సాక్షి, హైదరాబాద్ : గతేడాది స్పోర్ట్స్ కోటాలో మెడికల్ సీట్లు అమ్ముకున్నారనే ఆరోపణల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) బుధవారం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారుల ఇళ్లపై ఒకేసారి మెరుపు దాడులు నిర్వహించింది. ఎల్బీనగర్, సరస్వతి నగర్ కాలనీలోని స్పోర్ట్స్ అథారిటీ సైక్లింగ్ కోచ్ గుర్రం చంద్రారెడ్డి నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించి విలువైన డాక్యుమెంట్లు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే శాప్ డిప్యూటీ డైరెక్టర్ వెంకట రమణ, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ విమలాకర్ రావు, స్పోర్ట్స్ కమిటీ సభ్యురాలు శోభ ఇళ్లల్లో సైతం సోదాలు నిర్వహించారు.
గతేడాది తెలంగాణ స్పోర్ట్స్ కోటాలో మెడికల్ సీట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు రావడంతో సీఎం ఆదేశాలతోనే శాప్ డిప్యూటీ డైరెక్టర్ వెంకట రమణ ఇంట్లో దాడులు నిర్వహించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. తొమ్మిది సభ్యులతో కూడిన కమిటీ అర్హులైన వారికి అన్యాయం చేసి, నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. ఇలా ఎంతమందికి నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారన్న విషయంపై విచారణ జరుపుతున్నామని, దర్యాప్తు పూర్తైన వెంటనే ఉన్నతాధికారికి నివేదిక సమర్పిస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment