N Uttamkumar Reddy
-
శాశ్వత నష్టం చేసిందే బీఆర్ఎస్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి, రైతులకు శాశ్వత నష్టాన్ని చేకూర్చినది బీఆర్ఎస్ సర్కారేనని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర విభజన తర్వాత 2015 నుంచి 2019 వరకు ఏటా ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కృష్ణాజలాల పంపిణీకి బీఆర్ఎస్ సర్కారు అంగీకరించిందని చెప్పారు. ఉమ్మడి ఏపీలో కంటే తెలంగాణ ఏర్పాటయ్యాకే కృష్ణాజలాల విషయంలో ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు. సోమవారం ఉత్తమ్ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించిందంటూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు చేసిన ఆరోపణలను ఖండించారు. ఉత్తమ్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 56 రోజులైంది. ఈ కాలంలో ప్రాజెక్టుల అప్పగింతపై ఎలాంటి నిర్ణయం జరగలేదు. హరీశ్‌రావు ఆరోపణలు పచ్చి అబద్ధం. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే వారి వ్యవహారశైలితో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. పరీవాహక ప్రాంతం, కరువు నేలలు, జనాభా, సాగు యోగ్యమైన భూములు వంటి అంశాల ఆధారంగా తెలంగాణకు 551 టీఎంసీలు, ఏపీకి 260 టీఎంసీల కృష్ణాజలాలను పంచేలా బీఆర్ఎస్ సర్కారు డిమాండ్ చేయాల్సి ఉన్నా.. దానికి భిన్నంగా ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులకు ఒప్పుకుంది. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ అసమర్థత, చేతకానితనం, అవినీతి, కక్కుర్తి వల్లే ఈ సమస్య తలెత్తింది. రాయలసీమ లిఫ్టుకు కేసీఆర్ సహకారం 2020లో కేసీఆర్ సీఎంగా ఉండి ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో పదేపదే ఏకాంత చర్చలు జరిపి.. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసేందుకు కుట్ర చేశారు. తర్వాత కొన్ని రోజులకే మే 5న శ్రీశైలం ఫోర్‌షోర్ నుంచి 92,592 క్యూసెక్కుల సామర్థ్యంతో రోజుకు 8 టీఎంసీల కృష్ణా జలాలను తరలించుకునే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతూ ఏపీ ప్రభుత్వం జీవో 203 జారీ చేసింది. గ్రావిటీ ద్వారా తెలంగాణకు ఉచితంగా వచ్చే కృష్ణాజలాలను ఏపీకి తీసుకుపోతుంటే బీఆర్ఎస్ వాళ్లు సహకరించారు. కలసి కుట్రచేశారు. రాయలసీమ ఎత్తిపోతల పనుల కోసం ఏపీ పిలిచిన టెండర్లకు 2020 ఆగస్టు 10తో గడువు ముగిస్తే.. అంతకంటే ఐదు రోజుల ముందే ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. తెలంగాణ సీఎంను రావాలని కోరింది. కానీ రాయలసీమ ఎత్తిపోతల టెండర్లకు సహకరించడం కోసం కేసీఆర్ ఆ సమావేశానికి వెళ్లకుండా వాయిదా కోరారు. టెండర్లు ముగిశాకే మీటింగ్‌కు వెళ్లారు. తెలంగాణకు అందాల్సిన నీటిని కేసీఆర్, జగన్ కలసి రాకుండా చేశారు. నీటిపారుదల శాఖను కుప్పకూల్చారు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై రూ.27,500 కోట్లు ఖర్చుపెట్టి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేకపోవడం గత బీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కల్వకుర్తి, భీమా, కోయిల్‌సాగర్, నల్లగొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయారు. కృష్ణా జలాల వినియోగంలో కేసీఆర్ ప్రభుత్వం అన్నిరకాలుగా విఫలమైంది. అసంబద్ధంగా నీటి పారుదల శాఖను నడిపి కుప్పకూల్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.లక్ష కోట్లు అప్పుచేశారు. దాని నిర్వహణ కోసం ఏటా రూ.10వేల కోట్లు కావాలి. ఈ ప్రాజెక్టులోని ఒక బ్యారేజీ కూలిపోయి, మరో బ్యారేజీ కూలిపోయే స్థితిలో ఉండి.. ఒక్క చుక్క నీటిని వాడుకోలేని దుస్థితి ఉంది. చావులకు కారణం హరీశ్‌రావే.. ఉద్యమకాలంలో హరీశ్‌రావులా పెట్రోల్ పోసుకున్నట్టు నటించి వేరే వారి చావులకు మేం కారణం కాలేదు. ఆ సమయంలో హరీశ్, మిగతావరు పెద్ద బ్లాక్‌మెయిలర్లుగా ఉన్నారు. ఆ వివరాలు సైతం బయటపెట్టాల్సి ఉంటుంది. హరీశ్‌రావు అబద్ధాలను మానుకోవాలి..’’ అని ఉత్తమ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ సర్కారే ఒప్పుకుంది 2022 మే 6న జరిగిన కృష్ణా బోర్డు 16వ సమావేశంలో ప్రాజెక్టుల అప్పగింతకు నాటి బీఆర్ఎస్ సర్కారు ఒప్పుకొన్నట్టు మినిట్స్‌లో రికార్డు చేశారని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ఆ మినిట్స్ ప్రతినిధులను మీడియా ప్రతినిధులకు చూపారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పెద్దవాగు ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించాలని నిర్ణయించామని, అందుకోసం రూ.200 కోట్ల సీడ్ మనీ కేటాయించామని బీఆర్ఎస్ ప్రభుత్వ చివరి బడ్జెట్ (2023–24) ప్రతిపాదనల్లో కూడా పొందుపర్చారని పేర్కొన్నారు. ఇలా ప్రాజెక్టుల అప్పగింతకు పలుమార్లు అంగీకరించి, ఇప్పుడు కాంగ్రెస్ సర్కారుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. -
కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేతగా ‘జీ–23’ నాయకుడు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేతగా అధిర్ రంజన్ చౌదరి స్థానంలో మరొకరిని నియమించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 19 నుంచి ప్రారంభం కానున్నాయి. లోక్‌సభాపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టబోరని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పార్టీ పనితీరుపై అంతృప్తి వ్యక్తం చేస్తూ గత ఏడాది ఆగస్టులో సోనియా గాంధీకి లేఖ రాసిన జీ–23 (గ్రూప్–23) నాయకుల్లో ఒకరిని ఈ పదవిలో నియమించే పరిస్థితి కనిపిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ పోటీలో శశి థరూర్, మనీష్ తివారీ ముందంజలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, గౌరవ్ గొగోయ్, రవనీత్ బిట్టూల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సోనియా గాంధీకి లేఖ రాసిన జీ–23 నేతల్లో శశి థరూర్, మనీష్ తివారీ కూడా ఉన్నారు. ‘ఒక్కరికి ఒక పదవి’ అనే విధానాన్ని కఠినంగా అమలు చేయాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా అధిర్ రంజన్ చౌదరిని లోక్‌సభాపక్ష నేత బాధ్యతల నుంచి తప్పించాలని యోచిస్తోంది. ఆయన ఇప్పటికే పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో జరిగిన అవినీతిపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని, దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు కోసం పట్టుబట్టాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. -
స్వాతంత్ర సమరయోధుడి కన్నుమూత
కోదాడ రూరల్: ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొండపల్లి మట్టపల్లి లక్ష్మీనరసింహారావు (87) శుక్రవారం గుండెపోటుతో హైదరాబాద్‌లోని తన స్వగృహంలో మృతిచెందారు. రామలక్ష్మీపురం సింహయ్యగా పిలిపించుకునే కొండపల్లి మట్టపల్లి లక్ష్మీనరసింహారావు అప్పట్లోనే ఆంగ్లంలో ఎంఏ పూర్తి చేసి కొన్నాళ్లు హిందు పత్రికలో జర్నలిస్టుగా కూడా పనిచేశారు. కోదాడ నియోజకవర్గ పరిధిలోని గణపరం రామలక్ష్మీపురంలో జన్మించిన ఆయన స్వాతంత్ర సమరయోధుడిగా జైలుకెళ్లి వచ్చారు. అదేవిధంగా కోదాడ, హుజూర్నగర్ ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ మంత్రి అక్కిరాజు వాసుదేవరావుగా సమీప బంధువు. విద్యార్థి దశ నుంచే క్రియాశీలక రాజకీయాల్లో పనిచేశారు. ఆయన మృతికి టీపీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు విరేపల్లి లక్ష్మీనారాయణరావు, వేనేపల్లి చందర్రావు, ఉత్తమ్ పద్మావతి, నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం నాయకులు కొండపల్లి వాసుదేవరావు, కొండపల్లి మురళీధర్‌రావు, విద్యాత్తవేత్తలు మంత్రిపగఢ భరతరావు, శ్రీరామకవచం వెంకటేశ్వర్లు, గ్రామస్తులు తమ దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. చదవండి: మానవత్వం చాటిన ఎమ్మెల్యే కంచర్ల చదవండి: శభాష్! క్రేన్‌తో వ్యక్తిని కాపాడిన పోలీసులు -
ఉత్తమ్‌కు కరోనా పాజిటివ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కరోనా సోకింది. గత మూడు రోజులుగా దగ్గుతో బాధపడుతున్న ఆయన శనివారం కోవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. అయితే, ఛాతీ భాగంలో కొంత ఇన్ఫెక్షన్ ఉన్న కారణంగా మెరుగైన చికిత్స కోసం ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ)లో చేరినట్టు సమాచారం. కాగా.. ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో తనకు కోవిడ్ నిర్ధారణ కాలేదని, ఊపిరితిత్తుల సీటీ స్కానింగ్‌లోనే ఈ విషయం వెల్లడైందని ఉత్తమ్ తెలిపారు. తనను కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. చదవండి: అందరికీ ఉచితంగా టీకా: సీఎం కేసీఆర్ చదవండి: ఆ ‘నలుగురు’గా మారిన ముస్లిం యువత Got a CT lung scan today. Pneumonia caused by Covid detected. People who have been in contact with me, kindly get tested. Both rapid & RT PCR tests failed to detect COVID in my case. Urge you to go for lung CT scan if symptoms persist despite negative RTPCR/Rapid antigen tests. — Uttam Kumar Reddy (@UttamTPCC) April 24, 2021 -
ఏఐసీసీ కొత్త కమిటీలో ఉత్తమ్‌కు చోటు
సాక్షి, హైదరాబాద్: బంగ్లాదేశ్ విముక్తి యుద్ధ సంస్మరణ ఉత్సవాల నిర్వహణ కోసం ఏఐసీసీ నియమించిన కమిటీలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి చోటు దక్కింది. ఈ ఉత్సవాల నిర్వహణ కోసం 10 మంది నేతలతో కమిటీ వేసినట్లు పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ మంగళవారం జారీ చేసిన ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. రక్షణ, విదేశాంగ అనుభవం ఉన్న, సరిహద్దు ప్రాంత నేతలకు కమిటీలో చోటు కల్పించారు. ఏకే ఆంటోనీ చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో ఉత్తమ్‌తో పాటు మీరాకుమార్, కెప్టెన్ అమరీందర్‌సింగ్, పృథ్వీరాజ్ చౌహాన్, జితేంద్ర సింగ్, కిరణ్ చౌదరి, మేజర్ వేద్‌ప్రకాశ్, శర్మిష్టా ముఖర్జీలకు చోటు లభించింది. కమిటీ కన్వీనర్‌గా కెప్టెన్ ప్రవీణ్ దావర్‌ను నియమించారు. జగ్గారెడ్డి దీక్ష రద్దు: ఎల్ఆర్ఎస్ రద్దు కోరుతూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి బుధవారం గాంధీభవన్‌లో నిర్వహించ తలపెట్టిన ఒక రోజు దీక్ష రద్దయింది. పాత పద్ధతిలోనే రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్న స్థలాలు, నిర్మాణాలకు రిజిస్ట్రేషన్లు చేయాలని మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో తన దీక్షను రద్దు చేసుకున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ ‘పంట కొనుగోళ్ల’ పోరు! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులు పండించే పంటలను కొనే కొనుగోలు కేంద్రాలు ఎత్తేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై పోరాటానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ అంశంపై రైతులతో కలసి ఉద్యమించాలని టీపీసీసీ నిర్ణయించింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు సుంకేట అన్వేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, పార్టీ నేతలు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు మంగళవారం గాంధీభవన్‌లో సమావేశమై చర్చించారు. పంట కొనుగోలు కేంద్రాల ఎత్తివేతను వ్యతిరేకిస్తూ రైతులతో కలసి పోరాటం చేయడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. చదవండి: (పల్లెల్లో పంట కొనుగోలు కుదరదు!) బుధవారం నుంచి వచ్చే నెల ఏడో తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు, తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇవ్వాలని, జనవరి 11న జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేయాలని, 18న హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి ఉద్యమం నిర్వహించాలని తీర్మానించారు. అనంతరం ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. ఒకట్రెండు రోజుల్లో ఇదే అంశంపై అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలతో కలసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసిన కేసీఆర్‌కు సీఎంగా కొనసాగే అర్హత లేదని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తే కాంగ్రెస్ పార్టీ సహించబోదని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయంపై రైతులతో కలసి ఉద్యమాలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ఈ ప్రభుత్వం అవసరమా అని ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన సీఎం కేసీఆర్ అక్కడి బీజేపీ పెద్దలతో సయోధ్య కుదుర్చుకున్నారని, అందులో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని ఆరోపించారు. వ్యవస్థలను కూల్చే పనిలో టీఆర్ఎస్..: భట్టి కాంగ్రెస్ ఏర్పాటు చేసిన వ్యవస్థలను కూల్చే పనిలో టీఆర్ఎస్ ఉందని భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజల సంక్షేమం కోసం పాలన చేయాలి కానీ.. లాభాల కోసం ప్రభుత్వాలను నడపరని, లాభాల కోసం ఆలోచిస్తే ప్రజాస్వామ్యయుతంగా పాలించినట్టు కాదని కేసీఆర్‌కు హితవు పలికారు. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ధర్నాల పేరిట టీఆర్ఎస్ వేసుకున్న ముసుగు తొలగిపోయిందని, ఢిల్లీకి మోకరిల్లి ఇప్పుడు మాట మారుస్తున్నారని విమర్శించారు. రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వ పెద్దలు తీసుకుంటున్న రైతు వ్యతిరేక నిర్ణయాలు వారి పతనానికి ప్రారంభాలని టి.జీవన్‌రెడ్డి అన్నారు. -
పీవీ భారతదేశ చరిత్రలో నిలిచిపోతారు: కేసీఆర్
నిరంతర సంస్కరణశీలి సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నిరంతర సంస్కరణ శీలిగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం పీవీ వర్ధంతి సందర్భంగా కేసీఆర్ ఆయనను స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఆర్థిక, విద్య, భూ పరిపాలన తదితర రంగాల్లో ఆయన అమలు చేసిన సంస్క రణల ఫలితాన్ని నేడు భారతదేశం అనుభ విస్తుందని అభిప్రాయపడ్డారు. అంతర్గత భద్రత, విదేశాంగ వ్యవహారాల్లోనూ ఆయన అవలం బించిన దృఢమైన వైఖరి, దౌత్యనీతి భారతదేశ సమ గ్రతను, సార్వభౌమాత్వాన్ని పటిష్టపరిచిం దని సీఎం కొనియాడారు. బహు భాషావేత్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, గొప్ప పరిపాలకుడిగా అనేక రంగాల్లో విశిష్ట సేవలందించిన పీవీకి ఘననివాళి అర్పించేందుకే శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో నిర్వహిస్తోందన్నారు. నెక్లెస్ రోడ్‌లోని పీవీ ఘాట్‌ని సందర్శించి నివాళులర్పించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): దివంగత ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. బుధవారం పీవీ 16వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్‌లోని ఆయన ఘాట్ వద్ద మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆయనకు నివాళులర్పించి స్మరించుకున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు కేవీ రమణాచారి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రులు గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మాజీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ప్రభుత్వ మాజీ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌శర్మలతో పాటు పీవీ కుటుంబసభ్యులు నివాళులర్పించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, బీసీ కమిషన్ మాజీ సభ్యులు వకులాభవరణం కృష్ణమోహన్, తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేస్తాం: కేకే ప్రపంచంలో భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెంచేందుకు కృషి చేసిన గొప్ప మేధావి దివంగత ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ కె.కేశవరావు తెలిపారు. పీవీ జ్ఞాపకార్థం నెక్లెస్ రోడ్‌కు ఆయన పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని చెప్పారు. ఈ నెల 31లోపు పీవీ పేరుతో స్మారక పోస్టల్ స్టాంపును ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించేలా కృషి చేస్తున్నామన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ధైర్యంతో భూ సంస్కరణలతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఆయన చేపట్టిన సంస్కరణలను, సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పోస్టల్ స్టాంపును విడుదల చేస్తుందన్నారు. పీవీ చరిత్రలో నిలిచిపోతారు: ఉత్తమ్ పీవీ నరసింహారావు చేపట్టిన సంస్కరణల వల్ల దేశ చరిత్రలో ఆయన నిలిచిపోతారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు ప్రపంచంలో భారతదేశాన్ని సూపర్ పవర్‌గా నిలబెట్టాయన్నారు. -
గాంధీభవన్‌లో NSUI సమావేశం
-
అక్రమ సంపాదనతో భారీ ప్రచారం
♦ టీఆర్ఎస్పై ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధ్వజం ♦ అరాచకాలను ఎండగట్టాలి ♦ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ఉగ్రవాది: భట్టి సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీ అక్రమ సంపాదనతో భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలతో బూటకపు ప్రచారం చేసుకుంటోందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన కృషి చాలా ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలోని అభివృద్ధిని తమ ఘనతగా టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన ఎన్ఎస్యూఐ సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు. టీఆర్ఎస్ నాయకుల అరాచకాలను, అప్రజాస్వామిక పద్ధతులను ప్రజలకు తెలియజేయడానికి సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలవడానికి టీఆర్ఎస్ అన్ని అడ్డదారులను తొక్కుతోందంటూ వీటిపై టీపీసీసీ రూపొందించిన వీడియో క్లిప్పింగులను విద్యార్థి నేతలకు ఉత్తమ్ చూపించారు. హైదరాబాద్‌కు గోదావరి జలాలు, మెట్రో రైలు, ఔటర్ రింగురోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి వాటికి కాంగ్రెస్ చేసిన కృషిని ప్రజలకు వివరించాలని చెప్పారు. హైదరాబాద్‌లో ఉంటున్న సెటిలర్లకు అందరితోపాటు సమానహక్కులుంటాయన్నారు. టీఆర్ఎస్కు ఓటేస్తే వృథా అయినట్టేనని పేర్కొన్నారు. టీఆర్ఎస్ కుట్రలు: భట్టి ప్రతిపక్షాలను లేకుండా చేయాలని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ఉగ్రవాదిగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలుపుకోసం ఇప్పటికే టీఆర్ఎస్ సర్కారు చాలా కుట్రలు చేసిందని ఆరోపించారు. ఎన్నికల నిర్వహణలో శాస్త్రీయత, పారదర్శకత లేకుండా వ్యవహరిస్తున్నదన్నారు. న్యాయస్థానాలు మొట్టికాయలు వేసినా, ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చినా అధికారపక్షం బరితెగించి పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్‌లోని ఏ దామాషా ప్రకారం డివిజన్ల రిజర్వేషన్లు చేశారని ప్రశ్నించారు. చండీయాగం దాతలెవరు: షబ్బీర్ అలీ సీఎం కేసీఆర్ నిర్వహించిన చండీయాగానికి 7.5 కోట్లు ఖర్చు అయినట్టు స్వయంగా ఆయనే చెప్పారని, దానికి విరాళాలు ఇచ్చిన దాతల పేర్లను చెప్పాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు ప్రచార పిచ్చి పట్టుకుందని, పబ్లిక్ టాయిలెట్లను కూడా కేసీఆర్ ఫొటోలతో నింపేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కాళ్ల దగ్గర మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ ఫొటోలు న్నాయని, ముస్లిం వేషధారణలో ఉన్న ఒవైసీ ఫొటోను అక్కడ పెట్టి ముస్లిం లను అవమానిస్తున్నారన్నారు. ముస్లింలకు కేసీఆర్, అసదుద్దీన్ క్షమాపణ చెప్పాలని షబ్బీర్ డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును మించిన అబద్ధాలకోరు దేశంలోనే లేరని విమర్శించారు. వీసాలపై న్యాయసలహాలు అమెరికా వెళ్లి ఇబ్బం దులు పడుతున్న తెలంగాణ విద్యార్థులకు ఆదివారం న్యాయ నిపుణుల ద్వారా ఉచితంగా న్యాయసలహాలను అందిస్తామని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధు యాష్కీ, టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ వినోద్‌కుమార్ తెలిపారు. అమెరికా వెళ్తున్న విద్యార్థులు అవగాహన లేకపోవడం వల్ల ఆర్థికంగా నష్ట పోతు న్నారని, అక్కడ ఇబ్బందులు పడుతున్నా రని చెప్పారు. -
'ఉపాధిహామీకి నిధులు పెంచాలి'
హైదరాబాద్: ఉపాధిహామీ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీరుగారుస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతు కూలీలు ఉపాధిలేక ఇబ్బంది పడుతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. ఉపాధి హామీకి నిధులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 5న అన్ని మండల కేంద్రాల్లో కాంగ్రెస్ ధర్నాలు చేపట్టనున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. -
'హైదరాబాద్‌ను అమ్మకానికి పెడుతున్న టీ సర్కార్'
రంగారెడ్డి: ఆచరణ సాధ్యంకాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి టీఆర్ఎస్ అధికారంలో వచ్చిందంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. సోమవారం ఎల్బీనగర్లో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భట్టి విక్రమార్కతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదుపై నేతలతో ఉత్తమ్, భట్టి, షబ్బీర్ అలీ సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. టీఆర్ఎస్ సర్కార్ హైదరాబాద్‌ను అమ్మకానికి పెడుతోందని మండిపడ్డారు. సెక్రటేరియట్‌ను కూడా ప్రైవేట్ సంస్థలకు ధారదత్తం చేసేందుకు సిద్ధమవుతోందని విమర్శించారు. హైదరాబాద్ సిటీ, ప్రభుత్వ సంస్థలను రక్షించుకునే ఎజెండాతో తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలని భట్టి సూచించారు. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. విభేదాలు పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం కాంగ్రెస్ కార్యకర్తలు పాటుపడాలని అన్నారు. అధికారక టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని చెప్పారు. 10 నెలల కేసీఆర్ సర్కార్ రాజకీయ వలసలను ప్రోత్సహించిందే తప్ప.. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. వ్యవసాయ సంక్షోభం తీవ్రస్థాయికి చేరినా.. ప్రభుత్వం నిర్లక్ష్యంగానే ఉందని ఉత్తమ్ మండిపడ్డారు. ఇదిలా ఉండగా, వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరపకుండా ప్రభుత్వమే విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి రావని అన్నారు. మైనార్టీల భాష్యం చెప్పుకునే ఎంఐఎం కూడా ఈ అంశాన్ని ప్రశ్నించడం లేదని ఉత్తమ్ విమర్శించారు. -
డబ్బు తరలింపు ఘటనలో మాజీమంత్రి ‘ఉత్తమ్’పై కేసు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఎన్నికల సమయంలో అక్రమంగా డబ్బు తరలింపు కేసులో మాజీ మంత్రి, హుజూర్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతోపాటు వాహన యజమాని, డ్రైవర్‌పై కూడా కేసు నమోదైంది. కోదాడ నుంచి హైదరాబాద్‌కు డబ్బు అక్రమంగా తలిస్తుండగా నల్లగొండ జిల్లా సూర్యాపేట వద్ద వాహనంలో నోట్లకట్టలు దగ్ధమైన విషయం విదితమే. విచారణ జరిపిన పోలీసులు.. వాహన యజమాని గౌతం, ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న మాజీమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డ్రైవర్‌పై సూర్యాపేట టౌన్ పోలీసులు నమోదు చేశారు. కేసు పురోగతిపై నివేదికను పోలీసులు కోర్టుకు పంపినట్లు తెలిసింది. -
ఉత్తమ్‌కు టీపీసీసీ పదవి
వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకం మూడు నాలుగు రోజుల ఉత్కంఠకు తెర ‘జానా’కు చేజారిన టీపీసీసీ చీఫ్ పదవి సాక్షిప్రతినిధి, నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌కు ఓ కీలకమైన పదవి అందివచ్చింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎంపికయ్యారు. ఏఐసీసీ నాయకత్వం మంగళవారం చేసిన ప్రకటన ఆయన అనుచర వర్గంలో ఆనందోత్సాహాలు నింపింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండు రాష్ట్రాలకు వేర్వేరు పీసీసీలు ఉంటాయని, పీసీసీ అధ్యక్షులను ప్రకటిస్తారని పార్టీవర్గాలు ఎదురు చూశాయి. మూడు నాలుగు రోజు లుగా జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి కుందూరు జానారెడ్డి పేరు తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి ఖరారైందని, ఆయన పేరును అధికారి కంగా ప్రకటించడమే తరువాయి అని జోరుగా ప్రచారం జరిగింది. ఎపుడెపుడు జానా పేరును ప్రకటిస్తారా అని ఆయన అనుచరులంతా ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ దీనికి భిన్నంగా మంగళవారం ఏఐసీసీ నాయకత్వం ఢిల్లీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి పార్టీకి కొత్త సారథులను ఎంపిక చేసి ప్రకటించింది. జానాతో బాటే టీపీసీ రేసులో వినిపించిన మరో ముఖ్య నేత పొన్నాల లక్ష్మయ్యను అధ్యక్షుడిగా, గృహనిర్మాణ శాఖా మాజీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రకటించారు. వాస్తవానికి టీపీసీసీ అధ్యక్ష పదవి రేసులో జానారెడ్డితో పాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేరు కూడా మొదటి నుంచీ పరిశీలనలో ఉందని చెబుతున్నారు. పార్టీలో సామాజిక సర్దుబాటులో భాగంగానే వివిధ పోస్టులు ఖరారయ్యాయని చెబుతున్నారు. జిల్లాకు చెందిన సీనియర్ నేత జానాకు పదవి తప్పిపోయినా, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అదే స్థాయి పదవి లభించడంతో జిల్లా కాంగ్రెస్ శ్రేణులు కొంత ఊరట చెందాయి. వరసగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంత్రి పదవి కోసం మాత్రం సుదీర్ఘకాలమే ఎదురు చూశారు. 2012 ఫిబ్రవరిలో నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలో ఆయన గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చే వరకు ఉత్తమ్ ఆ బాధ్యతల్లోనే కొనసాగారు. ఇదీ.. బయోడేటా పేరు : నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పుట్టిన తేదీ : 20.06.1962 విద్యార్హత : ఎన్డీఏ (నేషనల్ డిఫెన్స్ అకాడమీ). పూనాలో ప్రాథమిక సైనిక శిక్షణ, యుద్ధ విమాన ప్రాథమిక పైలట్ శిక్షణ. బీదర్, దుండిగల్, హకీంపేటలలో ఎయిర్‌ఫోర్స్ శిక్షణ సంస్థలలో శిక్షణ పొందారు. విధులు నిర్వహించిన ప్రాంతాలు: భారత వాయుసేనలో భారత్-పాక్, భారత్- చైనా సరిహద్దుల్లో, అమృత్సర్, శ్రీనగర్, జైసల్మేర్, బుచ్, చబూవా, బాగోగ్రా. భారత రాష్ట్రపతి కార్యాలయంలో ఆరున్నర సంవత్సరాలు కంట్రోలర్ (సెక్యూరిటీ, ప్రొటోకాల్, పరిపాలన, రాష్ట్రపతి విదేశీయానాలు) గా విధినిర్వహణ 1994లో ఉద్యోగానికి రాజీనామా, అదే సంవత్సరంలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1994లో శాసనసభ ఎన్నికలలో కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. 1999, 2004లో కోదాడ శాసనసభ్యుడిగా విజయం. 2009లో హుజూర్నగర్ ఎమ్మెల్యేగా విజయం . చేపట్టిన పదవులు : పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్, 610జీఓ అమలు కమిటీ చైర్మన్ తెలంగాణపై కాంగ్రెస్ తరపున అఖిలపక్ష భేటికీ తెలంగాణ ప్రతినిధి. శాసన సభ అంచనాల కమిటి చైర్మన్‌గా పనిచేశారు. 2012లో రాష్ట్ర గృహనిర్మాణ శాఖా మంత్రిగా బాధ్యతల స్వీకరణ -
'దిగ్విజయ్ హామీ మేరకు సమ్మె విరమించాలి'
హుజూర్నగర్: కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ హామీ మేరకు ఏపీఎన్జీవోలు సమ్మె విరమించాలని మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడినా ఆంధ్ర ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు ఉండవని ద్విగిజయ్ అన్నారన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం అక్టోబర్ మొదటి వారంలో కేబినెట్ ముందుకు తెలంగాణ నోట్ వస్తుందన్నారు. సీడబ్ల్యుసీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం హైదరాబాద్ 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందన్నారు. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీని కలిపి ఉమ్మడి రాజధానిగా చేయనున్నట్లు ప్రచారం జరుగుతుందన్నారు. హైదరాబాద్ రెవెన్యూ డిస్ట్రిక్ట 217 చదరపు కిలోమీటర్లు ఉండగా, గ్రేటర్ హైదరాబాద్ 950 చ.కిలోమీటర్లు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ 7,200 చ.కిలోమీటర్లు ఉందన్నారు. వీటిలో 217 చ.కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్ రెవెన్యూ డిస్ట్రిక్టను మాత్రమే ఉమ్మడి రాజధానిగా చేయాలని, దానికి సంబంధించిన నోటును తాను వ్యక్తిగతంగా తయారు చేసి మ్యాప్‌లతో సహా హోంశాఖకు వివరించానని చెప్పారు. ఈ మేరకు సీడబ్ల్యుసీ తీర్మానంలో కూడా ఇదే విషయం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ విషయంలో ఏ ఇతర ప్రతిపాదనలను తెలంగాణ ప్రజలు అంగీకరించరని వివరించినట్లు చెప్పారు. తాను 610 జీవో చైర్మన్‌గా పనిచేసిన అనుభవం దృష్ట్యా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఏపీ ఎన్జీవోలకు ఎటువంటి సమస్యలు ఉండవని, వెంటనే సమ్మె విరమించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.