ఏసీబీ విచారణకు సహకరిస్తున్నాం.. | Dinakar Babu Says Full Cooperation To ACB Inquiry | Sakshi
Sakshi News home page

ఎవరు డబ్బులు తీసుకున్న శిక్షార్హులే..

Published Thu, Jun 7 2018 1:55 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

Dinakar Babu Says Full Cooperation To ACB Inquiry - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ స్పోర్ట్స్‌ కోటాలో గత సంవత్సరం మెడికల్‌ సీట్లు అమ్ముకున్నారనే ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ అధికారుల ఇళ్లపై దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఏసీబీ విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని సాట్స్‌ ఎండీ దినకర్‌ బాబు చెప్పారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. సాట్స్‌లో అక్రమాలు జరగలేదని పేర్కొన్నారు. కొంతమంది అధికారులు చేసిన తప్పులకు క్రీడాకారులు బలయ్యారని తెలిపారు.

‘ ఫెన్సింగ్‌ని 2016లోనే కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఫెన్సింగ్‌ బాండ్‌ కారణంగానే ఫెన్సింగ్‌ సర్టిఫికెట్లను పరిగణలోకి తీసుకోలేదు. ఏ విధమైన ప్రాక్టీస్‌ లేని వాళ్లను అసోసియేషన్‌లో ఎంపిక చేస్తున్నారు. ఏసీబీ వాళ్లు అడిగిన అన్ని వివరాలకి సమాధానం ఇచ్చాం. అసోసియేషన్‌లో ఉన్న లోపాల వల్ల క్రీడా విద్యార్థులకు న్యాయం జరగడం లేదు. అసోసియేషన్‌ లే బాక్‌ డోర్‌ను ప్రోత్సహిస్తున్నాయి. సాట్స్‌ ద్వారా ఒక్క క్రీడాకారునికి కూడా అన్యాయం జరగలేదు. ఇప్పటికీ ప్రభుత్వం రెండుసార్లు కమిటీలు వేసి విచారణ జరిపింది. వాటిలో కొన్ని లోపాలు బయటపడ్డాయని’ సాట్స్‌ ఎండీ పేర్కొన్నారు.

ఇటాంటి ఘటనలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా కొత్త విధానాన్ని రూపొందించబోతున్నామని ఎండీ చెప్పారు. ‘అసోసియేషన్‌ సెలెక్షన్ల ప్రాసెస్‌ పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది. ఎవరికి నచ్చినట్లుగా వాళ్లు ఎంపిక చేసుకుని టీంలను పంపిస్తున్నారు. కొన్ని అసోసియేషన్లను ప్రభుత్వాలు నిషేధించినప్పటికీ అవి కొనసాగుతూ టీం సెలక్షన్‌ చేస్తున్నాయి. సాట్స్‌లో ఎవరు డబ్బులు తీసుకున్న శిక్షార్హులే. ప్రతి ఏడాది కొన్ని వందలమందిని సెలక్షన్‌ చేసి పంపిస్తున్నారు. ఏసీబీ విచారణ పూర్తికాగానే ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో నివేదిక సమర్పిస్తాం. తప్పుడు వ్యక్తులు టీమ్‌లోకి వచ్చినా వెంటనే వాళ్లను నిషేధిస్తున్నామని’ సాట్స్‌ ఎండీ తెలిపారు.

ఆరోపణలు చేస్తున్న ఆ నలుగురు క్రీడా విద్యార్థుల వ్యవహారంలో నేను సరిగానే వ్యవహరించానన్నారు. వాళ్ళని అసోసియేషన్లు తప్పుదోవ పట్టించాయని ఆయన చెప్పారు. భాగ్యశ్రీతో పాటుగా మరికొందరి విషయంలో మాకు చాలా బాధాకరంగా ఉందని చెప్పారు. నిషేధించిన ఫెన్సింగ్‌ సర్టిఫికెట్‌ తీసుకువచ్చి మెరిట్‌ జాబితాలో పెట్టమంటే చాలా కష్టమని సాట్స్‌ ఎండీ దినకరన్‌ పేర్కొన్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement