సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి, రైతులకు శాశ్వత నష్టాన్ని చేకూర్చినది బీఆర్‌ఎస్ సర్కారేనని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర విభజన తర్వాత 2015 నుంచి 2019 వరకు ఏటా ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కృష్ణాజలాల పంపిణీకి బీఆర్‌ఎస్ సర్కారు అంగీకరించిందని చెప్పారు. ఉమ్మడి ఏపీలో కంటే తెలంగాణ ఏర్పాటయ్యాకే కృష్ణాజలాల విషయంలో ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు. సోమవారం ఉత్తమ్ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించిందంటూ బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు చేసిన ఆరోపణలను ఖండించారు. ఉత్తమ్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..
‘‘మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 56 రోజులైంది. ఈ కాలంలో ప్రాజెక్టుల అప్పగింతపై ఎలాంటి నిర్ణయం జరగలేదు. హరీశ్‌రావు ఆరోపణలు పచ్చి అబద్ధం. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే వారి వ్యవహారశైలితో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. పరీవాహక ప్రాంతం, కరువు నేలలు, జనాభా, సాగు యోగ్యమైన భూములు వంటి అంశాల ఆధారంగా తెలంగాణకు 551 టీఎంసీలు, ఏపీకి 260 టీఎంసీల కృష్ణాజలాలను పంచేలా బీఆర్‌ఎస్ సర్కారు డిమాండ్ చేయాల్సి ఉన్నా.. దానికి భిన్నంగా ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులకు ఒప్పుకుంది. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ అసమర్థత, చేతకానితనం, అవినీతి, కక్కుర్తి వల్లే ఈ సమస్య తలెత్తింది.
రాయలసీమ లిఫ్టుకు కేసీఆర్ సహకారం
2020లో కేసీఆర్ సీఎంగా ఉండి ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో పదేపదే ఏకాంత చర్చలు జరిపి.. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసేందుకు కుట్ర చేశారు. తర్వాత కొన్ని రోజులకే మే 5న శ్రీశైలం ఫోర్‌షోర్ నుంచి 92,592 క్యూసెక్కుల సామర్థ్యంతో రోజుకు 8 టీఎంసీల కృష్ణా జలాలను తరలించుకునే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతూ ఏపీ ప్రభుత్వం జీవో 203 జారీ చేసింది.
గ్రావిటీ ద్వారా తెలంగాణకు ఉచితంగా వచ్చే కృష్ణాజలాలను ఏపీకి తీసుకుపోతుంటే బీఆర్‌ఎస్ వాళ్లు సహకరించారు. కలసి కుట్రచేశారు. రాయలసీమ ఎత్తిపోతల పనుల కోసం ఏపీ పిలిచిన టెండర్లకు 2020 ఆగస్టు 10తో గడువు ముగిస్తే.. అంతకంటే ఐదు రోజుల ముందే ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. తెలంగాణ సీఎంను రావాలని కోరింది. కానీ రాయలసీమ ఎత్తిపోతల టెండర్లకు సహకరించడం కోసం కేసీఆర్ ఆ సమావేశానికి వెళ్లకుండా వాయిదా కోరారు. టెండర్లు ముగిశాకే మీటింగ్‌కు వెళ్లారు. తెలంగాణకు అందాల్సిన నీటిని కేసీఆర్, జగన్ కలసి రాకుండా చేశారు.
నీటిపారుదల శాఖను కుప్పకూల్చారు
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై రూ.27,500 కోట్లు ఖర్చుపెట్టి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేకపోవడం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కల్వకుర్తి, భీమా, కోయిల్‌సాగర్, నల్లగొండ జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయారు. కృష్ణా జలాల వినియోగంలో కేసీఆర్ ప్రభుత్వం అన్నిరకాలుగా విఫలమైంది. అసంబద్ధంగా నీటి పారుదల శాఖను నడిపి కుప్పకూల్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.లక్ష కోట్లు అప్పుచేశారు. దాని నిర్వహణ కోసం ఏటా రూ.10వేల కోట్లు కావాలి. ఈ ప్రాజెక్టులోని ఒక బ్యారేజీ కూలిపోయి, మరో బ్యారేజీ కూలిపోయే స్థితిలో ఉండి.. ఒక్క చుక్క నీటిని వాడుకోలేని దుస్థితి ఉంది.
చావులకు కారణం హరీశ్‌రావే..
ఉద్యమకాలంలో హరీశ్‌రావులా పెట్రోల్ పోసుకున్నట్టు నటించి వేరే వారి చావులకు మేం కారణం కాలేదు. ఆ సమయంలో హరీశ్, మిగతావరు పెద్ద బ్లాక్‌మెయిలర్లుగా ఉన్నారు. ఆ వివరాలు సైతం బయటపెట్టాల్సి ఉంటుంది. హరీశ్‌రావు అబద్ధాలను మానుకోవాలి..’’ అని ఉత్తమ్ పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ సర్కారే ఒప్పుకుంది
2022 మే 6న జరిగిన కృష్ణా బోర్డు 16వ సమావేశంలో ప్రాజెక్టుల అప్పగింతకు నాటి బీఆర్‌ఎస్ సర్కారు ఒప్పుకొన్నట్టు మినిట్స్‌లో రికార్డు చేశారని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ఆ మినిట్స్ ప్రతినిధులను మీడియా ప్రతినిధులకు చూపారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పెద్దవాగు ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించాలని నిర్ణయించామని, అందుకోసం రూ.200 కోట్ల సీడ్ మనీ కేటాయించామని బీఆర్‌ఎస్ ప్రభుత్వ చివరి బడ్జెట్ (2023–24) ప్రతిపాదనల్లో కూడా పొందుపర్చారని పేర్కొన్నారు. ఇలా ప్రాజెక్టుల అప్పగింతకు పలుమార్లు అంగీకరించి, ఇప్పుడు కాంగ్రెస్ సర్కారుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
శాశ్వత నష్టం చేసిందే బీఆర్‌ఎస్!
Published Tue, Feb 6 2024 6:08 AM | Last Updated on Tue, Feb 6 2024 7:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment