chakali ilamma
-
చాకలి ఐలమ్మ జయంత్యుత్సవాలకు రూ.15 లక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారిణి చాకలి ఐలమ్మ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 లక్షల నిధులు కేటాయించిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ ఉత్స వాలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఐలమ్మ జయంత్యుత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించా రు. ఈనెల 26న రవీంద్ర భారతిలో జరిగే జయంతి కార్యక్రమాల కోసం రూ.12 లక్షలు కేటాయించామని, అలాగే ఈ నెల 10న జరిగే వర్ధంతి కార్యక్రమం కోసం రూ.3 లక్షలు కేటాయించినట్లు పొన్నం వెల్లడించారు.ఈ కార్యక్రమాల నిర్వహణ కమిటీకి చైర్మన్‌గా షాద్‌నగర్ శాసనసభ్యుడు వీర్లపల్లి శంకర్ వ్యవహరిస్తారన్నారు. ఈ కమిటీలో 40 మంది సభ్యులను కూడా నియమించినట్లు చెప్పారు. పాలకుర్తిలో చాకలి ఐలమ్మ స్మారక భవన నిర్మాణానికి ఉన్న అనువైన స్థలాన్ని గుర్తించాలని, ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డికి మంత్రి సూచించారు. -
తెలంగాణ పోరాట స్ఫూర్తి!
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చాకలి ఐలమ్మ (చిట్యాల ఐలమ్మ). నిజాం నవాబుకూ, ఆయన తొత్తులైన భూస్వాములకూ వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో తన ఇల్లునే కార్యాలయంగా మార్చిందామె. 1895 సెప్టెంబర్ 26న సద్దుల బతుకమ్మ నాడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్ణాపురంలో ఆమె జన్మించింది. చిన్న వయస్సులోనే పాలకుర్తికి చెందిన నర్సయ్యతో వివాహం అయింది. పాలకుర్తి పరిసరాల్లో మల్లంపల్లి దొరవద్ద కొంత భూమిని ఐలమ్మ కుటుంబం కౌలుకు తీసుకొని సాగు చేసింది. ఇది పాల కుర్తి పొరుగునే ఉన్న విస్నూర్ గ్రామానికి చెందిన దేశ్‌ముఖ్ రేపాక రామచంద్రారెడ్డికి కోపం తెప్పించింది. దొర గడీల్లో వంతుల వారీగా వెట్టి చేసే ఐలమ్మ కుటుంబం సొంతంగా భూమిని కౌలుకు తీసుకొని సాగు చేసుకోవడం సహించలేక పోయాడు. ఐలమ్మ భూమిని కాజేయాలనీ, ఆమె పండించిన పంటను గూండాలతో కొల్లగొట్టించాలనీ చూశాడు. ఐలమ్మ ‘ఆంధ్ర మహాసభ’ నాయకత్వంలో ఎర్రజెండా పట్టింది. పోరాడింది.‘గుత్పల సంఘం’ సభ్యులు, గ్రామ స్థుల సహకారంతో పంటను తరలించుకు పోవడానికి వచ్చిన గూండాలను తరిమి కొట్టింది. ఐలమ్మ సాధించిన ఈ విజయం తెలంగాణలో భూపోరాటానికి నాంది అయింది. చివరకు రైతాంగ సాయుధ పోరాటం సాగి వేలాది ఎకరాలు సాగు చేసుకునే రైతుల పరం అయ్యాయి. ఐలమ్మ 1985 సెప్టెంబర్ 1న తుది శ్వాస విడిచింది. ఉద్యమనాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేక చొరవతో వేసిన సబ్ కమిటీ తెలంగాణ పాఠశాల విద్యలో ఆమె జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చింది. వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజక వర్గ కేంద్రంలోని మార్కెట్ యార్డ్‌కి ‘చాకలి ఐలమ్మ’ పేరు పెట్టి ప్రభుత్వం ఆమె పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకొంది. అంతేకాదు చిట్యాల ఐలమ్మను ‘తెలంగాణ తల్లి’గా గుర్తించి 2021 సెప్టెంబర్ 26 నుండి ఆమె జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోంది. – కొండూరు సత్యనారాయణ, రజక సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన సలహాదారు -
సాయుధ పోరాటాన్ని రగిల్చిన అగ్ని కణం చాకలి ఐలమ్మ
భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని రగిల్చిన అగ్ని కణం చిట్యాల ఐలమ్మ. రజక కుటుంబంలో పుట్టిన ఒక ఆడ పడుచు వేల ఎకరాల అధిపతైన దొర దోపిడీని ఎదిరించి నిలిచింది. ‘దున్నేవాడిదే భూమి’ అని సాగిన తెలంగాణ సాయుధ పోరా టంలో ఐలమ్మ నిప్పురవ్వ. రైతులు, కూలీలను ఏకం చేసి ఉద్యమానికి ఊపిరులూదింది. భూమిలేక పోతే జిందగీ లేదని రక్తతర్పణం చేసిన ఐలమ్మ ‘బందగి’ దారిలో నడి చింది. ‘సంఘం’లో చేరితే సంగతి చెప్తానన్న దొరకు ఏ గతీ లేకుండా చేసింది. ‘బాంచెన్ నీ కాల్మొక్తా’ అన్న జనం చేత బందూకు బట్టించింది. వెట్టిచాకిరీ చేసేవాళ్ళు అలగా జనం కాదు, సహస్ర వృత్తులు చేసే సకలజనం అని చాటి చెప్పింది. 1895 సెప్టెంబర్ 26న సద్దుల బతుకమ్మ నాడు ఓరుగంటి మల్లమ్మ, సాయిలు నాలుగో సంతానంగా జన్మించింది ఐలమ్మ. తల్లిదండ్రులది ఉమ్మడి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం. 11వ ఏట పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో లగ్గమైంది. ఆమెకు ఐదుగురు కొడుకులు, ఒక కూతురు. దొర ఇంట ఊడిగం, ఊరి జనం బట్టల ఉతుకుడు. ఇదే వారి జీవనాధారం. దీంతో కుటుంబం గడవడం గగనమయ్యేది. ఎదిగి వచ్చిన కొడుకులతో వ్యవసాయం చేయాలనుకుంది. పాలకుర్తికి పక్కనే ఉన్న మల్లంపల్లి దొర కుటుంబానికి చెందిన ఉత్తంరాజు జయప్రదాదేవి వద్ద 40 ఎకరాల భూమిని కౌలుకు తీసు కుంది. అదే విస్నూరు దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి తట్టుకోలేక పోయిండు! ‘వ్యవసాయం వద్దు, బట్టలు ఉతకడానికి రావాలి’ అని కబురు పంపిన దొరకు... తనకు వ్యవసాయమే ముఖ్యమనీ, ‘గడీలో వెట్టి చేయను పో’ అనీ గట్టిగా చెప్పింది. అప్పుడే వెట్టిచాకిరీలు చేయవద్దని పిలుపు నిచ్చిన ‘ఆంధ్ర మహాసభ’లో చేరింది. ఆడది ముందుబడి తన ఆధిపత్యాన్ని వెనుకబడేసిం దని రామచంద్రారెడ్డి రగిలిపోయాడు. దీంతో ఐలమ్మపై దొర కక్ష పెంచుకున్నాడు. ఐలమ్మ కొడుకులను అరెస్ట్ చేయించాడు. నల్లగొండలోని జైలులో ఉన్న కుటుంబీకులను కలిసేందుకు ఐలమ్మ ఒంటరిగా 100 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి వచ్చేది. దొర ఐలమ్మ ఇంటిని తగలబెట్టించాడు. ఆమె కూతురిపై లైంగికదాడి జరిగింది. అయినా లొంగని ఐలమ్మ న్యాయ పోరాటం చేసి దొరపై గెలిచింది. ఇది సహించలేని విస్నూరు దొర... ఐలమ్మ పొలాన్ని అక్రమంగా తన పేర రాయించుకున్నాడు. కానీ దొరను గానీ, దొర గూండాలను గానీ తన పొలాన్ని టచ్ చేయనివ్వలేదు ఐలమ్మ. పొలంలోని వడ్లను తీసుకునేందుకు వచ్చిన దొర గూండాలను ‘ఆంధ్ర మహాసభ’ (సంఘం) సభ్యులతో కలిసి తరిమికొట్టింది. ధాన్యాన్ని ఇంటికి చేర్చింది. ఐలమ్మ తెగువను చూసిన జనానికి ప్రేరణ, స్ఫూర్తి కల్గింది. క్రమంగా తెలంగాణ పల్లెపల్లెన ఉద్యమం అలలుఅలలుగా ఎగిసిపడింది. పల్లెల్లో దొరల పట్టు తప్పింది. ‘బందగి’ రక్త తర్పణంతో ఎరుపెక్కిన పోరుజెండా, ఐలమ్మ సాహసంతో సాయుధపోరు దారి చూపింది. దొరల ఆధిపత్యం క్రమంగా నేలమట్టమైంది. ఐలమ్మ భూపోరాటంతో మొదలుకొని సాయుధ పోరాటం చివరి వరకు నాలుగువేల మంది ఉత్పత్తి కులాల వారు అమరులయ్యారు. 10 లక్షల ఎకరాల భూమి పంపకం జరిగింది. ఆమె భూమి ఆమెకు దక్కింది. యావత్ తెలంగాణ మహిళా పౌరుషానికి ప్రతీకగా నిలిచిన ఐలమ్మ 1985 సెప్టెంబర్ 10న తుది శ్వాస విడిచింది. తెలంగాణ ప్రభుత్వం ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తాం అని చెప్పడం చాలా గొప్ప విషయమే. కానీ వాటిని ఘనంగా నిర్వహించాలి. ఆమె జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చి ఆమె గురించి గొప్పగా తెలిసేలా విగ్రహాలు పెట్టాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమె కుటుంబానికి అండగా ఉండాలి. అప్పుడే ఆమెకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. - పీలి కృష్ణ , జర్నలిస్ట్ (సెప్టెంబర్ 26న చాకలి ఐలమ్మ జయంతి) -
విస్నూర్ దొరకు ఎదురొడ్డి పోరాడిన చాకలి ఐలమ్మ.. కొంగు నడుముకు చుట్టి..
చారిత్రాత్మక తెలంగాణ సాయుధ రైతాంగపోరాటం ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న నైజాం ప్రాంతం భారతదేశంలో విలీనం అయింది. ఈ చరిత్రలో ఓభాగం జనగామ జిల్లా పాలకుర్తి మండంలోని విస్నూర్ గడి.శత్రు దుర్భేద్యమైన ఈ విస్నూర్ గడిలో నుంచే చుట్టూ 60 గ్రామాలకు విస్నూర్ దొరగా ప్రసిద్ధి చెందిన దేశ్‌ముఖ్ రాపాక వెంకటరాంచంద్రారెడ్డి పాలన సాగించాడు. ఆయన, ఆయన కుమారుడు బాబుదొర అనేక అరాచకాలు సృష్టించారు. వీరి పాలనపై కడివెండినుంచే తొలి తిరుగుబాటు మొదలైంది. తొలి తెలంగాణ అమరవీరుడు దొడ్డి కొమురయ్య ఈ కడివెండి గ్రామానికి చెందినవారే. ఈయనతో పాటు పిట్టల నర్సయ్య, ఎర్రంరెడ్డి మోహన్‌రెడ్డి, నల్లా నర్సింహులు పల్లెపల్లెనా సంఘాలు ఏర్పాటు చేశాయి. దేశ్‌ముఖ్ రాంచంద్రారెడ్డి తల్లి జానకమ్మ దొరసాని వీరిపై కసిపెంచుకుంది. దొరసాని ఆదేశంతో వారి అనుచరులు 1946 జులై 4న కాల్పులు జరపడంతో, దొడ్డి కొమురయ్య ప్రాణాలు కోల్పోయారు. ఆయన సోదరుడు మల్లయ్యకు బుల్లెట్ గాయమైంది. రజాకార్లకు, విస్నూర్ దొరకు ఎదురొడ్డి పోరాడారు పాలకుర్తికి చెందిన చాకలి ఐలమ్మ. కొంగు నడుముకు చుట్టి, కొడవలి చేతబట్టి తెలంగాణ సాయుధపోరాటంలో వీరోచితంగా పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మ. తెలంగాణ స్వాతంత్ర్య పోరాటంలో ప్రధాన భూమిక పోషించిన ఐలమ్మ ఓరకంగా ఉద్యమానికి ఊపిరులూదింది అని చెప్పవచ్చు. విస్నూర్ గడి దొర రాంచంద్రారెడ్డి కొడుకు బాపురెడ్డి హైద్రాబాద్ పారిపోతుండగా, జనగామ రైల్వేస్టేషన్లో కాల్చిచంపారు. ప్రజల ప్రతిఘటన 400గ్రామాలకు వ్యాపించింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ప్రదర్శనలు జరిగాయి. రజాకార్ల దాడులు, అరాచకాలు మరింతగా పెరిగాయి. తగ్గకుండా ప్రజా ప్రతిఘటన సాగింది. దేశ్‌ముఖ్‌లు, భూస్వాములు పట్టణాలకు పారిపోయారు. చివరకు నైజాం సర్కార్ 1948 సెప్టెంబర్ 17న కేంద్రంలో విలీనమైంది -
చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం
కవాడిగూడ: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏడాది పాటు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో అధికారికంగా నిర్వహించనున్నామని కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖమంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 17న పరేడ్ గ్రౌండ్లో త్రివిధ దళాల పరేడ్ ఉంటుందని ఆయన వెల్లడించారు. నిజాం రజాకర్ల దమన కాండకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చాకలి ఐలమ్మతో పాటు ఎంతో మంది వీరులు ప్రాణ త్యాగం చేశారని వారందరినీ ఏడాది పాటు స్మరించుకుంటూ వారి ఆశయాల స్ఫూర్తితో నేటి సమాజం ముందుకు సాగాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ వర్ధంతిని తెలంగాణ రజకాభివృద్ధి (ధోబీ) సంస్థ ఆధ్వర్యంలో శనివారం లోయర్ ట్యాంక్‌బండ్‌లోని ఆమె విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి కిషన్‌రెడ్డి, కవాడిగూడ కార్పొరేటర్ జి.రచనశ్రీ, రాంనగర్ కార్పొరేటర్ రవిచారి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు బొమ్మరాజు కృష్ణమూర్తి, రాష్ట్ర వర్కింగ్ కమిటీ చైర్మన్ మందలపు గాంధీ, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ ఎం.నర్సింహ్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపల్లి రాజశేఖర్, వైస్ చైర్మన్ నర్సింహ్మ, బీజేపీ రాష్ట్ర నాయకులు పరిమళ్‌కుమార్, రంగరాజ్‌గౌడ్, శ్యాంసుందర్‌గౌడ్, రమేష్‌రాం తదితరులు పాల్గొన్నారు. ఐలమ్మ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. లోయర్ ట్యాంక్‌బండ్‌లోని ఆమె విగ్రహానికి ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాంనగర్ మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్‌రెడ్డిలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ముఠా గోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విలీనం వేడుకలను ఏడాది పాటు నిర్వహిస్తుందన్నారు. టీఆర్ఎస్ నాయకులు ముఠా జైసింహ, డివిజన్ అధ్యక్షుడు శ్యామ్యాదవ్, నాయకులు ఆర్.రాంచందర్, రాజేష్, హరి తదితరులు పాల్గొన్నారు. – ఎమ్మెల్యే ముఠా గోపాల్ -
బీజేపీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ఐలమ్మ 126 జయంతి కార్యమ్రంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌లు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, హైదరాబాద్ నగర మాజీ మేయర్ కార్తీకరెడ్డిలతో పాటు పలువురు పార్టీ పదాధికారులు పాల్గొన్నారు. -
నిజాం వ్యతిరేక ఉద్యమనిర్మాత ఐలమ్మ
కవాడిగూడ(హైదరాబాద్): నిజాం నవాబుకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ ప్రజా ఉద్యమాన్ని నిర్మించి మహిళా సంక్షేమం కోసం పోరాటాలు చేసిన ఘనత చాకలి ఐలమ్మదే అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కొనియాడారు. చాకలి ఐలమ్మ 126వ జయంతిని పురస్కరించుకుని లోయర్‌ట్యాంక్‌బండ్‌లోని తెలంగాణ రజక ధోబీ అభివృద్ధి సంస్థ, తెలంగాణ ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి, మంత్రి తలసాని యాదవ్, రజక ధోబీ అభివృద్ధి జాతీయ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ఎం. అంజయ్య, తెలంగాణ రాష్ట్ర రజక ధోబీ అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు బొమ్మరాజు కృష్ణమూర్తి తదితరులు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ సాయుధపోరాటంలో బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిలబడిన వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు. బహుళజాతి కంపెనీలు రజక వృత్తిని సొంతం చేసుకుని వారికి అన్యాయం చేస్తున్నారని, ప్రభుత్వాలు మారుతున్నా రజకుల సమస్యలు పరిష్కారం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ..నిజాం నిరంకుశ పాలనకు విముక్తి కల్పించేందుకు చాకలి ఐలమ్మ చేసిన స్ఫూర్తితోనే మలిదశ తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. ప్రొటోకాల్ వివాదం.. వేడుకల్లో ప్రధాన వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో అధికారులు ప్రొటోకాల్ పాటించలేదంటూ టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఫ్లెక్సీలో స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఫొటో లేదంటూ టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ కార్పొరేటర్ జి.రచనశ్రీ ఫొటో లేదంటూ బీజేపీ నేతలు గొడవకు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్, ఎమ్మెల్యే ముఠాగోపాల్ ఇరుపార్టీల నేతలకు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఈ గొడవ జరుగుతున్న సమయంలోనే నిర్వాహకులు ఎమ్మెల్యే ముఠాగోపాల్ ఫొటోను ఫ్లెక్సీపై అతికించడం కొసమెరుపు. పేదల సమస్యలపై అలుపెరగని పోరాటం: మంత్రి తలసాని పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా అనేక భూపోరాటాలు, పేదల సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన చాకలి ఐలమ్మ మహిళా చైతన్యానికి ప్రతీక అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. ఐలమ్మ జీవిత చరిత్రను ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలన్నారు. ఆమె జయంతి, వర్ధంతులను ప్రజలందరూ పండుగలా నిర్వహించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్, టీఆర్ఎస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. -
దొరను ఢీకొన్న ధీర.. ఐలమ్మ
