వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకం
మూడు నాలుగు రోజుల ఉత్కంఠకు తెర
‘జానా’కు చేజారిన టీపీసీసీ చీఫ్ పదవి
సాక్షిప్రతినిధి, నల్లగొండ
జిల్లా కాంగ్రెస్‌కు ఓ కీలకమైన పదవి అందివచ్చింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎంపికయ్యారు. ఏఐసీసీ నాయకత్వం మంగళవారం చేసిన ప్రకటన ఆయన అనుచర వర్గంలో ఆనందోత్సాహాలు నింపింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండు రాష్ట్రాలకు వేర్వేరు పీసీసీలు ఉంటాయని, పీసీసీ అధ్యక్షులను ప్రకటిస్తారని పార్టీవర్గాలు ఎదురు చూశాయి. మూడు నాలుగు రోజు లుగా జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి కుందూరు జానారెడ్డి పేరు తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి ఖరారైందని, ఆయన పేరును అధికారి కంగా ప్రకటించడమే తరువాయి అని జోరుగా ప్రచారం జరిగింది. ఎపుడెపుడు జానా పేరును ప్రకటిస్తారా అని ఆయన అనుచరులంతా ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ దీనికి భిన్నంగా మంగళవారం ఏఐసీసీ నాయకత్వం ఢిల్లీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి పార్టీకి కొత్త సారథులను ఎంపిక చేసి ప్రకటించింది. జానాతో బాటే టీపీసీ రేసులో వినిపించిన మరో ముఖ్య నేత పొన్నాల లక్ష్మయ్యను అధ్యక్షుడిగా, గృహనిర్మాణ శాఖా మాజీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రకటించారు. వాస్తవానికి టీపీసీసీ అధ్యక్ష పదవి రేసులో జానారెడ్డితో పాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేరు కూడా మొదటి నుంచీ పరిశీలనలో ఉందని చెబుతున్నారు.
పార్టీలో సామాజిక సర్దుబాటులో భాగంగానే వివిధ పోస్టులు ఖరారయ్యాయని చెబుతున్నారు. జిల్లాకు చెందిన సీనియర్ నేత జానాకు పదవి తప్పిపోయినా, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అదే స్థాయి పదవి లభించడంతో జిల్లా కాంగ్రెస్ శ్రేణులు కొంత ఊరట చెందాయి. వరసగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంత్రి పదవి కోసం మాత్రం సుదీర్ఘకాలమే ఎదురు చూశారు. 2012 ఫిబ్రవరిలో నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలో ఆయన గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చే వరకు ఉత్తమ్ ఆ బాధ్యతల్లోనే కొనసాగారు.
ఇదీ.. బయోడేటా
పేరు : నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
పుట్టిన తేదీ : 20.06.1962
విద్యార్హత : ఎన్‌డీఏ (నేషనల్ డిఫెన్స్ అకాడమీ).
పూనాలో ప్రాథమిక సైనిక శిక్షణ, యుద్ధ విమాన ప్రాథమిక పైలట్ శిక్షణ. బీదర్, దుండిగల్, హకీంపేటలలో ఎయిర్‌ఫోర్స్ శిక్షణ సంస్థలలో శిక్షణ పొందారు.
విధులు నిర్వహించిన ప్రాంతాలు: భారత వాయుసేనలో భారత్-పాక్, భారత్- చైనా సరిహద్దుల్లో,
అమృత్‌సర్, శ్రీనగర్, జైసల్మేర్, బుచ్, చబూవా, బాగోగ్రా.
భారత రాష్ట్రపతి కార్యాలయంలో ఆరున్నర సంవత్సరాలు కంట్రోలర్ (సెక్యూరిటీ, ప్రొటోకాల్, పరిపాలన, రాష్ట్రపతి విదేశీయానాలు) గా విధినిర్వహణ
1994లో ఉద్యోగానికి రాజీనామా, అదే సంవత్సరంలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
1994లో శాసనసభ ఎన్నికలలో కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు.
1999, 2004లో కోదాడ శాసనసభ్యుడిగా విజయం.
2009లో హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా విజయం .
చేపట్టిన పదవులు : పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్,
610జీఓ అమలు కమిటీ చైర్మన్
తెలంగాణపై కాంగ్రెస్ తరపున అఖిలపక్ష భేటికీ తెలంగాణ ప్రతినిధి.
శాసన సభ అంచనాల కమిటి చైర్మన్‌గా పనిచేశారు.
2012లో రాష్ట్ర గృహనిర్మాణ శాఖా మంత్రిగా బాధ్యతల స్వీకరణ
ఉత్తమ్‌కు టీపీసీసీ పదవి
Published Wed, Mar 12 2014 2:10 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement