Railway Hospital
-
ఏం డాక్లర్లయ్యా సామీ! గర్భసంచి ఆపరేషన్ చేయమంటే.. మూత్రనాళం కోసి
అనంతపురం: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది అనే చందంగా మారింది గుంతకల్లు రైల్వే ఆస్పత్రి వైద్యుల తీరు. గర్భసంచి తొలగించాలంటూ శస్త్ర చికిత్స చేపట్టిన వైద్యులు.. ఏకంగా రోగి మూత్రనాళాన్నే కత్తిరించి పరిస్థితిని మరింత జఠిలం చేసిన వైనం సంచలనం రేకెత్తించింది. వివరాలు.. గుంతకల్లుకు చెందిన ఓ మహిళ రెండు రోజుల క్రితం రైల్వే ఆస్పత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యులు ఆమెకు గర్భసంచి తొలగించాలని సూచించి శుక్రవారం శస్త్రచికిత్స చేశారు. అయితే గర్బసంచి తొలగించే క్రమంలో మూత్ర విసర్జన నాళాన్ని కట్ చేశారు. ఫలితంగా ఆమె పరిస్థితి విషమంగా మారింది. దీంతో చేతులెత్తిసిన వైద్యులు వెంటనే ఆమెను కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. ఘటనపై రైల్వే ఆస్పత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గజలక్ష్మీ ప్రభావతి వివరణ కోసం ప్రయత్నించగా ఆమె స్పందించ లేదు. కాగా, గత నెల 8వ తేదీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న పరిమళ ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువకనే మరో దారుణం వెలుగు చూడడంతో రైల్వే ఆస్పత్రికి వెళ్లాలంటే ఉద్యోగులు భయపడుతున్నారు. చిన్నపాటి కుటుంబనియంత్రణ ఆపరేషన్‌ను దాదాపు 8 గంటల పాటు చేసి, చివరకు ఆమె పరిస్థితి విషమం కావడంతో వైద్యులు చేతులెత్తేశారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన అనంతపురానికి తరలిస్తుండగా పరిమళ మృతి చెందింది. -
ఉద్యోగులకు వైద్య ప్రదాయినిగా దక్షిణ మధ్య రైల్వే
సాక్షి, హైదరాబాద్ : ఒకవైపు లాక్డౌన్. మరోవైపు కరోనా ఉద్ధృతి. పొంచి ఉన్న వైరస్ ముప్పు. ఇది వయోధికులకు, దీర్ఘకాలిక రోగులకు మరింత ప్రమాదకరమైన పరిణామం. దీనిని దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే ఇటీవల చేపట్టిన వినూత్న కార్యక్రమం రైల్వే కార్మికులకు, ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు, కుటుంబ సభ్యులకు వరప్రదాయినిగా మారింది. కరోనా వ్యాప్తి దష్ట్యా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు స్తంభించినప్పటికీ లాలాగూడలోని ద.మ రైల్వే కేంద్రీయ ఆస్పత్రి మాత్రం ఉద్యోగుల వద్దకే వైద్య సేవలను తీసుకెళ్లింది. ఒకవైపు అన్ని రకాల వైద్య సదుపాయాలను కొనసాగిస్తూనే మరోవైపు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి అవసరమైన మందులను వారి ఇళ్ల వద్దకే చేరవేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛంద కార్యకర్తలు కోవిడ్ వారియర్స్‌గా పని చేస్తున్నారు.