గుంతకల్లులోని రైల్వే ఆస్పత్రి
అనంతపురం: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది అనే చందంగా మారింది గుంతకల్లు రైల్వే ఆస్పత్రి వైద్యుల తీరు. గర్భసంచి తొలగించాలంటూ శస్త్ర చికిత్స చేపట్టిన వైద్యులు.. ఏకంగా రోగి మూత్రనాళాన్నే కత్తిరించి పరిస్థితిని మరింత జఠిలం చేసిన వైనం సంచలనం రేకెత్తించింది. వివరాలు.. గుంతకల్లుకు చెందిన ఓ మహిళ రెండు రోజుల క్రితం రైల్వే ఆస్పత్రిలో చేరింది.
పరీక్షించిన వైద్యులు ఆమెకు గర్భసంచి తొలగించాలని సూచించి శుక్రవారం శస్త్రచికిత్స చేశారు. అయితే గర్బసంచి తొలగించే క్రమంలో మూత్ర విసర్జన నాళాన్ని కట్ చేశారు. ఫలితంగా ఆమె పరిస్థితి విషమంగా మారింది. దీంతో చేతులెత్తిసిన వైద్యులు వెంటనే ఆమెను కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. ఘటనపై రైల్వే ఆస్పత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గజలక్ష్మీ ప్రభావతి వివరణ కోసం ప్రయత్నించగా ఆమె స్పందించ లేదు.
కాగా, గత నెల 8వ తేదీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న పరిమళ ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువకనే మరో దారుణం వెలుగు చూడడంతో రైల్వే ఆస్పత్రికి వెళ్లాలంటే ఉద్యోగులు భయపడుతున్నారు. చిన్నపాటి కుటుంబనియంత్రణ ఆపరేషన్‌ను దాదాపు 8 గంటల పాటు చేసి, చివరకు ఆమె పరిస్థితి విషమం కావడంతో వైద్యులు చేతులెత్తేశారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన అనంతపురానికి తరలిస్తుండగా పరిమళ మృతి చెందింది.
Comments
Please login to add a commentAdd a comment