
ఆ కుటుంబ సంకల్పమే.. ఓ ప్ర‘యోగం’!
- మరణానంతరం దేహదానానికి సమష్టి నిర్ణయం
- డైట్ అధ్యాపకుడు తిరుమల చైతన్య కుటుంబం ఆదర్శం
- రిమ్స్ డెరైక్టర్‌కు అంగీకార పత్రాల అందజేత
- వైద్య విద్యార్థుల ప్రాక్టికల్స్‌కు ఉపయోగపడాలన్నదే లక్ష్యం
- ఇతరుల నుంచి అంగీకారపత్రాల సేకరణకూ సిద్ధం
రిమ్స్ క్యాంపస్: పుట్టినవాడు గిట్టక తప్పదు.. మరణించినవాడికి మరుజన్మ తప్పదన్నది గీతా సారం. అయితే మరణించిన వారి దేహం మట్టిలో కలిస్తేగానీ మరో జన్మ ఉండదన్న నమ్మకం మన సమాజంలో పాతుకుపోయింది. మట్టిలో లిస్తే మరుజన్మ ఉంటుందో లేదో గానీ.. పార్థివ దేహాన్ని భావి వైద్యుల ప్రయోగశాలగా మార్చడం ద్వారా ఎన్నో ప్రాణాలను నిలబెట్టే అపూర్వ అవకాశం లభిస్తుంది. అదే దిశలో ఆలోచించిందా ఆ కుటుంబం.
తమ తదనంతరం తమ శరీరాలను వృథా పోనివ్వకుండా వైద్య విద్యార్థుల ప్రయోగాల కోసం దానం చేయాలని సంకల్పించింది. అనుకున్నదే తడవుగా కుటుంబం మొత్తం అంగీకార పత్రాలపై సంతకాలు చేసింది. రిమ్స్ వైద్య కళాశాల డెరైక్టర్‌కు అందజేసింది. శరీర దానం పై ప్రచారం చేయడంతోపాటు ప్రజల నుంచి అంగీ కార పత్రాలు పొందేందుకు కృషి చేసేందుకు నడుం కట్టిన ఆ కుటుంబం గురించి తెలుసుకుందాం.. మన మూ స్ఫూర్తి పొందుదాం..
శ్రీకాకుళం ప్రశాంతినగర్ కాలనీకి చెందిన సదాశివుని తిరుమల చైతన్య రెండున్నర దశాబ్దాలుగా వమరవల్లిలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డైట్)లో సీని యర్ అధ్యాపకునిగా విధు లు నిర్వహిస్తున్నారు. ఈయనకు భార్య పుష్పాంజలి, ఇంజనీరింగ్ పూర్తి చేసిన కుమార్తె ప్రత్యూష, ఇంజనీరింగ్ చదువుతున్న కుమారుడు సాకేత్ సిద్ధార్థలు ఉన్నారు. ఉన్నత విద్యావంతులైన ఈ కుటుంబ సభ్యులు సమష్టిగా ఓ ఉదాత్తమైన నిర్ణయం తీసుకున్నారు. తాము చనిపోయిన తరువాత మృతదేహాలను వైద్య విద్యార్థుల ప్రాక్టికల్స్ కోసం దానం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు అంగీకార పత్రాలను రిమ్స్ డెరైక్టర్ టి.జయరాజ్‌కు శుక్రవారం అందజేశారు.
అన్ని దానాల్లో కన్నా విద్యాదానం గొప్పదని అంటారు. కానీ వైద్య కళాశాలల్లో విద్యాదానం చేసేందుకు అవసరమైన మానవ దేహాలు లభించక విద్యార్థులు ఉపన్యాసాలు, వీడియోలను చూసి పరిజ్ఞానం పెంచుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో నాణ్యమైన వైద్యు లు తయారవ్వటం లేదని విమర్శలు చేసే బదులు భావి వైద్యుల ప్రాక్టికల్స్‌కు ఉపయోగపడేలా మృతదేహాలను దానమివ్వటం ఎంతో అవసరమని భావించిందీ కుటుంబం.
మానవ సమాజం ఏర్పడిన తొలినాళ్లలో మరణించినవారి దేహాలను జంతువులు పీక్కుతినకుండా పూడ్చటం, దహనం చేయటం వంటి కార్యక్రమాలు చేసేవారు. క్రమంగా అదో నమ్మకం, సంప్రదాయంగా మారడంతో వైద్య విద్యార్థుల ప్రయోగ పాఠాలకు మృతదేహాలు దొరకటం దుర్లభంగా మారింది. దాంతో గతంలో దొంగచాటుగా సమాధులను తవ్వి మానవదేహాలను సేకరించి వైద్య పరిశోధనలు చేసి ఎన్నో కొత్త విషయాలను కనుగొన్నర ని చరిత్ర చెబుతోంది. ఇప్పటికీ దాదాపు ఆ పరిస్థితే ఉందని.. ఇది మారాలి.. తమ నిర్ణయం నలుగురికీ ఆదర్శంగా నిలవాలన్నది తిరుమల చైతన్య కుటుంబం ఆశయం.
పదివేల దేహదాన ధ్రువపత్రాల సేకరణే లక్ష్యం
వైద్య విద్యార్థుల ప్రాక్టికల్స్ కోసం జిల్లాలో పది వేల మృతదేహాల దానపత్రాలు సేకరించాలని తిరుమల చైతన్య దృఢ సంకల్పంతో ఉన్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా పుష్పాంజలి అవేకనింగ్ చారిటబుల్ ట్రస్ట్(పి.ఎస్.సి.టి)ను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా దేహదానంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టి పదివేల మంది నుంచి అంగీకార పత్రాలు సేకరిస్తామని ఆయన చెప్పారు. ఈ మహా క్రతువును తమ కుటుంబంతోనే మొదలుపెట్టి ముందడుగు వేశారు.
దేహదానానికి ముందుకు వచ్చే వారికి ప్రశంసాపత్రాలు ఇప్పించే విషయమై మాట్లాడేందుకు త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్, ఆరోగ్యశాఖ మంత్రి, జిల్లా కలెక్టర్‌లను కలవనున్నట్లు చెప్పారు. దేహదానానికి ముందుకు వచ్చేవారు. ఒక పాస్‌పోర్టు సైజ్ ఫొటో, ఏదైనా గుర్తింపు కార్డు, ఇద్దరు కుటుంబ సభ్యుల సాక్షి సంతకంతో తన నెంబరు 9490904090, 7702123770 నెంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు.