చాకలి ఐలమ్మ
నాడు దుర్మార్గుల దాష్టీకాలపై ఆమె నిప్పులు చెరిగింది. కానీ, ఇప్పుడు ఆమె విగ్రహాలకు దుండగులు నిప్పు పెడుతున్నారు. నాడు ఆమె తెగువ, స్ఫూర్తి... రజాకార్ల అరాచకత్వాన్ని కూల్చివేసిం ది. కానీ, నేడు ఆమె విగ్రహాలను అరాచక శక్తులు కూల్చేస్తున్నాయి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆమె నిత్య నీరాజనాలు అందు కుంది. ఆమె మన వీరనారి చిట్యాల ఐలమ్మ. నేడు అవమానాలకు గురవుతున్నవి ఆమె విగ్రహాలే. ఉద్యమాల గడ్డపై ఓ పోరుబిడ్డకు జరుగుతున్న అవమానం తెలంగాణ యావత్తుకూ అవమానం కాదా? నాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అగ్నికణం వలె నిత్యం ఉద్యమ నెగళ్లను కాపాడి, మహాజ్వాలను రగిలించింది ఇప్పుడు తాను దహిం చుకుపోవడానికేనా? మొన్న కరీంనగర్ జిల్లాలో ఐలమ్మ విగ్రహాన్ని కాల్చేశారు. నిన్న హైదరాబాద్ శివారులో చింతలకుంట చౌరస్తాలో ఆమె నిలువెత్తు ప్రతిరూ పాన్ని నేలమట్టం చేశారు,
తాజాగా శనివారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌లో ఐలమ్మ విగ్రహానికి నిప్పుపెట్టారు. కుట్రపూరితంగా సాగుతున్న ఈ దాడుల పరంపరకు అడ్డుకట్ట వేసేవారు లేరు. ఇంతవరకూ నిందితులెవరో, దుండుగు లెందరో పోలీసులు తేల్చలేకపోయారు. వారిని పట్టుకోలేకపోయారు. స్ఫూర్తిప్రదాతల విగ్రహాలను కాపాడుకోవాలన్న సోయి ఈ పాలకులకు లేకపోవ డం శోచనీయం. ఐలమ్మ విగ్రహాలకు జరుగుతున్న అపచారాలకు తెలంగాణ లోని సకలజనులూ విలవిలలాడుతున్నారు. ఆమె పేరు తలవనిదే తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో రోజులు గడిచేవి కావు. ఇప్పుడు మాత్రం ఐలమ్మ విగ్రహాలకు అపచారాల పరంపర కొనసాగుతున్నా ప్రశ్నిం చలేకపోతున్నారు. ఉద్యమ సారథులే పాలకులైన ఈ అపురూప సందర్భంలో ఇలాంటి ఘోరాలు, నేరాలు సహించదగినవేనా? ఉద్యమ నాయకులుగా, మేధావులుగా చెలామణి అయిన వారిప్పు డు ఎలాంటి నిరసనలూ వ్యక్తం చేయడంలేదు. మాట వరుసకైనా ఖండించడంలేదు. ఇప్పుడు దొరల నయాగఢీల ముందు పదవుల కోసం సాగిలపడటమే వారికి ప్రాధాన్యాంశంగా మారింది. ఉద్య మాల గడ్డపై పోరాట నాయకులకు కొదవలేని ఈ నేల ఎందుకు మౌనంగా ఉం ది? నాడు ఐలమ్మ పేరుతో జనాల్లోకి వచ్చి ఉద్యమ ప్రయోజనాలు నెరవేర్చు కున్నారు నాయకులు. ఇప్పుడు అధికారం దక్కగానే, పదవులు పొందగానే కనీ సం ఆమె వర్ధంతిని అధికారికంగా కూడా జరపలేకపోవడం, జరపాలని అడగ లేకపోవడం ఏం నీతి? తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని పట్టాలెక్కించి నిజాం రాచరికాన్ని, భూస్వాముల పెత్తనాన్ని పాడెకట్టింది ఇందుకేనా?
భూమి, భుక్తి, విముక్తి ఉద్యమాలకు ప్రేరణగా నిలిచిన పాపానికా ఐలమ్మకు ఈ అవమా నం? నిజానికి ఐలమ్మ ఒక అగ్నికణం. మన చోద్యం కాకపోతే.. ఎక్కడన్నా అగ్నికణానికి నిప్పు పెట్టగలరా? ఉద్యమజ్యోతిని కాల్చేయసాధ్యమా? జనం గుండెల్లో గూడు కట్టుకున్న ఆమెను గునపాలతో కూల్చేయగలరా?
నీలం వెంకన్న హైదరాబాద్. ఫోన్: 9705346084