no toilets
-
విద్యార్థినుల ఆత్మగౌరవ సమస్య
సాక్షి, కాటారం: ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొస్తున్న ప్రభుత్వ పెద్దలు, అధికారుల మాటలు నీటిమూటలుగా మారిపోతున్నాయి. కేజీ టు పీజీ విద్య అమలులో భాగంగా ప్రభుత్వం నూతన భవన నిర్మాణాలకు కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నప్పటికీ గత విద్యా సంస్థల భవనాల్లో నెలకొన్న సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలో లక్షల రూపాయలు వెచ్చించి భవనాలు నిర్మించినప్పటికీ కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)లో మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థులు, సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. ఆది నుంచి అంతే.. కాటారం మండలంలో 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీఐ కళాశాలను ఏర్పాటు చేసింది. సరైన భవన నిర్మాణం లేకపోవడంతో తాత్కాలికంగా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన భవనంలో తరగతుల నిర్వహణ కొనసాగించారు. గత కొన్నాళ్ల పాటు కళాశాల అదే భవనంలో కొనసాగగా పాఠశాలకు తరగతుల కొరత ఏర్పడడంతో భవనం పాఠశాలకు అనివార్యమైంది. దీంతో అదే పాఠశాల భవన సముదాయం ఆవరణలో అప్పటి కాంగ్రెస్ హయాంలో రూ.40లక్షల నక్సల్స్ ప్రభావిత ప్రాంత అభివృద్ది నిధుల(ఐఏపీ) ద్వారా నిర్మించిన భవనంలోకి కళాశాలను మార్చి తరగతులు చేపడుతున్నారు. సివిల్, కోపా, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ లాంటి ట్రేడ్స్ అందుబాటులో ఉండటంతో కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగిపోయింది. మారుమూల గ్రామాలకు కళాశాల అందుబాటులో ఉండడంతో విద్యార్థినులు అధిక సంఖ్యలో ప్రవేశం పొందారు. కానీ కళాశాలలో మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థినులు, మహిళా అధ్యాపకుల ఆగచాట్లు వర్ణనాతీతంగా మారాయి. కళాశాలకు సరైన భవనం నిర్మాణం చేపట్టినప్పటికీ మరుగుదొడ్ల నిర్మాణం మాత్రం లేకపోవడంతో విద్యార్థినులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమీపంలోని పాఠశాలకు సంబంధించిన మరుగుదొడ్లు వినియోగిస్తున్నా కొన్ని సార్లు పాఠశాల తరఫున అభ్యంతరాలు ఎదురవుతున్నట్లు విద్యార్థినులు తెలిపారు. అంతేకాకుండా సెలవు దినాల్లో ఈ పరిస్థితి మరింత అయోమయంగా ఉంటున్నట్లు వారు పేర్కొన్నారు. సెలవు రోజుల్లో పాఠశాల మరుగుదొడ్లకు తాళం వేసి ఉంటుండడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియని అయోమయమైన దుస్థితి ఉంటుందని వాపోయారు. లక్షలు వెచ్చించి భవనాలు నిర్మించినప్పటికీ మరుగుదొడ్లు మాత్రం నిర్మించకపోవడం దారుమని వాపోతున్నారు. ఇంత పెద్ద కళాశాలలో సౌకర్యాలు సరిగా లేకపోవడం శోచనీయం అని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్డి నిర్మాణం మహిళల ఆత్మగౌరవ సమస్యగా చెప్పుకొస్తూ గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు ప్రభుత్వం సంస్థల్లోనే మరుగుదొడ్ల నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఐటీఐలో మరుగుదొడ్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు, మహిళా సిబ్బంది కోరుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇదే దుస్థితి.. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సైతం సమస్యలకు నిలయంగా మారింది. పక్కా భవనం ఉన్నప్పటికి సరైన సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి నూతన భవనం నిర్మించారు. మరుగుదొడ్లు వినియోగంలో లేకపోవడంతో విద్యార్థుల సమస్య వర్ణానాతీతంగా మారిపోయింది. ఒంటికి రెంటికి కిలో మీటరు దూరం వెళ్లాల్సిన దుస్థితి నెలకొంటుందని విద్యార్థులు తెలుపుతున్నారు. భవనం నిర్మించి ఏళ్లు గడుస్తున్నప్పటికీ మరుగుదొడ్ల వాడకంలో రాకపోవడంతో తిప్పలు తప్పడం లేదు. పురాతన షెడ్డు ఆవరణలో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ అవి శిథిలావస్థకు చేరడంతో వినియోగించలేని పరిస్థితి ఉంది. నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లు నీటి సౌకర్యం లేక ఉపయోగంలోకి రావడం లేదు. ఇటీవల పలు విద్యార్థి సంఘాల నాయకులు ఐటీఐ, ప్రభుత్వ కళాశాలలోని అసౌకర్యాలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన స్థానిక ఎంపీపీ పంతకాని సమ్మయ్య, ప్రజాప్రతినిధులు విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. పరిష్కారానికి ఉన్నతాధికారుల దృష్టికి తీసు కెళ్తామని హామీ ఇచ్చారు. ఏదేమైనా జిల్లా స్థాయి కళాశాలలు ఈ ప్రాంతంలో ఉన్నప్పటీకీ సౌకర్యాల లేమి వెంటాడుతుండటంతో విద్యా ర్థులు కళాశాలలకు రావడానికి ఆసక్తి చూపడం లేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరుగుదొడ్లు లేక ఇబ్బందులు కళాశాలలో మరుగుదొడ్లు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కళాశాలలో ఉంటాం. అత్యవసర సమయాల్లో మరుగుదొడ్ల అవసరం ఎంతగానో ఉంటుంది. కళాశాలకు వచ్చిందంటే వెళ్లే వరకు మా పరిస్థితి అయోమయంగా నెలకొంటుంది. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. – రమ్య, ఐటీఐ, ప్రథమ సంవత్సరం విద్యార్థిని పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలి కళాశాలలో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలి. ఇంత పెద్ద కళాశాల అయినప్పటికీ తగిన సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. మలమూత్ర విసర్జన కోసం మైలు దూరం వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటి వరకు మా సమస్యను పట్టించుకునే వారే లేరు. – రాజేశ్, విద్యార్థి, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కాటారం -
సిగ్గు..సిగ్గు!
వీరఘట్టం శ్రీకాకుళం : అన్ని విద్యాసంస్థల్లో మరుగుదొడ్లు ఉండాల్సిందే. మరుగు సమస్య లేకుండా చూడాలి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశం ఇది. అయితే ఈ ఆదేశం అన్నిదగ్గర్ల అమలవుతోందో..లేదో తెలియదుగాని..వీరఘట్టం ప్రభు త్వ జూనియర్ కళాశాలలో మాత్రం అమలు జరగడం లేదు. ఇక్కడ 200 మంది అమ్మాయిలతోపాటు.. మరో 250 మంది మగపిల్లలు చదువుతున్నారు. అందుకుతగ్గట్టుగా మరుగుదొడ్లు లే వు. దీంతో అత్యవసర సమయంలో సమీపంలో ని తుప్పలు, డొంకల చాటుకు వెళ్లాల్సి రావడం సిగ్గుపడాల్సి విషయమే. ఈ కళాశాలలో మరుగుదొడ్లు నిర్మించాలని పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి పలుమార్లు అధికారులను కోరా రు. జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి దృష్టికి కూడా విషయాన్ని తీసుకెళ్లారు. అయితే సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. పరిస్థితి ఇదీ సుమారు 50 ఏళ్ల చరిత్ర ఉన్న వీరఘట్టం ప్రభు త్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతుల లేమితో విద్యార్థినీ విద్యార్థులు నిత్యం అవస్థలు పడుతున్నారు. వీరఘట్టం, వంగర, జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాల్లోని పలు గ్రామాల కు చెందిన పిల్లలు ఇంటర్ చదువుకు ఈ కళాశాలలో చేరుతుంటారు. ప్రస్తుతం ప్రథమ, ద్వితీ య సంవత్సరం కలిపి సుమారు 450 మంది పిల్లలు ఉండగా.. వీరిలో 200 మంది అమ్మాయిలు. వీరందరికీ ఒకే మరుగుదొడ్డి ఉంది. అది కూడా శిథిలమైంది. దీంతో మరుగు సమస్యతో నిత్యం విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. అత్యవసర సమయంలో కాలేజీకి సమీపంలో ఉన్న తుప్పులు..డొంగల వైపు వెళ్లలేక బాలికలు బాధపడుతున్నారు. పట్టించుకోని ఇంటర్ బోర్డు ! ఫీజుల పేరిట వేలాది రూపాయలు వసూలు చేస్తున్న ఇంటర్మీడియెట్ బోర్డు కళాశాలలో మౌలి క వసతుల కల్పనకు చర్యలు చేపట్టకపోవడం దారుణమని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇలా ఎన్ని రోజులు తమ పిల్లలు ఇబ్బందులు పడాలని ప్రశ్నిస్తున్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం కళాశాలలో మరుగుదొడ్ల సమస్యతో విద్యార్థులు, స్టాఫ్ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. బిల్లింగ్‌ల కొరతకూడా ఉంది. ఇటీవల కొత్తగా విధుల్లో చేరాను. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. – పి.శంకరరావు, ప్రిన్సిపాల్, వీరఘట్టం జూనియర్ కాలేజీ ఎవరితో చెప్పుకోలేకపోతున్నాం కళాశాలలో చేరి ఏడాది గడిచింది. మా సమస్యలను ఎవరితో చెప్పుకోలేక నిత్యం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఉన్న ఒక మరుగుదొడ్డి కూడా శిథిలమైంది. – కె.నాగమణి, ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఆరుబయటకు వెళ్తున్నాం మరుగుదొడ్లు లేకపోవడంతో అత్యవసరవేళ ఆరుబయటకు వెళ్తున్నాం. సిగ్గుతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు స్పందించి మరుగుదొడ్లు నిర్మించి మా ఇబ్బందులు తీర్చాలి. – ఎ.సుశీల, ద్వితీయ సంవత్సరం విద్యార్థిని -
నో టాయిలెట్..నో రైస్!: కిరణ్‌బేడి
పుదుచ్చేరి: బహిరంగ మల విసర్జన రహిత, పరిశుభ్రమైన గ్రామాలకే ఉచిత బియ్యం అందించాలని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి శనివారం జారీచేసిన ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి. ఆమె కొన్ని గ్రామాలు సందర్శించి అక్కడి పారిశుధ్య నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలానా గ్రామం చెత్త రహిత, బహిరంగ మల విసర్జన రహితమని మే 31 లోగా స్థానిక ప్రజాప్రతినిధితోపాటు పంచాయతీ అధికారి నుంచి పౌర సరఫరాల కమిషనర్‌కు లేఖ వస్తేనే అక్కడ ఉచిత బియ్యం పథకం అమలు చేయాలని పేర్కొన్నారు. అయితే ఈ నిర్ణయం నిరంకుంశంగా ఉందని అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో కిరణ్ బేడి తన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు. జూన్ చివరి నాటికి పుదుచ్చేరిలోని అన్ని గ్రామాలు బహిరంగ మల విసర్జన రహితంగా మారుతాయని ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో తన నిర్ణయాన్ని నిలుపుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
వసతి గృహ నిర్వాహకులపై కలెక్టర్ ఆగ్రహం
మంచిర్యాలసిటీ: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంట ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహ నిర్వాహకులపై జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కలెక్టర్ వసతి గృహాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష కోసం ఉచిత శిక్షణ పొందుతున్న విద్యార్థులను వసతి గృహంలో సౌకర్యాలు, వసతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీంతో విద్యార్థులు భోజనం, సౌకర్యాలు, వసతి సరిగ్గా లేదని వివరించారు. దీంతో ఆయన వసతిగృహ, ఇంజినీరింగ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించి సిబ్బందిపై అగ్రహం వెలిబుచ్చారు. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని, పద్ధతి మార్చుకోవాలని, లేనిచో చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. కంప్యూటర్ ద్వారా అదనపు పరిజ్ఞానం నేర్చుకోవాలని, ప్రవేశ పరీక్షలపై పలు సూచనలు, సలహాలు విద్యార్థులకు ఇచ్చారు. ఇందులో డీఆర్వో ప్రియాంక, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి గంగారాం, డీఐఈవో బీనారాణి, ఏటిడబ్ల్యూ నీలిమ, సిబ్బంది ఉన్నారు -
నీళ్లకూ దిక్కులేదు!
13 వేల ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్లకు నీళ్లు లేవు ►మరో 3,310 స్కూళ్లలో టాయిలెట్లు లేవు ►తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విద్యార్థులు ►ఇంకా 7,517 తరగతి గదుల కొరత ►ఉన్నత పాఠశాలల్లో అరకొరగానే సైన్స్ ల్యాబ్‌లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశా లలను మౌలిక సదుపాయాల కొరత పీడిస్తోంది. ఏళ్ల తరబడి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నా ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. ప్రతి పాఠశాలనూ ఎన్నో సమస్యలు వేధిస్తున్నాయి. టీచర్లు ఉన్న స్కూళ్లలో మౌలిక సదుపాయాలు ఉండవు. మౌలిక సదుపాయాలున్న చోట టీచర్లు ఉండరు. ఇటీవలి వరకు పాఠశాలల్లో టాయిలెట్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడగా... ఇప్పుడు టాయిలెట్లు ఉన్నా నీటి సౌకర్యం లేక వినియోగించుకోలేని దుస్థితి. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 13,892 పాఠశాలల్లోని టాయిలెట్లకు నీటి సదుపాయం లేదని విద్యా శాఖే తేల్చింది. ఇక 3,310 స్కూళ్లలో టాయిలెట్లు లేవు. దీంతో విద్యార్థుల ఇబ్బందులు వర్ణనాతీతం. ఇక ప్రతి ఉన్నత పాఠశాలలో సైన్స్‌ల్యాబ్ కచ్చితంగా ఉండాలి. కానీ 75 శాతం ఉన్నత పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్‌లే లేవు. సరిపడా తరగతి గదులు లేవు. సరిపడా ఫర్నీచర్, విద్యుత్ సదుపాయం లేవు. లైబ్రరీ, కాంపౌండ్ వాల్ లేకపోవడం వంటి సమస్యలూ ఉన్నాయి. ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తులు చేసినా.. ప్రతి నియోజకవర్గంలో రూ.5 కోట్లతో పాఠశాలల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిం చినా ఆచరణలోకి రాలేదు. ఒక్కో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.కోటి, జిల్లా కలెక్టర్ అత్యవసర నిధి నుంచి రూ.కోటి, పాఠశాల విద్యా శాఖ రూ.3 కోట్లు ఇవ్వ డం ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసేలా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ ఇందుకు ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకరించడం లేదని తెలుస్తోంది. రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలుంటే... ఇప్పటి వరకు 45 మంది మాత్రమే తమ నియోజకవర్గాల్లోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ముందుకు వచ్చారని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నెన్నో సమస్యలు ►ప్రస్తుతం రాష్ట్రంలో 25,966 పాఠశాలలు (ప్రాథమిక 18,139, ప్రాథమికోన్నత 3,244, ఉన్నత 4,583) ఉండగా.. వాటిలో ఇంకా 7,517 తరగతి గదులు నిర్మించాల్సి ఉంది. ఇందుకు రూ.589 కోట్లు అవసరం. ► 3,310 పాఠశాలల్లో టాయిలెట్ల వసతి కల్పించాల్సి ఉంది. ఇందుకు రూ.64 కోట్లు అవసరం. ఇక ఇప్పటికే నిర్మించిన 13,892 టాయిలెట్లకు నీటి సదుపాయం కల్పించేందుకు రూ.138 కోట్లు అవసరం. ► 2,286 స్కూళ్లకు విద్యుత్ సదుపాయం కల్పిం చాల్సి ఉంది. అందుకు రూ.80 కోట్లు కావాలి. ► పాఠశాలల్లో 9,23,853 బల్లలు (ఫర్నీచర్) అవసరం. ఇందులో ప్రాథమిక పాఠశాలలకు 4,27,061, ప్రాథమికోన్నత స్కూళ్లకు 1,34,017, ఉన్నత పాఠశాలలకు 3,62,775 బల్లలు అవసరం. వీటితోపాటు ఇతర ఫర్నీచర్‌కు కలిపి రూ.415 కోట్లు కావాలి. ► 3,877 ఉన్నత పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్‌లు లేవు. ఏర్పాటు చేసేందుకు రూ.19.38 కోట్లు అవసరం. ► 92 ఉన్నత పాఠశాలల్లో లైబ్రరీల ఏర్పాటుకు రూ.23 కోట్లు కావాలి. ► 10,275 పాఠశాలలకు ప్రహరీ గోడలు నిర్మించేందుకు రూ.585 కోట్లు అవసరం. -
ఉగ్గ పట్టుకోవాల్సిందే !
నగరంలో పబ్లిక్ టాయిలెట్లు కరువు మహిళలకు తీవ్ర ఇబ్బందులు స్పందించని అధికారులు కరీంనగర్ కార్పొరేషన్ : నగరంలో పబ్లిక్ టాయిలెట్లు కరువయ్యాయి. 3.5 లక్షల జనాభా గల నగరంలో కేవలం 20 పబ్లిక్ టాయిలెట్లు మాత్రమే ఉన్నాయి. ఉత్తర తెలంగాణలోనే అతి పెద్ద బిజినెస్ సెంటర్‌గా వెలుగొందుతున్న నగర ప్రధాన వ్యాపార కూడలి టవర్‌సర్కిల్‌కు సమీపంలో కేవలం మూడు టాయిలెట్లు ఉండడం చూస్తుంటే అధికారులకు స్వచ్ఛ కరీంనగర్, ప్రజారోగ్యంపై ఎలాంటి శ్రద్ధ ఉందో అర్థమవుతుంది. ప్రతి రోజు లక్షకు పైగా జనాభా ప్రధాన వ్యాపార కూడలికి వస్తూ పోతుంటారు. కొనుగోళ్ల నిమిత్తం వివిధ గ్రామాల నుంచి వచ్చే వారితో మార్కెట్ అంతా కిటకిటలాడుతుంటుంది. అయితే మహిళలే ఎక్కువగా వస్తుంటారు. అయితే వారి కోసం ప్రత్యేక టాయిలెట్స్ లేకపోవడం దారుణం. కనీసం షాపింగ్మాల్స్ల్లోనూ ఏర్పాటు చేయడం లేదు. ప్రణాళికలు కరువు స్వచ్ఛభారత్‌లో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు నిధులు కూడా కేటాయించింది. అయితే టాయిలెట్ల నిర్మాణంలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు. స్వచ్ఛభారత్ అంటే కేవలం రోడ్లు శుభ్రం చేయడమనే భావనలోనే అధికారులు ఉన్నారు. దీంతో మిగతా విషయాలపై దృష్టి సారించడం లేదు. టాయిలెట్లు ఎంత అవసరమో ఆ బాధను అనుభవించే వారికే తెలుస్తుంది. వర్షాకాలంలో మాటిమాటికి టాయిలెట్ రావడం సర్వసాధారణం. పురుషులు ఎక్కడపడితే అక్కడ సమస్య తీర్చుకుంటారు. కానీ స్త్రీల బాధ వర్ణనాతీతం. మూత్రం విసర్జించకుండా ఎక్కువ సేపు ఆగితే మూత్ర సంబంధవ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ టాయిలెట్ల సౌకర్యం లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ఇంటికి వెళ్లే వరకు ఆపుకోవడం తప్ప గత్యంతరం లేదు. ప్రభుత్వ స్థలం ఉన్న ప్రాంతాల్లోనైనా టాయిలెట్లు నిర్మించాలనే ఆలోచన కూడా రావడం లేదు. మహిళలకు ప్రత్యేకం ఎప్పుడు ? ఈనెల 1న నగరంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మున్సిపాలిటీల సదస్సులో మున్సిపల్ మంత్రి కేటీఆర్ మహిళల బాధలను సర్వే ద్వారా తెలుసుకుని కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. కామన్ టాయిలెట్లకు రావడానికి మహిళలు ఇబ్బందులు పడుతున్నట్లు సర్వేలో తేలిందని, మహిళల కోసం మున్సిపాలిటీల్లోని ప్రధాన వ్యాపార కూడళ్లలో ‘షీ టాయిలెట్సు’ యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని ఆదేశించారు. అలాగే పాఠశాలల్లో బాలబాలికలకు వేర్వేరుగా టాయిలెట్లు ఉండాలని తెలిపారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్నింటిపై మున్సిపాలిటీలకు సర్వహక్కులు ఉంటాయన్నారు. ఈ సమస్య పరిష్కరించాల్సిన మున్సిపాలిటీలు పట్టించుకోవడం లేదని విమర్శలు వినవిపిస్తున్నాయి. తొమ్మిదింటికి ప్రతిపాదనలు – రవీందర్, ఏసీపీ నగరపాలక సంస్థలో ప్రస్తుతం 20 పబ్లిక్ టాయిలెట్లు వినయోగంలో ఉన్నాయి. ప్రజల నుంచి వచ్చిన డిమాండ్‌తో మరో తొమ్మిదింటికి ప్రతిపాదనలు తయారు చేశారు. షీ టాయిలెట్లు, పాఠశాలల్లో ప్రత్యేక టాయిలెట్లపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. -
ఆశ్రమ బడిలో అన్నీ సమస్యలే
సమస్యలతో గిరిజన ఆశ్రమ పాఠశాలల కనీస సదుపాయాలకు దూరంగా విద్యార్థులు పట్టింపులేని ప్రజాప్రతినిధులు, అధికారులు నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం మారుమూల ప్రాంతాలకు చెందిన గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆశ్రమ పాఠశాలలు నిర్వహణలోపంతో కునారిల్లుతున్నాయి. అరకొర సిబ్బం ది.. అంతంతమాత్రంగా తరగతి గదులు.. నిర్వహణలోపంతో నిరుపయోగంగా మారిన మరుగుదొడ్లు, మూత్రశాలలు.. వెరసి విద్యార్థులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ స్వరాష్ట్రంలో పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల దుస్థితిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఎక్కడ పడితే అక్కడే ఏటూరునాగారం : ఏజెన్సీలోని గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిం చేందుకు ప్రభుత్వం నెలకొల్పిన ఆశ్రమ పాఠశాలలు సమస్యలకు లోగిళ్లుగా మా రాయి. ప్రజాప్రతినిధుల పట్టింపులేని తనం, అధికారుల నిర్లక్ష్యంతో ఆయా పాఠశాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ఏటూరునాగారం, చెల్పాక పాఠశాలల్లో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. ఇవీ సమస్యలు ఏటూరునాగారం ఆశ్రమ పాఠశాలలో గణితం, హిందీ, పీఈటీ పోస్టులు మూడేళ్ల నుంచి ఖాళీగా ఉంటున్నాయి.ఇక్కడి పాఠశాలలో డైనింగ్ హాల్, కిచెన్, అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తికాకపోవడంతో విద్యార్థులు వరండాల్లోనే కూర్చుని చదువుకుంటున్నారు. శిథిలమైన వరండాల కిందనే సిబ్బంది వంటలు చేస్తున్నారు. వర్షం కురిసిన సమయంలో తరగతులు నిర్వహించడం లేదు. ఇప్పటి వరకు విద్యార్థులకు స్కూల్ డ్రెస్‌లు, ట్రంకుబాక్సులు, ప్లేట్లు రాలేదు. చెల్పాక పాఠశాలలో అదనపు గదులు పూర్తి కాకపోవడంతో విద్యార్థులు పడుకునే గదుల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక్కడి పాఠశాలలో నూతనంగా నిర్మించిన భవనంలోని మరుగుదొడ్ల వ్యర్థపు పైపును కాంట్రాక్టర్ కొన్ని రోజుల క్రితం పగులగొట్టారు. దీంతో మరుగుదొడ్లు, మూత్రశాలలు నిరుపయోగంగా ఉన్నాయి. కొత్తగా నిర్మించిన వాటర్‌ట్యాంకు అడుగు భాగంలో పగుళ్లు ఏర్పడడంతో ఎప్పుడూ కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. హాస్టల్ గదుల్లో సీలింగ్ ఫ్యాన్లు లేకపోవడంతో విద్యార్థులు రాత్రివేళలో దోమలతో ఇబ్బందులు పడుతున్నారు. వంట గది లేకపోవడంతో హాస్టల్ సిబ్బంది ఆరుబయటనే వంటలు వండుతున్నారు. హామీలు.. బుట్టదాఖలు నల్లబెల్లి : మండలంలోని మూడుచెక్కలపల్లి గిరిజ న బాలికల ఆశ్రమ పాఠశాలలో రక్షణ చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడి పాఠశాలలో 502 మంది విద్యార్థినులు చదువుకుంటున్నప్పటికీ వారికి తగిన సదుపాయాలు కల్పించడంలేదని తెలుస్తోంది. గతేడాది పాఠశాలకు చెందిన విద్యార్థినులు బానోతు భూమిక, బానోతు ప్రియాంక అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సమయంలో అధికారులు రక్షణ చర్యలు చేపడుతామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చినా నేటివరకు అమలు కాకపోవడం గమనార్హం. ఇవీ సమస్యలు పాఠశాలలో సెక్యూరిటీ గార్డులను నియమించకపోవడంతో రాత్రివేళలో విద్యార్థినులు భయాందోళనకు గురవుతున్నారు.పాఠశాల చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సందర్శకుల రాకపోకలను గమనిస్తామని ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్ హామీ ఇచ్చినా నేటివరకు అమలుకాలేదు. గతేడాది ఇదే పాఠశాలలో చదువుకున్న విద్యార్థినులకు 80 శాతం పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రస్తుత విద్యాసంవత్స రంలో ప్రవేశం పొందిన 240 మందికి ఇప్పటివరకు పుస్తకాలు ఇవ్వకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రహరీ లేక పరేషాన్ కురవి : మండలంలోని కంచర్లగూడెం తండాలోని డీఎన్‌టీపీఎస్ (డీనోటిఫైడ్ ట్రైబల్ ప్రైౖమరీ స్కూల్) సమస్యలతో సతమవుతోంది. పాఠశాల విద్యార్థుల పరిరక్షణను పట్టించుకునే నాథుడే కరువవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఇవీ సమస్యలు కంచర్లగూడెం డీఎన్టీపీఎస్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవు. పాఠశాలలో తాగునీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు మహబూబాబాద్–డోర్నకల్ ప్రధాన రహదారి పక్కన ఉన్న చేతి పంపు వద్దకు వెళ్తున్నారు. స్కూల్‌కు ప్రహరీ లేకపోవడంతో విద్యార్థులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. అయితే మాకేంటి..! కొత్తగూడ : మండలంలోని సాధిరెడ్డిపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల సమస్యలకు నిలయంగా మారిం ది. ఈ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను వేరే పాఠశాలకు పంపిస్తున్నారు. ఏజెన్సీ పాఠశాలల నిర్వహణను అధికారులు పట్టించు కోవడంలేదని చెప్పేందుకు ఈ బడి నిదర్శనంగా నిలుస్తుంది. ఇవీ సమస్యలు సాధిరెడ్డిపల్లి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అంతంత మాత్రంగా భోజనం అందిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు స్కూల్ భవనంపై పెద్ద చెట్టు కూలిపడినా దానిని ఇప్పటివరకు తొలగించలేదు. దీంతో విద్యార్థులు భయపడుతున్నారు.