సాక్షి, తెలంగాణభవన్: తెలంగాణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మంత్రి కోమటిరెడ్డి(Komatireddy Venkat Reddy), మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు తాజాగా జగదీష్ రెడ్డి కౌంటిరచ్చారు. కోమటిరెడ్డిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. కేటీఆర్‌ను చూస్తేనే ముఖ్యమంత్రి, మంత్రులు భయపడిపోతున్నారంటూ కామెంట్స్ చేశారు.
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణభవన్(Telangana Bhavan)లో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో రైతులను చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతోంది. కేటీఆర్‌ను చూసి సీఎం, మంత్రులు భయపడుతున్నారు. పోలీసుల సూచన మేరకు 12వ తేదీన జరగాల్సిన నల్గొండ రైతు దీక్షను వాయిదావేశాం. ఎక్కడి నుండి ఒత్తిడి వచ్చిందో పోలీసులు పర్మిషన్ రిజెక్ట్ చేశారు. కోమటిరెడ్డి వలనే పోలీసులు అనుమతి రద్దు చేశారు. నల్గొండ సభకు పర్మిషన్ ఇవ్వాలని హైకోర్టుకు వెళ్ళాము. హైకోర్టు సూచనతో ముందుకు వెళ్తాం.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెత్త మాటలు మాట్లాడుతున్నారు. పోలీసులు లేకుండా, సెక్యూరిటీ లేకుండా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ జిల్లాలో ఎక్కడికైనా వెళ్లి రాగలరా?. ఎప్పుడు దొరుకుతారా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. రైతుల ధాన్యం కొనే వరకు మేము కల్లాల్లోనే ఉన్నాం. మిల్లర్లతో కుమ్మక్కు అయ్యి రైతులను దళారులకు కాంగ్రెస్ నేతలు అప్పచెప్పారు.
కేటీఆర్ నల్గొండ వస్తుంటే కోమటిరెడ్డికి ఎందుకు అంత భయం?. నల్గొండ క్లాక్ టవర్ వద్దనే అన్ని రాజకీయ పార్టీలు కార్యక్రమాలు చేస్తాయి. సీఎం, మంత్రులు హైదరాబాద్ నగరంలో ఈడీ ఆఫీసు, రాజ్‌భవన్ ముందు ధర్నా చేస్తే ప్రజలకు ఇబ్బంది కలగలేదా?. కోమటిరెడ్డిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. నల్గొండ జిల్లా అభివృద్ధిపై నాతో చర్చ చేసే దమ్ము కోమటిరెడ్డికి ఉందా?. కాంగ్రెస్ పాపాలతోనే జిల్లాలో ఫ్లోరిన్ మహమ్మారి పుట్టింది. నేను జిల్లాలో చేసిన అభివృద్ధి చూడటానికి కోమటిరెడ్డి జీవిత కాలం సరిపోదు. సొంత నియోజకవర్గాలను కోమటిరెడ్డి అభివృద్ధి చేసుకోలేదు.
యాదాద్రి థర్మల్ ప్లాంట్ ఆపేస్తా అని కోమటిరెడ్డి చెబుతున్నారు. ఆయన స్పృహలో ఉండి మాట్లాడటం లేదు. సరైన పోటీ లేక నల్గొండలో కోమటిరెడ్డి గెలిచారు. భూపాల్‌రెడ్డి దెబ్బకు నల్గొండలో ఓటమి తప్పలేదు. మంత్రి ఎవరి దగ్గర ఎంత వసూలు చేశారో అన్ని విషయాలు నా దగ్గర ఉన్నాయి. చేతగాక పోలీసుల చేత పర్మిషన్ రద్దు చేయించారు. మీరు 20,30 ఏళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి ఆస్తులు పెంచుకున్నారు. కాంగ్రెస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు, మంత్రి కోమటిరెడ్డి.. నల్లగొండలో బీఆర్‌ఎస్ ధర్నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్ట్‌లను నిర్లక్ష్యం చేసిన నేతలు జిల్లాకు ఎలా వస్తారు?. రేసుల మొనగాడు దీక్ష చేస్తే రైతులు నమ్మే పరిస్థితిలో లేరు. మూడు ఫీట్లు ఉన్న వ్యక్తి మూడువేల ఓట్లతో గెలిచాడు. బీఆర్‌ఎస్ పార్టీ బొందలగడ్డ పార్టీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment