జట్టు ప్రదర్శనతో గర్వంగా ఉన్నా!
మా వ్యూహాలు ఫలించాయి
భవిష్యత్తులో మరిన్ని పతకాలు
పుల్లెల గోపీచంద్ విజయానందం
సాక్షి, హైదరాబాద్: గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్ల ప్రదర్శన పట్ల జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మెగా ఈవెంట్‌లో తమ వ్యూహాలు ఫలించాయని, ఫలితంగా నాలుగు పతకాలు గెలుచుకోగలిగామని ఆయన అన్నారు. కామన్వెల్త్‌లో విజయానంతరం స్వర్ణ పతక విజేత పారుపల్లి కశ్యప్, కాంస్యం గెలిచిన గురుసాయిదత్, పీవీ సింధులతో కలిసి గోపీచంద్ మంగళవారం నగరానికి చేరుకున్నారు.
గచ్చిబౌలిలోని అకాడమీలో జరిగిన మీడియా సమావేశంలో గోపీచంద్ తన విజయానందాన్ని పంచుకున్నారు. అంతకు ముందు శంషాబాద్ విమానాశ్రయంలో బ్యాడ్మింటన్ క్రీడాకారులకు ఘన స్వాగతం లభించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అధికారులు గోపీచంద్ బృందానికి స్వాగతం పలికారు. ఆ తర్వాత గోపీచంద్ అకాడమీలో కూడా వేడుకలు జరిగాయి. ఆటగాళ్లను ప్రత్యేక రథంపై ఊరేగిస్తూ తీసుకు రాగా... బాణాసంచా కాల్చి వర్ధమాన ఆటగాళ్లు, అకాడమీ స్టాఫ్ సంబరాలు నిర్వహించారు.
కశ్యప్‌పై నమ్మకం నిజమైంది
బ్యాడ్మింటన్ సర్క్యూట్‌లో నిలకడగా రాణిస్తే ఎప్పుడైనా భారీ విజయాలు దక్కుతాయని, ఇప్పుడు కశ్యప్ విషయంలో అది రుజువైందని గోపీచంద్ అన్నారు. ‘ఫైనల్లో మేం అనుకున్న వ్యూహం ప్రకారమే కశ్యప్ ఆడాడు. ఎక్కడా దానిని తప్పలేదు. ఈ పెద్ద విజయం కశ్యప్‌కు చాలా అవసరం.
దానిని అతను సాధించాడు’ అని ఆయన చెప్పారు. సెమీస్‌లో ఓడిన కొద్ది సేపటికే మూడో స్థానం కోసం ఆడాల్సి వచ్చిందని, ఆ సమయంలో ఓటమిని మరచి, తర్వాతి మ్యాచ్‌లో విజయం సాధించడం అంత సులువు కాదని... గురుసాయిదత్, సింధు ఈ ఘనత సాధించడం విశేషమన్నారు. జ్వాల- అశ్వినిలు కూడా బాగా ఆడారని, తన దృష్టిలో వారి సెమీఫైనల్ మ్యాచ్ ప్రదర్శన అత్యుత్తమమని గోపీచంద్ చెప్పారు.
క్వార్టర్స్ ఉత్తమం: గురుసాయి
తొలి సారి పెద్ద ఈవెంట్‌లో పతకం గెలవడం పట్ల గురుసాయిదత్ ఆనందం వ్యక్తం చేశాడు. ‘గెలుపు అనుభూతి చాలా అద్భుతంగా ఉంది. నిజానికి ఫైనల్‌కు కూడా చేరగలననే భావించాను. ఇప్పుడు సాధ్యం కాకపోయినా వచ్చేసారి సాధిస్తాను. ముఖ్యంగా క్వార్టర్స్‌లో టాప్ సీడ్‌ను ఓడించడం ప్రత్యేకంగా అనిపించింది. అకాడమీలో సహచరులతో శిక్షణ వల్లే నా విజయం సాధ్యమైంది’ అని అతను చెప్పాడు.
అసంతృప్తి లేదు: సింధు
తొలిసారి కామన్వెల్త్‌లో పాల్గొన్న సింధు కాంస్య పతకం గెలుచుకుంది. ‘స్వర్ణం గెలుచుకోకపోవడం సహజంగానే కొంత నిరాశకు గురి చేసింది. అయితే కాంస్యంతో సంతృప్తిగా ఉన్నా. సెమీ ఫైనల్ మ్యాచ్ గెలవాల్సింది. కాంస్యం కోసం మానసికంగా సిద్ధం కాలేదు. అయితే కోచ్ ప్రోత్సాహంతో మ్యాచ్ గెలుచుకోగలిగాను’ అని సింధు పేర్కొంది.