పాఠశాల వంట గది రేకులు గాలి దుమారానికి లేచిపోయినా కొత్తవాటిని ఏర్పాటు చేయలేదు. స్కూల్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను సాధిరెడ్డిపల్లి నుంచి పొగుళ్లపల్లి జెడ్పీ పాఠశాలకు పంపిస్తున్నారు. ఉన్నా ఉట్టిగనే.. మహబూబాబాద్ రూరల్ : మండలంలోని రెడ్యాల ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో సమస్యలు తిష్టవేశాయి. 1976లో ఇక్కడ ఏహెచ్ఎస్ ప్రారంభమైనప్పటికీ విద్యార్థులకు కనీస సదుపాయాలు కల్పించడంలేదు. ఫలితంగా వారు నిత్యం సమస్యలతో సహవాసం చేయాల్సి వస్తుంది. ఈ పాఠశాలలో 3 నుంచి 10 తరగతుల వరకు ఇంగ్లిష్, తెలుగు మీడియంలో విద్యాబోధన చేస్తున్నారు. 601 మంది విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలలో హెచ్ఎం, 12 మంది ఉపాధ్యాయులు, 10 మంది సీఆర్టీలు పనిచేస్తున్నారు. ఇవీ సమస్యలు పాఠశాల బావిలోని నీరు నల్లగా ఉండడంతో విద్యార్థులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. 21 మరుగుదొడ్లు, 8 స్నానాల గదులకు నీటి సరఫరా లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. స్నానాల గదులకు నీటి వసతి లేకపోవటంతో విద్యార్థులు ఆరుబయటనే చేస్తున్నారు. బకెట్లతో నీళ్లు పట్టుకుని బహిర్భూమికి వెళ్తున్నారు. మరుగుదొడ్ల నిర్వహణకు పారిశుద్ధ్య సిబ్బంది లేరు.విద్యార్థులకు అవసరమైన బెంచీలు, ఫ్యాన్లు, లైట్లు, స్పోర్స్ మెటీరియల్ లేవు. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ పాఠశాలకు ఏఎన్ఎంను కేటాయించలేదు.పాఠశాల ఆవరణలో ఉన్న ఒక చేతి పంపు సరిగా పని చేయటం లేదు. విద్యార్థులకు ఇంగ్లిష్, తెలుగు మీడియం పాఠ్య పుస్తకాలు చాలా వరకు రావాల్సి ఉంది. పాఠశాలలో గ్రౌండ్ లెవలింగ్ లేకపోవడంతో వర్షం కురిసినప్పుడు పరిసరాల్లో మురుగునీరు నిలుస్తుంది. అధ్వానం.. అస్తవ్యస్తం మహబూబాబాద్ : పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల అసౌకర్యాలకు నిలయం గా మారింది. ఏళ్ల తరబడి విద్యార్థినులను సమస్య లు పట్టిపీడిస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యా రు. ఫలితంగా వారు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు పాఠశాల సమస్యలు పరిష్కరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇవీ సమస్యలు పాఠశాలలో గదుల కొరత తీవ్రంగా ఉంది.ఇక్కడ 25 మంది ఉపాధ్యాయులు అవసరం ఉండగా.. 19 మంది మాత్రమే పనిచేస్తున్నారు.15 మంది సీఆర్టీలుండగా నలుగురు రెగ్యులర్‌గా పనిచేస్తున్నారు. తరగతి గదుల కొరతతో చెట్ల కిందనే కొన్ని క్లాసులను నిర్వహిస్తున్నారు. మరికొన్నింటిని డైనింగ్ హాల్లో నిర్వహిస్తున్నారు.పాఠశాలలో నీటి సమస్య తీవ్రంగా ఉంది.మరుగుదొడ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉండడం తో విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారు.