'దిగ్విజయ్ హామీ మేరకు సమ్మె విరమించాలి'
హుజూర్‌నగర్: కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ హామీ మేరకు ఏపీఎన్జీవోలు సమ్మె విరమించాలని మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడినా ఆంధ్ర ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు ఉండవని ద్విగిజయ్ అన్నారన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం అక్టోబర్ మొదటి వారంలో కేబినెట్ ముందుకు తెలంగాణ నోట్ వస్తుందన్నారు. సీడబ్ల్యుసీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం హైదరాబాద్ 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందన్నారు.
ఇటీవల గ్రేటర్ హైదరాబాద్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీని కలిపి ఉమ్మడి రాజధానిగా చేయనున్నట్లు ప్రచారం జరుగుతుందన్నారు. హైదరాబాద్ రెవెన్యూ డిస్ట్రిక్‌ట 217 చదరపు కిలోమీటర్లు ఉండగా, గ్రేటర్ హైదరాబాద్ 950 చ.కిలోమీటర్లు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ 7,200 చ.కిలోమీటర్లు ఉందన్నారు. వీటిలో 217 చ.కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్ రెవెన్యూ డిస్ట్రిక్‌టను మాత్రమే ఉమ్మడి రాజధానిగా చేయాలని, దానికి సంబంధించిన నోటును తాను వ్యక్తిగతంగా తయారు చేసి మ్యాప్‌లతో సహా హోంశాఖకు వివరించానని చెప్పారు.
ఈ మేరకు సీడబ్ల్యుసీ తీర్మానంలో కూడా ఇదే విషయం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ విషయంలో ఏ ఇతర ప్రతిపాదనలను తెలంగాణ ప్రజలు అంగీకరించరని వివరించినట్లు చెప్పారు. తాను 610 జీవో చైర్మన్‌గా పనిచేసిన అనుభవం దృష్ట్యా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఏపీ ఎన్జీవోలకు ఎటువంటి సమస్యలు ఉండవని, వెంటనే సమ్మె విరమించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.