నెల రోజులకుపైగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 1500 మందికిపైగా ఉద్యోగులకు వారి ఇళ్ల వద్ద మందులను అందజేశారు. ముఖ్యంగా మూప్రిండాల వ్యాధులు, గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, ఆస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ కోవిడ్ హైరిస్క్ గ్రూపులో ఉన్నవారికి ఈ పథకం గొప్ప ఊరటనిస్తోంది. రెండు రోజుల క్రితం దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా దీనిపై అధికారులు, ఆస్పత్రి వైద్య నిపుణులతో సమీక్ష నిర్వహించారు. ఈ పథకాన్ని మరింత బలోపేతం చేయాలని, దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అవసరమైతే కోవిడ్ వారియర్స్‌ను అదనంగా ఏర్పాటు చేసుకొని అవసరమైన వారికి సత్వరమే ఇళ్ల వద్ద మందులు అందజేసేలా సేవలను విస్తరించాలని సూచించారు. ప్రత్యేక బృందం ఏర్పాటు.. ఈ పథకాన్ని విజయవంతంగా కొనసాగించేందుకు ఆస్పత్రిలో సీనియర్ వైద్య నిపుణుడితో పాటు, ఒక స్టాఫ్‌నర్స్, మరో సీనియర్ ఫార్మాసిస్ట్‌తో ఒక టీమ్‌ను ఏర్పాటు చేశారు. వాట్సప్ నంబర్ల ద్వారా ఉద్యోగుల నుంచి అందిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకొని వారికి అవసరమైన మందులను స్వచ్ఛంద కార్యకర్తల ద్వారా ఇళ్లకే పంపిస్తున్నారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి 2 నెలలకు సరిపడా మందులను అందజేస్తుండగా, ఉద్యోగులకు, కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు మాత్రం ఒక నెలకు అవసరమైన మందులను అందజేస్తున్నారు. ఈ క్రమంలో అత్యవసర వైద్య సేవలు కావాల్సినవారికి ఆస్పత్రిలోనే చికిత్సలు అందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలోనే అతి పెద్దదైన లాలాగూడ కేంద్రీయ ఆస్పత్రిలో అన్ని రకాల అత్యవసర వైద్య విభాగాలు ఉన్నాయి. కార్పొరేట్ తరహా వైద్య సేవలను ఉద్యోగులకు అందజేస్తున్నారు. కార్పొరేట్ వైద్య నిపుణులను కూడా పిలిపిస్తున్నారు. ప్రతి రోజు 3000మందికి పైగా రోగులకు ఓపీ సేవలను అందజేస్తున్నారు. ఒకవైపు కోవిడ్ తీవ్రత కొనసాగుతున్న తరుణంలోనూ వైద్య సదుపాయాలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ద.మ రైల్వే పటిష్టమైన చర్యలు చేపట్టింది. మరోవైపు రైల్వే ఆస్పత్రుల్లో కేవలం రైల్వే ఉద్యోగులకు కాకుండా అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన ఉద్యోగులు, వారి కుటుంబాలకు కూడా వైద్య సేవలను విస్తృతం చేశారు. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేష్ తెలిపారు. వాట్సప్ నంబర్లకు వివరాలు పంపితే చాలు.. మందులు అవసరమైన పేషెంట్లు తమ వివరాలను ఆస్పత్రి సూచించిన ఫోన్ నంబర్లకు వాట్సప్ ద్వారా తెలియజేస్తే చాలు. గతంలో వైద్యులు రాసిన మందుల ప్రిస్కిప్షన్ ఆధారంగా ప్రస్తుతం అవసరమైన మందులను వారికి పంపిస్తారు. మందులు ఇలా అందుకోవచ్చు.. ►వాట్సప్ నంబర్లు: 970137055, 9618936328. ►ఈ నంబర్లకు పేషెంట్ పేరు, ఉద్యోగి పేరు, మెడికల్ కార్డు , గతంలో డాక్టర్ రాసిన ప్రిస్కిప్షన్ పంపించాలి ►చిరునామా, ల్యాండ్‌మార్క్ కూడా తెలియజేయాలి ►రైల్వే విశ్రాంత ఉద్యోగులు, ప్రస్తుత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ► 60 ఏళ్లు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను చేరుకోవడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. -
రైల్–బోట్.. ఇది రైల్వే రోబో
సాక్షి, హైదరాబాద్: రైల్వే ఆసుపత్రిలో రోబో ఆకట్టుకుంటోంది. సొంతంగా రైల్వే అధికారి ఆధ్వర్యంలో సిబ్బంది సహకారంతో రూపొందించిన ఈ రోబో, కోవిడ్ బాధితులకు వైద్య సేవలు చేసే సమయంలో వైద్యులు, సిబ్బంది వారి దగ్గరకు వెళ్లాల్సిన అవసరాన్ని బాగా తగ్గించనుంది. దీనికి రైల్–బోట్ అనే పేరు పెట్టారు. అదనపు డివిజినల్ రైల్వే మేనేజర్ (హైదరాబాద్) హేమ్‌సింగ్ బనోత్‌కు రోబోటిక్ శాస్త్రంలో అవగాహన ఉంది. దీంతో ఆయన తన సిబ్బంది సహకారంతో ఈ రోబోను రూపొందించారు. రోగులకు మందులు, ఆహారం అందించటం, వారి శరీర ఉష్ణోగ్రత చూడటం, వారి వద్దకు వైద్య పరికరాలు, ఇతర వస్తువులు తీసుకెళ్లటం.. తదితరాల్లో దీని ఉపయోగం ఉండనుంది. పాన్ అండ్ టిల్ట్ ఫంక్షన్స్, రియల్ టైం వీడియో అనుసంధానం ఉండటంతో, వైద్యులు, రోగులు దూరంగా ఉండే దీని ద్వారా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఆ వివరాలు రికార్డు కూడా అవుతాయి. వారి శరీర ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నట్టు నమోదైతే అలారం మోగించి సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. ఇది 80 కిలోల బరువును మోసుకెళ్తుంది. ఆండ్రాయిడ్ మొబైల్ యాప్, రేడియో ఫ్రీక్వెన్సీ రిమోట్ కంట్రోలర్‌తో దీన్ని ఆపరేట్ చేస్తారు. ప్రయోగాత్మకంగా లాలాగూడలోని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన ఆసుపత్రిలో దీనిని వినియోగిస్తున్నారు. రోబో పనితీరును దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా పరిశీలించి, రూపొందించిన అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. -
కరోనా కట్టడికి రైల్వే ఆస్పత్రులు సిద్ధం
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిన రైల్వే శాఖ తన పరిధిలో ఉన్న అన్ని ఆస్పత్రుల్ని సిద్ధం చేసింది. ఏపీలో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లలోని రైల్వే ఆస్పత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్, కోవిడ్ వార్డులను ఏర్పాటు చేసింది. రైల్వే ఆస్పత్రుల్లో పనిచేసే పారా మెడికల్ సిబ్బంది, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్లు, నర్సింగ్ అసిస్టెంట్లకు కోవిడ్ –19 రోగులతో వ్యవహరించేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. విజయవాడ డివిజన్లో 129, గుంతకల్ డివిజన్లో 234, గుంటూరు డివిజన్లో 125.. మొత్తం 488 క్వారంటైన్ పడకలను సిద్ధం చేశారు. ► విజయవాడ, గుంతకల్‌లోని రైల్వే ఆస్పత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ కమ్ కోవిడ్ వార్డులను ఏర్పాటు చేశారు. ► ఈ వార్డుల్లో ప్రస్తుతం ఉన్న వైద్య సిబ్బందికి తోడు అవసరమైన అదనపు సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకునేందుకు రైల్వే బోర్డు అంగీకారం తెలపడంతో ఆ మేరకు నియామకాలు చేపట్టారు. ► ఇప్పటివరకు విజయవాడలో 11 మంది డాక్టర్లు, 36 మంది ఇతర వైద్య సిబ్బందిని నియమించారు. గుంతకల్‌లోని రైల్వే ఆస్పత్రిలో ఆరుగురు డాక్టర్లు, మరో 14 మంది వైద్య సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. ► ఇంకా అవసరమైన సిబ్బంది నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు ఏప్రిల్ 15 తర్వాత నియామకాలు చేపట్టనున్నారు. ► విజయవాడ, కాకినాడ, తిరుపతి, విశాఖలో రైల్వే బోగీలను ఐసోలేషన్ కోచ్‌లుగా మార్చారు. జోన్ మొత్తంలో 2,500 ఐసోలేటెడ్ కోచ్‌లు సిద్ధంగా ఉన్నాయి. ► రైల్వే ఆస్పత్రుల్లో వసతుల కొరత ఏర్పడినా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్ వార్డుల కొరత వచ్చినా.. రైల్వే ఐసోలేషన్ కోచ్‌లు అందుబాటులోకొస్తాయి. ► రైల్వే సిబ్బంది ఇప్పటికే ఆరు లక్షల మాస్క్‌లు, 40 వేల లీటర్ల శానిటైజర్లను తయారు చేశారు. రైల్వే ఆస్పత్రుల్లో పనిచేసే డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి పీపీఈలు అందించేందుకు ప్రతి వారం వెయ్యికి పైగా తయారు చేయనున్నారు. -
రైల్వే ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వ్యాప్తిపై రైల్వే శాఖ అప్రమత్తమైంది. రైల్వే ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డులు ప్రారంభించటంతో పాటు రైళ్లలో రసాయన జలాలతో ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ నుంచి ఆదేశాలు రావటంతో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా చర్యలు చేపట్టారు. సికింద్రాబాద్ లాలాగూడలోని రైల్వే ఆస్పత్రిలో ప్రత్యేకంగా 10 పడకలతో ఐసోలేషన్ వార్డు ప్రారంభించారు. అలాగే జోన్ పరిధిలోని అన్ని డివిజన్ కేంద్రాల్లో ఉన్న రైల్వే ఆస్పత్రుల్లో కూడా ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయబోతున్నారు. రైలు ప్రయాణాలతో జాగ్రత్త.. దేశవ్యాప్తంగా పది రోజుల కిందటి వరకు ఐదు పాజిటివ్ కేసులు మాత్రమే ఉండగా, సోమవారానికి ఆ సంఖ్య 43కు చేరుకుంది. కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే వారే ఈ వైరస్‌కు గురవుతున్నారు. వారు మన దేశానికి వచ్చేనాటికే వారి శరీరంలో ఆ వైరస్ చేరి ఉంటోంది. ఇక్కడికి వచ్చాక జ్వరం, జలుబు వచ్చి అప్పుడు ఆస్పత్రులకు వెళ్తే కోవిడ్ పాజిటివ్‌గా తేలుతోంది. ఆ లక్షణాలు పూర్తిగా బయటపడే లోపు వారు చాలాచోట్ల ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో ఇతరులకు సోకే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా రైలు ప్రయాణాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు. కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు చెందిన వారు రైళ్లలో ఉండే అవకాశం ఉంది. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఆన్‌బోర్డు సిబ్బందితో రసాయనాల పిచికారీ.. రైళ్లలో ఆన్‌బోర్డు క్లీనింగ్ సిబ్బంది ఉంటారు. వారు రైలు ప్రయాణిస్తున్న సమయంలో ప్రయాణికుల నుంచి వచ్చే అపరిశుభ్రత ఫిర్యాదుల ఆధారంగా ఆ బోగీకి చేరుకుని శుభ్రం చేస్తుంటారు. ఇప్పుడు వారి వద్ద వైరస్‌పై ప్రభావం చూపే రసాయనాలను అందుబాటులో ఉంచారు. నిర్ధారిత సమయాల ప్రకారం వారు సీట్లు, హోల్డింగ్ బార్స్, టాయిలెట్లు, తలుపులు, కిటికీల వద్ద వాటిని పిచికారీ చేస్తున్నారు. ప్రత్యేకంగా ప్రయాణికులు ఫిర్యాదు చేసినా వచ్చి ఆ చర్యలు చేపడుతున్నారు. రైల్వే సిబ్బంది, ప్రయాణికుల్లో ఎవరైనా కోవిడ్ లక్షణాలతో ఇబ్బంది పడుతుంటే వెంటనే వారిని రైల్వే ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసే ఐసోలేషన్ వార్డులకు తరలించి చికిత్స అందిస్తారు. దీనికి సంబంధించి ఆయా ఆస్పత్రుల్లోని వైద్యుల్లో కొందరిని ప్రత్యేకంగా ఆ వార్డులకు కేటాయించారు. వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. ఈ ఆస్పత్రుల్లో సాధారణ ప్రజలను కూడా చేర్చుకోవాలా వద్దా అన్న విషయంలో మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు. ఇక అన్ని స్టేషన్లలో రసాయన జలాల పిచికారీ చేపట్టారు. ముఖ్యంగా ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండే స్టేషన్లపై ప్రత్యేక దృష్టి సారించారు. పారిశుధ్య చర్యలను కూడా పెంచారు. -
యువర్ అటెన్షన్ ప్లీజ్..పట్టాలు తప్పిన వైద్యం
గుంతకల్లు: ఘనమైన చరిత్ర కలిగిన గుంతకల్లు రైల్వే ఆసుపత్రి క్రమంగా ప్రాభవం కోల్పోతోంది. ఉద్యోగుల పాలిట సంజీవనిగా పేరొందిన వైద్యాలయమే జబ్బు పడింది. చికిత్స నోచుకోక రోగులకు అరకొర వైద్య సేవలతో సరిపెట్టుకుంటోంది. ఆసుపత్రి పరిధిలో అనంతపురం, వైఎస్ఆర్ జిల్లా, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, మహబూబ్‌నగర్, రాయచూర్, గుల్బ ర్గా, బళ్లారి, వేలూరు జిల్లాలు ఉన్నాయి. 1960లో ఆరు పడకలతో ప్రారంభమైన ఆసుపత్రి ప్రస్తుతం 130 పడకల స్థాయికి చేరింది. 14వేల మంది కార్మికులతో పాటు 6వేల మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఈ ఆసుపత్రి పెద్దదిక్కు. గుత్తి, ధర్మవరం, కడప, నందలూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, ద్రోణాచలం, రాయచూర్ కేంద్రాల్లో రైల్వే ఆరోగ్య ఉప కేంద్రాలను నిర్వహిస్తున్నారు. వీటి నుంచి ప్రతి నెలా దాదాపు 2వేల మంది రోగులను గుంతకల్లుకు రెఫర్ చేస్తున్నారు. రోజూ వెయ్యి మందికి పైగా రోగులకు చికిత్స చేస్తుండగా.. నెలలో 150 నుంచి 200 దాకా ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రిలో చిన్నపిల్లలు, కళ్లు, గైనకాలజిస్టు, కార్డియాలజీ, డెర్మటాలజీ, పెథాలజీ తదితర కీలక విభాగాలకు సంబంధించిన వైద్య పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. వైద్యుల కొరత నేపథ్యంలో లక్షలాది రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంకు మూతపడింది. ప్రస్తుతం రోగులకు రక్తం అత్యవసరమైతే అనంతపురం, కర్నూలు, బళ్లారి నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. విధిలేక ప్రయివేటుకు.. వేలాది మంది కార్మికులతో ముడిపడిన రైల్వే ఆసుపత్రి ఎవరికీ పట్టని పరిస్థితి. కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో కార్మికులు విధిలేక ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. భారీగా తగ్గిన రోగుల సంఖ్యను పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఆసుపత్రిలోని మంచాలపై పరుపులు పూర్తిగా దెబ్బతినడంతో రోగుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. మంచాలు కూడా పాడవడంతో స్టాండ్స్ కింద రాళ్లు పెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వైద్యుల కొరత కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈ రైల్వే ఆసుపత్రిలో నెలల తరబడి వైద్యుల పోస్టులను భర్తీ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. అన్ని విభాగాలకు సంబంధించి 19 మంది వైద్యులు సేవలు అందించాల్సి ఉండగా.. ప్రసుత్తం 10 మంది వైద్యులే దిక్కయ్యారు. ఈ కారణంగా ఒకప్పుడు వెయ్యి మందికి పైగా ఓపీ ఉండగా.. ఇప్పుడు వందలోపు మాత్రమే ఉండటం గమనార్హం. ఇన్‌పేషెంట్లు కూడా 50 నుంచి 60 మందిలోపే ఉంటున్నారు. అదేవిధంగా పెథాలజిస్టు లేని కారణంగా బ్లడ్ బ్యాంకును మూతేశారు. పెద్ద రోగమైతే రెఫరల్ ఆసుపత్రికే.. ఆసుపత్రిలో కీలకమైన వైద్యులు లేకపోవడంతో రోగులు వ్యయప్రయాసలకు లోనుకావాల్సి వస్తోంది. చిన్న వ్యాధులకు సైతం అనంతపురంలోని ప్రయివేట్ రెఫరల్ ఆసుపత్రిని ఆశ్రయించాల్సి వస్తోంది. ఇతర జిల్లాల నుంచి ఎంతో ఆశతో ఇక్కడికి వస్తే.. వైద్యులు లేరనే కారణంతో రెఫరల్ ఆసుపత్రికి తరలిస్తుండటం రోగులతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులను కలచివేస్తోంది. రెఫరల్ ఆసుపత్రిలో చేరిన 24 గంటల్లోపు సమాచారం అందిస్తేనే రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది. అయితే అప్పటి వరకు డబ్బు ఎలా సర్దుబాటు చేయాలనే ప్రశ్న తలెత్తుతోంది. సీఎంఎస్ దృష్టికి తీసుకెళ్లాం రైల్వే ఆస్పత్రిలో స్పెషలిస్టు డాక్టర్లను నియమించాలి. ఒక సివిల్ సర్జన్ వైద్యుడు, బ్లడ్ బ్యాంకును పునరుద్ధరించాలి. పూర్తిగా పాడైన మంచాలు, బెడ్స్‌తో పాటు రోగులకు అందించే యూనిఫాం తదితర అంశాలను డీఆర్ఎం ద్వారా చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లాం. – కె.ప్రభాకర్, ఎంప్లాయీస్ సంఘ్గుంతకల్లు డివిజన్ అధ్యక్షుడు మంచానికి సపోర్ట్‌గా రాళ్లు ఏర్పాటు చేసుకున్నాం నా భర్త రామాంజినేయలు రైల్వేలో పారిశుద్ధ్య కార్మికునిగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందారు. గుత్తిలో ఉంటున్నాం. కొన్ని నెలలుగా మా ఆయన ఆర్యోగ పరిస్థితి బాగా లేకపోవటంతో నాలుగు రోజుల క్రితం ఆసుపత్రిలో చేర్పించాం. మంచం సరిగా లేకపోవటంతో రాళ్లు పెట్టుకున్నాం. పరుపు కూడా పాడైపోయింది. – లక్ష్మీదేవి, రిటైర్డు రైల్వే ఉద్యోగి భార్య -
ఆత్మహత్యాయత్నం వెనుక... యూనియన్ల వర్గపోరు
విజయవాడ : రైల్వే ఆస్పత్రిలో పనిచేస్తున్న మొండెం రాధ ఈనెల 3న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘన వెనుక యూనియన్ల వర్గపోరు ఉన్నట్లు తేటతెల్లమైంది. గత నెల 21న రైల్వే ఉద్యోగుల సంఘానికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎంప్లాయిస్ సంఘ్ విజయం సాధించింది. మజ్దూర్ యూనియన్ ఓటమిపాలైంది. ఎంప్లాయిస్ సంఘ్‌ను కాంగ్రెస్ పార్టీ బలపరుస్తుండగా మజ్దూర్ యూనియన్ను వామపక్ష పార్టీలు బలపరుస్తున్నాయి. అయితే వారు ప్రత్యక్షంగా ఎక్కడా పాల్గొనలేదు. రజనీకుమారిపై ఆరోపణలు ఆస్పత్రిలో హెడ్‌నర్స్‌గా పనిచేస్తున్న ఎ. రజనీకుమారి తనను వేధిస్తున్నారని 20 రోజుల క్రితం మహిళా విభాగం హెడ్నర్స్ ఎం రాధ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును ఆయన సరిగా పట్టించుకోలేదు. దీంతో హెడ్నర్స్ రజనీకుమారి వేధింపుల వ్యవహారాన్ని భర్త రాజశేఖర్‌కు రాధ తెలిపింది. దీంతో రాజశేఖర్ ఆస్పత్రికి వచ్చి హెడ్‌నర్స్‌ను నిలదీశాడు. తన సెల్‌ఫోన్ విరగొట్టి తనపై దాడి చేసినట్లు రజనీకుమారి రాజశేఖర్‌పై సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో కేసుపెట్టింది. తన భర్తపై పెట్టిన కేసు విరమించుకోవాలని రజనీకుమారిని రాధ కోరింది. అందుకు నిరాకరించిన రజనీకుమారి, రాధను మరింత అవమానించింది. దీన్ని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇందుకు కారణం రజనీకుమారేనని చెప్పింది. ఈ మేరకు రాజశేఖర్ సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో రజనీకుమారిపై కేసు పెట్టాడు. ఓటమిని జీర్ణించుకోలేకే... రజనీకుమారి ఆస్పత్రి విభాగం నుంచి యూనియన్ ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ సభ్యురాలుగా ఎంప్లాయీస్ సంఘ్ తరఫున పోటీ చేయగా, మజ్దూర్ సంఘ్ సభ్యుడు తిరుపతి స్వామి గెలుపొందాడు. ఓటమిని తట్టుకోలేక తనను వేధించడం ప్రారంభించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆస్పత్రిలో వర్గపోరే ఎక్కువ ఆస్పత్రిలో రెగ్యులర్ సిబ్బంది 25 మంది ఉన్నారు. వీరు కాకుండా మెడికల్ కాలేజీ నుంచి 50 మంది విద్యార్థులు వస్తుంటారు. రైల్వే ఉద్యోగులకు వైద్య సేవలు బాగా అందించే అవకాశం ఉంది. అయితే రిటైర్డ్ ఉద్యోగులు వచ్చినప్పుడు వారిని విసుక్కోవడం, సరిగా వైద్యం చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. యూనియన్ల మధ్య ఉండే స్పర్థలను మనసుల్లో పెట్టుకొని వర్గాలుగా విడిపోయి వైద్యం సక్రమంగా చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. సెలైన్ పెట్టేందుకు సఫాయి కార్మికులను వాడుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం. ఇంత మంది నర్సులు ఉండి కూడా ఈ దుస్థితి ఎందుకు వచ్చిందనేది ఉన్నతాధికారులు పరిశీలించాల్సి ఉంది. మందులు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు ఆస్పత్రికి రైల్వే శాఖ ద్వారా సరఫరా అయ్యే మందులు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రాధ మందులు వైద్యశాల నుంచి తీసుకుపోయి అమ్ముకుంటున్నదని, అందుకే మందలించానని రజనీకుమారి చెబుతోంది. ఇందులో నిజమెంతనేది ఉన్నతాధికారుల విచారణలో తేలాల్సి ఉంది. మందులు దొంగతనంగా బయటకు తీసుకువెళ్లి అమ్ముకుంటుంటే హెడ్‌నర్స్‌గా రజనీ కుమారి కాని, ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎన్సీ రావుకాని ఎందుకు చర్యలు తీసుకోలేదనేదీ ప్రస్తుతం ఆస్పత్రి వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆస్పత్రిలో జరుగుతున్న కీచులాటలు ఆత్మహత్యా యత్నం వరకు వెళ్లాయంటే ఎటువంటి పరిణామాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.