ఇటీవలి కాలంలో నిత్యం ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదం జరగడం, కొంతమంది ప్రాణాలు కోల్పోవడం ప్రజలు చూస్తూనే ఉన్నారు. అలాంటి వార్తలు చదివిన ప్రతిసారీ ప్రజలకు రవాణా శాఖ పనితీరుపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ సందేహాలు ప్రజలకే కాదు మరో ముఖ్య వ్యక్తికీ ఉన్నాయి. ఆయనే జిల్లా ఉప రవాణా కమిషనర్ (డీటీసీ) జే రమేష్‌కుమార్. తమ శాఖ అధికారులు, సిబ్బంది ప్రజలతో వ్యవహరించే తీరు, ప్రజలకు తమ శాఖ అందిస్తున్న సేవలు, అవి సక్రమంగా అందుతున్నాయా లేదా వంటి సందేహాలు ఆయన మనసును తొలుస్తున్నాయి. వాటిని నివృత్తి చేసుకునేందుకు ఆయనకు ఒక చక్కటి మార్గం దొరికింది. అదే ‘సాక్షి’ దినపత్రిక నిర్వహిస్తున్న వీఐపీ రిపోర్టర్. ఈ కార్యక్రమం ద్వారా ఆయన ఒక విలేకరిగా మారిపోయారు. స్థానిక ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు చేరుకుని వాహన చోదకులు నియమ నిబంధనలు పాటిస్తున్నారా లేదా ఆరా తీశారు. తొలుత ఆయన తన కార్యాలయంలోని కౌంటర్ల వద్ద ఉన్న వ్యక్తులతో ఇలా సంభాషించారు..
డీటీసీ : మీ పేరేమిటి, ఏ పని మీద వచ్చారు.
స్వర్ణ వెంకటేశ్వరరావు : సర్ నేను లెసైన్స్ రెన్యువల్ కోసం వచ్చాను. రెన్యువల్ చేశారు కానీ అన్ని పేర్లూ తప్పు వచ్చాయి. సరిచేయమంటే ఆ కాగితాలు తీసుకురా, ఈ కాగితాలు తీసుకురా అంటూ ఇప్పటికి ఎనిమిది సార్లు తిప్పారు.
డీటీసీ : ఒకసారి మా ఏఓ గారి దగ్గరకు వెళ్లి విషయం చెప్పండి, ఆయన పరిష్కరిస్తారు. అక్కడి నుంచి మెట్ల మీదుగా కి ందకి దిగి సిగ్నల్ వ్యవస్థపై అవగాహన కలిగించే ప్రాంతానికి వెళ్లి అక్కడ ఒక యువతితో
డీటీసీ : ఏమ్మా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు.
డీ సునీత : ఎల్‌ఎల్‌ఆర్ కోసం దరఖాస్తు చేశాను సార్. టెస్ట్ పెట్టారు అది కూడా పూర్తి చేశాను. అక్కడే ఉన్న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఎండీ అలీతో
డీటీసీ : మీరు ఇక్కడ ఏ విధులు నిర్వహిస్తున్నారు
ఎండీ అలీ : లెర్నింగ్ లెసైన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ట్రాఫిక్ నిబంధనలు, ట్రాఫిక్ సిగ్నల్స్‌పై అవగాహన కల్పిస్తాం సార్ అలాగే లెసైన్స్‌లు ఇచ్చే ముందు వారికి పరీక్షలు నిర్వహించి సంతృప్తి చెందిన తరువాతే లై సెన్స్‌లు ఇస్తున్నాం సార్.
అక్కడి నుంచి హెల్ప్ డెస్క్‌లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ కిరణ్‌కుమార్ వద్దకు వెళ్లి
డీటీసీ : ఇక్కడ ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులోనే ఉన్నాయి కదా..వారికి సౌకర్యాలు కలిగించడానికి ఇంకా ఏమైనా ఏర్పాట్లు చేయాల్సి ఉందా అని ప్రశ్నించారు.
పీఆర్ కిరణ్‌కుమార్ : ఇక్కడ అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి సార్. ఏ పనిమీద వచ్చిన ప్రజలను ఆ పనికి సంబంధించిన సెక్షన్‌కు పంపుతున్నాం, వారి నుంచి ఫిర్యాదులేమీ లేవు. అక్కడి నుంచి నంబర్ ప్లేట్లు ఇస్తున్న కాంట్రాక్టర్ తాలూకు వ్యక్తి వద్దకు వచ్చి
డీటీసీ : నంబర్ ప్లేట్లు ఎన్నిరోజులకు వస్తున్నాయి.
మోహన్ : ప్లేట్లు 10 రోజులకు వస్తున్నాయి సార్. మామూలుగా నాలుగు రోజులకే రావాలి. ఆలస్యమౌతోంది. అక్కడే ఉన్న కానిస్టేబుల్‌తో ఇక్కడ అంతా సజావుగానే సాగుతోంది కదా అని ప్రశ్నించిన డీటీసీతో
కానిస్టేబుల్ రామారావు : బాగానే ఉంది కానీ నంబర్ ప్లేట్ల లో నాణ్యత ఉండడం లేదని ఆరోపణలు వస్తున్నాయి సార్.
డీటీసీ : మీరు ఏ పనిమీద వచ్చారు.
వెంకటేశ్వరరావు : నేను ట్రాన్స్‌పోర్టు వాహనం జంగారెడ్డిగూడెం కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. నంబర్ ప్లేటు కోసం ఇక్కడికి రావలసి వచ్చింది. ట్రాన్స్‌పోర్టు వాహనాలకు కూడా ఎక్కడ రిజిస్ట్రేషన్ జరిగితే అక్కడే నంబర్ ప్లేటు వచ్చేలా ఏర్పాటు చేయండి సార్ అని అడిగాడు. అక్కడి నుంచి స్థానిక ఫైర్‌స్టేషన్ సెంటర్ వద్దకు చేరుకున్న డీటీసీ ఆయన సిబ్బంది ఒక ద్విచక్ర వాహనంపై వెళుతున్న ముగ్గురు విద్యార్థులను ఆపారు.
డీటీసీ : ఏమయ్యా బైక్ ఎవరిది, లెసైన్స్ ఉందా, ముగ్గురు వెళ్లడం నేరమని తెలియదా?
రాజేష్ : బైక్ మా నాన్నగారిది సార్ కాలేజీలో చిన్న పని ఉంటే చూసుకుని వెళదామని వచ్చాను. అక్కడ స్నేహితులు కలిస్తే వారిని ఎక్కించుకు వెళుతున్నాను. లెసైన్స్‌కు దరఖాస్తు చేసుకున్నాను. ఇంకా రాలేదు. అని చెప్పాడు. ఈ లోపు అటుగా వెళుతున్న మరో విద్యార్థిని
డీటీసీ : ఆపి నీ వయసెంత, లెసైన్స్ ఉందా, మీ నాన్నగారు ఏమి చేస్తారు అని ప్రశ్నించారు.
ప్రదీప్ : నేను ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాశాను సార్. మా నాన్నగారు పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.
డీటీసీ : అటుగా వెళుతున్న జి.లహరి అనే బిఫార్మసీ విద్యార్థిని ఆపి ఏమ్మా మీకు లెసైన్స్, సీ బుక్, ఇన్సూరెన్సు ఉన్నాయా అని ప్రశ్నించగా ఆమె తన బండిలోని కాగితాలన్నీ చూపడంతో వెరీ గుడ్ మేము ఇప్పటి వరకూ చూసిన వాటిలో మొత్తం రికార్డులున్నది మీ ఒక్కరి దగ్గరే అందరూ మీలాగే ఉంటే మా పని తేలికౌతుంది. అంటూ ప్రశంసించారు. అనంతరం ఎం.బిందు అనే మహిళను ఆపి
డీటీసీ : ఏమ్మా మీ బండి రికార్డులు, లెసైన్స్ చూపండి అని అడిగారు. దానికి ఆమె తనవద్ద ఏ రికార్డులూ లేవని తెలపడంతో మీరు ఏమి చేస్తారు అని ప్రశ్నించారు. తాను కాలేజిలో లెక్చరర్‌గా పనిచేస్తానని చెప్పడంతో విద్యార్థులకు అవగాహన కలిగించాల్సిన మీరే ఇలా చేస్తే ఎలా అని సున్నితంగా మందలించారు.
ప్రమాదాల నివారణకు అందరూ సహకరించాలి : డీటీసీ
రవాణా శాఖ రహదారి భద్రతకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది. రోడ్డుపై తిరిగే ప్రతి వాహనం కండిషన్‌లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రమాదాలు జరగకుండా ప్రజల నుంచి కూడా సహకారం అవసరం. నిబంధనలకు విరుద్ధంగా వెళితే మహిళలకూ మినహాయింపు ఉండదు. మైనర్లు కూడా వాహనాలు నడిపేస్తున్నారు. లెసైన్సులు లేకుండా వాహనాలు నడిపితే జైలు శిక్ష పడే అవకాశం ఉంది. చాలామంది ఉన్నతోద్యోగులు, పోలీసుల పిల్లలు కూడా లెసైన్సులు లేకుండా రోడ్లపైకి వాహనాలను తీసుకువస్తున్నారు. ఇటువంటివి మరోసారి మా దృష్టిలో పడితే అటువంటి ఉద్యోగులకు, తల్లిదండ్రులకు కౌన్సెలింగులిస్తాం. మైనర్లు ప్రమాదాలకు కారణమైతే తల్లిదండ్రులకు శిక్షపడేలా చట్టాలు రూపొందించాలి. లెసైన్స్‌లు తీసుకోవడంలో ఇబ్బందులుంటే నేరుగా నన్నే కలవవచ్చు. నంబర్ ప్లేట్ల విషయంలో నాణ్యత లేని విషయం ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఏజెన్సీని మార్చాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రవాణా వాహనాలు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అక్కడే నంబర్ ప్లేట్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం.
రోడ్డు భద్రతకే ప్రాధాన్యం
Published Sun, May 17 2015 1:32 AM | Last Updated on Sun, Sep 3 2017 2:10 AM
Advertisement
Advertisement