colleceter
-
దళితబంధు కేవళం ఆ నేతలకేనా..!
కామారెడ్డి: అధికార పార్టీ నాయకులు, వారి అనుచరులకే దళిత బంధు ఇస్తున్నారని భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన దళితులు ఆరోపించారు. గ్రామానికి చెందిన సుమారు 80 మంది దళితులు గురువారం కలెక్టరేట్‌కు తరలివచ్చారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్‌లోనికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీలు దళితబంధు తీసుకోవడంతో పాటు వారి అనుచరులు, బంధువులకు ఇప్పించుకున్నారన్నారు. గ్రామంలో 500 దళిత కుటుంబాలు ఉన్నాయని 15 మందికే పథకం లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. లబ్ధిపొందినవారిలో ఒక్కరు కూడా అర్హులు లేరన్నారు. ఇతర పార్టీల వారికి ఇవ్వబోమని బహిరంగంగానే చెబుతున్నారన్నారు. అధికారులు స్పందించి విచారణ జరిపించి, అర్హులకే దళితబంధు వచ్చేలా చూడాలని కోరారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందించారు. -
‘మీడియా’ కథనంతో.. రిమ్స్‌ను తనిఖీ చేసిన కలెక్టర్..!
ఆదిలాబాద్: ‘పడకేసిన వసతులు’ శీర్షికన ఈనెల 6న ‘సాక్షి’ మెయిన్ పేజీలో ప్రచురితమైన కథనా నికి కలెక్టర్ రాహుల్ రాజ్ స్పందించారు. రిమ్స్‌లో పడకలు సరిపోక రోగులు తిప్పలు పడుతున్నారు. ఒకే పడకపై ఇద్దరు, ముగ్గురేసి ఉన్నారనే విషయాన్ని ప్రస్తావించగా.. స్పందించిన కలెక్టర్ శుక్రవారం ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఎమర్జెన్సీ, ఫీవర్ వార్డులతో పాటు ఇతర వార్డుల్లో కలియ తిరిగారు. అందుతున్న వైద్యసేవల వివరాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డైరెక్టర్‌ను ఆదేశించారు. జిల్లాలో ఈనెలలో ఇప్పటివరకు 12 డెంగీ, రెండు మలేరియా కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించినట్లు వివరించారు. వారానికి రెండుసార్లు డ్రైడే పాటించాలన్నారు. నీరు నిల్వ ఉండకుండా చూడాలని తెలిపారు. వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. కలెక్టర్ వెంట రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్‌వో నరేదంర్ రాథోడ్, జిల్లా మలేరియా నివారణ అధికారి శ్రీధర్, రిమ్స్ సూపరింటెండెంట్ అశోక్, వైద్యులు సుమలత, శ్యాంప్రసాద్ తదితరులు ఉన్నారు. -
'గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లపై'.. కలెక్టర్ సమీక్ష..!
పెద్దపల్లి: జిల్లా వ్యాప్తంగా గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని, అందుకనుగుణంగా సంబంధిత శాఖల అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం మండపాల నిర్వహణ, నిమజ్జనం ఏర్పాట్లపై అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, డీసీపీ వైభవ్‌గైక్వాడ్‌తో కలిసి సమీక్షించారు. అన్ని మండలాలు, గ్రామాల్లో ఏర్పాటు చేసే గణేశ్‌మండప నిర్వాహకులు అధికారుల వద్ద పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పోలీసు, రెవెన్యూ ఇతర శాఖల అధికారులు స్థానికంగా సమావేశమై ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. నిమజ్జనానికి అవసరమైన క్రేన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. గణపతి ఉత్సవాల సందర్భంగా గట్టి నిఘా ఉంటుందని, వివాదాలు సృష్టిస్టేందుకు యత్నించే వారిపై చట్టపరమైన చర్యలుంటాయని డీసీపీ పేర్కొన్నారు. ఆర్డీఓలు మధుమోహన్, హనుమనాయక్, ఏఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
బహిరంగ ప్రదేశాల్లో చవితి వేడుకలకు అనుమతిలేదు..
