కానిస్టేబుల్ నియామకాల్లో అక్రమాల్లేవు
⇒ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ పూర్ణచందర్రావు
⇒ అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో వివరణ
⇒ రిజర్వేషన్లు, కటాఫ్‌ల ప్రకారమే ఎంపిక
⇒ సందేహాలుంటే ‘ఓపెన్ చాలెంజ్’ చేసుకోవచ్చని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్ నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ పూర్ణచందర్రావు స్పష్టంచేశారు. ఒక్కో కేటగిరీకి ఒకో విధంగా మార్కుల కటాఫ్ ఉంటుందని, ఈ విషయంలో అనుమానాలున్న అభ్యర్థులు తమ వెబ్‌సైట్‌ను పరిశీలించి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు సోమవారం డీజీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. తమకన్నా తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులకు ఉద్యోగాలు రావడంపై ఆవేదన వ్యక్తంచేశారు. ఒకే కేటగిరీ ఉన్నా, తమ కన్నా తక్కువ మార్కులు వచ్చిన వ్యక్తి ఎలా ఎంపికయ్యాడో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళనపై స్పందించిన డీజీపీ అనురాగ్‌శర్మ, కటాఫ్ మార్కులు, రిజర్వేషన్లు, తదితర విషయాలపై అభ్యర్థులకు వివరాలు తెలపాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ పూర్ణచందర్‌రావును ఆదేశించారు. ఈ మేరకు పూర్ణచందర్రావు ఎస్పీ రమేశ్‌రెడ్డితో కలసి మీడియాతో మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సోయం శ్రీకాంత్ అనే అభ్యర్థి ఎస్టీలో మరింత వెనుకబడిన కేటగిరీ అనీ, అందుకే ఆ కేటగిరీ కింద ఉన్న సివిల్ విభాగంలో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడని ఆయన తెలిపారు. ఎస్టీ కేటగిరీలోనే అతడి కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వారు తాము పెట్టే కటాఫ్ మార్కులు చూసుకుంటే తేడా తెలిసిపోతుందని తెలిపారు.
సోమవారం రాత్రి సివిల్, ఏఆర్, స్పెషల్ పోలీస్, ఎస్పీఎఫ్, ఫైర్‌మెన్, తదితర కేటగిరీల్లో కటాఫ్ మార్కులను అధికారిక వెబ్సైట్లో పెడతామని, ఆ వివరాలు చూస్తే అభ్యర్థుల సందేహాలు నివృత్తి అవుతాయని చైర్మన్ స్పష్టంచేశారు. ప్రతీ జిల్లాకు, యూనిట్‌కు కటాఫ్ విధానం వేర్వేరుగా ఉంటుందని, పది జిల్లాల్లో పది రకాల కటాఫ్ పద్దతులు పాటించామని, అదే విధంగా పోలీస్ కుటుంబాల పిల్లలు, స్పోర్ట్స్ కోటా, ఎన్సీసీ, హోంగార్డు.. ఇలా ఇతర కేటగిరీల రిజర్వేషన్లలో కటాఫ్‌లు మరో రకంగా ఉంటాయని తెలిపారు. అభ్యర్థులు తమ కటాఫ్ మార్కుల వివరాలను పరిశీలించుకుంటే సందేహాలు నివృత్తి అవుతాయని స్పష్టంచేశారు. ఎంపిక జాబితా బయటపెట్టిన తర్వాత ఓపెన్ చాలెంజ్ విధానం ఉండదని, కానీ అభ్యర్థుల ఆవేదనను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 24 నుంచి అభ్యర్థులకు ఓపెన్ చాలెంజ్ విధానాన్ని వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని చైర్మన్ స్పష్టంచేశారు. అక్కడ కూడా అభ్యర్థులకు సందేహాలుంటే న్యాయస్థానాలకు వెళ్లే అవకాశం కూడా ఉందని తెలిపారు.