పొలకొలనుగా.. క్షీరపురిగా విలసిల్లిన పాలకొల్లు పట్టణంలోని శ్రీ క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయం (పెదగోపురం) పంచారామ క్షేత్రాల్లో ఒకటి భాసిల్లుతోంది. క్షీరా రామలింగేశ్వరుడి పేరుతో ఇక్కడ కొలువైన పరమ శివుణ్ణి దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడకు తరలివస్తుంటారు. కార్తీక మాసంలో లక్షలాది మంది ఇక్కడి శివలింగాన్ని దర్శించి పునీతులవుతారు. గోదావరి నది సముద్రంలో సంగమించే నరసాపురం పట్టణం పాలకొల్లుకు అతి సమీపంలో ఉండటంతో పుష్కర యాత్రికులు క్షీరా రామలింగేశ్వరుడిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో యాత్రికులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ పెదగోపురాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.85 లక్షలను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో
క్షీరపురిలో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ఆలయ అర్చకులు, ఆలయ పరిధిలోని దుకాణాల యజమానుల ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఆలయ కార్యనిర్వహణాధికారి చల్లపు సూర్యచంద్రరావు ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారారు. భక్తులు, అర్చుకులు, దుకాణాల యజమానులతో మాట్లాడారు. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టింగ్ ఇలా సాగింది.
ఈవో : అమ్మా.. నా పేరు సూర్యచంద్రరావు. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా వచ్చాను. మీ సమస్యలేమిటో చెప్పండి.
విజయలక్ష్మి, భక్తురాలు : ప్రతి సోమవారం స్వామికి ఇచ్చే పంచ హారతులను దర్శించుకునే భాగ్యం కేవలం ముందు వరుసలో భక్తులకు మాత్రమే కలుగుతోంది. ఆలయానికి వచ్చే వారందరికీ పంచహారతులు దర్శించుకోవడానికి అవకాశం కల్పించండి.
ఈవో : మంచి సూచన చేశారు. వచ్చే సోమవారం నుంచి భక్తులందరికీ పంచహారతుల దర్శన భాగ్యం కల్పిస్తాం.
ఆదిమూల నాగేశ్వరరావు, భక్తుడు : నమస్కారమండీ. ఆలయం ముందు దుకాణాలు పెట్టడం వల్ల భక్తులకు ఇబ్బందిగా ఉంది.
ఈ విషయాన్ని కలెక్టర్, ఎమ్మెల్యే, మునిసిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లాం. అయినా స్పందన లేదు.
ఈవో : నిజమే కొద్దిరోజులుగా సమస్య తీవ్రమైంది. దుకాణాలున్న ప్రాంతం మునిసిపాలిటీది కావడం వల్ల మునిసిపల్ కమిషనర్‌కి లేఖ రాశాం. ఆక్రమణలు తొలగించాల్సిన బాధ్యత మునిసిపాలిటీదే.
లింగం సత్యనారాయణ, భక్తుడు : మాది పూలపల్లి. పొరుగూరు నుంచి వచ్చే భక్తులకు వాహనాలు పార్కింగ్ చేసుకునే అవకాశం ఆలయ పరిసరాల్లో లేదు. గుడికి దగ్గరలో పార్కింగ్ సౌకర్యం కల్పించాలి.
ఈవో : పుష్కరాల నేపథ్యంలో దేవుని హాలును అభివృద్ధి చేస్తున్నాం. రూ.35 లక్షలతో నిర్మించే అభిషేకాల మండపం దిగువ భాగంలో పార్కింగ్ సదుపాయాన్ని కల్పిస్తాం.
నీలకంఠేశ్వరి, భక్తురాలు : పొరుగూరు నుంచి వచ్చే భక్తులకు విశ్రాంతి తీసుకోవడానికి సరైన సదుపాయం లేదు. దూర ప్రాంత భక్తులు స్వామి దర్శనానంతరం కొద్దిసేపు సేదతీరే అవకాశం ఆలయ పరిసరాల్లో కల్పించాలి.
ఈవో : పుష్కరాల అభివృద్ధి పనుల్లో భాగంగా అభిషేకాల మండపం నిర్మిస్తున్నాం. దీంట్లో భక్తులు సేదతీరే వీలుంటుంది.
మార్కండేయులు, భక్తుడు : నిత్యం గుడిలోనే ఉంటా. గర్భగుడిలో వీఐపీల పేరుతో కొంతమందికి ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నారు. దీనివల్ల సామాన్య భక్తులు దర్శన భాగ్యం కోసం గంటలకొద్దీ వేచి ఉండాల్సి వస్తోంది.
ఈవో : కార్తీక మాసం, పర్వ దినాల్లో ఈ సమస్య తలెత్తుతోంది. గర్భగుడి లో అభిషేకాలను ఇకనుంచి చేయని వ్వం. అభిషేకాల కోసం పుష్కర నిధులతో ప్రత్యేక మండపం నిర్మిస్తున్నాం.
ఎస్.గణపతి, భక్తుడు : ఈవో గారూ. పుష్కరాల సందర్భంగా ఈ ఆలయానికి వచ్చే భక్తులందరికీ అన్నసమారాధన చేయాలి. అవసరమైతే మైకుల్లో ప్రచారం చేయండి. భక్తుల నుంచి విరాళాలు వసూలు చేయండి. సాధారణ రోజుల్లో ప్రతి సోమవారం భక్తులకు అన్నసమారాధన చేయించండి.
ఈవో : మంచి సూచన చేశారు. ఇకనుంచి ముందు పట్టణేతరులకు టోకెన్లు ఇచ్చి ఆ తరువాత మిగిలితే స్థానికులకు భోజనం పెట్టే ఏర్పాటు చేస్తాం. అనంతరం ఈవో సూర్యచంద్రరావు పురోహితుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ఈవో : అర్చక స్వాములూ.. మీ సమస్యలేమిటో చెప్పండి.
కోట నాగబాబు, పురోహితుడు : మాకంటూ ప్రత్యేకంగా సమస్యలు లేవు. పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్నివిధాలా సేవలందిస్తాం. పుష్కర సమయాల్లో అరగంట మాత్రమే విశ్రాంతి ఇస్తాం.
మద్దూరి సూర్యనారాయణమూర్తి, పురోహితుడు : గత పుష్కరాల్లో పురోహితులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చారు. ఈ పుష్కరాలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున కోరుతున్నాం.
ఈవో : ఈ విషయమై శనివారం ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశాం. తప్పనిసరిగా పురోహితులందరికీ గుర్తింపు కార్డులిచ్చే ఏర్పాట్లు చేస్తాం.
అనంతరం ఆలయానికి చెందిన షాపులను లీజుకు తీసుకు వ్యాపారాలు చేస్తున్న వారితో ఈవో మాట్లాడారు. వివిధ సమస్యలను వ్యాపారులు ఈవో దృష్టికి తీసుకెళ్లారు. ఆలయానికి సంబంధించి 42 షాపులు
ఉన్నాయని, తగినన్ని మరుగుదొడ్లు
లేకపోవడంతో షాపుల్లో పనిచేసే గుమాస్తాలు, యజమానులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. వీటిలో నీటి సౌకర్యం లేదని, ప్రస్తుతం ఉన్న మరుగుదొడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. పుష్కర నిధులతో మరుగుదొడ్లకు మరమ్మతులు చేస్తున్నామని ఈవో సమాధానమిచ్చారు. స్థలాభావం వల్ల అదనపు మరుగుదొడ్లు నిర్మించే అవకాశం లేదన్నారు. తాగునీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
పుష్కర యాత్రికులకు సమస్యలు రానివ్వం
పుష్కర యాత్రికులకు ఎలాంటి సమస్యలు రానివ్వం. దూర ప్రాంతాల నుంచి వచ్చే పుష్కర యాత్రికుల కోసం 12 రోజులపాటు పట్టణంలోని అన్నసమారాధన సత్రాల సహకారంతో మెయిన్ రోడ్డులోని రేపాక వారి సత్రంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. భక్తుల విశ్రాంతి కోసం అన్నదాన సత్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు భక్తుల సౌకర్యాల కోసం ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు రూ.85 లక్షలు మంజూరు చేయించారు. రూ.50 లక్షలతో ఆలయానికి రంగులు, వైరింగ్ మరమ్మతులు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదులు, ఆలయ ప్రాంగణంలో ఫ్లోరింగ్ పనులు చేయిస్తున్నాం. మరో రూ.35 లక్షలతో అభిషేక మండపాల నిర్మిస్తున్నాం. ఈ పనులన్నీ రెండు నెలల్లో పూర్తవుతాయి.
- చల్లపు సూర్యచంద్రరావు, ఈవో
క్షీరా రామం..భక్తిధామం
Published Sun, Apr 5 2015 4:43 AM | Last Updated on Mon, Jul 29 2019 6:06 PM
Advertisement
Advertisement