సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లా కలెక్టర్ మణికొండ రఘునందన్‌రావు బదిలీ కానున్నారు. ఒకట్రెండు రోజుల్లో జరిగే ఐఏఎస్‌ల బదిలీ జాబితాలో ఆయన పేరు కూడా ఉండనుంది. మూడున్నరేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న రఘునందన్‌రావు జిల్లా పాలనలో తనదైన ముద్ర వేశారు. గరిష్టంగా మూడేళ్లకే బదిలీ చేసే ప్రభుత్వం.. ఆయన పనితీరు సంతృప్తికరంగా ఉండడంతో కొనసాగించింది. రంగారెడ్డి జిల్లా చరిత్రలో ఎక్కువ కాలం పనిచేసిన అధికారిగా రికార్డు సృష్టించారు.
2015 జనవరి రెండో వారంలో కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన రఘునందన్‌రావు.. ప్రభుత్వ విధానపర నిర్ణయాల్లోనూ కీలక భూమిక పోషించారు. జిల్లాల పునర్విభజన, భూ రికార్డుల ప్రక్షాళన, రైతు బంధు పథకాల రూపకల్పనలో టాస్క్‌ఫోర్స్ కమిటీలకు నేతృత్వం వహించారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఉద్యోగుల విభజనలో ముఖ్య పాత్ర పోషించారు.
స్టడీ టూర్ కూడా..
రఘునందన్‌రావు వచ్చే నెలలో అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్తున్న ఆయన ఆరు నెలలపాటు అక్కడే ఉంటారు. ఈ నేపథ్యంలో బదిలీ అనివార్యంగా మారింది. దీనికితోడు ముందస్తు ఎన్నికల ఊహగానాలు కూడా కలెక్టర్ బదిలీపై ప్రభావం చూపుతున్నాయి. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ మొదలు కానున్నందున జిల్లా ఎలక్ట్రోరల్ అధికారిగా వ్యవహరించే కలెక్టర్ మార్పు కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇవ్వాల్సివుంటుంది.
ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోవడానికి జాబితా సవరణ మొదలు కాకమునుపే బదిలీ చేయడం ఉత్తమమని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఒకట్రెండు రోజుల్లో ఆయన మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఏడాది కార్యదర్శి హోదా కూడా సాధించిన రఘునందన్‌రావు.. సాధారణ బదిలీల్లో తన పేరు ఉంటుందని భావించారు. అయితే, విలువైన భూములు ఉన్న రంగారెడ్డి జిల్లాలో సమర్థ అధికారిగా రాణించిన కలెక్టర్‌ను మార్చడం వల్ల పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన బదిలీకి ఆసక్తి చూపలేదు. కోర్టుల్లో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తినా, కోర్టు ధిక్కారం కేసులు నమోదైనా రఘునందన్‌రావుకు వెన్నంటి నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment