హబ్సిగూడలోని శాట్స్ డిప్యూటీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న దృశ్యం. (ఇన్‌సెట్‌లో) వెంకటరమణ
సాక్షి, హైదరాబాద్ : ఆటగాళ్ల భవిష్యత్తుతో ఆడుకున్నారు. అర్హుల జాబితాను అమ్ముకున్నారు. మెడిసిన్ సీట్లలో స్పోర్ట్స్ కోటా ప్రయారిటీ లిస్ట్‌లకు వెలకట్టారు. క్రీడాకారులకు, వారి సంబంధీకులకు వీటిని అందించడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ (శాట్స్) డిప్యూటీ డైరెక్టర్ జి.వెంకటరమణ లంచం డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అవకతవకలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)ను ఆదేశించారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు బుధవారం వెంకటరమణను అరెస్టు చేశారు. ఆయన ఇల్లు, కార్యాలయంతోపాటు మొత్తం ఐదు ప్రాంతాల్లోని శాట్స్ సంబంధీకుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు.
ఈ ప్రయారిటీ లిస్టులు, సర్టిఫికెట్లను నిబంధనల ప్రకారం జారీ చేయట్లేదని శాట్స్ ఏ అండ్ ఎస్‌ఎస్ ఇన్‌చార్జ్ కె.మనోహర్, డిప్యూటీ డైరెక్టర్ (సీ అండ్ ఏ) జీఏ శోభ, అడ్మినిస్ట్రేటర్లు జి.చంద్రారెడ్డి, విలమలాకర్‌రావులపై ఆరోపణలు రావడంతో వారి ఇళ్ళల్లోనూ సోదాలు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ రమణకుమార్ వెల్లడించారు. స్పోర్ట్స్ కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ కోసం అవసరమైన ప్రయారిటీ లిస్టులకు భారీ డిమాండ్ ఉంటుంది. ఏ ఆట క్రీడాకారుడికి ఎంత ర్యాంక్ వస్తే, ఏ కోర్సులో సీటు వచ్చే ఆస్కారం ఉందనేది ఈ జాబితాల్లో ఉంటుంది. మెడిసిన్ ప్రవేశపరీక్ష రాసి కౌన్సెలింగ్ కోసం ఎదురు చూస్తున్న క్రీడాకారులు నిత్యం శాట్స్ నుంచి ఈ జాబితాలు తీసుకుంటారు. అందులోని ప్రయారిటీ ప్రకారం తమకు మెడిసిన్‌లో స్పోర్ట్స్ కోటాలో సీటు రాదని భావిస్తే మరో కోటాలో దరఖాస్తు చేసుకుంటుంటారు. దీన్నే కొందరు శాట్స్ అధికారులు క్యాష్ చేసుకోవడం ప్రారంభించారు.
2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రయారిటీ లిస్ట్ జారీకి డిప్యూటీ డైరెక్టర్ జి.వెంకటరమణ రూ.లక్ష లంచం డిమాండ్ చేశారనేది ఆరోపణ. క్రీడాకారులైన భరత్ చంద్రారెడ్డి , వర్షితా రాజ్‌ల ఫిర్యాదు మేరకు ఏసీబీ ఈ కేసు నమోదు చేసింది. స్పోర్ట్స్ కోటాలో మెడికల్ సీట్లు పొందడానికి అవసరమైన ప్రయారిటీల జారీలో అవకతవకలు జరిగాయని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇవి జరగట్లేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు దీనిపై ప్రాథమిక విచారణ చేస్తున్న ఏసీబీకి భరత్‌చంద్రారెడ్డి తండ్రి సత్యనారాయణ నుంచి గత నెల 25న మరో ఫిర్యాదు అందింది. ఇందులో తనకు స్పోర్ట్స్ కోటా ప్రయారిటీ లిస్ట్ జారీ చేయడానికి వెంకటరమణ గతేడాది ఆగస్టులో రూ.లక్ష లంచం డిమాండ్ చేసి తీసుకున్నారని అందులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసిన ఏసీబీ రంగంలోకి దిగి లోతుగా ఆరా తీసింది.
మొత్తం 9 మంది సభ్యులు గల కమిటీ ఈ ప్రయారిటీ లిస్ట్ తయారు చేసినప్పటికీ డిప్యూటీ డైరెక్టర్ వెంకటరమణది కీలక పాత్రగా ఏసీబీ పేర్కొంది. మొత్తం ఎంత మంది నుంచి ఈ మొత్తం వసూలు చేశారనేదానిపై ఆరా తీస్తున్నారు. ఈ జాబితాల తయారీలోనూ అవకతవకలు జరిగినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. వెంకటరమణతో పాటు కమిటీ సభ్యులైన మనోహర్, శోభ, గుర్రం చంద్రారెడ్డి, విమలాకర్‌రావులపై ఈ ఆరోపణలు ఉన్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ బృందాలు హబ్సిగూడ రవీంద్రనగర్‌లోని వెంకటరమణ, శోభ ఇళ్లల్లో సోదాలు చేశారు. డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ సోదాలు నిర్వహించారు. మన్సూరాబాద్ డివిజన్ సరస్వతినగర్ కాలనీలో నివసించే చంద్రారెడ్డి, బాగ్‌లింగంపల్లిలోని ఎంఐజీ–2లో గల డి.విమలాకర్‌రావు ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఈయన కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వహిస్తున్నారు.
ఎల్బీ స్టేడియంలోని స్పోర్ట్స్ కమిటీ సభ్యుల కార్యాలయాల్లో దాడులు నిర్వహించారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి వరకు సోదాలు చేశారు. అక్కడి వెంకటరమణ, శోభల చాంబర్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా పలు కీలక ఫైళ్లు, హార్డ్‌డిస్క్‌లు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన వెంకటరమణను జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి ప్రజల వద్ద ఏవైనా ఫిర్యాదులు, ఆధారాలు ఉంటే తమను సంప్రదించాలని ఏసీబీ అధికారులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment