అటు పరుగు... ఇటు పరుగు!
సాక్షి, హైదరాబాద్: ఒలింపిక్ స్ఫూర్తిని చాటాల్సిన చోట క్రీడా స్ఫూర్తి కనిపించకుండా పోయింది. ఒలింపిక్ డే గొప్పతనం గురించి చెప్పాల్సిన చోట రాజకీయాలు వచ్చేశాయి. పోటాపోటీగా ఒలింపిక్ రన్‌ను నిర్వహించడంలో తెలంగాణలోని రెండు ఒలింపిక్ సంఘాలు తమ పట్టుదలను ప్రదర్శించాయి. వరల్డ్ ఒలింపిక్ డే సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (ఓఏటీ), తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ (టీఓఏ) పోటాపోటీగా రెండు రన్‌లు నిర్వహిం చాయి. జనాలను రన్‌లో భాగస్వాములను చేయడంలో మాత్రం ఇరు వర్గాలు కొంత వరకు సఫలం అయ్యాయి.
రెండు సంఘాలు హైదరాబాద్‌లోని ఆరేసి కేంద్రాలనుంచి పరుగు నిర్వహించాయి. పలువురు మాజీ, వర్ధమాన ఆటగాళ్లు పరుగులో పాల్గొని క్రీడాజ్యోతులను ఎల్బీ స్టేడియానికి తీసుకు వచ్చారు. రంగారావు నేతృత్వంలోని ఓఏటీ తమ రన్ ముగింపు కార్యక్రమాన్ని ఎల్బీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్స్) మేనేజింగ్ డెరైక్టర్ ఇందులో పాల్గొనడం విశేషం. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు బీవీ పాపారావు హాజరయ్యారు.
మాజీ ఆటగాళ్లు ముకేశ్‌కుమార్, జుల్ఫికర్, మీర్ ఖాసిం అలీ, ముళినీరెడ్డి, ఎస్‌ఎం ఆరిఫ్ తదితరులు ఇక్కడ కనిపించారు. మరో వైపు ఎల్బీ ప్రధాన గ్రౌండ్‌లో టీఓఏ ముగింపు ఉత్సవం జరిగింది. క్రీడాకారుల్లో నైనా జైస్వాల్, ఎడ్వర్డ్, అలోయిసిస్, రవీనా, రోయింగ్ కోచ్ ఇస్మాయిల్ బేగ్ తదితరులు ఈ వేదికపై ఉన్నారు. టీఓఏ అధ్యక్షుడు జితేందర్ రెడ్డితో పాటు ఇద్దరు శాసనసభ్యులు ఇందులో పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమానికి సంబంధించి ఇరు వర్గాలు క్రీడా శాఖ మంత్రి టి.పద్మారావును ఆహ్వానించినా, ఏదో ఒక దానికి హాజరైతే వివాదం అవుతుందనే ఉద్దేశ్యంతో ఆయన పూర్తిగా దూరంగా ఉన్నట్లు తెలిసింది.