ఆదిలాబాద్: ‘పడకేసిన వసతులు’ శీర్షికన ఈనెల 6న ‘సాక్షి’ మెయిన్ పేజీలో ప్రచురితమైన కథనా నికి కలెక్టర్ రాహుల్ రాజ్ స్పందించారు. రిమ్స్‌లో పడకలు సరిపోక రోగులు తిప్పలు పడుతున్నారు. ఒకే పడకపై ఇద్దరు, ముగ్గురేసి ఉన్నారనే విషయాన్ని ప్రస్తావించగా.. స్పందించిన కలెక్టర్ శుక్రవారం ఆస్పత్రిని తనిఖీ చేశారు.
ఎమర్జెన్సీ, ఫీవర్ వార్డులతో పాటు ఇతర వార్డుల్లో కలియ తిరిగారు. అందుతున్న వైద్యసేవల వివరాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డైరెక్టర్‌ను ఆదేశించారు. జిల్లాలో ఈనెలలో ఇప్పటివరకు 12 డెంగీ, రెండు మలేరియా కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.
పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించినట్లు వివరించారు. వారానికి రెండుసార్లు డ్రైడే పాటించాలన్నారు. నీరు నిల్వ ఉండకుండా చూడాలని తెలిపారు. వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. కలెక్టర్ వెంట రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్‌వో నరేదంర్ రాథోడ్, జిల్లా మలేరియా నివారణ అధికారి శ్రీధర్, రిమ్స్ సూపరింటెండెంట్ అశోక్, వైద్యులు సుమలత, శ్యాంప్రసాద్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment