్ ఆస్పత్రిలో అవినీతి రాజ్యమేలుతోంది. వైద్యం కోసం వచ్చే పేదల నుంచి సిబ్బంది డబ్బులు దండుకుంటున్నారు. ముఖ్యంగా ప్రసూతి విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. పుట్టిన బాబుకు, పాపకు ఓ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి ఆస్పత్రిని నిర్వహిస్తున్నా.. రూ.వేల జీతా లు తీసుకుంటున్న సిబ్బంది అక్రమమార్గంలో వసూళ్ల పర్వం మొదలుపెట్టారు. ఆస్పత్రికి రోజూ సుమారు 30 నుంచి 40 ప్ర సూతి కేసులు వస్తుంటాయి. ఇలా ఒక్కొక్కరి నుంచి రూ.1,000 నుంచి రూ.1,500 వరకు బంధువుల నుంచి సిబ్బంది వసూలు చేస్తున్నారు. కానీ రిమ్స్ ఉన్నతాధికారులు మాత్రం ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రూపులుగా వసూళ్లు ప్రసూతి కోసం వచ్చిన మహిళా బంధువుల నుంచి ప్రసూతి విభాగం సిబ్బంది, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది గ్రూపులుగా మారి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముందుగా ఆస్పత్రికి వచ్చిన మహిళను ప్రసూతి విభాగంలో చేర్పిస్తారు. అక్కడి సిబ్బంది ఆపరేషన్‌కు సంబంధించిన దుస్తులు మహిళ ధరించిన తర్వాత రూ.200 తీసుకుంటారు. ఆ తర్వాత డెలివరీ అయిన వెంటనే ఆపరేషన్ థియేటర్లో ఉండే ఇద్దరు సిబ్బంది పుట్టిన పాపకు లెక్కకట్టి మరీ వసూలు చేస్తారు. బాబు పుడితే రూ.800, పాప పుడితే రూ.500 తీసుకుంటారు. సదరు బంధువులు డబ్బులు ఇచ్చేంత వరకు పుట్టిన బిడ్డను వారి చేతికివ్వకుండా ఇబ్బంది పెడతారు. దీంతో ఏం చేయలేని పరిస్థితుల్లో డబ్బులు ఇచ్చి బిడ్డను తీసుకుంటారు. ఇవేకాకుండా అదనంగా అక్కడి నుంచి ప్రసూతి వార్డుకు తరలించేందుకు వార్డు బాయ్‌కి రూ.100, ప్రసూతి వార్డులో పడక చూపించిన సిబ్బందికి రూ.300, పుట్టిన బిడ్డకు ఆయిల్ రాసి శుభ్రం చేసే సిబ్బందికి రూ.200 ఇలా ఎక్కడి సిబ్బంది అక్కడే దోచుకుంటున్నారు. మొత్తంగా సుమారు రూ.1500 వరకు వసూలు చేయందే విడిచిపెట్టరు. ఎవరికి ఎంతెంత డబ్బులు ఇవ్వాలనేది కూడా సిబ్బంది ముందుగానే బాధితులకు చెబుతారు. తాము 10 నుంచి 15 మంది ఉంటామని, మీరిచ్చిన డబ్బులు అందరం పంచుకుంటామని స్వయంగా వారే చెప్పడం గమనార్హం. ప్రసూతి వార్డుకు తల్లిని, బిడ్డను తీసుకెళ్లిన తర్వాత ఒక మహిళ సిబ్బంది వచ్చి డబ్బులు వసూళు చేసుకొని వెళ్తొంది. ఆ తర్వాత మరో మహిళ సిబ్బంది వచ్చి అంతకుముందు ఇచ్చిన డబ్బులు తమకు కావని వారు ఆపరేషన్ థియేటర్ సిబ్బంది అంటూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి డబ్బుల కోసం మహిళ బంధువులు పీక్కుతింటున్నారు. ఒకవేళ సిబ్బంది అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే వారికి నరకం చూపేడుతున్నారు. ఇక గిరిజన మహిళల పరిస్థితి మరీ దారుణం. కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు రిమ్స్‌లోని ప్రసూతి వార్డులో జరుగుతున్న అవినీతి గురించి స్వయంగా కలెక్టర్ అహ్మద్ బాబుకు బాధితులు ఫిర్యాదు చేశారు. గతేడాది ఆగష్టులో రిమ్స్ తనిఖీలకు వచ్చిన కలెక్టర్‌ను కలిసిన కొంత మంది బాధితులు తమ నుంచి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని విన్నవించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసూతి వార్డులో ఉన్న సిబ్బందిని వేరే వార్డుల్లోకి మార్చాలని రిమ్స్ అధికారులను ఆదేశించారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అయినప్పటికి కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ సిబ్బంది వసూళ్ల పర్వం కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రసూతి వార్డు ఇన్చార్జీ అధికారులు ఈ విషయాన్ని మామూలుగా తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిబ్బంది డబ్బులు అడుగుతున్నారని ఎవరికైన చెబితే ఎక్కడ మళ్లీ తమను హింసిస్తారనే భయంతో బాధితులు నోరు మెదపడం లేదు. ఏదేమైన ప్రసూతి వార్డులో అవినీతి కంపును తొలగించాలని పలువురు కోరుతున్నారు. దృష్టి సారిస్తాం.. రిమ్స్ ప్రసూతి వార్డులో డబ్బులు వసూలు చేసే సిబ్బంది చర్యలు తీసుకుంటాం. ఇకపై సిబ్బంది డబ్బులు తీసుకుంటున్నారనే దానిపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. గతంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ వార్డులో ఉన్న సిబ్బందిని వేరే వార్డుకు బదిలీ చేయడం జరిగింది. ఆస్పత్రికి వచ్చిన వారిని సిబ్బంది డబ్బులు అడిగితే తమకు ఫిర్యాదు చేయాలి. సదరు సిబ్బందిపై తగు చర్యలు తీసుకుంటాం. - డాక్టర్ శశిధర్, రిమ్స్ డెరైక్టర్