sports authority of Telangana
-
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా ఆంజనేయగౌడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా ఈడిగ ఆంజనేయగౌడ్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అందుకు సంబంధించిన నియామకపత్రాన్ని సోమవారం ప్రగతి భవన్లో సీఎం చేతుల మీదుగా ఆంజనేయ గౌడ్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. -
క్రీడాకారులందరికీ టీకాలు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్రీడల మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మంగళవారం గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీని సందర్శించారు. ఈ సందర్భంగా చీఫ్ కోచ్ గోపీచంద్ పర్యవేక్షణలో టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న క్రీడాకారులు సాయిప్రణీత్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలతోపాటు అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న ఇతర క్రీడాకారులతో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు క్రీడాకారులకు కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని.... క్రీడాకారుల జాబితాను సిద్ధం చేసి వారికి లాల్‌బహదూర్ స్టేడియంలో టీకా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లాలలో జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. చదవండి: BAN Vs SL: బంగ్లాదేశ్‌దే వన్డే సిరీస్; అలా అయితే ఇంకా సంతోషించేవాడిని! -
ఎల్బీ స్టేడియం ముందు కోచ్‌ల మెరుపు ధర్నా
సాక్షి, నాంపల్లి: హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం ముందు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కాంట్రాక్ట్ కోచ్ శాట్స్ కోచ్‌లు శనివారం మెరుపు ధర్నాకు దిగారు. 27 ఏళ్లుగా ఒప్పంద కోచ్ లగా పని చేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలంటూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కాంట్రాక్ట్ కోచ్ శాట్స్ కోచ్ లు నిరసనకు దిగారు. రెగులరైజ్ చేయాలని ప్రభుత్వ పెద్దలని ఎన్ని సార్లు వేడుకున్నఎలాంటి స్పందన రాకపోవడంతోనే మెరుపు ధర్నాకు దిగినట్లు తెలిపారు. తెలంగాణ వచ్చాక అయిన తమ బతుకులు బాగుపడతాయి అనుకుంటే... సీన్ రివర్స్ అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తమకు జీతాలు కూడా టైమ్ కి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంట్రాక్ట్ కోచ్ నేత రవి శంకర్ మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ కోచ్ లను క్రమబద్ధీకరించాలి. సమయానికి వేతనాలు ఇవ్వడం లేదని కోచ్‌లు ఆవేదన చెందుతున్నారు. క్రీడలు ఎంతో పవిత్రమైనది.. ఈ రంగంలో మేము 1993 నుంచి సేవలు అందిస్తున్నాం.. మమ్మల్ని రెగ్యులర్ చేయాలి.. ఈ విషయంలో ప్రభుత్వం న్యాయం చేస్తుందని భావిస్తున్నాం. మేము ఎవరిని విమర్శించటం లేదు.కోచింగ్ వల్ల సమాజం లో క్యారెక్టర్ అభివృద్ధి అవుతుంది. ఇప్పటివరకు 30 జాతీయ మల్ల యోధులను తయారు చేశాం. మా చైర్మన్ వెంకట్ రెడ్డి సమస్యలు పరిష్కరించాలి. అని డిమాండ్ చేశారు. -
కోచ్ అర్జున్ యాదవ్‌ను తొలగించండి
సాక్షి, హైదరాబాద్: అనుభవం లేని ఆటగాళ్లు, అర్హత లేని కోచ్ అర్జున్ యాదవ్ కారణంగానే రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు ఘోర పరాజయాల్ని చవిచూస్తోందని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తక్షణమే అర్జున్ యాదవ్‌ను తొలగించి అన్ని అర్హతలు ఉన్న కోచ్‌ను హైదరాబాద్‌కు నియమించాలని ఆయన హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)ను కోరారు. ‘పంజాబ్‌తో జరిగిన రంజీ ట్రోఫీలో హైదరాబాద్ ఇన్నింగ్స్ 125 పరుగులతో ఓడటం సిగ్గుచేటు. అనుభవం లేని క్రికెటర్లు జట్టులో ఉన్నారు. హెచ్‌సీఏ కక్ష సాధింపు ధోరణిని విడిచిపెట్టి అనువజు్ఞడైన అంబటి రాయుడును తిరిగి హైదరాబాద్ జట్టులో ఆడించాలి. కోచ్ అర్జున్ యాదవ్‌ను కూడా వెంటనే తప్పించి ఆయన స్థానంలో అర్హత ఉన్న మరో కోచ్‌ను నియమించాలి. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ వెంటనే జోక్యం చేసుకోవాలి. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌తో మాట్లాడి హైదరాబాద్ రంజీ జట్టులోకి రాయుడును తీసుకొచ్చే అంశంపై కేటీఆర్ శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నా. ఇలా చేస్తేనే హైదరాబాద్ జట్టుకు మేలు జరుగుతుంది’ అని వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. -
ఏసీబీ విచారణకు సహకరిస్తున్నాం..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ స్పోర్ట్స్ కోటాలో గత సంవత్సరం మెడికల్ సీట్లు అమ్ముకున్నారనే ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారుల ఇళ్లపై దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఏసీబీ విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని సాట్స్ ఎండీ దినకర్ బాబు చెప్పారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. సాట్స్‌లో అక్రమాలు జరగలేదని పేర్కొన్నారు. కొంతమంది అధికారులు చేసిన తప్పులకు క్రీడాకారులు బలయ్యారని తెలిపారు. ‘ ఫెన్సింగ్‌ని 2016లోనే కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఫెన్సింగ్ బాండ్ కారణంగానే ఫెన్సింగ్ సర్టిఫికెట్లను పరిగణలోకి తీసుకోలేదు. ఏ విధమైన ప్రాక్టీస్ లేని వాళ్లను అసోసియేషన్‌లో ఎంపిక చేస్తున్నారు. ఏసీబీ వాళ్లు అడిగిన అన్ని వివరాలకి సమాధానం ఇచ్చాం. అసోసియేషన్‌లో ఉన్న లోపాల వల్ల క్రీడా విద్యార్థులకు న్యాయం జరగడం లేదు. అసోసియేషన్ లే బాక్ డోర్‌ను ప్రోత్సహిస్తున్నాయి. సాట్స్ ద్వారా ఒక్క క్రీడాకారునికి కూడా అన్యాయం జరగలేదు. ఇప్పటికీ ప్రభుత్వం రెండుసార్లు కమిటీలు వేసి విచారణ జరిపింది. వాటిలో కొన్ని లోపాలు బయటపడ్డాయని’ సాట్స్ ఎండీ పేర్కొన్నారు. ఇటాంటి ఘటనలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా కొత్త విధానాన్ని రూపొందించబోతున్నామని ఎండీ చెప్పారు. ‘అసోసియేషన్ సెలెక్షన్ల ప్రాసెస్ పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది. ఎవరికి నచ్చినట్లుగా వాళ్లు ఎంపిక చేసుకుని టీంలను పంపిస్తున్నారు. కొన్ని అసోసియేషన్లను ప్రభుత్వాలు నిషేధించినప్పటికీ అవి కొనసాగుతూ టీం సెలక్షన్ చేస్తున్నాయి. సాట్స్‌లో ఎవరు డబ్బులు తీసుకున్న శిక్షార్హులే. ప్రతి ఏడాది కొన్ని వందలమందిని సెలక్షన్ చేసి పంపిస్తున్నారు. ఏసీబీ విచారణ పూర్తికాగానే ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో నివేదిక సమర్పిస్తాం. తప్పుడు వ్యక్తులు టీమ్‌లోకి వచ్చినా వెంటనే వాళ్లను నిషేధిస్తున్నామని’ సాట్స్ ఎండీ తెలిపారు. ఆరోపణలు చేస్తున్న ఆ నలుగురు క్రీడా విద్యార్థుల వ్యవహారంలో నేను సరిగానే వ్యవహరించానన్నారు. వాళ్ళని అసోసియేషన్లు తప్పుదోవ పట్టించాయని ఆయన చెప్పారు. భాగ్యశ్రీతో పాటుగా మరికొందరి విషయంలో మాకు చాలా బాధాకరంగా ఉందని చెప్పారు. నిషేధించిన ఫెన్సింగ్ సర్టిఫికెట్ తీసుకువచ్చి మెరిట్ జాబితాలో పెట్టమంటే చాలా కష్టమని సాట్స్ ఎండీ దినకరన్ పేర్కొన్నారు. -
అర్హుల లిస్ట్ అమ్ముకున్నాడు
సాక్షి, హైదరాబాద్ : ఆటగాళ్ల భవిష్యత్తుతో ఆడుకున్నారు. అర్హుల జాబితాను అమ్ముకున్నారు. మెడిసిన్ సీట్లలో స్పోర్ట్స్ కోటా ప్రయారిటీ లిస్ట్‌లకు వెలకట్టారు. క్రీడాకారులకు, వారి సంబంధీకులకు వీటిని అందించడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ (శాట్స్) డిప్యూటీ డైరెక్టర్ జి.వెంకటరమణ లంచం డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అవకతవకలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)ను ఆదేశించారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు బుధవారం వెంకటరమణను అరెస్టు చేశారు. ఆయన ఇల్లు, కార్యాలయంతోపాటు మొత్తం ఐదు ప్రాంతాల్లోని శాట్స్ సంబంధీకుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ ప్రయారిటీ లిస్టులు, సర్టిఫికెట్లను నిబంధనల ప్రకారం జారీ చేయట్లేదని శాట్స్ ఏ అండ్ ఎస్ఎస్ ఇన్చార్జ్ కె.మనోహర్, డిప్యూటీ డైరెక్టర్ (సీ అండ్ ఏ) జీఏ శోభ, అడ్మినిస్ట్రేటర్లు జి.చంద్రారెడ్డి, విలమలాకర్రావులపై ఆరోపణలు రావడంతో వారి ఇళ్ళల్లోనూ సోదాలు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ రమణకుమార్ వెల్లడించారు. స్పోర్ట్స్ కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ కోసం అవసరమైన ప్రయారిటీ లిస్టులకు భారీ డిమాండ్ ఉంటుంది. ఏ ఆట క్రీడాకారుడికి ఎంత ర్యాంక్ వస్తే, ఏ కోర్సులో సీటు వచ్చే ఆస్కారం ఉందనేది ఈ జాబితాల్లో ఉంటుంది. మెడిసిన్ ప్రవేశపరీక్ష రాసి కౌన్సెలింగ్ కోసం ఎదురు చూస్తున్న క్రీడాకారులు నిత్యం శాట్స్ నుంచి ఈ జాబితాలు తీసుకుంటారు. అందులోని ప్రయారిటీ ప్రకారం తమకు మెడిసిన్‌లో స్పోర్ట్స్ కోటాలో సీటు రాదని భావిస్తే మరో కోటాలో దరఖాస్తు చేసుకుంటుంటారు. దీన్నే కొందరు శాట్స్ అధికారులు క్యాష్ చేసుకోవడం ప్రారంభించారు. 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రయారిటీ లిస్ట్ జారీకి డిప్యూటీ డైరెక్టర్ జి.వెంకటరమణ రూ.లక్ష లంచం డిమాండ్ చేశారనేది ఆరోపణ. క్రీడాకారులైన భరత్ చంద్రారెడ్డి , వర్షితా రాజ్‌ల ఫిర్యాదు మేరకు ఏసీబీ ఈ కేసు నమోదు చేసింది. స్పోర్ట్స్ కోటాలో మెడికల్ సీట్లు పొందడానికి అవసరమైన ప్రయారిటీల జారీలో అవకతవకలు జరిగాయని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇవి జరగట్లేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు దీనిపై ప్రాథమిక విచారణ చేస్తున్న ఏసీబీకి భరత్‌చంద్రారెడ్డి తండ్రి సత్యనారాయణ నుంచి గత నెల 25న మరో ఫిర్యాదు అందింది. ఇందులో తనకు స్పోర్ట్స్ కోటా ప్రయారిటీ లిస్ట్ జారీ చేయడానికి వెంకటరమణ గతేడాది ఆగస్టులో రూ.లక్ష లంచం డిమాండ్ చేసి తీసుకున్నారని అందులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసిన ఏసీబీ రంగంలోకి దిగి లోతుగా ఆరా తీసింది. మొత్తం 9 మంది సభ్యులు గల కమిటీ ఈ ప్రయారిటీ లిస్ట్ తయారు చేసినప్పటికీ డిప్యూటీ డైరెక్టర్ వెంకటరమణది కీలక పాత్రగా ఏసీబీ పేర్కొంది. మొత్తం ఎంత మంది నుంచి ఈ మొత్తం వసూలు చేశారనేదానిపై ఆరా తీస్తున్నారు. ఈ జాబితాల తయారీలోనూ అవకతవకలు జరిగినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. వెంకటరమణతో పాటు కమిటీ సభ్యులైన మనోహర్, శోభ, గుర్రం చంద్రారెడ్డి, విమలాకర్రావులపై ఈ ఆరోపణలు ఉన్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ బృందాలు హబ్సిగూడ రవీంద్రనగర్‌లోని వెంకటరమణ, శోభ ఇళ్లల్లో సోదాలు చేశారు. డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ సోదాలు నిర్వహించారు. మన్సూరాబాద్ డివిజన్ సరస్వతినగర్ కాలనీలో నివసించే చంద్రారెడ్డి, బాగ్‌లింగంపల్లిలోని ఎంఐజీ–2లో గల డి.విమలాకర్రావు ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఈయన కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వహిస్తున్నారు. ఎల్బీ స్టేడియంలోని స్పోర్ట్స్ కమిటీ సభ్యుల కార్యాలయాల్లో దాడులు నిర్వహించారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి వరకు సోదాలు చేశారు. అక్కడి వెంకటరమణ, శోభల చాంబర్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా పలు కీలక ఫైళ్లు, హార్డ్‌డిస్క్‌లు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన వెంకటరమణను జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి ప్రజల వద్ద ఏవైనా ఫిర్యాదులు, ఆధారాలు ఉంటే తమను సంప్రదించాలని ఏసీబీ అధికారులు కోరారు. -
స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ అరెస్టు..
సాక్షి, హైదరాబాద్ : గత సంవత్సరం తెలంగాణ స్పోర్ట్స్ కోటాలో మెడికల్ సీట్లు అమ్ముకున్నారనే ఆరోపణల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) బుధవారం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారుల ఇళ్లపై ఒకేసారి మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఏసీబీ డైరెక్టర్ జనరల్ పూర్ణచందర్ రావు మాట్లాడుతూ.. శాప్ డిప్యూటీ డైరెక్టర్ వెంకట రమణ నివాసం సహా మరో ఐదు చోట్ల తనిఖీలు నిర్వహించామన్నారు. ‘స్పోర్ట్స్ కోటాలో 12 మందికి మెడికల్ సీట్లు అమ్ముకున్నట్లు గుర్తించాం. బాధితులు భరత్ చంద్రారెడ్డి, హర్షితారాజ్ల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని’ ఏసీబీ డీజీ చెప్పారు. అధికారులు వెంకట రమణ, శోభ, చంద్రారెడ్డి, విమలాకర్లు లంచం డిమాండ్ చేశారని ఏసీబీ డీజీ తెలిపారు. 2017 స్పోర్ట్స్ సర్టిఫికెట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు సేకరించామన్నారు. శాప్ డిప్యూటీ డైరెక్టర్ వెంకట రమణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ఇంకా ఎవరైనా బాధితులుంటే ఏసీబీని సంప్రదించాలని ఏసీబీ డైరెక్టర్ జనరల్ పూర్ణచందర్ రావు సూచించారు. -
మెడికల్ సీట్లు అమ్ముకున్నారనే..
సాక్షి, హైదరాబాద్ : గతేడాది స్పోర్ట్స్ కోటాలో మెడికల్ సీట్లు అమ్ముకున్నారనే ఆరోపణల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) బుధవారం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారుల ఇళ్లపై ఒకేసారి మెరుపు దాడులు నిర్వహించింది. ఎల్బీనగర్, సరస్వతి నగర్ కాలనీలోని స్పోర్ట్స్ అథారిటీ సైక్లింగ్ కోచ్ గుర్రం చంద్రారెడ్డి నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించి విలువైన డాక్యుమెంట్లు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే శాప్ డిప్యూటీ డైరెక్టర్ వెంకట రమణ, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ విమలాకర్ రావు, స్పోర్ట్స్ కమిటీ సభ్యురాలు శోభ ఇళ్లల్లో సైతం సోదాలు నిర్వహించారు. గతేడాది తెలంగాణ స్పోర్ట్స్ కోటాలో మెడికల్ సీట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు రావడంతో సీఎం ఆదేశాలతోనే శాప్ డిప్యూటీ డైరెక్టర్ వెంకట రమణ ఇంట్లో దాడులు నిర్వహించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. తొమ్మిది సభ్యులతో కూడిన కమిటీ అర్హులైన వారికి అన్యాయం చేసి, నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. ఇలా ఎంతమందికి నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారన్న విషయంపై విచారణ జరుపుతున్నామని, దర్యాప్తు పూర్తైన వెంటనే ఉన్నతాధికారికి నివేదిక సమర్పిస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. -
అటు పరుగు... ఇటు పరుగు!
సాక్షి, హైదరాబాద్: ఒలింపిక్ స్ఫూర్తిని చాటాల్సిన చోట క్రీడా స్ఫూర్తి కనిపించకుండా పోయింది. ఒలింపిక్ డే గొప్పతనం గురించి చెప్పాల్సిన చోట రాజకీయాలు వచ్చేశాయి. పోటాపోటీగా ఒలింపిక్ రన్‌ను నిర్వహించడంలో తెలంగాణలోని రెండు ఒలింపిక్ సంఘాలు తమ పట్టుదలను ప్రదర్శించాయి. వరల్డ్ ఒలింపిక్ డే సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (ఓఏటీ), తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ (టీఓఏ) పోటాపోటీగా రెండు రన్లు నిర్వహిం చాయి. జనాలను రన్లో భాగస్వాములను చేయడంలో మాత్రం ఇరు వర్గాలు కొంత వరకు సఫలం అయ్యాయి. రెండు సంఘాలు హైదరాబాద్‌లోని ఆరేసి కేంద్రాలనుంచి పరుగు నిర్వహించాయి. పలువురు మాజీ, వర్ధమాన ఆటగాళ్లు పరుగులో పాల్గొని క్రీడాజ్యోతులను ఎల్బీ స్టేడియానికి తీసుకు వచ్చారు. రంగారావు నేతృత్వంలోని ఓఏటీ తమ రన్ ముగింపు కార్యక్రమాన్ని ఎల్బీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్స్) మేనేజింగ్ డెరైక్టర్ ఇందులో పాల్గొనడం విశేషం. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు బీవీ పాపారావు హాజరయ్యారు. మాజీ ఆటగాళ్లు ముకేశ్‌కుమార్, జుల్ఫికర్, మీర్ ఖాసిం అలీ, ముళినీరెడ్డి, ఎస్ఎం ఆరిఫ్ తదితరులు ఇక్కడ కనిపించారు. మరో వైపు ఎల్బీ ప్రధాన గ్రౌండ్లో టీఓఏ ముగింపు ఉత్సవం జరిగింది. క్రీడాకారుల్లో నైనా జైస్వాల్, ఎడ్వర్డ్, అలోయిసిస్, రవీనా, రోయింగ్ కోచ్ ఇస్మాయిల్ బేగ్ తదితరులు ఈ వేదికపై ఉన్నారు. టీఓఏ అధ్యక్షుడు జితేందర్ రెడ్డితో పాటు ఇద్దరు శాసనసభ్యులు ఇందులో పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమానికి సంబంధించి ఇరు వర్గాలు క్రీడా శాఖ మంత్రి టి.పద్మారావును ఆహ్వానించినా, ఏదో ఒక దానికి హాజరైతే వివాదం అవుతుందనే ఉద్దేశ్యంతో ఆయన పూర్తిగా దూరంగా ఉన్నట్లు తెలిసింది. -
జట్టు ప్రదర్శనతో గర్వంగా ఉన్నా!
మా వ్యూహాలు ఫలించాయి భవిష్యత్తులో మరిన్ని పతకాలు పుల్లెల గోపీచంద్ విజయానందం సాక్షి, హైదరాబాద్: గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్ల ప్రదర్శన పట్ల జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మెగా ఈవెంట్లో తమ వ్యూహాలు ఫలించాయని, ఫలితంగా నాలుగు పతకాలు గెలుచుకోగలిగామని ఆయన అన్నారు. కామన్వెల్త్లో విజయానంతరం స్వర్ణ పతక విజేత పారుపల్లి కశ్యప్, కాంస్యం గెలిచిన గురుసాయిదత్, పీవీ సింధులతో కలిసి గోపీచంద్ మంగళవారం నగరానికి చేరుకున్నారు. గచ్చిబౌలిలోని అకాడమీలో జరిగిన మీడియా సమావేశంలో గోపీచంద్ తన విజయానందాన్ని పంచుకున్నారు. అంతకు ముందు శంషాబాద్ విమానాశ్రయంలో బ్యాడ్మింటన్ క్రీడాకారులకు ఘన స్వాగతం లభించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అధికారులు గోపీచంద్ బృందానికి స్వాగతం పలికారు. ఆ తర్వాత గోపీచంద్ అకాడమీలో కూడా వేడుకలు జరిగాయి. ఆటగాళ్లను ప్రత్యేక రథంపై ఊరేగిస్తూ తీసుకు రాగా... బాణాసంచా కాల్చి వర్ధమాన ఆటగాళ్లు, అకాడమీ స్టాఫ్ సంబరాలు నిర్వహించారు. కశ్యప్‌పై నమ్మకం నిజమైంది బ్యాడ్మింటన్ సర్క్యూట్లో నిలకడగా రాణిస్తే ఎప్పుడైనా భారీ విజయాలు దక్కుతాయని, ఇప్పుడు కశ్యప్ విషయంలో అది రుజువైందని గోపీచంద్ అన్నారు. ‘ఫైనల్లో మేం అనుకున్న వ్యూహం ప్రకారమే కశ్యప్ ఆడాడు. ఎక్కడా దానిని తప్పలేదు. ఈ పెద్ద విజయం కశ్యప్‌కు చాలా అవసరం. దానిని అతను సాధించాడు’ అని ఆయన చెప్పారు. సెమీస్‌లో ఓడిన కొద్ది సేపటికే మూడో స్థానం కోసం ఆడాల్సి వచ్చిందని, ఆ సమయంలో ఓటమిని మరచి, తర్వాతి మ్యాచ్‌లో విజయం సాధించడం అంత సులువు కాదని... గురుసాయిదత్, సింధు ఈ ఘనత సాధించడం విశేషమన్నారు. జ్వాల- అశ్వినిలు కూడా బాగా ఆడారని, తన దృష్టిలో వారి సెమీఫైనల్ మ్యాచ్ ప్రదర్శన అత్యుత్తమమని గోపీచంద్ చెప్పారు. క్వార్టర్స్ ఉత్తమం: గురుసాయి తొలి సారి పెద్ద ఈవెంట్లో పతకం గెలవడం పట్ల గురుసాయిదత్ ఆనందం వ్యక్తం చేశాడు. ‘గెలుపు అనుభూతి చాలా అద్భుతంగా ఉంది. నిజానికి ఫైనల్‌కు కూడా చేరగలననే భావించాను. ఇప్పుడు సాధ్యం కాకపోయినా వచ్చేసారి సాధిస్తాను. ముఖ్యంగా క్వార్టర్స్‌లో టాప్ సీడ్‌ను ఓడించడం ప్రత్యేకంగా అనిపించింది. అకాడమీలో సహచరులతో శిక్షణ వల్లే నా విజయం సాధ్యమైంది’ అని అతను చెప్పాడు. అసంతృప్తి లేదు: సింధు తొలిసారి కామన్వెల్త్లో పాల్గొన్న సింధు కాంస్య పతకం గెలుచుకుంది. ‘స్వర్ణం గెలుచుకోకపోవడం సహజంగానే కొంత నిరాశకు గురి చేసింది. అయితే కాంస్యంతో సంతృప్తిగా ఉన్నా. సెమీ ఫైనల్ మ్యాచ్ గెలవాల్సింది. కాంస్యం కోసం మానసికంగా సిద్ధం కాలేదు. అయితే కోచ్ ప్రోత్సాహంతో మ్యాచ్ గెలుచుకోగలిగాను’ అని సింధు పేర్కొంది.