సాక్షి,గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): కోవిడ్ థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో వినాయక చవితి వేడుకలను ఈ ఏడాది కూడా నిరాడంబరంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ జె.నివాస్ గురువారం ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రెవెన్యూ డివిజన్, మండల, గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని రెవెన్యూ, సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై విజయవాడ, నూజివీడు, మచిలీ పట్నం, గుడివాడ రెవెన్యూ డివిజన్ల సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల పదో తేదీన వినాయక చవితిని పురస్కరించుకుని ఇంటిలో మాత్రమే పూజలకు పరిమితం కావాలని భక్తులను కోరారు. చవితి వేడుకల్లో భాగంగా బహిరంగ ప్రదేశాలు, కూడళ్లలో గణనాథుని విగ్రహాలను ఏర్పాటు చేయొద్దని, నిమజ్జన కార్యక్రమాలు జరపొద్దని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. వినాయక చవితి నిర్వహణ కమిటీలు పూర్తిస్థాయిలో జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు రెవెన్యూ డివిజన్, మండల, మున్సిపాలిటీ స్థాయిలో వినాయక చవితి నిర్వహణ కమిటీ ప్రతినిధులు, స్థానిక ప్రముఖులను ఆహ్వానించి, వారితో సమావేశాలు నిర్వహించి, వారికి అవగాహన కల్పించాలని కలెక్టర్ నివాస్ ఈ సందర్భంగా ఆదేశించారు. ప్రజలు గుమిగూడకుండా ఉండడమే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. ప్రజలు అందరూ సహకరించాలని విజ్ఞప్తిచేశారు. చదవండి: అక్కడ రూపాయికే ఇడ్లీ: ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే.. -
‘ఆ డివిజన్లో అప్రమత్తంగా ఉండాలి’
సాక్షి, కర్నూలు: జిల్లాలో ఇప్పటివరకు 547 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కలెక్టర్ వీరపాండ్యన్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 191 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొన్నారు. విశ్వభారతి కోవిడ్ ఆసుపత్రి నుంచి 80 ఏళ్ల వృద్ధుడు, ఒకటిన్నర ఏళ్ల చిన్నారిని ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేశామని చెప్పారు. ఆదోనిలో వలసకు వెళ్ళిన వారిలో ఒక్కరికీ కరోనా వైరస్ సోకిందని.. ఆ డివిజన్ లో అప్రమత్తం ఉండాలని ప్రజలకు సూచించారు. అక్కడ కరోనా కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. (ఏపీలో కొత్తగా 54 కరోనా కేసులు..) బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌కు చెందినవారిని తరలించామని కలెక్టర్ పేర్కొన్నారు. మూడు రైళ్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు చెందినవారిని తరలించామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చేవారి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు కరోనా పరీక్ష చేయించుకోవాలని, లేదంటే క్వారంటైన్లో ఉండాలని తెలిపారు. విశాఖ ఘటనను దృష్టిలో ఉంచుకుని 5 ఫ్యాక్టరీల్లో తనిఖీలు చేస్తున్నామని కలెక్టర్ వీరపాండ్యన్ పేర్కొన్నారు. (కరోనా ఖతం!) లాక్డౌన్ పటిష్టంగా అమలు: ఎస్పీ ఫక్కీరప్ప జిల్లాలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నామని ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. లాక్డౌన్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అత్యవసర సేవల అనుమతి కోసం 9 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. 419 దరఖాస్తులకు మాత్రమే అనుమతులు ఇస్తున్నామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి 10,812 వాహనాలు సీజ్ చేశామని ఎస్పీ ఫక్కీరప్ప పేర్కొన్నారు. -
ఉందిలే మంచికాలం ముందుముందునా..
సాక్షి, ఏలూరు (మెట్రో): పంచాంగ శ్రవణంలో జిల్లాలో అనుకూలమైన అంశాలున్నాయని పండితులు తెలిపారు. రైతులకు సాగునీటికి కొరత ఉండదని, వారి పరిస్థితి కూడా బాగుంటుందని చెప్పారు. శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలను శనివారం కలెక్టర్ కార్యాలయంలోని గోదావరి సమావేశ మందిరంలో జ్యోతిని వెలిగించి కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ప్రారంభించారు. పండితులు తాడికొండ నరసింహరావు, కాశిభొట్ల ప్రసాద్ సంయుక్తంగా పంచాంగ శ్రవణం చేశారు. జిల్లాకు బాగుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో మిగిలిన జిల్లాల కన్నా పశ్చిమ గోదావరి జిల్లా అగ్రభాగాన ఉండేందుకు అవసరమైన సహజ వనరులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజల సహకారంతో అభివృద్ధిలో జిల్లాను నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసేందుకు సిద్ధం కావాలన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో నిజమైన లబ్ధిదారులకు నూరుశాతం చేరినప్పుడే అభివృద్ధి కల సాకారమవుతుందన్నారు. మనం చేసే పని సానుకూల దృక్పథంతో చేస్తే సత్ఫలితాలు సాధించగలమన్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు తెలియజేయవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. వేద పండితులు యనమండ్ర రవిప్రకాష్ శర్మ, పిరాట్ల ఆదిత్య శఱ్మ, కూచిబొట్ల సచ్చితానంద ప్రసాద్ వేదపఠనం చేసి, వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం గండికోట రాజేష్ శిష్యబృందం ప్రదర్శించిన ఉగాది స్వాగత నృత్యం, జిల్లా ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ ప్రదర్శించిన నృత్యం సభికులను ఆకట్టుకుంది. అనంతరం వేద పఠనం, పంచాంగ శ్రవణకర్తలను కలెక్టర్ సత్కరించారు. కలెక్టర్‌కు జేసీ ఎం.వేణుగోపాలరెడ్డి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఉత్తమ కలెక్టర్‌కు సన్మానం
సాక్షి, మెట్‌పల్లిరూరల్: జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్‌ను మెట్పల్లి మండల సర్పంచ్‌లు బుధవారం శాలువాలు, పూలగుఛ్చంతో సన్మానించారు. జాతీయ స్థాయిలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంస్థ అందించే ఉత్తమ కలెక్టర్ అవార్డుకు ఎంపికయినందుకు ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మండల సర్పంచ్ల ఫోరం కన్వీనర్ ఆకుల రాజరెడ్డి, బద్దం శేఖర్ రెడ్డి, శ్రీనివాస్, జంగిటి అంజయ్య, శంకర్ నాయక్, డీపీవో లక్ష్మీనారాయణ పాల్గొన్నారు -
నేడో, రేపో..కలెక్టర్ బదిలీ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లా కలెక్టర్ మణికొండ రఘునందన్‌రావు బదిలీ కానున్నారు. ఒకట్రెండు రోజుల్లో జరిగే ఐఏఎస్‌ల బదిలీ జాబితాలో ఆయన పేరు కూడా ఉండనుంది. మూడున్నరేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న రఘునందన్‌రావు జిల్లా పాలనలో తనదైన ముద్ర వేశారు. గరిష్టంగా మూడేళ్లకే బదిలీ చేసే ప్రభుత్వం.. ఆయన పనితీరు సంతృప్తికరంగా ఉండడంతో కొనసాగించింది. రంగారెడ్డి జిల్లా చరిత్రలో ఎక్కువ కాలం పనిచేసిన అధికారిగా రికార్డు సృష్టించారు. 2015 జనవరి రెండో వారంలో కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన రఘునందన్‌రావు.. ప్రభుత్వ విధానపర నిర్ణయాల్లోనూ కీలక భూమిక పోషించారు. జిల్లాల పునర్విభజన, భూ రికార్డుల ప్రక్షాళన, రైతు బంధు పథకాల రూపకల్పనలో టాస్క్‌ఫోర్స్ కమిటీలకు నేతృత్వం వహించారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఉద్యోగుల విభజనలో ముఖ్య పాత్ర పోషించారు. స్టడీ టూర్ కూడా.. రఘునందన్‌రావు వచ్చే నెలలో అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్తున్న ఆయన ఆరు నెలలపాటు అక్కడే ఉంటారు. ఈ నేపథ్యంలో బదిలీ అనివార్యంగా మారింది. దీనికితోడు ముందస్తు ఎన్నికల ఊహగానాలు కూడా కలెక్టర్ బదిలీపై ప్రభావం చూపుతున్నాయి. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ మొదలు కానున్నందున జిల్లా ఎలక్ట్రోరల్ అధికారిగా వ్యవహరించే కలెక్టర్ మార్పు కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇవ్వాల్సివుంటుంది. ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోవడానికి జాబితా సవరణ మొదలు కాకమునుపే బదిలీ చేయడం ఉత్తమమని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఒకట్రెండు రోజుల్లో ఆయన మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఏడాది కార్యదర్శి హోదా కూడా సాధించిన రఘునందన్‌రావు.. సాధారణ బదిలీల్లో తన పేరు ఉంటుందని భావించారు. అయితే, విలువైన భూములు ఉన్న రంగారెడ్డి జిల్లాలో సమర్థ అధికారిగా రాణించిన కలెక్టర్‌ను మార్చడం వల్ల పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన బదిలీకి ఆసక్తి చూపలేదు. కోర్టుల్లో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తినా, కోర్టు ధిక్కారం కేసులు నమోదైనా రఘునందన్‌రావుకు వెన్నంటి నిలిచారు. -
వసతి గృహ నిర్వాహకులపై కలెక్టర్ ఆగ్రహం
మంచిర్యాలసిటీ: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంట ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహ నిర్వాహకులపై జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కలెక్టర్ వసతి గృహాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష కోసం ఉచిత శిక్షణ పొందుతున్న విద్యార్థులను వసతి గృహంలో సౌకర్యాలు, వసతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీంతో విద్యార్థులు భోజనం, సౌకర్యాలు, వసతి సరిగ్గా లేదని వివరించారు. దీంతో ఆయన వసతిగృహ, ఇంజినీరింగ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించి సిబ్బందిపై అగ్రహం వెలిబుచ్చారు. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని, పద్ధతి మార్చుకోవాలని, లేనిచో చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. కంప్యూటర్ ద్వారా అదనపు పరిజ్ఞానం నేర్చుకోవాలని, ప్రవేశ పరీక్షలపై పలు సూచనలు, సలహాలు విద్యార్థులకు ఇచ్చారు. ఇందులో డీఆర్వో ప్రియాంక, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి గంగారాం, డీఐఈవో బీనారాణి, ఏటిడబ్ల్యూ నీలిమ, సిబ్బంది ఉన్నారు -
బతికినవి 42 శాతమే!
చారకొండ : మండల పరిధిలో హరితహారం అబాసుపాలవుతోంది. నాటిన మొక్కలు సగానికంటే ఎక్కువగానే ఎం డిపోయాయి. కేవలం 42శాతం మొ క్కలు మాత్రమే బతికాయని అధికారులే చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం అమలు తీరు ఎలా ఉందో అర్థమవుతోంది. నాటినవి లక్షా 60 వేలు.. మండల పరిధిలోని జూపల్లి, తిమ్మాయిపల్లి, తుర్కలపల్లి, సిరుసనగండ్ల, చారకొండ, చంద్రాయన్పల్లి, గోకారం తదితర గ్రామాల్లో 1లక్ష 60వేల మొక్కలు నాటారు. ప్రస్తుతం 42శాతం మొక్కలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల వద్ద నాటిన మొక్కలు మాత్రమే ఆయా యజమాన్యాల చొరవతో మొక్కలు సజీవంగా ఉన్నాయి. గ్రామాలలో రోడ్లపై, ఖాళీస్థలాలలో నాటిన మొక్కలను బతికించే బాధ్యత మండల పరిషత్ అధికారులకు ఉన్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కలెక్టర్ ఆదేశించినా.. మొక్కలను పెంచే బాధ్యత మండల పరిషత్ అధికారులదేనని కలెక్టర్ చెప్పినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో నాటిన మొక్కలు చనిపోయాయి. ఇన్చార్జ్ ఎంపీడీఓగా వంగూరు మండల అధికారి హిమబిందును నియమించ డంతో ఆమె వంగూరుకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో హరితహారం భవి తవ్యం ప్రశ్నార్థకమంగా మా రుతోంది. నిర్లక్ష్యం తగదు... ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని అదికారుల నిర్లో్యంతో నీరుగారుస్తంన్నారు. మొక్కలు నాటి వాటివంక చూడకుండా పోతున్నారు. మాగ్రామంలో ఎంతో హడావిడిగా దేవాలయాలవద్ద, రోడ్లవద్ద, మజీద్‌లవద్ద మొక్కలు నాటారు. నీరులేక ఎండిపోయాయి. ప్రభుత్వ అదికారులు మొక్కలు సంరక్షించే బాధ్యత మరిచి పోయారు. కాలుష్య నివారణకు, వర్షాలు సమృద్ధిగా కురవడానికి ప్రకృతిలో మొక్కల పాత్ర ప్రధానమైనది. మొక్కలు పెంచడంలో నిర్లక్షం వహించరాదు. – జగపతి, జూపల్లి -
పోలీస్ సేఫ్..?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : అన్యాయంగా అట్రాసిటీ కేసులో ఇరుక్కొని బలవన్మరణం పొందిన నెన్నెలకు చెందిన రంగు రామాగౌడ్ కేసులో పోలీసుల పాత్ర చర్చనీయాంశమైంది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఎస్టీ కాని పల్ల మహేష్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై అట్రాసిటీ చట్టాన్ని ప్రయోగించడంతోనే రామాగౌడ్ మనస్తాపంతో బలవన్మరణం పొందినట్లు నిర్ధారణ అయింది. ఫిర్యాదుదారు పల్ల మహేష్‌కు తహసీల్ధార్ సత్యనారాయణ జారీ చేసిన ఎస్టీ ధ్రువీకరణ పత్రం సరైనదో.. కాదో తేల్చేందుకు రామాగౌడ్ మృతి తరువాత జిల్లా కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ బెల్లంపల్లి సబ్ కలెక్టర్ రాహుల్‌రాజ్‌ను విచారణాధికారిగా నియమించగా, ఆయన నిజాన్ని నిగ్గు తేల్చారు. పల్ల మహేష్ బీసీ అని, తహసీల్దార్ ఎస్టీ ధ్రువీకరణ పత్రం జారీ చేశారని ఈనెల 26న కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. ఈ మేరకు తహసీల్దార్‌ను రాత్రికి రాత్రే సస్పెండ్ చేశారు. తహసీల్దార్ సస్పెన్షన్‌తో రామాగౌడ్ ఆత్మహత్యకు తప్పుడు ఎస్టీ ధ్రువీకరణపత్రంతో నమోదైన అట్రాసిటీ కేసే కారణమని స్పష్టమైంది. అయినా... తప్పుడు సర్టిఫికేట్‌తో ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తి మీద ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. ఫిర్యాదు అందిన 24 గంటల్లో కేసు నమోదు చేయాలనేది నిబంధన. కానీ గొడవ జరిగిన రోజే తనపై పల్ల మహేష్ దాడి చేశాడని రామాగౌడ్ ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్ఐ కేసు నమోదు చేయలేదు. అదే సమయంలో మరుసటి రోజు పల్ల మహేష్ నుంచి ఫిర్యాదు అందిన అరగంటలోనే ఆగమేఘాల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ దాఖలైన తరువాత 13 రోజులకు విచారణకు వచ్చిన ఏసీపీ బాలుజాదవ్ ఎస్టీ అయిన పల్ల మహేష్ అనే వ్యక్తిని కులం పేరుతో దూషించినట్లు నిర్ధారించారు. ఇందుకు ఆయన తహసీల్దార్ ఇచ్చిన ఎస్టీ సర్టిఫికేట్‌నే పరిగణలోకి తీసుకున్నారే తప్ప, పల్ల మహేష్ తండ్రి బీసీ అని, మహేష్ చెల్లెలుకు బీసీ కులం సర్టిఫికేట్ జారీ అయిందనే విషయాన్ని పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో అనాథలైన రామాగౌడ్ భార్య సరస్వతి, కూతురు వసుధలకు తాత్కాలికంగా కొన్ని హామీలు ఇచ్చి కేసును నీరు గార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గొడవ జరిగిన నాడే ఫిర్యాదు చేసినా... నో యాక్షన్ నెన్నెల పెద్ద చెరువులో అక్రమంగా శనగపంట వేశాడని పల్ల మహేష్‌పై రామాగౌడ్ పత్రికలకు ఎక్కిన తరువాత డిసెంబర్ 12న గొడవ జరిగింది. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు వాటర్ ట్యాంక్ నుంచి నీళ్లు తెస్తున్న రామాగౌడ్, సర్పంచి ఇంటి నుంచి వస్తున్న పల్ల మహేష్‌కు గొడవ జరిగింది. వెంటనే తనను మహేష్ కొట్టినట్లు రామాగౌడ్ డిసెంబర్ 12న సాయంత్రం 6.30 గంటలకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలిసి మహేష్ మరుసటి రోజు డిసెంబర్ 13న మధ్యాహ్నం 2 గంటలకు రామాగౌడ్ మీద ఫిర్యాదు చేశాడు. ‘సర్పంచి ఇంటి నుంచి వస్తున్న తనను రామాగౌడ్ అడ్డగించి, కులం పేరుతో ధూషించాడని’ ఫిర్యాదు చేయగానే ‘ప్రివెంటివ్ ఆఫ్ అట్రాసిటీస్ సెక్షన్3’ కింద అరగంటలో అంటే మధ్యాహ్నం 2.30 గంటలకు ఎస్ఐ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీన్ని బట్టి కేసు నమోదు, తదుపరి చర్యల వెనుక నెన్నెల సర్పంచి భర్త, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు ఇబ్రహీం ఉన్నట్లు రామాగౌడ్ భార్య సరస్వతి, గీత కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. కేసు నమోదు కాగానే రామాగౌడ్ అజ్ఞాతంలోకి వెళ్లగా డిసెంబర్ 26న విచారణ కోసం నెన్నెల వచ్చిన ఏసీపీ బాలుజాదవ్‌కు స్థానికులు పల్ల మహేష్ ఎస్టీ కాదనే విషయాన్ని చెప్పినా వినలేదని వారు ఆరోపిస్తున్నారు. అప్పుడే కేసును అట్రాసిటీ చట్టం నుంచి తొలగించినట్లయితే రామాగౌడ్ బతికుండేవాడనేది వారి వాదన. తహసీల్దార్‌పై కలెక్టర్ చర్యతో సరా..? రామాగౌడ్ మృతి తరువాత ఈ కేసు తీవ్రతను గమనించిన కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ ఫిర్యాదుదారు పల్ల మహేష్‌కు జారీచేసిన ఎస్టీ ధ్రువీకరణ æపత్రంపై విచారణ జరపాల్సిందిగా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ రాహుల్‌రాజ్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఈనెల 26న నివేదిక ఇస్తూ... పల్ల మహేష్ ఎస్టీ కాదని తేల్చి చెప్పారు. ఆ వెంటనే కలెక్టర్ నెన్నెల తహసీల్దార్‌ను సస్పెండ్ చేశారు. కలెక్టర్ చర్యతో ఈ కేసు తప్పడుదని తేలిపోయింది. అయినా తదుపరి చర్యలకు పోలీస్ యంత్రాంగం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందో తెలియని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో రాజకీయ జోక్యంతో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. తహసీల్దార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఆధారంగానే కేసు నమోదు చేసినట్లు పోలీసులు తప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అదే సమయంలో రామాగౌడ్ ఫిర్యాదుపై కేసు ఎందుకు నమోదు చేయలేదనే దానికి సమాధానం లేదు. ఎమ్మెల్యేను న్యాయం చేయమన్న సరస్వతి... కాగా రామాగౌడ్ భార్య సరస్వతి మంగళవారం రూ.50వేల ఆర్థిక సాయం అందించేందుకు వచ్చిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వద్ద తన గోడు వెల్లబోసుకుంది. తన భర్త చావుకు కారణమైన పల్ల మహేష్, మండల కో ఆప్షన్ సభ్యుడిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు ఆయన కూడా హామీ ఇచ్చారు. ఏం చేస్తారో వేచిచూడాలి. -
జనగామ కలెక్టర్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు!
సాక్షి, హైదరాబాద్: తనపై లేనిపోని ఆరోపణలు చేసిన జనగామ కలెక్టర్ శ్రీదేవయానిపై సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అసెంబ్లీ స్పీకర్ ఎస్.మధుసూదనాచారికి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ చేసిన ఆరోపణలపై వివరణ ఇస్తూ ఓ లేఖను అందజేశారు. ఈ మేరకు అసెంబ్లీలో బుధవారం స్పీకర్‌తో సమావేశమై తన హక్కులకు భంగం కలిగించిన కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం, బాధ్యత తనపై ఉందని, 2,000 గజాల స్థలం తనపేరు మీద రిజిస్టర్ అయి ఉందన్న జనగామ కలెక్టర్ మాటలు అవాస్తవమని వివరించారు. తన పేరున గజం స్థలం రిజిస్టర్ అయి ఉంటే.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా సిద్ధమేనని పేర్కొన్నారు. అది దేవాలయ ట్రస్ట్ భూమి అని, దానికి చైర్మన్‌గా ఎమ్మెల్యే ఉంటాడని చెప్పారు. -
మెరుగైన వైద్య సేవలందించాలి
ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచాలి కలెక్టర్ వాకాటి కరుణ పాఠశాలలు, ఆస్పత్రుల సందర్శన అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష చిట్యాల : ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ప్రజల్లో ఇంకా నమ్మకం కలగడం లేదని, మెరుగైన వైద్యసేవలందించి వారిలో విశ్వాçÜం పెంచాలని కలె క్టర్ వాకాటి కరుణ అన్నారు. మండల కేంద్రంలోని సామాజిక వైద్యశాలను, జూకల్లు, తిర్మాలాపూర్, చిట్యాల ప్రభు త్వ పాఠశాలలను బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాఠశాలల్లో ఏమైనా సమస్యలుంటే హెచ్ఎంలు లిఖితపూ ర్వకంగా రాసి ఇవ్వాలని కోరారు. తిర్మాలాపూర్ పాఠశాల నిర్వహణ సక్రమంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేసారు. సివిల్ ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్, వార్డులను పరిశీలించి సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 113 రోజులలో 100 ప్రసూతి ఆపరేషన్లు చేయడం భేష్ అని వైద్యులను, సిబ్బందిని అభినందించారు. ఆస్పత్రిలో వైద్యుల, సిబ్బంది కొరత లేకుండా చూస్తామన్నారు. అనంతరం వెలిశాలలోని పీహెచ్‌సీని సందర్శించారు. కలెక్టర్ వెంట ములుగు ఆర్డీఓ మహేందర్‌జీ, జిల్లా కో ఆర్డినేటర్ ఆకుల సంజీవయ్య, జిల్లా ఉపవైద్యాధికారి చల్లా మధుసూదన్, తహశీల్దార్ పాల్‌సింగ్, ఎంపీడీఓ త్రివిక్రమరావు, సూపరింటెండెంట్ వాడే రవిప్రవీణ్‌రెడ్డి, వైద్యులు జయపాల్, తిరుపతి, పద్మ, నవత, అశోక్, శృతి, శ్రీకాంత్ ,మల్లికార్జున్, రాణి ఉన్నారు. అనంతరం స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో మెుక్కలు నాటారు. బాలికలతో కలిసి భోజనం చేశారు. సౌకర్యాలు, విద్యాబోధనను పరిశీలించి విజయవంతంగా నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్ జయశ్రీని అభినందించారు. అధికారులకు క్లాస్.. మండల పరిషత్ కార్యాలయంలో అభివృద్ధి పనులపై నియోజకవర్గ స్థాయి అధికారులతో కలెక్టర్ రివ్యూ ని ర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో పర్యవేక్షణ లోపిస్తోందని ఎంఈఓల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు పని తీరు మెరుగు పరుచుకోవాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవాలు జరగాలి రేగొండ : ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవాలు జరిగేలా సిబ్బంది చర్యలు చేపట్టాలని కలెక్టర్ వాకాటి కరుణ అ న్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి, కస్తూర్బా ఆశ్రమ పాఠశాల,హైస్కూళ్లను తని ఖీ చేశారు. ఆస్పత్రి సిబ్బంది పనితీరుపై అగ్రహం వ్య క్తం చేశారు. సీనియర్ అసిస్టెంట్ శాంతిలత కొంత కా లంగా విధులకు రాకపోవడంపై డాక్టర్ కృష్ణవేణిని వి వరణ అడిగారు. శాంతిలత పనితీరు వివరించడంతో వెంటనే అమెను సరెండర్ చేయాలని,రెండో ఎఎన్ఎంలు సమ్మెలో ఉన్నందున వారి వేతనాలు నిలిపివేయాలని ఆదేశించారు. విధులకు సక్రమంగా రాకుంటే చర్య తప్పదని హెచ్చరించారు. అనంతరం కస్తూర్బా ఆశ్రమ పాఠశాల విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఉన్నత పాఠశాలను సందర్శించి పరిశుభ్రంగా లేకపోవడంతో హెచ్ఎం దేవేందర్‌రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వెంట తహశీల్దార్ శ్రీరాం మల్లయ్య, ఎంపీడీఓ దుబాసి రవీందర్, వీఆర్వోలు శ్రీనివాస్, సుభాష్ ఉన్నారు. -
హరితహారం వేగం పెంచండి
మొక్కలు నాటడం ఆపొద్దు కలెక్టర్ నీతూప్రసాద్ ముకరంపుర: హరితహారం కార్యక్రమం వేగం పెంచి జిల్లాలో విరివిగా మొక్కలు నాటే లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ నీతూప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి జిల్లాలోని తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, స్పెషల్ ఆఫీసర్లతో హరితహారం అమలుపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో ఆదివారం వరకు 1.81కోట్ల మొక్కలు నాటామని తెలిపారు. వివిధ నర్సరీల్లో ఇంకా 1.70 కోట్ల మొక్కలు అందుబాటులో ఉన్నాయన్నారు. పంచాయతీరాజ్ రోడ్లకిరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. ప్రతీ గ్రామంలో 40వేల మొక్కలు నాటాలన్నారు. ప్రభుత్వస్థలాల్లో సామూహిక మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని, వాటి రక్షణకు బోర్వెల్లు మంజూరు చేస్తామని తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలలో విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. జిల్లాలో 28మండలాల నుంచి హరితహారం మండల ప్రణాళికలు అందలేదని, వెంటనే పంపించాలని ఆదేశించారు. గ్రామాలలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పశ్చిమ, తూర్పు డీఎఫ్‌వోలు వినోద్‌కుమార్, రవికిరణ్, డ్వామా పీడీ వెంకటేశ్వర్రావు, డీఆర్వో వీరబ్రహ్మయ్య, పంచాయతీరాజ్ ఎస్ఈ దశరథం, జెడ్పీ సీఈవో సూరజ్‌కుమార్ పాల్గొన్నారు.