ఢిల్లీలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు జ్ఞాపికను ఇస్తున్న డిప్యూటీ సీఎం భట్టి
వివిధ పథకాలు, గ్రాంట్ల కింద రాష్ట్రానికి ఈ నిధులు రావాల్సి ఉంది
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు భట్టి విక్రమార్క వినతిపత్రం
ఏపీ నుంచి రావాల్సిన బకాయిలనూ ఇప్పించాలని విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన రూ.32,024 కోట్లను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్ నివాసంలో నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిధుల వివరాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ మార్గాల్లో రావాల్సిన నిధులకు సంబంధించి గతంలో రాసిన లేఖలను సైతం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం సహాయం చేసే పథకాలతోపాటు ప్రాయోజిత పథకాలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి గ్రాంటు, షెడ్యూల్ 9 క్రింద ఉన్న సంస్థల నిర్వహణ కోసం అయ్యే ఖర్చు, విద్యుత్ కొనుగోళ్ల కోసం ఖర్చు చేసిన నిధులు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కింద తీసుకున్న నిధులు అన్ని కలిపి రూ.32,024 కోట్లను ఇవ్వాలని కోరారు.
ఏపీ నుంచి బకాయిలు ఇప్పించండి
హైదరాబాద్‌లోని పలు రాజ్యాంగ సంస్థల భవనాల నిర్వహణ ఖర్చుల కింద ఏపీ ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.408 కోట్లను వెంటనే ఇప్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని భట్టి కోరారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం– 2014లోని సెక్షన్ 56 (2) ప్రకారం రావాల్సిన రూ.208.24 కోట్లను కూడా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా భట్టి వెంట ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్‌రెడ్డి, బలరాం నాయక్, అధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment