
హైదరాబాద్, సాక్షి: ప్రాణాలను పణంగా పెట్టి కేసీఆర్ తెలంగాణ సాధిస్తే.. సంస్కారం లేకుండా సీఎం రేవంత్ మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) మండిపడ్డారు. శనివారం అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ ప్రసంగాన్ని బహిష్కరించిన అనంతరం మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారాయన.
‘‘కేసీఆర్(KCR)పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మేం సీఎం ప్రసంగాన్ని బహిష్కరించి సభ నుంచి బయటకు వచ్చేశాం. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను కేసీఆర్ సాధించారు. కానీ, సీఎం అనే విజ్ఞత కోల్పోయి, సంస్కారం లేకుండా రేవంత్ వ్యాఖ్యలు చేశారు. ఆఖరికి.. ఆ వ్యాఖ్యలపై సభలో మాట్లాడామన్నా మాకు స్పీకర్ మైక్ ఇవ్వలేదు’’ అని హరీష్ అన్నారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) చేసిన ద్రోహం వల్లే తెలంగాణకు కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరిగిందని హరీష్ ఆరోపించారు. ఈ తప్పు ముమ్మాటికీ కాంగ్రెస్‌దే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ వల్ల నిర్లక్ష్యం జరిగింది. అప్పటి లెక్కల ప్రకారం నీళ్లు, ప్రాజెక్టులు ఉన్నాయి. అప్పటి లెక్కల ప్రకారం నీళ్ల పంపకాలు జరిగాయి.
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆనాడు మంత్రి పదవి కోసం తెలంగాణ కోసం మాట్లాడలేదు. పోతిరెడ్డిపాడు కోసం 40 రోజులు పీజేఆర్ తప్ప ఎవరూ పోరాడలేదు. ఆ సమయంలో ఉత్తమ్ మౌనంగా ఉండిపోయారు. .. తెలంగాణకు ద్రోహం చేసి పోతిరెడ్డిపాడుపై పెదవులు మూసుకున్నందుకే ఉత్తమ్‌కు మంత్రి పదవి వచ్చింది. విజయవాడలో ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు చంద్రబాబు ఇంట్లో భోజనం చేశారు. ఆపై శ్రీశైలం ఖాళీ అయ్యే వరకు చూశారు.
సెక్షన్-3 తెచ్చి తెలంగాణకు న్యాయం చేసింది కేసీఆర్. ద్రోహ చరిత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డిది.. త్యాగ చరిత్ర మాది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను మేము వ్యతిరేకించాం. నీళ్లు ఉన్నా ఖమ్మం, నల్గొండ లో పంటలు ఎండిపోయాయి ఎందుకు?. కేసీఆర్ కట్టిన సీతారామ పుణ్యమాని ఖమ్మం పంటలు కాపాడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment