సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వ్యాప్తిపై రైల్వే శాఖ అప్రమత్తమైంది. రైల్వే ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డులు ప్రారంభించటంతో పాటు రైళ్లలో రసాయన జలాలతో ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ నుంచి ఆదేశాలు రావటంతో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా చర్యలు చేపట్టారు. సికింద్రాబాద్ లాలాగూడలోని రైల్వే ఆస్పత్రిలో ప్రత్యేకంగా 10 పడకలతో ఐసోలేషన్ వార్డు ప్రారంభించారు. అలాగే జోన్ పరిధిలోని అన్ని డివిజన్ కేంద్రాల్లో ఉన్న రైల్వే ఆస్పత్రుల్లో కూడా ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయబోతున్నారు.
రైలు ప్రయాణాలతో జాగ్రత్త..
దేశవ్యాప్తంగా పది రోజుల కిందటి వరకు ఐదు పాజిటివ్ కేసులు మాత్రమే ఉండగా, సోమవారానికి ఆ సంఖ్య 43కు చేరుకుంది. కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే వారే ఈ వైరస్‌కు గురవుతున్నారు. వారు మన దేశానికి వచ్చేనాటికే వారి శరీరంలో ఆ వైరస్ చేరి ఉంటోంది. ఇక్కడికి వచ్చాక జ్వరం, జలుబు వచ్చి అప్పుడు ఆస్పత్రులకు వెళ్తే కోవిడ్ పాజిటివ్‌గా తేలుతోంది. ఆ లక్షణాలు పూర్తిగా బయటపడే లోపు వారు చాలాచోట్ల ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో ఇతరులకు సోకే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా రైలు ప్రయాణాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు. కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు చెందిన వారు రైళ్లలో ఉండే అవకాశం ఉంది. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ఆన్‌బోర్డు సిబ్బందితో రసాయనాల పిచికారీ..
రైళ్లలో ఆన్‌బోర్డు క్లీనింగ్ సిబ్బంది ఉంటారు. వారు రైలు ప్రయాణిస్తున్న సమయంలో ప్రయాణికుల నుంచి వచ్చే అపరిశుభ్రత ఫిర్యాదుల ఆధారంగా ఆ బోగీకి చేరుకుని శుభ్రం చేస్తుంటారు. ఇప్పుడు వారి వద్ద వైరస్‌పై ప్రభావం చూపే రసాయనాలను అందుబాటులో ఉంచారు. నిర్ధారిత సమయాల ప్రకారం వారు సీట్లు, హోల్డింగ్ బార్స్, టాయిలెట్లు, తలుపులు, కిటికీల వద్ద వాటిని పిచికారీ చేస్తున్నారు. ప్రత్యేకంగా ప్రయాణికులు ఫిర్యాదు చేసినా వచ్చి ఆ చర్యలు చేపడుతున్నారు. రైల్వే సిబ్బంది, ప్రయాణికుల్లో ఎవరైనా కోవిడ్ లక్షణాలతో ఇబ్బంది పడుతుంటే వెంటనే వారిని రైల్వే ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసే ఐసోలేషన్ వార్డులకు తరలించి చికిత్స అందిస్తారు. దీనికి సంబంధించి ఆయా ఆస్పత్రుల్లోని వైద్యుల్లో కొందరిని ప్రత్యేకంగా ఆ వార్డులకు కేటాయించారు. వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. ఈ ఆస్పత్రుల్లో సాధారణ ప్రజలను కూడా చేర్చుకోవాలా వద్దా అన్న విషయంలో మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు. ఇక అన్ని స్టేషన్‌లలో రసాయన జలాల పిచికారీ చేపట్టారు. ముఖ్యంగా ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండే స్టేషన్లపై ప్రత్యేక దృష్టి సారించారు. పారిశుధ్య చర్యలను కూడా పెంచారు.
Comments
Please login to add a commentAdd a comment