సాక్షి, నల్గొండ : మూడు సంవత్సరాలుగా ఆగిపోయిన చత్తీస్‌ఘడ్-సిరోంచ రోడ్డు పనుల గురించి కేంద్ర మంత్రిపై ఒత్తిడి తెచ్చి మూడు నెలల్లో సాధించానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. నెల రోజుల్లో రోడ్డు పనులు ప్రాంరంభం కానున్నాయన్నారు. సూర్యాపేట 7 స్టార్ హోటల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి దేశం కోసం పనిచేసిన వ్యక్తి అని, ఆయనను విమర్శించే అర్హత మంత్రి జగదీష్‌రెడ్డికి లేదని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలలో ఓడిపోయినప్పటి నుంచి మంత్రి జగదీష్ మానసిక పరిస్థితి బాలేదని, హుజూర్‌నగర్‌లో గెలుపు కాంగ్రెస్‌దేనని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కలిసికట్టుగా పనిచేసి హుజుర్‌నగర్‌ల్‌లో విజయం సాధిస్తామని వెంకట్‌రెడ్డి తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని, టీఆర్‌ఎస్ ఉద్యమ నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారని అన్నారు. దీనికి ఈటెల రాజేందర్, రసమయి బాలకిషన్, నాయిని నర్సింహరెడ్డి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మిషన్ భగీరథ నీళ్లు వంద గ్రామాలకు కూడా అందడం లేదని, కేవలం ప్రచారానికే పరిమితమైందని విమర్శించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ మొత్తం దోపిడీ పథకాలేనని, శ్రీరామ్ సాగర్ చివరి ఆయకట్టు వరకు నీళ్లిచ్చే వరకు పోరాటం చేస్తామని కోమటిరెడ్డి అన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం మూడు లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని దివాళా తీయించిందని, ఓ వైపు రాష్ట్రం అప్పుల్లో ఉంటే మరోవైపు నూతన భవనాలు ఎందుకు కడుతున్నారని కోమటిరెడ్డి ప్రశ్నించారు. హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని విమర్శించారు. తుంగతుర్తి నియోజకవర్గంలో మంత్రి జగదీష్ రెడ్డి అనుచరులు ఇసుక మాఫియా నడిపిస్తున్నారని, వందల కొద్ది లారీల ఇసుకను ఆక్రమంగా తరలిస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment