విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు కలెక్టర్ ఆర్వీ కర్ణన్
మంచిర్యాలసిటీ: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంట ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహ నిర్వాహకులపై జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కలెక్టర్ వసతి గృహాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష కోసం ఉచిత శిక్షణ పొందుతున్న విద్యార్థులను వసతి గృహంలో సౌకర్యాలు, వసతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీంతో విద్యార్థులు భోజనం, సౌకర్యాలు, వసతి సరిగ్గా లేదని వివరించారు.
దీంతో ఆయన వసతిగృహ, ఇంజినీరింగ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించి సిబ్బందిపై అగ్రహం వెలిబుచ్చారు. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని, పద్ధతి మార్చుకోవాలని, లేనిచో చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.
కంప్యూటర్ ద్వారా అదనపు పరిజ్ఞానం నేర్చుకోవాలని, ప్రవేశ పరీక్షలపై పలు సూచనలు, సలహాలు విద్యార్థులకు ఇచ్చారు. ఇందులో డీఆర్వో ప్రియాంక, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి గంగారాం, డీఐఈవో బీనారాణి, ఏటిడబ్ల్యూ నీలిమ, సిబ్బంది ఉన్నారు
Comments
Please login to add a commentAdd a comment