సాక్షి, కడప అర్బన్ : తన కుమార్తె వరలక్ష్మి మరణానికి అర్జున్‌రెడ్డి అనే వ్యక్తే కారణమని వల్లూరు మండలం బీచువారి పల్లెకు చెందిన వేల్పుచెర్ల మంజులాదేవి కడప రైల్వే పోలీసులకు శనివారం ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్‌ఐ రారాజు తెలిపారు. పోలీసుల కథనం, మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు.. వల్లూరు మండలం బీచువారిపల్లెకు చెందిన మంజులాదేవికి, పుల్లారెడ్డితో 31 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఆమె భర్త పుల్లారెడ్డి మృతి చెందాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో వరలక్ష్మి కడప రిమ్స్ ఆవరణంలోని ప్రభుత్వ దంతవైద్య కళాశాలలో బీడీఎస్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈనెల 18న ఇంటికి వస్తానని తల్లికి ఫోన్‌చేసి, వార్డెన్ అనుమతి తీసుకుని బయలు దేరి, మరలా తల్లికి ఫోన్ చేసి తాను హాస్టల్‌లోనే ఉంటానని చెప్పింది.
కానీ, అదే రోజు సాయంత్రం తనకు, అర్జున్ రెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిందని, తనను వివాహం చేసుకుంటానని మాయ మాటలు చెప్పి, ఇపుడు తనకు ఫోన్ చేసి వివాహం చేసుకోనని, తనకు ఇదివరకే వివాహమైందని తెలిపి మోసం చేశాడని పేర్కొంది. తనను చావమన్నాడని.. బెదిరించాడని వరలక్ష్మి, తన తల్లికి ఫోన్ చేసి చెప్పడంతో ఆమెను హాస్టల్‌లోనే ఉండాలని కోరింది. ఈ నేపథ్యంలో ఈనెల 18న రైలు కిందపడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ విషయాన్ని రెండు రోజుల తర్వాత గుర్తించిన పోలీసులు మృతురాలి వద్ద ఫోన్ ద్వారా తల్లికి విషయం తెలిపారు. మృతురాలి తల్లి మంజులా దేవి శనివారం కడప రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment