పి.సౌమ్యలత. డీఎస్పీగా నరసాపురంలో తొలి పోస్టింగ్. పోలీస్ సబ్ డివిజన్ అధికారిగా శాంతి భద్రతలను
పి.సౌమ్యలత. డీఎస్పీగా నరసాపురంలో తొలి పోస్టింగ్. పోలీస్ సబ్ డివిజన్ అధికారిగా శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన కీలక బాధ్యతలు ఆమెపైనే ఉన్నాయి. విధుల్లో చేరినప్పుడే మహిళల సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తానని చెప్పిన ఆమె అక్కడితో ఆగిపోలేదు. ఆ దిశగా ఆచరణ మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ‘సాక్షి’ వీఐపీగా రిపోర్టర్‌గా నరసాపురం మండలం సీతారామపురంలోని లేసు పార్కులో పనిచేస్తున్న మహిళల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం
చేశారు. సుమారు రెండు గంటలపాటు లేసు పార్కులో పనిచేసే మహిళలతో మమేకమై వారి బాధలను, కష్టాలను, సమస్యలను తెలుసుకున్నారు. చట్టాలపై వారికి అవగాహన ఉందా లేదా, కష్టమొస్తే పోలీసులు ఉన్నారన్న విషయం తెలుసా లేదా అన్న విషయాలను ఆరా తీశారు. మహిళలకు ఆత్మస్థైర్యమే వజ్రాయుధమని, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళితే అందలం ఎక్కవచ్చని సాటి మహిళగా అక్కడి మహిళలకు బోధించారు. వీఐపీ రిపోర్టర్ విశేషాలు ఇలా...
డీఎస్పీ : నా పేరు సౌమ్యలత. నరసాపురం డీఎస్పీగా ఈ మధ్యనే బాధ్యతలు చేపట్టాను. మిమ్మల్ని కలుసుకోవాలని, మీ ఇబ్బందులు తెలుసుకోవాలని.. పోలీస్ శాఖ పరంగా ఏదైనా సహాయం చేయగలనా అనే విషయాలను తెలుసుకోవడానికి వచ్చాను. లేస్ పార్క్ విశేషాలు చెబుతారా.
పడవల మంగతాయారు, ఇన్‌స్ట్రక్టర్ : నమస్తే మేడమ్. నేను ఇక్కడ కుట్టు అల్లికలకు సంబంధించి శిక్షణ తీసుకుంటున్న వారికి ఇన్‌స్ట్రక్టర్‌గా వ్యవహరిస్తున్నాను. ప్రస్తుతం మా సెక్షన్‌లో 40 మంది శిక్షణ పొందుతున్నారు. రెండు నెలల పాటు శిక్షణ ఉంటుంది. లేసు అల్లికలు, డిజైన్లలో శిక్షణ ఇస్తాం.
డీఎస్పీ : శిక్షణ అనంతరం ఎలాంటి ఉపాధి దొరుకుతుంది.
పి. కరుణకృప, కె.అనూష, కె.లక్ష్మీ సరస్వతి : మేడమ్. మేం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నాం. శిక్షణ అనంతరం లేసు అల్లికల్లో నైపుణ్యత వస్తుంది. విదేశాలకు ఎగుమతి అయ్యే లేసులను అల్లుతాం. మాకు నెలలో ఒక్కొక్కరికీ రూ.మూడు వేల నుంచి రూ.నాలుగు వేల వరకు ఆదాయం వస్తుంది.
డీఎస్పీ : మీరంతా ఎక్కడెక్కడినుంచి వచ్చారు. దూరం నుంచి వచ్చే సందర్భంలో మీకేమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా
దేశింశెట్టి రమాదుర్గ, పులపర్తి లక్ష్మీకాంతం, సీహెచ్ విజయలక్ష్మి : బస్సుల్లోను, ఆటోల్లోను ప్రయాణం చేసి రావాలి. కొన్ని సందర్భాల్లో కొద్దిపాటి ఇబ్బందులు తప్పవు. అయితే ఈప్రాంతంలో మరీ ఇబ్బందికర పరిస్థితులు లేవు. సమాజంలో మహిళల విషయంలో ఇంకా మార్పు రావాలి.
డీఎస్పీ : మహిళల రక్షణ కోసం అమలులో ఉన్న చట్టాలు గురించి మీకేమైనా అవగాహన ఉందా.
హేమలత : మహిళల కోసం ఏవో కొన్ని చట్టాలు ఉన్నాయని మాత్రం తెలుసు. కానీ అవేమిటో పూర్తిగా తెలియదు. ఏదైనా కష్టమొస్తే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తెలుసు. దీంతో డీఎస్పీ సౌమ్యలత మహిళల రక్షణ కోసం అమలులో ఉన్న చట్టాలను గురించి వారికి వివరించారు. ఇటీవల అమల్లోకి వచ్చిన నిర్భయ చట్టంపై అవగాహన కల్పించారు. గృహహింస, ఈవ్‌టీజింగ్ వంటి సమస్యలు తలెత్తినప్పుడు ఏం చేయాలన్నది వివరించారు. నరసాపురం డివిజన్ పరిధిలోని మహిళలకు ఏమైనా ఇబ్బందులుంటే.. పోలీస్ శాఖ ద్వారా పరిష్కరించగలిగేవి అయితే వెంటనే తనకు చెప్పాలని సూచించారు. సమస్యలొచ్చినప్పుడు ఏ సమయంలోనైనా తన సెల్ నంబర్ 94407 96615కు ఫోన్ చేయాలని సూచించారు.