వంగి దండాలు పెట్టే రోజుల్లో సివంగిలా గర్జించింది. ఆమె కొంగు నడుముకు చుడితే దొరతనం తోకముడిచింది. ఆమె కొడవలి చేతబడితే పీడితజనం కడలిలా తరలివచ్చారు. ఆడదని అలుసుగా చూసిన కంట్లో నలుసు అయింది. ఆమె తెగింపుతోనే వెట్టిచాకిరీ ముగింపునకు వచ్చింది. దొరను ఢీకొన్న ధీర. నడీడులో గడీలను గడగడలాడించింది. ఎత్తిపట్టిన చేతిలో ఎర్రజెండా అయింది. ఆమె ఎవరో కాదు వీరనారి చాకలి ఐలమ్మ. ఆశయమే ఆశగా శ్వాసించింది. సాహసంతోనే సహవాసం చేసింది. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాగి పోరులో మమేకమైంది. భూమిలేకపోతే జిందగీ లేదని రక్తతర్పణం చేసిన బందగి దారిలో నడిచింది. పోరుదారిలో అయినవాళ్లను పోగొట్టుకొని అందరికీ అయినదానిలా నిలిచింది. సంగంల చేరితే సంగతి చెప్తానన్న దొరకు ఏ గతీ లేకుండా చేసింది. ‘బాంచెన్ నీ కాల్మొక్తా’ అన్న జనం చేత బందూకు చేతబట్టించింది. వెట్టిచాకిరీ చేసేవారు అలగా జనం కాదు, సహస్రవృత్తులు చేసే సకలజనం అని చాటి చెప్పింది. 1895లో సద్దుల బతుకమ్మ నాడు బట్టలుతికే చాకలి దంపతులు ఓరుగంటి మల్లమ్మ, సాయిలు నాలుగో సంతానంగా జన్మించింది ఐలమ్మ. తల్లిదండ్రులది ఉమ్మడి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం. తన 11 ఏట పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో లగ్గమైంది. ఆమెకు ఐదుగురు కొడుకులు, ఒక కూతురు. దొర ఇంట ఊడిగం, ఊరిజనం బట్టల ఉతుకుడు. ఇదే వారి జీవనాధారం. దీంతో కుటుంబం గడవడం గగనమయ్యేది. ఎదిగి వచ్చిన కొడుకులతో ఎవసాయం చేయాలనుకుంది. పాలకుర్తికి పక్కనే ఉన్న మల్లంపల్లి దొర కుటుంబానికి చెందిన ఉత్తంరాజు జయప్రదాదేవి వద్ద 40 ఎకరాల భూమిని మఖ్త(కౌలు)కు తీసుకుంది. అదే విస్నూరు దేశ్‌ముఖ్ రాపాక రామచంద్రారెడ్డికి కంటగింపు అయింది. తనకు వ్యవసాయమే ముఖ్యమని, దొర గడీలో వెట్టిచేయను పో అని గట్టిగా చెప్పింది. అప్పుడే వెట్టిగొట్టాలు చేయవద్దని పిలుపునిచ్చిన ఆంధ్రమహాసభ(సంగం)లో 1944లో చేరింది. కష్టజీవులను చేరదీసి కట్టుబాట్లను సవాల్ చేసింది. ఆడది ముందుబడి తన ఆధిపత్యాన్ని వెనుకబడేసిందని రామచంద్రారెడ్డి రగిలిపోయాడు. దీంతో ఐలమ్మపై దొర కక్ష పెంచుకున్నాడు. కౌలుకు తీసుకున్న భూమిలో కాపుకొచ్చిన పంటను కాజేయాలని పన్నాగం పన్నాడు. గూండాలను పురమాయించారు. ఐలమ్మ సంగపోళ్ల అండతో గూండాలను తరిమికొట్టి తన పంటను ఒడుపుగా ఇంటికి చేర్చింది. ‘అప్పుడు ఐలమ్మ అడ్డం తిరిగి కొంగునడుముకు చుట్టి కొడవలి చేతబట్టి సివంగి వోలె గర్జించిన తీరు నా కళ్లలో ఇప్పటికీ కదలాడుతోంది’ అని తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భీంరెడ్డి నర్సింహారెడ్డి తన ఆత్మకథ ‘భూమిక’లో రాసుకున్నాడు. ఐలమ్మ పోరాటక్రమంలో ఓ కొడుకును పోగొట్టుకుంది. మరో ఇద్దరు కొడుకులు, భర్త జైలు పాలయ్యారు. నల్లగొండలోని జైలులో వారిని కలిసేందుకు ఐలమ్మ ఒంటరిగా 100 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి వచ్చేది. ఆ మగువ తెగువ.. దిగువ జనానికి స్ఫూర్తి ఐలమ్మ తెగువ.. సామాజికంగా దిగువ ఉన్న జనానికి ప్రేరణ, స్ఫూర్తినిచ్చింది. పల్లెపల్లెన ఉద్యమం అలలు అలలుగా ఎగిసిపడింది. పల్లెపట్టున దొరపట్టు తప్పింది. బందగి రక్త తర్పణంతో ఎరుపెక్కిన పోరుజెండా, ఐలమ్మ సాహసంతో సాయుధపోరు దారి చూపింది. ఐలమ్మను గడీకి పిలిపించుకొని... ‘నిన్ను ఇక్కడ చంపితే దిక్కెవరు’ అని ప్రశ్నించిన దొరకు ఖతర్నాక్ జవాబిచ్చింది. ‘నీకు ఒక్కడే కొడుకు, నాకు నలుగురు కొడుకులు. నన్ను చంపితే నా కొడుకులు నిన్ను బత్కనీయరు. నీ గడీల గడ్డి మొలస్తది’ అని హెచ్చరించింది. ఐలమ్మ అన్నట్లే గడీల గడ్డిమొలిచింది. దొరల ఆధిపత్యం నేలమట్టమైంది. నైజాం వ్యతిరేక పోరాటానికి ఊపిరిలూదిన ఐలమ్మ 1985 సెప్టెంబర్ 10న ఊపిరి వదిలింది. నీలం వెంకన్న, పాత్రికేయుడు ఈ–మెయిల్ : neelamvenkanna75@ gmail.com -
రజకులకు ఆసరా..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రులు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లతో పాటు ఇతర ప్రభుత్వ సంస్థల్లో బట్టలు ఉతికే పనులను రజకులకే అప్పగించేలా విధానపరమైన నిర్ణయం తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. 50 ఏళ్లు దాటిన రజక వృత్తిదారులకు ఆసరా పింఛన్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. రజకుల కోసం హైదరాబాద్‌లో ఎకరం స్థలంలో రూ.5 కోట్లతో హాస్టల్, కమ్యూనిటీ హాల్ నిర్మించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో చాకలి అయిలమ్మ విగ్రహాన్ని స్థాపిస్తామని తెలిపారు. రజక యువకులకు ప్రత్యామ్నాయ ఉపాధి కోసం బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు అందిస్తామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్‌లో రజక సంఘం ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలపై చర్చించారు. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాచర్ల ఉప్పలయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు మానస గణేశ్, కో ఆర్డినేటర్ కొల్లూరు మల్లేశ్‌కుమార్, అసోసియేట్ అధ్యక్షుడు కొలిపాక రాములు, ప్రధాన కార్యదర్శి కొల్లంపల్లి వెంకటరాములు, కొండూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సీఎంకు వినతిపత్రం సమర్పించారు. ప్రజలకు సేవ చేస్తున్న కులాల అభ్యున్నతి కోసం కృషి చేయాల్సిన సామాజిక బాధ్యత ప్రభుత్వంపై ఉందని ముఖ్యమంత్రి అన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలోని కుల వృత్తులకు ప్రోత్సాహం కరువైందని, ఇప్పుడు వాటిని నిలబెట్టేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. రజక సంఘం కోరుకున్న విధంగానే కార్యక్రమాలు అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రజకులు ఆర్థిక, సామాజిక, విద్య, ఉపాధి రంగాల్లో ప్రగతి సాధించేందుకు అవసరమైన తోడ్పాటును ప్రభుత్వం అందిస్తుందని ప్రకటించారు. ‘‘రజకులకు ఆర్థిక చేయూత అందించే కార్యక్రమాల అమలుకు బడ్జెట్లో రూ.250 కోట్లు కేటాయించాం. ఇంకా అవసరమైన పక్షంలో మరిన్ని నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ నిధులతో రజకుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో రజక సంఘం ప్రతినిధులే నిర్ణయం తీసుకోవాలి. మురికి బట్టలు ఉతికే క్రమంలో రజకులు అనారోగ్యం పాలవుతున్నారు. వారి వైద్యానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. హైదరాబాద్, ఇతర నగరాల్లో, జిల్లా కేంద్రాల్లో, పట్టణాల్లో దోబీఘాట్ల నిర్మిస్తాం. బట్టలు నేలపై ఆరేయకుండా దండాలు ఏర్పాటు చేసే పద్ధతి పెట్టాలి. ప్రభుత్వ ఆసుపత్రులు, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఎక్కువ సంఖ్యలో బట్టలు ఉతకడానికి అవసరమయ్యే వాషింగ్ మెషిన్లను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. ఆ పనిని రజకులకే అప్పగిస్తాం’’అని సీఎం అన్నారు. హెచ్ఎండీఎ, జీహెచ్ఎంసీతోపాటు ఇతర నగరాలు, పట్టణాల్లో చేసే లే అవుట్లలో బట్టలు ఉతికి, ఇస్త్రీ చేయడానికి అనువుగా కొంత స్థలం తీసి కచ్చితంగా రజక సంఘాలకు అప్పగించాలని అధికారులను సీఎం ఆదేశించారు. దోబీఘాట్లకు, వాషింగ్ మెషిన్లకు సబ్సిడీపై కరెంటు సరఫరా చేసే విషయాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పారు. ప్రభుత్వ ఖర్చుతో ఎరుకుల భవనం ఎరుకుల కులస్తుల సామాజిక, విద్యా ప్రగతికి దోహదపడేలా హైదరాబాద్‌లో భవనం నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు అవసరమైన స్థలాన్ని కేటాయించి నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఎరుకుల కులస్తుల ఉపాధి కోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తామని చెప్పారు. తెలంగాణ ఎరుకల సంఘం అధ్యక్షుడు కూతాడి రాములు, ప్రధాన కార్యదర్శి లోకిని రాజు తదితరులు శనివారం ప్రగతిభవన్‌లో సీఎంను కలిశారు. రజక భవనాలకు నిధులు కేటాయించడంపై హర్షం రజక భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై తెలంగాణ రజక సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ కొండూరు సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో రజక భవన నిర్మాణానికి రూ.5 కోట్లు, నల్లగొండలో భవనానికి రూ.50 లక్షలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసినవారిలో నేతలు కోట్ల శ్రీనివాస్, కొన్నె సంపత్, ముందిగొండ మురళి, పగడాల లింగయ్య, చిట్యాల రామస్వామి తదితరులున్నారు. -
ట్యాంక్‌బండ్‌పై ఐలమ్మ విగ్రహం:నాయిని
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: తెలంగాణ సాయుధ యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శనివారం బాగ్‌లింగంపల్లిలోని వీఎస్టి ఫంక్షన్ హాల్లో తెలంగాణ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ 31 వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం స్పూర్తిదాయకమని, ఆమె పోరాటం, త్యాగాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రజకులను గ్రామబహిష్కరణ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వృత్తులను కాపాడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక మంది అసువులు బాసారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులను జైల్లోపెట్టి కొట్టిన కాంగ్రెస్ నేతలు నేడు ఓడిపోయారన్నారు. కొండూరు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య, కాలప్ప, జీవన్, శ్రీనివాస్ రెడ్డి, మల్లయ్య భట్, యాదమ్మ, ముదిగొండ మురళి, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయండి
దోమలగూడ: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని తెలంగాణ రజక ఐక్య వేదిక ఫౌండర్ చైర్మన్ సి.శంకర్, అధ్యక్షుడు అమానపు అప్పారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దోమలగూడలో మంగళవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో దాదాపు 30 లక్షల మంది రజకులు ఉండగా అందులో వృత్తిపై ఆధారపడిన వారు 10 లక్షల మంది వరకు ఉంటారన్నారు. ప్రభుత్వం రజకుల రక్షణకు చట్టం చేయడంలో, సమగ్రాభివృద్ధికి నిధులు విడుదల చేయడంలో, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వీరనారి చాకలి ఐలమ్మకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని, ఆమె విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం హిమాయత్‌నగర్‌లోని వెనుకబడిన తరగతుల సాధికారిత సంస్థ కార్యాలయంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని నిర్వహిస్తున్నామని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. -
చాకలి ఐలమ్మ విగ్రహా ఏర్పాటుకు భూమి పూజ
మోటకొండూర్(యాదగిరిగుట్ట): మోటకొండూర్‌లో చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు ఆదివారం రజక యువజన సంఘం నాయకులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు వడ్డెబోయిన శ్రీనివాస్, కొన్నె సంపత్, వడ్డెబోయిన శ్రీధర్ మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో చాకలి ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. భావితరాలకు ఐలమ్మ చరిత్రను తెలియజేయాలన్నారు. ఐలమ్మ వర్థంతిని ప్రభుత్వమే అధికారికంగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వడ్డెబోయిన ఆంజనేయులు, బొట్ల నర్సింహ, వంగపల్లి ఉప్పలయ్య, బాల్ద రామకృష్ణ, భూమండ్ల సుధీర్, కృష్ణ, రాజయ్య, శ్రీను, శివయ్య, పాండు, కనకయ్య, వెంకటేష్, అచ్చయ్య, చంద్రశేఖర్ తదితరులున్నారు. -
తిరుగండ్లపల్లిలో ‘చాకలి అయిలమ్మ’
తిరుగండ్లపల్లి (మర్రిగూడ) : తెలంగాణ రజక సంఘం, తెలంగాణ సాంస్కృతిక శాఖ , ముత్తుమూవీ మేకర్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న చాకలి అయిలమ్మ చిత్రం షూటింగ్ మంగళవారం మండలంలోని తిరుగండ్లపల్లి గ్రామంలోని జరిగింది. పలు సన్నివేశాలను తీశారు. ఐలమ్మ పోరాటాలను ప్రజలకు తెలియజేయడానికిఈ సినిమా తీస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండూరి సత్యానారాయణ, పగడాల లింగయ్య, పుప్పాల యాదయ్య, పగిళ్ల సైదు లు, నాగయ్య, అంజయ్య, నిర్మాత పగడాల ముత్యాలు, దర్శకుడు సి.మురళి, నటీనటులు పాల్గొన్నారు. -
అగ్నికణానికి నిప్పు పెట్టడం సాధ్యమా!
నాడు దుర్మార్గుల దాష్టీకాలపై ఆమె నిప్పులు చెరిగింది. కానీ, ఇప్పుడు ఆమె విగ్రహాలకు దుండగులు నిప్పు పెడుతున్నారు. నాడు ఆమె తెగువ, స్ఫూర్తి... రజాకార్ల అరాచకత్వాన్ని కూల్చివేసిం ది. కానీ, నేడు ఆమె విగ్రహాలను అరాచక శక్తులు కూల్చేస్తున్నాయి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆమె నిత్య నీరాజనాలు అందు కుంది. ఆమె మన వీరనారి చిట్యాల ఐలమ్మ. నేడు అవమానాలకు గురవుతున్నవి ఆమె విగ్రహాలే. ఉద్యమాల గడ్డపై ఓ పోరుబిడ్డకు జరుగుతున్న అవమానం తెలంగాణ యావత్తుకూ అవమానం కాదా? నాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అగ్నికణం వలె నిత్యం ఉద్యమ నెగళ్లను కాపాడి, మహాజ్వాలను రగిలించింది ఇప్పుడు తాను దహిం చుకుపోవడానికేనా? మొన్న కరీంనగర్ జిల్లాలో ఐలమ్మ విగ్రహాన్ని కాల్చేశారు. నిన్న హైదరాబాద్ శివారులో చింతలకుంట చౌరస్తాలో ఆమె నిలువెత్తు ప్రతిరూ పాన్ని నేలమట్టం చేశారు, తాజాగా శనివారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌లో ఐలమ్మ విగ్రహానికి నిప్పుపెట్టారు. కుట్రపూరితంగా సాగుతున్న ఈ దాడుల పరంపరకు అడ్డుకట్ట వేసేవారు లేరు. ఇంతవరకూ నిందితులెవరో, దుండుగు లెందరో పోలీసులు తేల్చలేకపోయారు. వారిని పట్టుకోలేకపోయారు. స్ఫూర్తిప్రదాతల విగ్రహాలను కాపాడుకోవాలన్న సోయి ఈ పాలకులకు లేకపోవ డం శోచనీయం. ఐలమ్మ విగ్రహాలకు జరుగుతున్న అపచారాలకు తెలంగాణ లోని సకలజనులూ విలవిలలాడుతున్నారు. ఆమె పేరు తలవనిదే తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో రోజులు గడిచేవి కావు. ఇప్పుడు మాత్రం ఐలమ్మ విగ్రహాలకు అపచారాల పరంపర కొనసాగుతున్నా ప్రశ్నిం చలేకపోతున్నారు. ఉద్యమ సారథులే పాలకులైన ఈ అపురూప సందర్భంలో ఇలాంటి ఘోరాలు, నేరాలు సహించదగినవేనా? ఉద్యమ నాయకులుగా, మేధావులుగా చెలామణి అయిన వారిప్పు డు ఎలాంటి నిరసనలూ వ్యక్తం చేయడంలేదు. మాట వరుసకైనా ఖండించడంలేదు. ఇప్పుడు దొరల నయాగఢీల ముందు పదవుల కోసం సాగిలపడటమే వారికి ప్రాధాన్యాంశంగా మారింది. ఉద్య మాల గడ్డపై పోరాట నాయకులకు కొదవలేని ఈ నేల ఎందుకు మౌనంగా ఉం ది? నాడు ఐలమ్మ పేరుతో జనాల్లోకి వచ్చి ఉద్యమ ప్రయోజనాలు నెరవేర్చు కున్నారు నాయకులు. ఇప్పుడు అధికారం దక్కగానే, పదవులు పొందగానే కనీ సం ఆమె వర్ధంతిని అధికారికంగా కూడా జరపలేకపోవడం, జరపాలని అడగ లేకపోవడం ఏం నీతి? తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని పట్టాలెక్కించి నిజాం రాచరికాన్ని, భూస్వాముల పెత్తనాన్ని పాడెకట్టింది ఇందుకేనా? భూమి, భుక్తి, విముక్తి ఉద్యమాలకు ప్రేరణగా నిలిచిన పాపానికా ఐలమ్మకు ఈ అవమా నం? నిజానికి ఐలమ్మ ఒక అగ్నికణం. మన చోద్యం కాకపోతే.. ఎక్కడన్నా అగ్నికణానికి నిప్పు పెట్టగలరా? ఉద్యమజ్యోతిని కాల్చేయసాధ్యమా? జనం గుండెల్లో గూడు కట్టుకున్న ఆమెను గునపాలతో కూల్చేయగలరా? నీలం వెంకన్న హైదరాబాద్. ఫోన్: 9705346084 -
చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం
హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహం ప్రతిష్టించిన ఆరు నెలలకే నేలమట్టమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత నగరంలోని ఎల్బీనగర్ ప్రాంతంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం కొద్దిగా ఒరిగి ఉన్న విగ్రహం బుధవారం రాత్రి చూసేసరికి నేలపై పడిపోయి ఉంది. ఎవరైనా విగ్రహాన్ని కూల్చివేశారా లేక దానంతట అదే కూలిందా అన్నది మిస్టరీగా మారింది. ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.