గతేడాదిలో జరిగిన పారాలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు టీ-20 విభాగంలో కాంస్య పతకం సాధించిన తెలంగాణ బిడ్డ జీవాంజీ దీప్తిని చిరంజీవి అభినందించారు. ఈ విషయన్ని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఇలా తెలిపారు.
'ఇటీవల మన తెలుగు రాష్ట్రాల నుంచి పారా అథ్లెట్ ఒలింపిక్స్‌లో దీప్తి జీవాంజి కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ అనే చిన్న గ్రామంలో జన్మించిన జీవాంజీ దీప్తి దేశానికి ఎంతో పేరు తెచ్చింది. అయితే, ఒలింపిక్స్‌లో మెడల్ సాధించిన సందర్భంగా మీకేం కావాలని నేను ఆమెను అడిగినప్పుడు, చిరంజీవి గారిని కలవాలని ఉందని చెప్పారు. ఇటీవల నేను చిరంజీవిగారిని ఓ సందర్భంలో కలిసినప్పుడు దీప్తి జవాంజి గురించి చెప్పాను. ఆయన చాలా గొప్ప మనసుతో స్పందించారు.
చాలా పెద్ద అచీవ్‌మెంట్ చేసినప్పుడు, ఆమె రావటం కాదు, నేను అకాడమీకి వస్తానని అన్నారు. అన్నట్లుగానే చిరంజీవిగారు మా అకాడమీకి వచ్చి, అక్కడున్న పిల్లలందరినీ కలిశారు. రెండు గంటల పాటు అక్కడే గడిపారు. అలాగే ప్రతి ప్లేయర్‌ని ఇన్‌స్పైర్ చేసే విధంగా మాట్లాడారు. ఇదే సందర్భంలో ఆయన మూడు లక్షల రూపాయల చెక్‌ను దీప్తికి అందించటం మాకెంతో సంతోషాన్నిచ్చింది. ఇది మా క్రీడాకారులకు చిరంజీవిగారు ఇచ్చిన గొప్ప గౌరవంగా నేను భావిస్తాను. ఈ ఇన్‌స్పిరేషన్‌తో చాలా మంది మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని నేను భావిస్తున్నాను.' అని ఆయన అన్నారు.
దీప్తికి గ్రూప్-2 ఉద్యోగంతో పాటు రూ. కోటి
2024లో పారిస్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో జీవాంజీ దీప్తి మహిళల 400 మీటర్ల టీ-20 విభాగంలో దీప్తి కాంస్యం సాధించారు. పారాలింపిక్స్ అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన క్రీడాకారిణిగా ఆమె చరిత్ర సృష్టించింది. దీంతో ఆమెపై దేశవ్యాప్తంగా చాలామంది ప్రశంసలు కురిపించారు. ఆమె విజయంలో పుల్లెల గోపీచంద్ పాత్ర చాలా కీలకంగా ఉంది. ఆమెకు తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి ప్రకటించింది. ఆపై దీప్తికి గ్రూప్-2 ఉద్యోగంతో పాటు వరంగల్‌లో 500 గజాల స్థలం ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే.
కూతురి కోసం పొలం అమ్మేసిన తండ్రి
జీవాంజీ దీప్తి తల్లిదండ్రులు యాదగిరి, లక్ష్మిల శ్రమ ఆమె విజయంలో ఎక్కువగా ఉంది. నిరుపేద కుటుంబానికి చెందిన దీప్తి మానసిక వైకల్యంతో చాలా ఇబ్బందులు పడింది. మేధోపరమైన బలహీనత ఉండడంతో ఆమె కోసం తండ్రి యాదగిరి చాలా తల్లడిల్లిపోయారు. చిన్నతనంలో కూతురుకు ఫిట్స్ వస్తే వారు విలవిలలాడిపోయేవారు. అయితే, దీప్తి క్రీడల్లో మాత్రం చాలా చురుకుగా ఉండేది. దీంతో ఆమె సంతోషం కోసం ఆ తండ్రి డబ్బులకు వెనకాడలేదు. తనకున్న ఎకరం పొలాన్ని కూతురి కోసం అమ్మేశారు. తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహంతో దీప్తి తిరుగులేని విజయాన్ని దేశానికి అందించింది.
Comments
Please login to add a commentAdd a comment