గాంధీభవన్‌లో మాట్లాడుతున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, చిత్రంలో భట్టి విక్రమార్క, కోదండరెడ్డి, జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బంగ్లాదేశ్ విముక్తి యుద్ధ సంస్మరణ ఉత్సవాల నిర్వహణ కోసం ఏఐసీసీ నియమించిన కమిటీలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి చోటు దక్కింది. ఈ ఉత్సవాల నిర్వహణ కోసం 10 మంది నేతలతో కమిటీ వేసినట్లు పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్ మంగళవారం జారీ చేసిన ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. రక్షణ, విదేశాంగ అనుభవం ఉన్న, సరిహద్దు ప్రాంత నేతలకు కమిటీలో చోటు కల్పించారు. ఏకే ఆంటోనీ చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో ఉత్తమ్‌తో పాటు మీరాకుమార్, కెప్టెన్ అమరీందర్‌సింగ్, పృథ్వీరాజ్ చౌహాన్, జితేంద్ర సింగ్, కిరణ్ చౌదరి, మేజర్ వేద్‌ప్రకాశ్, శర్మిష్టా ముఖర్జీలకు చోటు లభించింది. కమిటీ కన్వీనర్‌గా కెప్టెన్ ప్రవీణ్ దావర్‌ను నియమించారు.
జగ్గారెడ్డి దీక్ష రద్దు: ఎల్‌ఆర్‌ఎస్ రద్దు కోరుతూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి బుధవారం గాంధీభవన్‌లో నిర్వహించ తలపెట్టిన ఒక రోజు దీక్ష రద్దయింది. పాత పద్ధతిలోనే రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్న స్థలాలు, నిర్మాణాలకు రిజిస్ట్రేషన్లు చేయాలని మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో తన దీక్షను రద్దు చేసుకున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు.
కాంగ్రెస్ ‘పంట కొనుగోళ్ల’ పోరు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులు పండించే పంటలను కొనే కొనుగోలు కేంద్రాలు ఎత్తేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై పోరాటానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ అంశంపై రైతులతో కలసి ఉద్యమించాలని టీపీసీసీ నిర్ణయించింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు సుంకేట అన్వేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, పార్టీ నేతలు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు మంగళవారం గాంధీభవన్‌లో సమావేశమై చర్చించారు. పంట కొనుగోలు కేంద్రాల ఎత్తివేతను వ్యతిరేకిస్తూ రైతులతో కలసి పోరాటం చేయడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. చదవండి: (పల్లెల్లో పంట కొనుగోలు కుదరదు!)
బుధవారం నుంచి వచ్చే నెల ఏడో తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు, తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇవ్వాలని, జనవరి 11న జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేయాలని, 18న హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి ఉద్యమం నిర్వహించాలని తీర్మానించారు. అనంతరం ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. ఒకట్రెండు రోజుల్లో ఇదే అంశంపై అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలతో కలసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసిన కేసీఆర్‌కు సీఎంగా కొనసాగే అర్హత లేదని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తే కాంగ్రెస్ పార్టీ సహించబోదని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయంపై రైతులతో కలసి ఉద్యమాలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ఈ ప్రభుత్వం అవసరమా అని ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన సీఎం కేసీఆర్ అక్కడి బీజేపీ పెద్దలతో సయోధ్య కుదుర్చుకున్నారని, అందులో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని ఆరోపించారు.
వ్యవస్థలను కూల్చే పనిలో టీఆర్‌ఎస్..: భట్టి
కాంగ్రెస్ ఏర్పాటు చేసిన వ్యవస్థలను కూల్చే పనిలో టీఆర్‌ఎస్ ఉందని భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజల సంక్షేమం కోసం పాలన చేయాలి కానీ.. లాభాల కోసం ప్రభుత్వాలను నడపరని, లాభాల కోసం ఆలోచిస్తే ప్రజాస్వామ్యయుతంగా పాలించినట్టు కాదని కేసీఆర్‌కు హితవు పలికారు. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ధర్నాల పేరిట టీఆర్‌ఎస్ వేసుకున్న ముసుగు తొలగిపోయిందని, ఢిల్లీకి మోకరిల్లి ఇప్పుడు మాట మారుస్తున్నారని విమర్శించారు. రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వ పెద్దలు తీసుకుంటున్న రైతు వ్యతిరేక నిర్ణయాలు వారి పతనానికి ప్రారంభాలని టి.జీవన్‌రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment