'హైదరాబాద్ను అమ్మకానికి పెడుతున్న టీ సర్కార్'
రంగారెడ్డి: ఆచరణ సాధ్యంకాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి టీఆర్ఎస్ అధికారంలో వచ్చిందంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. సోమవారం ఎల్బీనగర్లో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భట్టి విక్రమార్కతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదుపై నేతలతో ఉత్తమ్, భట్టి, షబ్బీర్ అలీ సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. టీఆర్ఎస్ సర్కార్ హైదరాబాద్ను అమ్మకానికి పెడుతోందని మండిపడ్డారు. సెక్రటేరియట్ను కూడా ప్రైవేట్ సంస్థలకు ధారదత్తం చేసేందుకు సిద్ధమవుతోందని విమర్శించారు. హైదరాబాద్ సిటీ, ప్రభుత్వ సంస్థలను రక్షించుకునే ఎజెండాతో తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలని భట్టి సూచించారు.
అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. విభేదాలు పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం కాంగ్రెస్ కార్యకర్తలు పాటుపడాలని అన్నారు. అధికారక టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని చెప్పారు. 10 నెలల కేసీఆర్ సర్కార్ రాజకీయ వలసలను ప్రోత్సహించిందే తప్ప.. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. వ్యవసాయ సంక్షోభం తీవ్రస్థాయికి చేరినా.. ప్రభుత్వం నిర్లక్ష్యంగానే ఉందని ఉత్తమ్ మండిపడ్డారు. ఇదిలా ఉండగా, వికారుద్దీన్ ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరపకుండా ప్రభుత్వమే విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి రావని అన్నారు. మైనార్టీల భాష్యం చెప్పుకునే ఎంఐఎం కూడా ఈ అంశాన్ని ప్రశ్నించడం లేదని ఉత్తమ్ విమర్శించారు.