పశువులకు మెరుగైన వైద్య సేవలు అందించడం, దూడల సంరక్షణ, కృత్రిమ గర్భధారణ ద్వారా మేలుజాతి దూడల అభివృద్ధికి కృషి చేయడం పశు సంవర్ధక శాఖ విధి. ఆ శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ ముత్యాల వేణుగోపాల్‌రెడ్డి వీటితో పాటు పశుగ్రాసాల సాగు తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పశువులు, గొర్రెలు, మేకలకు వ్యాధులు దరి చేరకుండా ముందు జాగ్రత్తగా వ్యాధి నిరోధక టీకాలు వేయిస్తున్నారు. పథకాల అమలును పారదర్శకంగా నిర్వహిస్తూ.. పశు సంవర్ధక శాఖకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారు.
పశువైద్య శాలలకు సొంత భవనాలు నిర్మించడంలో విజయవంతం అయ్యారు. ఆయన ‘సాక్షి’ తరపున వీఐపీ రిపోర్టర్‌గా మారి పశు సంపదకు, పాల ఉత్పత్తికి పెట్టింది పేరైన కల్లూరు మండలం తడకనపల్లి గ్రామంలో పశుపోషణ, పాల ఉత్పత్తిలో మహిళలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పశు సంపదను రక్షించడం, పాల ఉత్పత్తిని పెంచడమే తన లక్ష్యమని ఆయన చెప్పారు.
జేడీ: ఏమ్మా..! అందరూ బాగున్నారా.. పశు పోషణ, పాల ఉత్పత్తి ఎలా ఉంది ?
మహిళలు : బాగున్నాం సార్.. పశుపోషణ బాగుంది. ఇప్పటి వరకు పాల ఉత్పత్తి ఆశాజనకంగానే ఉంది. మాకు ప్రధాన ఆధారం పాడి పరిశ్రమనే.
జేడీ : అమ్మా నీ పేరు ఏమిటి? సమస్య ఉందా?
మహిళ: సార్ నా పేరు సకినాబీ. కొద్ది రోజులుగా మా దూడల కళ్ల నుంచి ఒకటే నీళ్లు కారుతున్నాయి. ఏమైనా అనారోగ్యమా?
జేడీ : వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కళ్లలో నీరు కారుతాయి. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ చికిత్స చేయిస్తాం.
ధనలక్ష్మి : సార్.. మేము రెయిన్‌బో రకం కోళ్లు పెంచుకుంటున్నాం. గుడ్లు బాగా పెడుతున్నాయి. కోళ్లు గుడ్లను పొదగడం లేదు.
జేడీ : రెయిన్‌బో కోళ్లు గుడ్లు ఎక్కువగా పెడతాయి. అయితే అవి పొదగవు. వాటిని నాటుకోళ్ల ద్వారా పొదిగించవచ్చు. ఈ కోళ్లు ఎక్కువ బరువు వస్తాయి. మాంసానికి, గుడ్లకు రెండింటికి ఉపయోగపడుతాయి.
ధనలక్ష్మి : కోళ్లకు ఏఏ రోగాలు వస్తాయి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
జేడీ : ప్రతి కుటుంబంలో పాడి-పంట ఉండాలి. దీనికి కోళ్ల పెంపకం ఉంటే అదనపు ఆదాయం వస్తుంది. కోళ్లకు మసూచి, కొక్కెర తెగుళ్లు వచ్చే ప్రమాదం ఉంది. వీటికి కూడా టీకాలు వేస్తాం. పెరటి కోళ్ల పెంపకం లాభసాటిగా ఉంటుంది.
పద్మావతమ్మ : సార్ పాల ప్రగతి కేంద్రాల కింద తమిళనాడు నుంచి పాడి గేదెలు తెచ్చి ఇచ్చారు. ఇవి చూలు కట్టడం లేదు..
జేడీ : చూలు కట్టకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. గర్భకోశ సమస్యలతో చూలు కట్టకపోయే ప్రమాదం ఉంది. మీ గ్రామంలో ప్రత్యేకంగా ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించి గర్భకోశ వ్యాధులకు చికిత్స చేయిస్తాం.
మహిళ : సార్..నా పేరు లతీఫాబీ. దూడ చనిపోయింది. ఇందువల్ల పాల ఉత్పత్తి తగ్గిపోయింది. కంతులు కట్టడం కష్టంగా ఉంది.
జేడీ : దూడ లేకపోయినా పశు పోషణకు ఇబ్బంది లేదు. అయితే పచ్చిమేత, దాణా తగినంత ఇవ్వాలి. అప్పుడు యథావిధిగా పాలు ఇస్తాయి. దూడల పరిరక్షణకు సునందిని పథకాన్ని అమలు చేస్తున్నాం. దీనివల్ల దూడల మరణాలను తగ్గించవచ్చు.
తిప్పన్న : సార్, మా గ్రామంలో గొర్రెలు ఎక్కువగా ఉన్నాయి. వర్షాకాలంలో ఎక్కువగా చనిపోతున్నాయి. గొర్రెలకు రాత్రి బస షెడ్లు ఏర్పరచాలి.
జేడీ : వర్షాకాలంలో గొర్రెలు తడుస్తుండటం, కలుషితమైన మేత తినడం, నీరు తాగడం వల్ల మరణాలు ఎక్కువగా ఉంటాయి. గొర్రెలకు బీమా సౌకర్యం కల్పించుకోవాలి. అప్పుడు చనిపోయినా పరిహారం లభిస్తుంది. గొర్రెలకు సామూహిక బీమా పథకం ఉంది. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. గొర్రెలకు రాత్రి బస షెల్టర్లు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది.
రాముడు : సార్, గొర్రెలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. ఈ దిశగా చర్యలు తీసుకోండి.
జేడీ : గొర్రెలకు అన్ని రకాల వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నాం. ప్రస్తుతం పీపీఆర్ వ్యాక్సిన్ వేయడం జరుగుతోంది. కొత్తగా పుట్టిన జీవాలు, ఆరు నెలల క్రితం వేయని జీవాలకు ఈ వ్యాక్సిన్ వేయించాలి. నట్టల నివారణ మందు కూడా ఉచితంగా తాపుతున్నాం. వీటిని సద్వినియోగం చేసుకోవాలి.
ఎంపీటీసీ సభ్యుడు శేఖర్ : సార్.. మా గ్రామం పశు సంపదకు నిలయం. కానీ గ్రామంలో నీటి సమస్య ఎక్కువగా ఉంది. పాడి పశువు పేయి కడగడానికి, వాటికి నీళ్లు తాపడానికి దూరం మంచినీళ్లు తెచ్చుకోవాల్సి ఉంది. నీటి సమస్యను తీర్చాలి.
జేడీ: పశు పోషణలో నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. పశువులు పరిశుభ్రంగా ఉంటేనే పాలు పరిశుభ్రంగా ఉంటాయి. అయితే నీటి సమస్య పరిష్కారం మా చేతిలో లేదు. అయినప్పటికీ నీటి సమస్య కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తాను.
ఎంపీటీసీ సభ్యుడు : సార్.. మహిళలకు పాడి గేదెలు ఇచ్చి వారి అభ్యున్నతికి దోహదపడ్డారు. ఎద్దుల బండ్లు ఇస్తే సౌకర్యంగా ఉంటుంది. చెరువులో నీళ్లు ఉన్నాయి. ఎద్దుల బండ్ల ద్వారా డ్రమ్ముల్లో తెచ్చుకోవచ్చు.
జేడీ : ఎద్దుల బండ్లు ఇవ్వడం కూడా పశుసంవర్ధక శాఖ చేపట్టడం లేదు. వీటిని సబ్సిడీపైన వ్యవసాయ శాఖ పంపిణీ చేస్తోంది. అవసరమైన వారికి ఎద్దుల బండ్లను వ్యవసాయ శాఖ జేడీ దృష్టికి తీసుకెళ్లి పంపిణీ చేసే విధంగా చూస్తాం.
జేడీ : ఏమ్మా.. పాల ఉత్పత్తి అధికంగా ఉంది కదా.. వీటికి మార్కెటింగ్ ఉందా ?
జుబేదాబీ : సార్.. గ్రామం పాలకోవకు ప్రసిద్ధి. ఇక్కడ ఉత్పత్తి చేసిన కోవాను వివిధ ప్రాంతాలకు తరలిస్తాం. ఉత్పత్తి అయిన పాలను బయటికి అమ్మం. కోవకు వినియోగిస్తాం. వచ్చిన పాలకోవకు వినియోగిస్తుండటం వల్ల పాలకు మంచి ధర వచ్చినట్లు అవుతోంది.
జేడీ : పాడి పశువులకు అజొల్లా మంచి పోషక విలువతో కూడిన దాణాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల దాణా ఖర్చు తగ్గుతుంది. అజొల్లా యూనిట్‌లను సబ్సీడీపై ఇస్తున్నాం.
వినియోగించుకున్నారా ?
ధనలక్ష్మి : సార్... చిన్న టేకూరు పశువైద్యాధికారి నాగరాజు అజొల్లా యూనిట్‌ల గురించి చెప్పారు. వాటిని వినియోగించుకున్నాం. ఇదిగో అజొల్లాను చూడండి. దీనిని దాణాలో కలిపి పాడి పశువులకు ఇస్తాం. దీనివల్ల పాల ఉత్పత్తి పెరుగుతోంది. వెన్నశాతం కూడా పెరిగింది.
జేడీ : ఏమ్మా నీ పేరేంటి?ఈ బర్రెలు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎలా పోషిస్తున్నారు?
మహిళ : సార్, నా పేరు జుబేదాబేగం. మేము స్వయం సహాయక సంఘాల్లో రాణిస్తున్నాం. మా గ్రామానికి డీఆర్‌డీఏ ద్వారా 15 గ్రూపులకు పాల ప్రగతి కేంద్రాలు మంజూరు చేశారు. ఒకసారి 5, మరోసారి 3 గ్రేడెడ్ ముర్రా జాతి పాడి గేదెలు మంజూరు చేశారు.
జేడీ : మరి వీటి ఆరోగ్య సంరక్షణపై అవగాహన ఉందా? పచ్చిమేత ఇస్తున్నారా? గేదెలకు వ్యాధి నిరోధక టీకాలు ఇస్తున్నారా?
జూబేదాబేగం : సార్.. ఈ గేదెలను తమిళనాడులో కొని మాకు పంపిణీ చేశారు. మొదట ఇవి ఈ వాతావరణానికి అనువుగా ఉంటాయో లేదోనని భయపడ్డాం. కానీ కొద్ది రోజుల్లోనే అలవాటు పడ్డాయి. వీటి కోసం ప్రత్యేకంగా ఏపీబీఎన్ గడ్డిని పెంచుతున్నాం. అజొల్లాను కూడా పెంచుతూ దాన్ని దాణాలో కలిపి ఇస్తున్నాం. క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు ఇస్తున్నాం. పశువుల్లో ఏమైనా అనారోగ్య సమస్యలు కనిపిస్తే వెంటనే చిన్న టేకూరు పశువైద్యాధికారికి చెబుతాం. వెంటనే వచ్చి చికిత్స చేస్తున్నారు.
జేడీ : పశుగ్రాసం వృథా చేసుకోకుండా ఉండేందుకు చాప్ కట్టర్లు ఇస్తున్నాం. మీరు తీసుకున్నారా ?
చంద్రకళ : తీసుకున్నాం సార్... యూనిట్ కాస్ట్ రూ.26 వేలు అయితే 50 శాతం సబ్సిడీతో తీసుకున్నాం. పశుగ్రాసాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి వినియోగిస్తున్నాం. ఇందువల్ల పశుగ్రాసం దుర్వినియోగం కావడం లేదు.
ధనలక్ష్మి : కొన్ని పాడి గేదెల్లో ఎద లక్షణాలు కనిపించడం లేదు. ఇందువల్ల ఈతకు ఎడం పెరుగుతోంది.
జేడీ : గేదెల్లో ఎద లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు దాదాపు 48 గంటలు ఉంటాయి. కొన్ని పశువులో మూగ ఎద లక్షణాలు ఉంటాయి. వీటిని గుర్తించడం కష్టం. ఎద లక్షణాలు కనిపించిన 12 గంటల తర్వాత కృత్రిమ గర్భధారణ సూది వేయించాలి.
జేడీ : సునందిని, క్షీర సాగర్ పథకాల గురించి తెలుసా...?
మహిళలు : తెలుసు సార్.. మా డాక్టరు వీటి గురించి చెప్పారు.
జేడీ: సునందిని పథకం దూడలకు ఉద్దేశించింది. యూనిట్ కాస్ట్ రూ.5 వేలు. ఇందులో లబ్ధిదారుని వాటా రూ.950 ఉంటుంది. దూడలకు మూడు విడతలుగా 237 కిలో దాణా ఇస్తాం. దూడలకు బీమా సౌకర్యం ఉంది. దీనివల్ల దూడలు త్వరగా పెరుగుతాయి. అదే విధంగా క్షీరసాగర్ పథకాన్ని అమలు చేస్తున్నాం. దీనివల్ల చాల ఉపయోగలు ఉన్నాయి. వీటిని వినియోగించుకోవాలి.
మహిళలు : జీవనాధారం కోసం పొట్టేళ్లు, గొర్రెల యూనిట్లు కావాలి. సార్.. ఇప్పించండి.?
జేడీ : పొట్టేళ్ల యూనిట్ల గొర్రెల యూనిట్ పంపిణీ చేయాలనే ప్రతిపాదన ఉంది. ఇది అమలులోకి వచ్చినప్పుడు తప్పకుండా ప్రాధాన్యం ఇస్తాం.
మిహ ళలు: సార్ ఈ గ్రామం పాలకోవాకు ప్రసిద్ధి చెందింది. దీనిని మరింత లభివృద్ధి చేసేందుకు ప్రొత్సాహం లేదు. తగిన చేయూత ఇవ్వాలి.
జేడీ : పాలకోవా తయారీని చిన్న తరహా పరిశ్రమగా గుర్తించి బ్యాంకుల ద్వారా చేయూత ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం.
పాల ఉత్పత్తి పెంచుతాం..
Published Mon, Mar 9 2015 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 10:31 PM
Advertisement
Advertisement