యస్.. రెండోసారి నేనే సీఎం! | Telangana CM Revanth Reddy Again Tells CM Post | Sakshi
Sakshi News home page

యస్.. రెండోసారి నేనే సీఎం!

Published Sat, Mar 15 2025 9:15 PM | Last Updated on Sat, Mar 15 2025 9:31 PM

Telangana CM Revanth Reddy Again Tells CM Post

హైదరాబాద్:  వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఏమో కానీ.. తెలంగాణ సీఎంగా ఎవరైనా ఆశలు పెట్టుకుంటే మాత్రం వదులకోవాల్సిందేననే సంకేతాలిచ్చారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్.. రెండోసారి కూడా తానే సీఎం అంటూ ఉద్ఘాటించి పలువురు ఆశావహులపై నీళ్లు చల్లారు. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఇప్పుడే చెప్పడం కష్టం కానీ, రేవంత్ మాత్రం స్పష్టమైన ధీమాతో సీఎంగా రెండోసారి కూడా తానే అంటున్నారు. 

ఇక్కడ బీఆర్ఎస్ సంగతిని పక్కన పెడితే, తెలంగాణ కాంగ్రెస్ లో ఒక బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా చేయాలనే డిమాండ్ ఎప్పట్నుంచో వస్తుంది. దీనిపై తెలంగాణ బీజేపీ కూడా డిమాండ్ చేస్తూనే ఉంది. బీసీలను వాడుకోవడం, వదిలేయడమే కానీ వారిని ఎప్పుడు సీఎంగా అందలం కాకపోయినా కనీసం సీఎం అభ్యర్థిగా అయినా ప్రకటిస్తారా? అంటూ కాంగ్రెస్ పై పదే పదే విమర్శలు చేస్తోంది. అసలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్.. ఒక బీసీని సీఎంగా చేస్తుందా? అని ఎద్దేవా చేస్తోంది.

సీఎం రేవంత్ ముందే జాగ్రత్త పడుతున్నారా..?
మరి ఈ విమర్శల నేపథ్యమో ఏమో కానీ రేవంత్ రెడ్డి.. తానే రెండోసారి సీఎం అంటూ పదే పదే చెబుతున్నారు. అసెంబ్లీలో సందర్భం వచ్చిన ప్రతీసారి రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, తానే సీఎంను అంటూ ప్రస్తావిస్తూ వస్తున్నారు. తన సీఎం పీఠానికి కాంగ్రెస్ నేతల నుంచి ఎటువంటి పోటీ లేకుండా రేవంత్ ముందే జాగ్రత్త పడుతున్నారా అనే అభిప్రాయం విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.

అయితే సీఎం రేవంత్ మాత్రం తాను రెండోసారి సీఎంను అని తరచు వ్యాఖ్యానించడం వెనుక ఆంతర్యాన్ని చూస్తే ఆయనలో కాస్త ఆందోళన అనేది కన్పిస్తోంది.   ఒకవేళ బీసీ వ్యక్తిని సీఎం అభ్యర్థిగా రెండోసారి ఎన్నికల సమయంలో ప్రకటిస్తే  ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ గా ఉన్న మహేష్ గౌడ్ లాంటి నేతలకు ఆ అవకాశం దక్కే అవకాశం ఉంది. మరొకవైపు పొన్నం ప్రభాకర్‌ లాంటి నేతలకు కూడా సీఎం పదవిపై ఆశ ఉందని చర్చ నడుస్తోంది.  అదే సమయంలో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కూడా తాను కూడా ముందు వరుసలోను ఉంటారు. ఇలా కాంగ్రెస్‌ లో పోటీ ఎక్కువగానే ఉంది.. ఆ క్రమంలోనే రేవంత్‌ సీఎం పోస్ట్‌ అంశాన్ని సమయం వచ్చినప్పుడల్లా లేవనెత్తుతున్నారా? అనే ప్రశ్న కూడా తలెత్తుంది. సీఎంగా తన సహజ ధోరణిలో ముందుకు సాగుతున్న రేవంత్.. అత్యంత ధీమాగా ‘రెండోసారి అధికారం.. రెండోసారి సీఎం’ అని చెప్పడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

రేవంత్ నోట.. ‘మళ్లీ సీఎం’ మాట
తెలంగాణ అసెంబ్లీ సమాఏశాల్లో భాగంగా మీడియాతో చిట్ చాట్ చేసిన సీఎం రేవంత్.. ప్రస్తుతమే కాదు.. రెండోసారి కూడా తానే సీఎం అంటున్నారు. ‘రెండోసారి నేనే ముఖ్యమంత్రి అవుతా. మొదటిసారి బిఆర్ఎస్ పై వ్యతిరేకతతో మాకు ఓటేశారు.  రెండోసారి మాపై ప్రేమతో ఓటు వేస్తారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే మా ఓటర్లు. నేను పనిని నమ్ముకుని ముందుకు వెళుతున్న.  ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. స్టేచర్ కాదు స్టేట్ ఫ్యూచర్ నాకు ముఖ్యం. రూ. 25 లక్షల పైచీలుకు రుణమాఫీ జరిగింది  ఒక్క కుటుంబంలో నలుగురు ఉన్న రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య కోటి. కోటిమంది మహిళలకు కచ్చితంగా లబ్ధి చేకూరుస్తా. వారంతా ఇప్పుడు మాట్లాడకపోయినా ఓటు మాకే వేస్తారు. గతంలో నేను చెప్పిందే జరిగింది. భవిష్యత్తులో నేను చెప్పిందే జరుగుతుంది’ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement