
హైదరాబాద్: కోఠి వుమెన్స్ కాలేజ్ ను యూనివర్శిటీగా మార్చడమే కాకుండా వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్శిటీ(Chakali Ilamma Womens University)గా పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,. దొరలపై, నిజాములపై పోరాడిన చాకలి ఐలమ్మ.. చరిత్రలో తనకంటూ పేజీ లిఖించుకున్నారన్నారు. మహిళా దినోత్సవంలో భాగంగా ఈరోజు(శనివారం) అక్కడకు విచ్చేసిన సీఎం రేవంత్(Revanth Reddy).. నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ..
ఈ గొప్ప చరిత్ర కల్గిన మహిళ పేరును ఒక యూనివర్శిటీకి పెట్టామన్నారు. వందేళ్ల చరిత్ర కల్గిన చరిత్ర ఈ మహిళా కళాశాలదని, దానిని యూనివర్శిటీగా మార్చి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్శిటీగా నామకరణం చేశామన్నారు. వందేళ్ల క్రితం ఏడుగురు విద్యార్థులతో ప్రారంభమైన ఈ కళాశాల.. నేడు ఏడువేల మందితో యూనివర్శిటీగా రూపాంతరం చెందిందన్నారు. దీనికి ఐదు వందల కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు రేవంత్ ప్రకటించారు. ఇది చరిత్రలో నిలిచిపోయే యూనివర్శిటీ కావాలన్నారు సీఎం రేవంత్.
మీ అన్నగా ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని, అలానే స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఆడ బిడ్డలు వంటిళ్లు కుందేళ్లు కాదని, వారు వ్యాపారవేత్తలుగా రాణించాలనేది తన ఆశయమన్నారు.