- నగరంలో పబ్లిక్ టాయిలెట్లు కరువు
- మహిళలకు తీవ్ర ఇబ్బందులు
- స్పందించని అధికారులు
ఉగ్గ పట్టుకోవాల్సిందే !
Published Mon, Aug 8 2016 12:23 AM | Last Updated on Fri, Aug 24 2018 7:14 PM
కరీంనగర్ కార్పొరేషన్ : నగరంలో పబ్లిక్ టాయిలెట్లు కరువయ్యాయి. 3.5 లక్షల జనాభా గల నగరంలో కేవలం 20 పబ్లిక్ టాయిలెట్లు మాత్రమే ఉన్నాయి. ఉత్తర తెలంగాణలోనే అతి పెద్ద బిజినెస్ సెంటర్‌గా వెలుగొందుతున్న నగర ప్రధాన వ్యాపార కూడలి టవర్‌సర్కిల్‌కు సమీపంలో కేవలం మూడు టాయిలెట్లు ఉండడం చూస్తుంటే అధికారులకు స్వచ్ఛ కరీంనగర్, ప్రజారోగ్యంపై ఎలాంటి శ్రద్ధ ఉందో అర్థమవుతుంది. ప్రతి రోజు లక్షకు పైగా జనాభా ప్రధాన వ్యాపార కూడలికి వస్తూ పోతుంటారు. కొనుగోళ్ల నిమిత్తం వివిధ గ్రామాల నుంచి వచ్చే వారితో మార్కెట్ అంతా కిటకిటలాడుతుంటుంది. అయితే మహిళలే ఎక్కువగా వస్తుంటారు. అయితే వారి కోసం ప్రత్యేక టాయిలెట్స్ లేకపోవడం దారుణం. కనీసం షాపింగ్‌మాల్స్‌ల్లోనూ ఏర్పాటు చేయడం లేదు.
ప్రణాళికలు కరువు
స్వచ్ఛభారత్‌లో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు నిధులు కూడా కేటాయించింది. అయితే టాయిలెట్ల నిర్మాణంలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు. స్వచ్ఛభారత్ అంటే కేవలం రోడ్లు శుభ్రం చేయడమనే భావనలోనే అధికారులు ఉన్నారు. దీంతో మిగతా విషయాలపై దృష్టి సారించడం లేదు. టాయిలెట్లు ఎంత అవసరమో ఆ బాధను అనుభవించే వారికే తెలుస్తుంది. వర్షాకాలంలో మాటిమాటికి టాయిలెట్ రావడం సర్వసాధారణం. పురుషులు ఎక్కడపడితే అక్కడ సమస్య తీర్చుకుంటారు. కానీ స్త్రీల బాధ వర్ణనాతీతం. మూత్రం విసర్జించకుండా ఎక్కువ సేపు ఆగితే మూత్ర సంబంధవ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ టాయిలెట్ల సౌకర్యం లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ఇంటికి వెళ్లే వరకు ఆపుకోవడం తప్ప గత్యంతరం లేదు. ప్రభుత్వ స్థలం ఉన్న ప్రాంతాల్లోనైనా టాయిలెట్లు నిర్మించాలనే ఆలోచన కూడా రావడం లేదు.
మహిళలకు ప్రత్యేకం ఎప్పుడు ?
ఈనెల 1న నగరంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మున్సిపాలిటీల సదస్సులో మున్సిపల్ మంత్రి కేటీఆర్ మహిళల బాధలను సర్వే ద్వారా తెలుసుకుని కమిషనర్‌లకు ఆదేశాలు జారీ చేశారు. కామన్ టాయిలెట్లకు రావడానికి మహిళలు ఇబ్బందులు పడుతున్నట్లు సర్వేలో తేలిందని, మహిళల కోసం మున్సిపాలిటీల్లోని ప్రధాన వ్యాపార కూడళ్లలో ‘షీ టాయిలెట్సు’ యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని ఆదేశించారు. అలాగే పాఠశాలల్లో బాలబాలికలకు వేర్వేరుగా టాయిలెట్లు ఉండాలని తెలిపారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్నింటిపై మున్సిపాలిటీలకు సర్వహక్కులు ఉంటాయన్నారు. ఈ సమస్య పరిష్కరించాల్సిన మున్సిపాలిటీలు పట్టించుకోవడం లేదని విమర్శలు వినవిపిస్తున్నాయి.
తొమ్మిదింటికి ప్రతిపాదనలు
– రవీందర్, ఏసీపీ
నగరపాలక సంస్థలో ప్రస్తుతం 20 పబ్లిక్ టాయిలెట్లు వినయోగంలో ఉన్నాయి. ప్రజల నుంచి వచ్చిన డిమాండ్‌తో మరో తొమ్మిదింటికి ప్రతిపాదనలు తయారు చేశారు. షీ టాయిలెట్లు, పాఠశాలల్లో ప్రత్యేక టాయిలెట్లపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
Advertisement