సాక్షి, హైదరాబాద్ : గత సంవత్సరం తెలంగాణ స్పోర్ట్స్ కోటాలో మెడికల్ సీట్లు అమ్ముకున్నారనే ఆరోపణల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) బుధవారం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారుల ఇళ్లపై ఒకేసారి మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఏసీబీ డైరెక్టర్ జనరల్ పూర్ణచందర్ రావు మాట్లాడుతూ.. శాప్ డిప్యూటీ డైరెక్టర్ వెంకట రమణ నివాసం సహా మరో ఐదు చోట్ల తనిఖీలు నిర్వహించామన్నారు. ‘స్పోర్ట్స్ కోటాలో 12 మందికి మెడికల్ సీట్లు అమ్ముకున్నట్లు గుర్తించాం. బాధితులు భరత్ చంద్రారెడ్డి, హర్షితారాజ్‌ల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని’ ఏసీబీ డీజీ చెప్పారు.
అధికారులు వెంకట రమణ, శోభ, చంద్రారెడ్డి, విమలాకర్‌లు లంచం డిమాండ్ చేశారని ఏసీబీ డీజీ తెలిపారు. 2017 స్పోర్ట్స్ సర్టిఫికెట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు సేకరించామన్నారు. శాప్ డిప్యూటీ డైరెక్టర్ వెంకట రమణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ఇంకా ఎవరైనా బాధితులుంటే ఏసీబీని సంప్రదించాలని ఏసీబీ డైరెక్టర్ జనరల్ పూర్ణచందర్ రావు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment