
గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు
బీఆర్‌ఎస్ సభ్యుల తీవ్ర అభ్యంతరం.. నిరసనగా సభ నుంచి నిష్క్రమణ
తన కుటుంబం లెక్కలేనన్ని గుడులు కట్టించిందని మంత్రి వివరణ
సాక్షి, హైదరాబాద్: ‘అప్పుడు మీ ప్రాథమ్యాలు కాళేశ్వరం సహా ఎత్తిపోతల పథకాలు, కొత్త సచివాలయం, పెద్ద భవనాలు, బ్రహ్మాండమైన కలెక్టర్ కార్యాలయాలు, పోలీసులకు ఏసీ వాహనాలు, చండీయాగాలు, ప్రగతి భవన్‌లో య జ్ఞాలు, యాగాలే.. ప్రజలకు మంచి రోడ్లు ఉండాలని మా త్రం కాదు. నాకు యాగాలు, యజ్ఞాలు లేవు. రోడ్లు, బ్రిడ్జీలు కట్టాలని ఉంది’అని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు అధికార, ప్రధాన ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వివాదం రాజేశాయి.
రోడ్ల నిర్మాణంపై శనివారం ప్రశ్నోత్తరాల్లో బీఆర్‌ఎస్ సభ్యులు వేముల ప్రశాంత్‌రెడ్డి, హరీశ్‌రావు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే క్రమంలో మంత్రి కోమటిరెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. యాగాలు చేశామని, సచివాలయం కట్టామని తమను అవమానించారని వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను యాగాలు చేస్తానని, తనకు దేవుడిపై భక్తి ఉందన్నారు. ‘నేను వాటర్ నీళ్లు అనను... ఎక్కడంటే అక్కడ చేపల పులుసు తినను’అని కోమటిరెడ్డి తీరును ఉద్దేశించి ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా సభ నుంచి బీఆర్‌ఎస్ సభ్యులంతా నిష్క్రమించారు.
దీనిపై శాసనసభ వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబు స్పందిస్తూ యాగాలు చేయడం తప్పని కోమటిరెడ్డి ఎక్కడా చెప్పలేదన్నారు. గత ప్రభుత్వ ప్రాథమ్యాల గురించే మాట్లాడారని.. దీనికే వారు సభ నుంచి వెళ్లిపోవడం బాధాకరమన్నారు. అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ తన కుటుంబం లెక్కలేనన్ని గుడులు కట్టించిందని వివరణ ఇచ్చారు. తన సమాధానాలకు దిమ్మ తిరిగే వారు వెళ్లిపోయారని విమర్శించారు.
రోడ్ల మరమ్మతులు, నిర్మాణంపై కోమటిరెడ్డి వర్సెస్ ప్రశాంత్‌రెడ్డి
అంతకుముందు రోడ్ల మరమ్మతు లు, నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి, బీఆర్‌ఎస్ సభ్యుడు ప్రశాంత్‌రెడ్డి మధ్య వాడీవేడి చర్చ జరిగింది. కాంగ్రెస్ ప్ర భుత్వం రోడ్ల కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయ డం లేదని.. ఫలితంగా తమ హయాంలో ప్రారంభమైన పనులు సైతం ఆగిపోయాయని ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. గత 10 ఏళ్లలో తాము రోడ్ల నిర్మాణానికి రూ. 22 వేల కోట్లను ఖర్చు చేశామన్నారు. కోమటిరెడ్డి నియోజకవర్గ కేంద్రం నల్లగొండలో రూ. 200 కోట్లతో రోడ్లు వేశామన్నారు.
అయితే ఈ వాదనను కోమటిరెడ్డి తోసిపుచ్చారు. బీఆర్‌ఎస్ పాలనలో రూ. 8,112 కోట్లతో 6,668 కి.మీ. రోడ్లకు మాత్రమే మరమ్మతులు చేశారని కోమటిరెడ్డి పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పాలనలో వేసిన రోడ్లు ఎక్కడున్నాయో చూపిస్తే ప్రశాంత్‌రెడ్డికి కొబ్బరికాయ కొట్టి సన్మానం చేస్తానని కోమటిరెడ్డి సవాల్ విసిరారు. తనపై కక్షతో నియోజకవర్గంలో రోడ్లకు నాడు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. 7 కి.మీ. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌ను బీఆర్‌ఎస్ పాలనలో కట్టలేకపోయారని కోమటిరెడ్డి ఆరోపించగా అది ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు అని ప్రశాంత్‌రెడ్డి వివరణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment