పేరులోనే రాజసం .. సేవల్లో నీరసం | VIP Reporter rims Director T Jaya Raj | Sakshi
Sakshi News home page

పేరులోనే రాజసం .. సేవల్లో నీరసం

Published Sun, Dec 7 2014 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM

పేరులోనే రాజసం .. సేవల్లో నీరసం

పేరులోనే రాజసం .. సేవల్లో నీరసం

 సమస్యల పరిష్కారానికి  కృషి చేస్తా
 రిమ్స్‌లో పలు సమస్యలున్నట్లు గుర్తించాను. వాటి పరిష్కారానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తా. ముఖ్యంగా మెటర్నిటీ వార్డులో ఒకే పడకపై ఇద్దరు బాలింతలు ఉండటం ఇబ్బందికరమే. ఈ సమస్యను పరిష్కారిస్తా. నిర్మాణంలో ఉన్న మూడు బ్లాకుల పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూస్తాం. మిగిలిన నాలుగు బ్లాకుల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదిక పంపుతాను. ఆస్పత్రిలో శానిటేషన్ లోపం కనిపించింది. దీనిపై కూడా దృష్టి పెడతాను. సదరం ధ్రువపత్రాల్లో కొన్ని నకిలీవి  వస్తున్నాయి. వాటిని గుర్తించి సంబంధిత అధికారులతో విచారణ జరిగేలా చూస్తాం. ఈ మేరకు డీఆర్‌డీఏ వాళ్లకు నివేదిక పంపుతాం. ఆస్పత్రికి ప్రహరీ గోడ లేకపోవటంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీని నిర్మాణానికి నిధులు మంజురయ్యాయి. పనులు త్వరగా జరిగేలా చూస్తాను.
 
 రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(రిమ్స్).. పేరులో రాజసం ఉట్టిపడే ఈ సంస్థ సేవల్లో మాత్రం నీరసంగానే ఉంటోంది. ఏళ్లు గడుస్తున్నా ఇంకా పూర్తికాని భవనాల నిర్మాణాలు, పూర్తిస్థాయిలో అందుబాటులో లేని స్పెషాలిటీ విభాగాలు, వైద్య నిపుణులు, సిబ్బంది కొరత, అధునాతన సౌకర్యాల లేమి.. ఎక్కడికక్కడ పారిశుద్ధ్యలోపం.. ఇలా ఎన్నో సమస్యలతో రిమ్స్ నీరసించిపోతోంది. జిల్లాలో పెద్దాస్పత్రి అయిన ఇక్కడికి రోజూ వందల సంఖ్యలో వచ్చే పేద రోగులు నాణ్యమైన, పూర్తిస్థాయి వైద్యసేవలు అందక ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీయాల్సి వస్తోంది. వీటికి తోడు గత ఏడు నెలలుగా స్టైపెండ్ అందక జూనియర్ డాక్టర్లు మనస్ఫూర్తిగా పని చేయలేకపోతున్నారు. ఈ లోపాలు, సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు రిమ్స్ డెరైక్టర్ టి.జయరాజ్ రిపోర్టర్‌గా మారారు. ‘సాక్షి’ తరపున వీఐపీ రిపోర్టరుగా ఆస్పత్రి అంతటా కలియదిరిగారు. రోగులు, ఉద్యోగుల సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు. ఆ వివరాలు..
 
 మెటర్నిటీ వార్డులో..
 డెరైక్టర్: డాక్టరు గారు.. మీ వార్డులో ఎంత మంది వైద్యులున్నారు. నెలకెన్ని కేసులు చేస్తుంటారు?
 డాక్టరు శశికళ: మా వార్డులో మొత్తం పది మంది వైద్యులం ఉన్నాం సార్. నెలకు సుమారు 420 కేసుల వరకు వస్తుంటాయి. వాటన్నింటిని సిబ్బంది సహకారంతో విజయవంతంగా చేస్తున్నాం.
 డెరైక్టర్: ఏమైనా సమస్యలున్నాయా?
 డాక్టరు శశికళ: పడకలు సరిపోవటం లేదు సార్. ఒక్కో పడకపై ఇద్దరేసి గర్భిణులు, బాలింతలను ఉంచాల్సి వస్తోంది.  అలాగే స్టాఫ్‌ను కూడాపెంచితే బాగుంటుంది.
 డెరైక్టర్: ఏమ్మా...ఏ ఊరు మీది?
 కుమారి(గర్భిణి): మాది శ్రీకాకుళం పట్టణమే బాబు.
 డెరైక్టర్: ఆస్పత్రిలో ఎప్పుడు చేరావు. బాగానే చూసుకుంటున్నారా?
 కుమారి: ఈ నెల రెండో తేదీన చేరాను. రక్తం తక్కువగా ఉందని ఉంచారు. బాగానే చూసుకుంటున్నారు. ఇబ్బంది లేదు సార్.
 డెరైక్టర్: ఏమ్మా.. ఒకే పడకపై ఇద్దరు బాలింతలను ఉంచారేంటి?
 హెడ్ నర్స్(విజయ): భవనాలు చాలకపోవటంతో పడకలు తక్కువగా ఉన్నాయి సార్. అందువల్ల ఒకే పడకపై ఇద్దరేసి బాలింతలను ఉంచుతున్నాం.
 డెరైక్టర్: ఏ ఊరమ్మా మీది.. ఆస్పుత్రిలో సేవలేవిధంగా అందుతున్నాయమ్మ?
 ఎం.రోజమ్మ(బాలింత): మాది గార మండలం కొర్ని గ్రామం సార్. ఇక్కడ వైద్య సేవలు బాగానే ఉన్నాయి. కాని ఉండటమే కష్టంగా ఉంది. ఒకే పడకపై ఇద్దరిని ఉంచుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంటుంది.
 ఆర్థోపెడిక్ వార్డులో..
 డెరైక్టర్: డాక్టరు గారు.. మీ వార్డులో ఏమైనా సమస్యలున్నాయా. అసలు ఇక్కడ రోగులకు అందే సేవలేంటి?
 డాక్టర్ రజనీ: మా వార్డులో పెద్దగా సమస్యలేమీ లేవు సార్. ఆర్థోపెడిక్‌కు సంబంధించి ఆరోగ్యశ్రీ కేసులకు ముందు ఇక్కడే చికిత్స అందిస్తున్నాం. ఆరోగ్యశ్రీ అప్రూవల్ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ వార్డుకు తరలిస్తాం. అంత వరకు శస్త్రచికిత్సకు ముందు చికిత్సంతా ఇక్కడే అందిస్తాం.
 డెరైక్టర్: రిఫరల్ కేసులకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా?
 రజనీ: చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. రోగి తరపు వారు వచ్చి ఎందుకు రిఫర్ చేశారో తెలియజేయమంటుంటారు. అయితే కొం త మందికి వైద్యపరంగా మేము చెప్పే విషయాలు అర్థం కావు. అటువంటప్పుడు ఇబ్బంది తప్పటం లేదు. వాళ్లకు తెలియక మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.
 డెరైక్టర్: అసలు కేసులు ఎందుకు రిఫరల్ వెళ్తున్నాయి, సుమారు ఎన్ని ఉండవచ్చు?
 రజనీ: రిమ్స్‌కు వచ్చే కేసుల్లో పది శాతం ఇతర ప్రాంతాలకు రిఫరల్‌గా వెళ్తున్నాయి. ఆయా కేసులకు సంబంధించిన సౌకర్యాలు ఇక్కడ లేకపోవటం వల్లే రిఫర్ చేస్తున్నాం. మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తే రిఫరల్ సమస్య ఉండదు సార్.
 డెరైక్టర్: ఏమయ్యా.. నీ పేరేంటి? నీకేమంది?
 రోగి: నా పేరు లక్ష్మీనాయుడు బాబు. మాది బూర్జ గ్రామమండి. పొలంలో చేను పెరుక్కుని రోడ్డెక్కుతుంటే బండి(స్కూటర్) గుద్దీసింది. ఆస్పత్రిలో సేరి పది రోజులు గడిసిపోనాది బాబు. ఇంత వరకు అపరేషన్ సేయ్యనేదు బాబు.
 డెరైక్టర్: డాక్టరు గారు.. ఇదేంటి వచ్చిన రెండు మూడు రోజుల్లో శస్త్రచకిత్స చేస్తామంటున్నారు కదా. మరి ఇతను వచ్చి పది రోజులైనా ఎందుకు చేయ్యలేదు?
 రజనీ: ఆయన కాళ్లకు ఇన్‌ఫెక్షన్ వచ్చింది సార్. అది నయమైతేగానీ శస్త్రచికిత్స చేయలేం. అందువల్లే ఆలస్యమవుతోంది.
 గైనిక్ వార్డులో..
 డెరైక్టర్: ఏం బాబు.. రోగులకు ఏం ఆహారం ఇస్తున్నావు?(డైట్ సరఫరా చేసే సిబ్బంది నారాయణతో)
 నారాయణ: రోగికివ్వాల్సిన పౌష్టికాహారాన్ని బట్టి ఆ రోజు మెనూ ఉంటుంది సార్. గైనిక్ వార్డుకు సంబంధించి అరటి పండు, రెండు గుడ్లు, రెండు శనగుండలు, భోజనం ఇస్తున్నాం సార్.
 డెరైక్టర్: ఏమ్మా...నీ పేరేంటి?
 బాలింత: నా పేరు స్వాతి సార్.. మా ఊరు చిలకపాలెం సార్.
 డెరైక్టర్: ఎన్నో కాన్పమ్మ?.. ఆస్పత్రిలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి?
 స్వాతి: నాది రెండో కాన్పు సార్. ఆస్పత్రిలో దోమలు విపరీతంగా ఉన్నాయి సార్. అసలు ఉండలేకపోతున్నాం. పిల్లలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. చివరకు బయట డబ్బులిచ్చి దోమ తెరలు కొనుక్కుని పిల్లలకు పెడుతున్నాం సార్. పేదోళ్లమైన మేము ఖర్చు చేయలేకపోతున్నాం. దోమల నివారణకు చర్యలు చేపడితే బాగుంటంది సార్.
 డెరైక్టర్: ఏమ్మా.. మీరు జూనియర్ డాక్టరే కదా.. మీకేమైనా సమస్యలున్నాయా?
 లావణ్య: అవును సార్.. మేము జూనియర్ డాక్టర్లమే. మాకు ఒక్క స్టైపెండ్ సమస్య తప్పితే ఇంకే సమస్యలు లేవు సార్. జూనియర్ డాక్టర్లుగా చేరినప్పటి నుంచి ఇంత వరకు ఒక్క నెల మాత్రమే స్టైపెండ్ ఇచ్చారు. ఇంకా ఏడు నెలల స్టైపెండ్ అందాలి సార్.
 డెరైక్టర్: స్టైపెండ్ కోసం ఇతర జిల్లాల్లో సమ్మె చేస్తున్నారు కదా. మీరు కూడానా...?
 లావణ్య: లేదు సార్. సమ్మె చేసే ఆలోచన ప్రస్తుతం లేదు. కాని స్టైపెండ్ అందకపోవటంతో జూనియర్ డాక్టర్లందరం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ప్రభుత్వం మా సమస్యను గుర్తించి, వెంటనే విడుదల చేస్తే బాగుంటుంది.
 ఆశా వర్కర్లతో..
 డెరైక్టర్: ఏ ఊరు మీది. రిమ్స్‌కు ఎందుకు వచ్చారమ్మా?
 ఆశా వర్కర్లు: సార్.. మాది ఆమదాలవలస. మా పేర్లు శ్రీదేవి, పద్మావతి. మేము ఆశా వర్కర్లుగా పనిచేస్తున్నాం. గర్భిణులను పట్టుకుని ఇక్కడకు వచ్చాం సార్.
 డెరైక్టర్: అలాగా.. ఆస్పత్రిలో ఏమైనా సమస్యలున్నాయా..?
 ఆశా వర్కర్లు: రక్త పరీక్షల రిపోర్టు ఇవ్వటం చాలా ఆలస్యం అవుతోంది సార్. దాని కోసం మళ్లీ రెండో రోజు రావల్సిన పరిస్థితి కొన్ని సందర్భాల్లో ఏర్పడుతోంది. అలా కాకుండా రక్తపరీక్షలు నిర్వహించిన వెంటనే రిపోర్టులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటే బాగుంటుంది సార్.
 నిర్మాణ విభాగం డీఈతో..
 డెరైక్టర్: (నడుచుకుంటూ నిర్మాణంలో ఉన్న కొత్త బ్లాకుల్లోకి వెళ్తూ అక్కడున్న డీఈ శ్రీనివాస్‌తో) సార్...ఏంటీ ఎంత వరకు వచ్చాయి నిర్మాణ పనులు?
 డీఈ: అవుతున్నాయి సార్. త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం సార్.
 డెరైక్టర్: పనుల్లో 45 శాతమే పూర్తి అయ్యాయని, ఇంకా 55 శాతం నిర్మాణాలు జరగాల్సి ఉందని అందరూ అంటున్నారు. ఏమిటి సార్ దీని పరిస్థితి?
 డీఈ: మొత్తం 13 బ్లాకుల్లో ఆరు బ్లాకులు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం వాడుకులో ఉన్నాయి సార్. నిర్మాణ దశలో ఏడు బ్లాకులు ఉన్నాయి. వీటిలో అత్యవసరంగా 7, 11, 12 బ్లాకుల నిర్మాణాలు చేపడుతున్నాం. ఈ పనులను సత్యసాయి కన్సస్ట్రక్షన్ వారు చేపడుతున్నారు. ఇందుకోసం రూ.20.89 కోట్లు మంజురయ్యాయి సార్.
 డెరైక్టరు: ఇంతకీ ఎప్పటికి ఈ నిర్మాణాలు పూర్తి అవుతాయి?
 డీఈ: ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 7,11, 12 బ్లాకులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి అవుతాయి సార్. మిగిలిన నాలుగు బ్లాకులకు సంబంధించి ఇటీవలే డీఎంఈ వచ్చి పరిశీలించి వెళ్లారు. వారిచ్చే ఆదేశాల ప్రకారం కొత్త కాంట్రాక్టు పిలవాలో లేక ప్రస్తుతమున్న వారికే పనులు అప్పగించాలో.. నిర్ణయం తీసుకుంటాం.
 డెరైక్టర్: ఓకే థ్యాంక్యూ వెరీ మచ్.. డీఈ గారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement