ముడి వీడని..ట్రాఫిక్ చిక్కో లు! | DSP P. srinivasa Rao VIP Reporter | Sakshi
Sakshi News home page

ముడి వీడని..ట్రాఫిక్ చిక్కో లు!

Published Sun, Dec 21 2014 1:37 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

ముడి వీడని..ట్రాఫిక్ చిక్కో లు! - Sakshi

ముడి వీడని..ట్రాఫిక్ చిక్కో లు!

శ్రీకాకుళం పట్టణ జనాభా ఎప్పుడో లక్ష దాటేసింది. ఇక్కడి ఆటోల సంఖ్య 1000. శివారు ప్రాంతాల నుంచి వస్తున్న వాహనాలు సుమారు 600. భారీ స్థాయిలో ద్విచక్రవాహనాలు. లెక్కకు మించి కార్లు. కానీ అవే రోడ్లు.. అవే జంక్షన్లు.. ఫలితం నిత్యం ప్రజలు ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకొని నరకం చూస్తున్నారు. అవసరాలకు తగినంతగా ట్రాఫిక్ పోలీస్ విభాగంలో సిబ్బంది సంఖ్య పెరగకపోవడంతో ఉన్న సిబ్బంది ట్రాఫిక్ చిక్కుముడిని విప్పలేకపోతున్నారు. ఏటా వాహనదారుల నుంచి జరిమానాల పేరిట సుమారు రూ.20 లక్షలు వసూలవుతున్నా.. ట్రాఫిక్ మెరుగుకు అవసరమైన వసతుల కల్పనపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. జంక్షన్లలో సీసీ కెమెరాలు, సిగ్నలింగ్ వ్యవస్థ మెరుగుపర్చడం, ట్రాఫిక్ ఐలెండ్లు, డివైడర్ల ఏర్పాటు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం వంటివి పెద్దగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు, పరిష్కార మార్గాలు కనుగొనేందుకు ఇటీవలే డీఎస్పీగా విధులు చేపట్టిన పి.శ్రీనివాసరావు ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్ రూపంలో రంగంలోకి దిగారు. పలు కూడళ్లలో తిరిగి వాహనదారులు, ప్రజల నుంచి సమాచారం రాబట్టారు. మోటార్ వెహికల్ చట్టం గూర్చి వివరించారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే పోలీసులు తమ వంతు పాత్ర పోషించగలరనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు.
 
   మెరుగుపరుస్తాం : ట్రాఫిక్ డీఎస్పీ
 ఇన్నాళ్లు ట్రాఫిక్ సీఐ ఆధ్వర్యంలో సిబ్బంది ఇక్కడి ట్రాఫిక్ వ్యవస్థను నడిపించేవారు. ప్రభుత్వం ఈ వ్యవస్థను బలోపేతం చేయడంతో సీఐ స్థానంలో డీఎస్పీ వచ్చారు. వాహనాల తనిఖీ, స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు, స్కూల్ బస్సుల తనిఖీ, విద్యార్థులకు ట్రాఫిక్‌పై అవగాహన కల్పించడంతోపాటు తల్లిదండ్రులను చైతన్య పర్చేందుకు కృషి చేస్తున్నాం. సూర్యమహల్, రామలక్ష్మణ కూడలి, చినబజార్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నళ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. దుకాణాలు, షాపింగ్ మాళ్ల వద్ద పార్కింగ్ వ్యవస్థ ఏర్పాటుకు, పట్టణంలోని రెండు మూడు ప్రాంతాల్లో కార్లు, ఆటోలు నిలపడానికి మున్సిపాలిటీ అనుమతితో పార్కింగ్ జోన్ల ఏర్పాటు ఆలోచన ఉంది. రోడ్డు ప్రమాదాల నివారణకు వివిధ విభాగాలతో సమన్వయం చేసుకుంటాం. జిల్లా ఎస్పీ ఆదేశాలు, సూచనల మేరకు ట్రాఫిక్ వ్యవస్థను
 చక్కదిద్దుతాం.
 
 ఆర్టీసీ కాంప్లెక్ వద్ద విద్యార్థితో..
 డీఎస్పీ: మీది ఏ ఊరు, కళాశాలకు ఎలా చేరుకుంటున్నావు?
 శివప్రసాద్(విద్యార్థి): మాది గార మండలం కొర్ని గ్రామం, ప్రతి రోజు ఆటోకు వ స్తున్నాం. మాకు ఒక్క బస్సే ఉంది సార్.. దీంతో విద్యార్థులమంతా చాలా ఇబ్బందులు పడి కళాశాలలకు ఆలస్యంగా చేరుకుంటున్నాం.
 డీఎస్పీ: మరి మీకు ప్రత్యామ్నాయం ఏమిటి?
 విద్యార్థి: ఆటోలు పట్టుకొని రావాల్సి వస్తోంది. గంటల తరబడి వేచి ఉంటే కానీ ఆటోడ్రైవర్లు ఆటోలు తీసే పరిస్థితి ఉండదు.
 డీఎస్పీ: ఆటోలతో ఎలాంటి ఇబ్బంది వస్తోంది?
 విద్యార్థి: సార్.. ఒక ఆటోలో 13 నుంచి 15 మందిని ఎక్కిస్తున్నారు. వేలాడుతూ ప్రయాణం చేస్తేగానీ వచ్చే పరిస్థితి లేదు.
 డీఎస్పీ: ఆటోవాలాలు అధిక వసూళ్లకు పాల్పడుతున్నారా?
 విద్యార్థి: సాయంత్రం 4 గంటల తరువాత ప్రతి అరగంటకు  
 రూ. 5 చొప్పున పెంచుతున్నారు ఏమీ చేయలేక అడిగినంత ఇస్తున్నాం.
 కాంప్లెక్స్ వద్ద ఆటో డ్రైవర్ తో..
 డీఎస్పీ: డ్రైవర్‌బాబూ.. మీకు ఏ రకమైన  సమస్యలు ఉన్నాయి?
 ఆటోడ్రైవర్: సార్.. కాంప్లెక్స్ నుంచి వన్ వే చేయడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రయాణికులు ఆటో ఎక్కే పరిస్థితి కన్పించడం లేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.
 డీఎస్పీ : వన్‌వే వల్ల ప్రయాణికులకు ఇబ్బందులుంటాయా?
 ఆటో డ్రైవర్: వన్‌వే వల్ల ఆర్‌టీసి కాంప్లెక్స్‌లో బస్సు దిగిన ప్యాసింజర్లు లగేజీలతో బయటకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు.
 డీఎస్పీ: ఆటోలు నడిపేవారు నిబంధనలను పాటించడం లేదట కదా?
 ఆటోడ్రైవర్: సార్.. ఎవరో ఒకరిద్దరు అలా చేస్తే అందరూ ఆటో డ్రైవర్లకు, ప్రయాణికులకు శిక్ష వేస్తున్నారు. పోలీసులు కూడా మా పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు.
 డే అండ్ నైట్ జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనదారుడితో..
 డీఎస్పీ: తమ్మూ.. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావు. పోలీసులు అడగడం లేదా?
 దుర్గారావు(వాహనాదారు): సార్ హెల్మెట్ ఖచ్చితంగా ఉండాలని లేదు. పోలీసులు అప్పడప్పుడు హడావుడి చేస్తారంతే.
 డీఎస్పీ: హెల్మెట్ లేకపోతే ప్రమాదం కదా?
 వాహనదారు: సుదూర ప్రయాణాలకే హెల్మెట్ వాడతాం. లోకల్‌గా అవసరం లేదు.
 డీఎస్పీ: డ్రైవింగ్ లెసైన్సు లేకుంటే పోలీసులు జరిమానా విధిస్తున్నారా?
 వాహనదారు: లెసైన్స్, సీ బుక్, పొల్యూషన్ లేకుంటే రూ.400 వరకు జరిమానా విధిస్తారు. ఒక్కోసారి అన్ని పేపర్లు ఉన్నా వందో రెండొందలో ఇచ్చుకోవాల్సి ఉంటుంది.
 త్రిబుల్ రైడింగ్ చేస్తున్న వ్యక్తితో..
 డీఎస్పీ:  బాబూ త్రిబుల్ రైడింగ్ చేయడం తప్పు కదా?
 జనార్ధన్(వాహనదారు): ఒక్కోసారి తప్పదు సార్. పోలీసులు కూడా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. వారికి దొరికితే కదా! పట్టుకున్నా పలుబడి ఉన్నవారిచేత ఫోన్ కొట్టిస్తే వదిలేస్తారు.. అంతే.
 డీఎస్పీ: ప్రమాదానికి గురైతే పరిస్థితి ఏమిటి?
 జనార్ధన్: మాకు ఇది అలవాటే.
 రిజిష్ట్రేషన్ చేయించని వాహనదారుతో..
 డీఎస్పీ: ఏమయ్యా రిజిస్ట్రేషన్ చేయించకుండా ప్రయాణం చేస్తున్నావ్?
 శ్రీనివాసరావు(వాహనదారు): సార్.. బండి ఈ మధ్యనే కొన్నాం. నెలరోజులైంది. వెయ్యి కిలోమీటర్లలోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కానీ చేయించలేదు. పోలీసులకు దొరికితే రెండు నుంచి ఐదువేల రూపాయల వరకు ఫైన్ విధిస్తారు.
 డీఎస్పీ: జరిమానా వేసి వదిలేస్తారా.. ఇంకా ఏమైనా ఇబ్బందులు పెడతారా?
 శ్రీనివాసరావు: వారి మూడ్ బట్టే ఉంటుంది సార్. జరిమానా చెల్లిస్తే వదిలేస్తారు. లేకుంటే బండిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లిపోతారు. అది తిరిగి మా చేతికి రావాలంటే తలప్రాణం తోకకు వస్తుంది.
 మైనర్ డ్రవర్‌తో..
 డీఎస్పీ: తమ్ముడూ నీకు డ్రైవింగ్ లెసైన్స్ ఉందా? 18 ఏళ్లు రాకుండా ఆటో తోలకూడదు తెలుసా?
 దయాకర్(డ్రైవర్): డ్రైవింగ్ లెసైన్స్ లేదండీ.. నేను నేర్చుకుంటున్నాను. నా పక్కనే మామయ్య ఉంటారు. ఎక్కడైనా పోలీసులు  ఎదురుపడితే ఆయనకు డ్రైవింగ్ ఇచ్చేస్తాను.
 డీఎస్పీ: ఫైన్ కట్టమని, కేసు నమోదు చేస్తామని పోలీసులు అంటే ఏం చేస్తావు?
 దయాకర్: వాళ్లు అలానే బెదిరిస్తారు. కాస్త బతిమాలితే వదిలేస్తారు.
 జీటీ రోడ్డులో బట్టల షాపు యజమానితో..
 డీఎస్పీ: షాపుల ముందు ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేయకూడదు కదా?
 షాపు యజమాని: పట్టణంలో పార్కింగ్‌కు స్థలం లేకపోవడంతో దుకాణాల ముందే కస్టమర్స్ పెట్టేస్తుంటారు.
 డీఎస్పీ : ఈ సమస్య పరిష్కారానికి ఏం చేస్తే బాగుంటుంది?
 దుకాణ యజమాని : సార్ పట్టణంలో ద్విచక్ర వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాలను కేటాయించాలి. మున్సిపల్ మైదానంతో పాటు ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తే ఈ సమస్య తీరుతుంది.
 
 వీరితోనే పర్యవేక్షణ
 ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో ఒక డీఎస్పీ, ఇద్దరు శాశ్వత ఎస్సైలు, నలుగురు తాత్కాలిక ఎస్సైలు, ముగ్గురు ఏఎస్సైలు, ఏడుగురు హెడ్ కానిస్టేబుళ్లు, 34 మంది కానిస్టేబుళ్లు, 35 మంది హోంగార్డులున్నారు. డే అండ్ నైట్ జంక్షన్‌లోనే సిగ్నల్ పాయింట్ ఉంది. ఒకేఒక్క ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఉండగా సిబ్బంది కోసం నాలుగు ద్విచక్ర వాహనాలు, రెండు జీపులు ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement